టీచర్ల పోస్టులపై సుదీర్ఘ కసరత్తు
- ఆదర్శ పాఠశాలలపై వెలువడని ఉత్తర్వులు
- రేషనలైజేషన్ పరిస్థితి అంతే
- ఇంకా కొలిక్కిరాని వైనం
ఒంగోలు వన్‌టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై రోజుకో ఉత్తర్వులు జారీచేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వ్యవహారం కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జారీచేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించాల్సి ఉంది.
అయితే ఖాళీల వివరాలు ప్రకటించాలంటే ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు పూరై ్త ఆ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడాలి. అయితే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, రేషనలైజేషన్ వ్యవహారంపై జిల్లా నుంచి సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆమోదముద్ర పడ లేదు. దీంతో ఖాళీల వ్యవహారం గందరగోళంగా మారనుంది.
ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విషయంలో..
ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు విషయంలో మొదట పట్టుదలగా వ్యవహరించింది. జిల్లాలో మొత్తం 483 ఆదర్శ ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పీ సిసోడియా జీవో ఎంఎస్ నం.46, తేదీ 7.8.2015 ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక్కో ఆదర్శ ప్రాధమిక పాఠశాలకు అన్ని వసతులు కల్పించాలంటే సుమారు రూ. 25 లక్షలు వ్యయమవుతుందని అంచనా. అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై పట్టును సడలించారు. మొదట కిలోమీటర్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయమన్నారు. ఆ మేరకు జిల్లాలో మొదట 513 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటవుతుందని లెక్కలు కట్టారు. అనంతరం ఆ సంఖ్య 437కు కుదించారు. అయితే ఈ సంఖ్య కూడా 383కు పడిపోయింది. దీనిపై ఇంకా చిక్కుముడి వీడ లేదు.
రేషనలైజేషన్‌లో..
ఉపాధ్యాయులు, పాఠశాలల రేషనలైజేషన్‌లో కూడా సందిగ్ధత సాగుతోంది. రేషనలైజేషన్‌లో గత ఏడాది చివరి నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందుకు బదులుగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి పాఠశాలలలోని విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ చేయాలని కోరుతున్నారు.
ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లు....
ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తం 465 మంది ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లు ఉన్నారు. ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్రకారం 130 మంది కంటే ఎక్కువ పిల్లల ఉన్న ఆదర్శ పాఠశాలలకు ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. జిల్లాలో ఇటువంటి పాఠశాలలు కేవలం 83 మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం 382 ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు మిగులుగా తేలుతున్నాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, రేషనలైజేషన్ విషయంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం మార్పులు, చేర్పుల కోసం డీఈవో కార్యాలయంలోని ఏపీవో, సిబ్బంది మంగళవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఈ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి కమిషనర్ ఆమోద ముద్ర పడితే కానీ ఖాళీల కసరత్తు కొలిక్కిరాదు.