‘ఆదర్శం... అపహాస్యం!.
♦ నెరవేరని ఆదర్శ పాఠశాల లక్ష్యం
♦ అరకొరగా నిర్మితమైన హాస్టల్ భవనాలు
♦ ఉన్నవి ప్రారంభించకపోవడంతో మొలుస్తున్న పిచ్చిమొక్కలు
♦ నిరుపయోగంగా పడి ఉన్న వసతి సామగ్రి
♦ సుదూరం నుంచి ఆటోల్లో తప్పని రాకపోకలు
నిరుపేదలకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలి... వారిని సమున్నతంగా తీర్చిదిద్దాలి... అందుకోసం సకల సౌకర్యాలతో భవనాలు... వసతి సమకూర్చాలి. ఆంగ్ల బోధనద్వారా ఉజ్వల భవితను అందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలంతా ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రూపొందించిన ఆదర్శ పాఠశాలల వ్యవస్థ అపహాస్యవమవుతోంది. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు... అక్కరకు రాని భవనాలు... అరకొర సౌకర్యాలు వారిని వెక్కిరిస్తున్నాయి.
ఈ చిత్రం చూడండి. ఇదేదో స్క్రాప్ దుకాణం అనుకుంటున్నారు కదూ... లక్కవరపుకోటలో ఏర్పాటైన ఆదర్శ పాఠశాల విద్యార్థులకోసం తెప్పించిన సామగ్రి వాటిని వినియోగించకపోవడంతో అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరో కొద్ది రోజుల్లో అవి తుప్పుపట్టిపోవడం ఖాయం.
రంగురంగుల్లో సుందరంగా కనిపిస్తున్న ఈ భవనం చూడండి. ఇది లక్కవరపుకోటలో నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్. ఇది ఇలా బయటకు కనిపిస్తున్నా... లోపల మాత్రం సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. అందువల్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. అవెప్పుడు పూర్తవుతాయో... దీనినెప్పుడు ప్రారంభిస్తారో తెలీదు గానీ... మరి కొద్దిరోజుల్లో ఇది శిథిలావస్థకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
లక్కవరపుకోట(ఎస్‌కోట): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం 2013 సంవత్సరంలో ప్రారంభించిన ఆదర్శపాఠశాలల్లో ‘ఆదర్శం’ నేతిబీరకాయ చందంగా మారింది. విద్యా బోధన పక్కన పెడితే ఇక్కడ అపహాస్యం! సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కడా నేటికీ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. దీనివల్ల విద్యార్థినులు సుదూర ప్రాంతాలనుంచి ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. వసతి సౌకర్యం కల్పిస్తారంటేనే ఇక్కడ చేర్చామని తీరా రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభం కాని వసతి గృహాలు
జిల్లాలో 16 చోట్ల ఆదర్శపాఠశాలల ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి వసతి గృహాలు నిర్మించారు. గత ఏడాది జూన్ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వసతి గృహాలు ప్రారంభిస్తామని అధికారులు హడావుడి చేశారు. ఒక్కో వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందుకు అవసరమైన వసతి, మంచాలు.. కుర్చీలు వంటి సామగ్రిని తెప్పించారు. అయితే అవన్నీ ఇప్పుడు ఓ మూల పడి ఉన్నాయి. ప్రస్తుతం హాస్టల్ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు.
ముఖ్యంగా లక్కవరపుకోట, వేపాడ, గర్భాంలోని వసతి గృహాలకు కనీసం మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం, విజటర్స్ వేచివుండే గదులు నిర్మాణం కాలేదు. అధికారులు మాత్రం ఈ విద్యా సంవత్సరానికే ప్రారంభించేస్తామని చెబుతున్నా... అందుకు అనుగుణంగా అయితే పనులు జరగలేదు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారుల మాటలు వారిని నమ్మకం కలిగించడంలేదు.
అవస్థలు పడుతున్న విద్యార్థులు
హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని అనడంతో సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేరారు. తీరా హాస్టళ్లు ప్రారంభించకపోవడంతో నిత్యం ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం చేతి చమురు వదులుతోందనీ, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వతసతి గృహాలు ప్రారంభించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.