చెప్పిందొకటి.. చేస్తోందొకటి!
* టీచర్ల రేషనలైజేషన్, బదిలీల్లో గందరగోళం
* ఇష్టారాజ్యంగా విధానాలు అమలు
* మార్గదర్శకాల్లో ఒకటుంటే కలెక్టర్లు చెబుతున్నది మరొకటి
* సీనియారిటీ జాబితాల్లో రోస్టర్ కమ్ మెరిట్ అమలు పట్టని అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. విద్యాశాఖ మార్గదర్శకాల్లో ఒకటుంటే.. జిల్లాల్లో కలెక్టర్లు మరో విధంగా చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఒకలా పేర్కొంటే విద్యాశాఖ మరో రకంగా మార్గదర్శకాలు ఇస్తోంది. సీనియారిటీ జాబితాల రూపకల్పనలో అన్ని జిల్లాల్లో రోస్టర్ కమ్ మెరిట్‌ను అమలు చేయడం లేదు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా చేస్తున్నారు. ఇక మిగులు (సర్‌ప్లస్) పోస్టులను గతంలోనే ఆయా జిల్లాలోని స్కూళ్లలోనే సర్దుబాటు చేయగా.. ఈసారి వాటిని ఇతర స్కూళ్లకు కేటాయించకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చిపెట్టారు. దీంతో ఆ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ సమస్యలు..
2014, సెప్టెంబర్ నుంచి జూన్ 30 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. అందుకే జూన్ 2015ను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధీకరణ చేయాలంటున్నాయి. 2014 సెప్టెంబర్ నాటి సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వల్ల విద్యార్థులకు అనుగుణంగా టీచర్లు రాలేకపోతున్నారు.
కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సొంత ఆలోచనలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఒక టీచర్‌ను ఇవ్వాలి. కానీ కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు టీచర్లు ఇస్తామంటున్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 50 మందికి మించి విద్యార్థులు ఉంటే ఆ స్కూల్‌ను కొనసాగించాలని, లేదంటే సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విలీనం చేయాలి. కానీ వరంగల్ జిల్లాల్లో 40 మంది విద్యార్థులు ఉన్నా ఆ స్కూళ్లను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇది ఉత్తర్వులకు వ్యతిరేకం కావడంతో డీఈవోలు ఒప్పుకోవడం లేదు.
అన్ని జిల్లాల్లో రేషనలైజేషన్ పూర్తి కాలేదు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు కూడా ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు.
భార్యాభర్తలు ఇద్దరికి 10 చొప్పున ప్రాధాన్య పాయింట్లు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట ఆ ఉత్తర్వులను అమలు చేయాలని, ఆ తర్వాత ప్రాధాన్య పాయింట్లు ఇద్దరిలో ఒక్కరే ఉపయోగించుకోవాలని విద్యాశాఖ రెండుసార్లు వివరణ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఆ పాయింట్లను ఉపయోగించుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. మరి వాటిని ఒక్కరికే పరిమితం చేస్తూ మార్పు చేసేదేలా? అన్న గందరగోళం ఏర్పడింది. ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేస్తున్నపుడు స్పౌజ్ పాయింట్లు వర్తింపచేయాలి. కానీ పక్క జిల్లాలో పని చేస్తున్నా వర్తింపజేస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఇతర ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోంది.
ఆరు జిల్లాల్లో సర్దుబాటు చేయగా ఇంకా 4 వేలకు పైగా మిగులు పోస్టులు ఉన్నట్లు తేలింది. నిజామాబాద్‌లో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్‌లో 826 పోస్టులు మిగులు (సర్‌ప్లస్)గా తేల్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరు. ఆదిలాబాద్‌లో 551 పోస్టులు ఖాళీలు ఉండగా, మెదక్‌లో 458 పోస్టులు, మహబూబ్‌నగర్‌లో 931, రంగారెడ్డిలో 1,894 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.