Ideal school
-
‘ఆదర్శం... అపహాస్యం!.
♦ నెరవేరని ఆదర్శ పాఠశాల లక్ష్యం ♦ అరకొరగా నిర్మితమైన హాస్టల్ భవనాలు ♦ ఉన్నవి ప్రారంభించకపోవడంతో మొలుస్తున్న పిచ్చిమొక్కలు ♦ నిరుపయోగంగా పడి ఉన్న వసతి సామగ్రి ♦ సుదూరం నుంచి ఆటోల్లో తప్పని రాకపోకలు నిరుపేదలకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలి... వారిని సమున్నతంగా తీర్చిదిద్దాలి... అందుకోసం సకల సౌకర్యాలతో భవనాలు... వసతి సమకూర్చాలి. ఆంగ్ల బోధనద్వారా ఉజ్వల భవితను అందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలంతా ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రూపొందించిన ఆదర్శ పాఠశాలల వ్యవస్థ అపహాస్యవమవుతోంది. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు... అక్కరకు రాని భవనాలు... అరకొర సౌకర్యాలు వారిని వెక్కిరిస్తున్నాయి. ఈ చిత్రం చూడండి. ఇదేదో స్క్రాప్ దుకాణం అనుకుంటున్నారు కదూ... లక్కవరపుకోటలో ఏర్పాటైన ఆదర్శ పాఠశాల విద్యార్థులకోసం తెప్పించిన సామగ్రి వాటిని వినియోగించకపోవడంతో అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరో కొద్ది రోజుల్లో అవి తుప్పుపట్టిపోవడం ఖాయం. రంగురంగుల్లో సుందరంగా కనిపిస్తున్న ఈ భవనం చూడండి. ఇది లక్కవరపుకోటలో నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్. ఇది ఇలా బయటకు కనిపిస్తున్నా... లోపల మాత్రం సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. అందువల్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. అవెప్పుడు పూర్తవుతాయో... దీనినెప్పుడు ప్రారంభిస్తారో తెలీదు గానీ... మరి కొద్దిరోజుల్లో ఇది శిథిలావస్థకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. లక్కవరపుకోట(ఎస్‌కోట): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం 2013 సంవత్సరంలో ప్రారంభించిన ఆదర్శపాఠశాలల్లో ‘ఆదర్శం’ నేతిబీరకాయ చందంగా మారింది. విద్యా బోధన పక్కన పెడితే ఇక్కడ అపహాస్యం! సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కడా నేటికీ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. దీనివల్ల విద్యార్థినులు సుదూర ప్రాంతాలనుంచి ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. వసతి సౌకర్యం కల్పిస్తారంటేనే ఇక్కడ చేర్చామని తీరా రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని వసతి గృహాలు జిల్లాలో 16 చోట్ల ఆదర్శపాఠశాలల ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి వసతి గృహాలు నిర్మించారు. గత ఏడాది జూన్ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వసతి గృహాలు ప్రారంభిస్తామని అధికారులు హడావుడి చేశారు. ఒక్కో వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందుకు అవసరమైన వసతి, మంచాలు.. కుర్చీలు వంటి సామగ్రిని తెప్పించారు. అయితే అవన్నీ ఇప్పుడు ఓ మూల పడి ఉన్నాయి. ప్రస్తుతం హాస్టల్ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ముఖ్యంగా లక్కవరపుకోట, వేపాడ, గర్భాంలోని వసతి గృహాలకు కనీసం మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం, విజటర్స్ వేచివుండే గదులు నిర్మాణం కాలేదు. అధికారులు మాత్రం ఈ విద్యా సంవత్సరానికే ప్రారంభించేస్తామని చెబుతున్నా... అందుకు అనుగుణంగా అయితే పనులు జరగలేదు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారుల మాటలు వారిని నమ్మకం కలిగించడంలేదు. అవస్థలు పడుతున్న విద్యార్థులు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని అనడంతో సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేరారు. తీరా హాస్టళ్లు ప్రారంభించకపోవడంతో నిత్యం ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం చేతి చమురు వదులుతోందనీ, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వతసతి గృహాలు ప్రారంభించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
5 కొత్త మోడల్ స్కూళ్లు
♦ ఈ ఏడాది నుంచే అందుబాటులోకి ♦ జులై 5లోగా దరఖాస్తుల స్వీకరణ ♦ 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహణ ♦ కొన్నిచోట్ల అద్దె భవనాల్లో కొనసాగింపు ♦ కాంట్రాక్టు పద్ధతిలో బోధనా సిబ్బంది! ఈ ఏడాదే మరో ఐదు ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్) అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కొన్నిచోట్ల భవనాలు అందుబాటులో లేనప్పటికీ.. అద్దె భవనాల్లోనైనా కొన సాగించాలని సంకల్పించిన జిల్లా విద్యాశాఖ.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో 12 ఆదర్శ పాఠశాలలు కొనసాగుతుండగా.. తాజాగా బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, పరిగి, మహేశ్వరంలలో ఆదర్శ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా ప్రారంభమయ్యే ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియను విద్యాశాఖ మొదలు పెట్టింది. ప్రస్తుతం 6,7,8 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రతి తరగతిలో వంద సీట్లుంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు తెల్లకాగితంపై వివరాలు రాసిచ్చి జులై 5వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి సమర్పిస్తే సరిపోతుందని డీఈఓ రమేష్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి దరఖాస్తులు సైతం తీసుకుంటున్నామన్నారు. ప్రతి మోడల్ స్కూల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు కొనసాగుతాయని, ఒక్కో గ్రూపులో 40 సీట్లున్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభర్థులకు జులై 10న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. సిబ్బందిపై స్పష్టత కరువు తాజాగా 5 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో విద్యాశాఖ ప్రవేశాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ పాఠశాలల్లో బోధనసిబ్బందిపై మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి 12 పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాలల్లోనూ రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే డీఎస్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రెగ్యులర్ సిబ్బంది నియామకం ఇప్పట్లో జరిగేలా లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ పది రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు హాజరుకానుండగా.. ఇప్పటికీ కాంట్రాక్టు టీచర్లను సైతం నియమించకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. -
రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్
♦ 5వ తరగతి లోపు పిల్లలంతా సర్కార్ స్కూల్‌కే! ♦ నేడు వార్షికోత్సవం.. ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎంపీ రాక జగదేవ్‌పూర్: ‘సర్కార్ స్కూలా..! అక్కడికి పంపితే పిల్లలకు చదువు సరిగ్గా రాదు.. ఏబీసీడీలు సంగతి దేవుడెరుగు, కనీసం అఆఇఈలు కూడా నేర్చుకోలేరు. ఇంగ్లిష్ సార్లు అసలే ఉండరు’. ప్రభుత్వ పాఠశాలపై ఈ తరహా అభిప్రాయం అనేక మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇలాంటి దురభిప్రాయాల్ని అంగడికిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల పటాపంచలు చేసింది. ఉపాధ్యాయుల కృషి.. విద్యాశాఖ సహకారం.. గ్రామస్తుల తీర్మానం.. ఆ స్కూల్ దశ, దిశని మార్చేసింది. గతంలో ఈ స్కూల్‌పై ‘మన ఊరు.. మన బడి’ అనే కథనం ‘సాక్షి’లో కూడా ప్రచురితమైంది. ఈ క్రమంలో మొదటి వార్షికోత్సవానికి సిద్ధమైన బడిని మరోసారి గుర్తుచేసుకుందాం... జగదేవ్‌పూర్ మండలంలోని 23 గ్రామ పంచాయతీలు, 9 మదిర గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో 55 ఏళ్ల క్రితం అంగడికిష్టాపూర్ గ్రామంలో ప్రారంభమైన ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. వందల మంది విద్యార్థులతో వెలిగిన పాఠశాల క్రమంగా 12 మందికి తగ్గి మూసివేత దిశగా చేరింది. అదే సమయంలో హెచ్ఎంగా ఉన్న ఓంకార్.. స్కూల్ పునఃవైభవానికి నడుం బిగించారు. సర్పంచ్ రాములు, గ్రామస్తులకు అవగాహన కల్పిండంతో గత ఏడాది మార్చిలో ఎంఈఓ సుగుణాకర్‌రావుతో సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న 5వ తరగతి లోపు పిల్లలకు ప్రభుత్వ బడికే పంపిస్తామని తీర్మానం చేశారు. ఫలితంగా గత ఏడాది 12 ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 72 మందికి చేరారు. ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తుల సహకారంతో మరో ముగ్గురు ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా.. పాఠశాల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయడంతో పాటు చెట్లు ఏపుగా పెరిగాయి. బడి బాగు కోసం గ్రామస్తులు నిధి ఏర్పాటుచేశారు. దీని నుంచే ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తున్నారు. 12 మంది దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్, కుర్చీలు, యూనిఫాం, ట్రై, బెల్టులు సమకూర్చారు. ఈక్రమంలో ఆదర్శ పాఠశాలగా అంగడికిష్టాపూర్ పేరు సాధించడం విశేషం. నేడు వార్షికోత్సవం అంగడికిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల మన ఊరు మన బడికి ఏడాది పూర్తి కావడంతో నేడు(బుధవారం) సాయంత్రం వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆహ్వాన కార్డులు ముద్రించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఒంటిమిట్టపల్లే ఆదర్శం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమిట్టపల్లి పాఠశాలే మాకు ఆదర్శం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ ప్రీ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఆ పాఠశాల మదిరిగానే మేం కూడా సాధిస్తాం. మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు మా పాఠశాల విద్యార్థులు 11 మంది రాయగా 8 మందికి సీట్లు వచ్చాయి. - ఓంకార్, హెచ్ఎం -
టీచర్ల పోస్టులపై సుదీర్ఘ కసరత్తు
- ఆదర్శ పాఠశాలలపై వెలువడని ఉత్తర్వులు - రేషనలైజేషన్ పరిస్థితి అంతే - ఇంకా కొలిక్కిరాని వైనం ఒంగోలు వన్‌టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై రోజుకో ఉత్తర్వులు జారీచేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వ్యవహారం కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జారీచేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించాల్సి ఉంది. అయితే ఖాళీల వివరాలు ప్రకటించాలంటే ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు పూరై ్త ఆ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడాలి. అయితే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, రేషనలైజేషన్ వ్యవహారంపై జిల్లా నుంచి సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆమోదముద్ర పడ లేదు. దీంతో ఖాళీల వ్యవహారం గందరగోళంగా మారనుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విషయంలో.. ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు విషయంలో మొదట పట్టుదలగా వ్యవహరించింది. జిల్లాలో మొత్తం 483 ఆదర్శ ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పీ సిసోడియా జీవో ఎంఎస్ నం.46, తేదీ 7.8.2015 ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక్కో ఆదర్శ ప్రాధమిక పాఠశాలకు అన్ని వసతులు కల్పించాలంటే సుమారు రూ. 25 లక్షలు వ్యయమవుతుందని అంచనా. అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై పట్టును సడలించారు. మొదట కిలోమీటర్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయమన్నారు. ఆ మేరకు జిల్లాలో మొదట 513 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటవుతుందని లెక్కలు కట్టారు. అనంతరం ఆ సంఖ్య 437కు కుదించారు. అయితే ఈ సంఖ్య కూడా 383కు పడిపోయింది. దీనిపై ఇంకా చిక్కుముడి వీడ లేదు. రేషనలైజేషన్‌లో.. ఉపాధ్యాయులు, పాఠశాలల రేషనలైజేషన్‌లో కూడా సందిగ్ధత సాగుతోంది. రేషనలైజేషన్‌లో గత ఏడాది చివరి నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందుకు బదులుగా ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి పాఠశాలలలోని విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ చేయాలని కోరుతున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు.... ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తం 465 మంది ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు ఉన్నారు. ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్రకారం 130 మంది కంటే ఎక్కువ పిల్లల ఉన్న ఆదర్శ పాఠశాలలకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. జిల్లాలో ఇటువంటి పాఠశాలలు కేవలం 83 మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం 382 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు మిగులుగా తేలుతున్నాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, రేషనలైజేషన్ విషయంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం మార్పులు, చేర్పుల కోసం డీఈవో కార్యాలయంలోని ఏపీవో, సిబ్బంది మంగళవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఈ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి కమిషనర్ ఆమోద ముద్ర పడితే కానీ ఖాళీల కసరత్తు కొలిక్కిరాదు.