teachers committees
-
పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదు
- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాలో వక్తలు హైదరాబాద్: పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదని, విరమణ తర్వాత పింఛన్ పొందటం ఉద్యోగి ప్రాథమిక హక్కు అని పలువురు వక్తలు అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 11 ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే సరళీకరణ విధానాలు అవలంబిస్తోందని, వాటి ఫలితమే సీపీఎస్ అని అన్నారు. హక్కుగా సాధించుకున్న పింఛన్ కోసం అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంఘటితంగా పోరాడాలని కోరారు. సీపీఎస్ రద్దుకై రాష్ర్ట ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో చర్చించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ న్యూ పెన్షన్ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నో పెన్షన్ చేశారని అన్నారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల వేతనం ప్రకారం దాదాపు 15 వేల రూపాయలు పింఛన్ రావాల్సి ఉండగా సీపీఎస్ విధానంలో కేవలం రూ.850 మాత్రమే వస్తాయని చెప్పారు. జీవితాన్ని, యవ్వనాన్ని, కష్టాన్ని, సేవలను అందించిన వ్యక్తికి పింఛన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు 1982లోనే తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎ.నర్సిరెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్), బి.కొండల్‌రెడ్డి, వి.మనోహరరాజు(టీపీటీఎఫ్), రఘు శంకర్‌రెడ్డి, ఎన్ .కిష్టప్ప(డీటీఎఫ్), యు.పోచయ్య, డి.సైదులు(ఎస్టీఎఫ్), షౌకత్‌అలీ, కె.నర్సింహారావు(టీఎస్పీటీఏ) వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డిటెన్షన్ గుణపాఠం!
ప్రభుత్వ పాఠశాలల్లో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యా యులు, సంఘాలలో చలనం వచ్చినట్లు కనిపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడుతుంది. ఇది మంచి పరిణామం. డిటెన్షన్ విధానాన్ని అమలు చేసే ప్రతిపాదన రావడానికి ఎన్ని కారణాలున్నా పరోక్షంగా ఉపాధ్యాయులూ కారణమనే విషయం అందరికీ తెలుసు. ఉపా ధ్యాయుల వైఫల్యాలను విద్యార్థులపై రుద్ది డిటెన్షన్ అంటగట్టవద్దు. విద్య లో నాణ్యతకు మేమే బాధ్యులం అనే అభిప్రాయానికి ఉపాధ్యాయులు, సంఘాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆలస్యంగానైనా, ఆత్మావలోకనం ద్వారా వాస్తవాల్ని ఉపాధ్యాయవర్గం గ్రహించడం హర్షణీయం. ఇకనైనా ఉపాధ్యాయ వర్గం విద్యార్థుల మధ్య ఉంటూ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు వారు హామీ ఇస్తే డిటెన్షన్ ప్రతిపాదన తాత్కాలికంగానైనా వాయిదా పడుతుందేమో? అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యా చట్టాలను, నియమ నిబంధనలను పటిష్టంగా అమ లు చేస్తే డిటెన్షన్ విధానాన్ని పెట్టాల్సిన అవసరం రాదు. పాఠశాలలకు సదుపాయాలు కల్పించి, సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణను కొనసాగించినట్లయితే వ్యవస్థ గాడినపడగలదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, సరైన లక్ష్యం కొరవడినందునే ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో అవాంఛిత రుగ్మతలు పొడసూపుతున్నాయి. ఏదిఏమైనా వ్యవస్థను సరిదిద్దుకోవాలి తప్ప డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం శ్రేయస్కరం కాబోదు. ఆ ప్రతిపాద నను విరమించుకోవాలి. - కె.వి.కౌసల్య, నల్లగొండ -
చెప్పిందొకటి.. చేస్తోందొకటి!
* టీచర్ల రేషనలైజేషన్, బదిలీల్లో గందరగోళం * ఇష్టారాజ్యంగా విధానాలు అమలు * మార్గదర్శకాల్లో ఒకటుంటే కలెక్టర్లు చెబుతున్నది మరొకటి * సీనియారిటీ జాబితాల్లో రోస్టర్ కమ్ మెరిట్ అమలు పట్టని అధికారులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. విద్యాశాఖ మార్గదర్శకాల్లో ఒకటుంటే.. జిల్లాల్లో కలెక్టర్లు మరో విధంగా చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఒకలా పేర్కొంటే విద్యాశాఖ మరో రకంగా మార్గదర్శకాలు ఇస్తోంది. సీనియారిటీ జాబితాల రూపకల్పనలో అన్ని జిల్లాల్లో రోస్టర్ కమ్ మెరిట్‌ను అమలు చేయడం లేదు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా చేస్తున్నారు. ఇక మిగులు (సర్ప్లస్) పోస్టులను గతంలోనే ఆయా జిల్లాలోని స్కూళ్లలోనే సర్దుబాటు చేయగా.. ఈసారి వాటిని ఇతర స్కూళ్లకు కేటాయించకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చిపెట్టారు. దీంతో ఆ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవీ సమస్యలు.. 2014, సెప్టెంబర్ నుంచి జూన్ 30 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. అందుకే జూన్ 2015ను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధీకరణ చేయాలంటున్నాయి. 2014 సెప్టెంబర్ నాటి సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వల్ల విద్యార్థులకు అనుగుణంగా టీచర్లు రాలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సొంత ఆలోచనలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఒక టీచర్‌ను ఇవ్వాలి. కానీ కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు టీచర్లు ఇస్తామంటున్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 50 మందికి మించి విద్యార్థులు ఉంటే ఆ స్కూల్‌ను కొనసాగించాలని, లేదంటే సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విలీనం చేయాలి. కానీ వరంగల్ జిల్లాల్లో 40 మంది విద్యార్థులు ఉన్నా ఆ స్కూళ్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇది ఉత్తర్వులకు వ్యతిరేకం కావడంతో డీఈవోలు ఒప్పుకోవడం లేదు. అన్ని జిల్లాల్లో రేషనలైజేషన్ పూర్తి కాలేదు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు కూడా ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. భార్యాభర్తలు ఇద్దరికి 10 చొప్పున ప్రాధాన్య పాయింట్లు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట ఆ ఉత్తర్వులను అమలు చేయాలని, ఆ తర్వాత ప్రాధాన్య పాయింట్లు ఇద్దరిలో ఒక్కరే ఉపయోగించుకోవాలని విద్యాశాఖ రెండుసార్లు వివరణ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఆ పాయింట్లను ఉపయోగించుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. మరి వాటిని ఒక్కరికే పరిమితం చేస్తూ మార్పు చేసేదేలా? అన్న గందరగోళం ఏర్పడింది. ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేస్తున్నపుడు స్పౌజ్ పాయింట్లు వర్తింపచేయాలి. కానీ పక్క జిల్లాలో పని చేస్తున్నా వర్తింపజేస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఇతర ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోంది. ఆరు జిల్లాల్లో సర్దుబాటు చేయగా ఇంకా 4 వేలకు పైగా మిగులు పోస్టులు ఉన్నట్లు తేలింది. నిజామాబాద్‌లో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్లో 826 పోస్టులు మిగులు (సర్ప్లస్)గా తేల్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరు. ఆదిలాబాద్‌లో 551 పోస్టులు ఖాళీలు ఉండగా, మెదక్‌లో 458 పోస్టులు, మహబూబ్‌నగర్‌లో 931, రంగారెడ్డిలో 1,894 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
పది శాతం బదిలీలూ చేసుకోవద్దా?
‘విచక్షణ’ బదిలీలపై కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలపై అసహనం! మాకు ఆ మాత్రం అధికారం లేదా.. అంటూ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘాల నేతలు సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఆయన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ విచక్షణ అధికారంతో బదిలీలు చేస్తున్నారని ఓ నేత పేర్కొనగా, ‘ఆ మాత్రం బదిలీలు చేయొద్దా? 1.20 లక్షల మంది టీచర్లలో 10 శాతం బదిలీలు కూడా చేసుకోవద్దా? ఆ మాత్రం అధికారం మాకు లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు మారుమాట్లాడకుండా బయటికి వచ్చినట్లు తెలిసింది. కాగా, మరో 100 వరకు ప్రభుత్వ విచక్షణాధికార బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. అవి సోమవారం విద్యాశాఖకు చేరినట్లు సమాచారం. మీ ఇష్టం ఉన్నట్లు మార్గదర్శకాలు ఉండాలంటే ఎలా? ఇక కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో ఉండాల్సిన అంశాల విషయంలో సోమవారం వివిధ ఉపాధ్యాయ సంఘాలు కడియం శ్రీహరిని సచివాలయంలో కలిశాయి. ఈ సందర్భంగా రెండు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కలిసి, వారు ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘తప్పనిసరి బదిలీకి పరిగణనలోకి తీసుకునే సర్వీసును కొన్ని సంఘాలు ఐదేళ్లు ఉండాలని, ఇంకొన్ని సంఘాలు 8 ఏళ్లు ఉండాలని చెబుతున్నాయి. ఒక్కో సంఘం ఒక్కో రకంగా మాట్లాడితే ఎలా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.’ అని అన్నట్లు సమాచారం. సెక్రటేరియట్ బదిలీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను వ్యతిరేకిస్తూ ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ప్రదర్శనలు నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి.