ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు
ఉన్నపళంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ
అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసిమోపెడు
‘దారికి’ రాకుంటే తొలగింపు కూడా..
మంత్రి గొట్టిపాటి ఇలాకాలో వృద్ధులకు వేధింపులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నెలనెలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి.. మా పార్టీలో చేరండి. లేదంటే అంతే సంగతులు.. ఆశలు వదులుకోండి. ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనంలేదు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య, శ్రీనివాసరావులతోపాటు కొందరు పింఛన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితోపాటు మరికొందరికి మాత్రం డబ్బులివ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకున్నారు.
మూడోనెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే.. మీ పింఛన్లు లేవన్నారు. ఆరాతీస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సచివాలయ పరిధిలో ఉన్నాయని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు నెలలు శ్రమకోర్చి అక్కడికే వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. సొంత ఊరిలో ఉంటే ఎలాగూ పింఛన్ ఇవ్వరని కేతనకొండ నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి బదిలీ పెట్టుకున్నారు.
ఆరోనెల శంకరాపురానికి వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. విషయం తెలిసి మంత్రి గొట్టిపాటి ముండ్లమూరు అధికారులకు చీవాట్లు పెట్టడంతోపాటు తక్షణం ముగ్గురి పింఛన్లను వేర్వేరు ఊర్లకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకేముంది.. వికలాంగుడు శ్రీనివాసరావు పింఛన్ శ్రీకాకుళానికి.. బత్తుల చిన్న అంజయ్య పింఛన్ అనంతపురానికి, లీలావతి పింఛన్ చిత్తూరు జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. వారు అంతదూరం వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే అంతకుమించిన ఖర్చవుతుంది. లేదంటే మంత్రిని కలిసి జీ హుజూర్ అనాల్సిందే అంటున్నారు.
వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారని..
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా ఇలాంటి వారి పింఛన్లను తొలగించారు. కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీచేశారు. పింఛన్‌దారులను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం.
తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారు. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టు నిలుపుకునేందుకే ఇలా..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇసుక, గ్రానైట్, రేషన్ బియ్యం దందాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై కూటమి సర్కారు పెనుభారం మోపడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతిష్ట నియోజకవర్గంలో పూర్తిగా మసకబారింది. పైగా.. నేతలు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది.
దీనిని పసిగట్టిన గొట్టిపాటి నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పింఛన్లను సైతం నిలిపేసి వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment