♦ ఈ ఏడాది నుంచే అందుబాటులోకి
♦ జులై 5లోగా దరఖాస్తుల స్వీకరణ
♦ 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహణ
♦ కొన్నిచోట్ల అద్దె భవనాల్లో కొనసాగింపు
♦ కాంట్రాక్టు పద్ధతిలో బోధనా సిబ్బంది!
ఈ ఏడాదే మరో ఐదు ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్) అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కొన్నిచోట్ల భవనాలు అందుబాటులో లేనప్పటికీ.. అద్దె భవనాల్లోనైనా కొన సాగించాలని సంకల్పించిన జిల్లా విద్యాశాఖ.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో 12 ఆదర్శ పాఠశాలలు కొనసాగుతుండగా.. తాజాగా బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, పరిగి, మహేశ్వరంలలో ఆదర్శ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా ప్రారంభమయ్యే ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియను విద్యాశాఖ మొదలు పెట్టింది. ప్రస్తుతం 6,7,8 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రతి తరగతిలో వంద సీట్లుంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు తెల్లకాగితంపై వివరాలు రాసిచ్చి జులై 5వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి సమర్పిస్తే సరిపోతుందని డీఈఓ రమేష్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి దరఖాస్తులు సైతం తీసుకుంటున్నామన్నారు. ప్రతి మోడల్ స్కూల్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు కొనసాగుతాయని, ఒక్కో గ్రూపులో 40 సీట్లున్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభర్థులకు జులై 10న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.
సిబ్బందిపై స్పష్టత కరువు
తాజాగా 5 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో విద్యాశాఖ ప్రవేశాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ పాఠశాలల్లో బోధనసిబ్బందిపై మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి 12 పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాలల్లోనూ రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే డీఎస్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రెగ్యులర్ సిబ్బంది నియామకం ఇప్పట్లో జరిగేలా లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ పది రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు హాజరుకానుండగా.. ఇప్పటికీ కాంట్రాక్టు టీచర్లను సైతం నియమించకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది.