పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదు | Government pension will not begging | Sakshi
Sakshi News home page

పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదు

Published Sun, Oct 2 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదు

పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదు

- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాలో వక్తలు
 
హైదరాబాద్: పింఛన్ ప్రభుత్వ భిక్ష కాదని, విరమణ తర్వాత పింఛన్  పొందటం ఉద్యోగి ప్రాథమిక హక్కు అని పలువురు వక్తలు అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్  స్కీమ్(సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్  విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 11 ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో టీజేఏసీ చైర్మన్  కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే సరళీకరణ విధానాలు అవలంబిస్తోందని, వాటి ఫలితమే సీపీఎస్ అని అన్నారు. హక్కుగా సాధించుకున్న పింఛన్  కోసం అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంఘటితంగా పోరాడాలని కోరారు. సీపీఎస్ రద్దుకై  రాష్ర్ట ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో చర్చించాలని సూచించారు.
 
 మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ న్యూ పెన్షన్  పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నో పెన్షన్  చేశారని అన్నారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల వేతనం ప్రకారం దాదాపు 15 వేల రూపాయలు పింఛన్  రావాల్సి ఉండగా సీపీఎస్ విధానంలో కేవలం రూ.850 మాత్రమే వస్తాయని చెప్పారు. జీవితాన్ని, యవ్వనాన్ని, కష్టాన్ని, సేవలను అందించిన వ్యక్తికి పింఛన్  ఇవ్వాలని సుప్రీంకోర్టు 1982లోనే తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.  కార్యక్రమంలో ఎ.నర్సిరెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్), బి.కొండల్‌రెడ్డి, వి.మనోహరరాజు(టీపీటీఎఫ్), రఘు శంకర్‌రెడ్డి, ఎన్ .కిష్టప్ప(డీటీఎఫ్), యు.పోచయ్య, డి.సైదులు(ఎస్‌టీఎఫ్), షౌకత్‌అలీ, కె.నర్సింహారావు(టీఎస్‌పీటీఏ) వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement