Chalets
-
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
‘వసతి’ వణుకుతోంది..
ఖమ్మంమయూరిసెంటర్: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక నేలపైనే నిద్రిస్తూ చాలీచాలని దుప్పట్లతో అవస్థలు పడుతున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులను వదిలి.. సంక్షేమ వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు తగిన విధంగా వసతి కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను రాత్రివేళ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సందర్శనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. సంక్షేమ శాఖ వసతి గృహాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కేవలం పేరుకే సంక్షేమ వసతి గృహాలుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం లోని ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో దుప్పట్లు, మ్యాట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ వసతి గృహాల్లో మినహా ఇతర శాఖల్లో విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ లేవు. అరకొర సౌకర్యాలతోనే బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. సౌకర్యాల లేమితో ఇబ్బందులు.. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, మ్యాట్లు ఇచ్చినా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎముకలు కొరికే చలిలో సైతం విద్యార్థులు పలుచటి మ్యాట్లను నేలపై వేసుకొని వాటిపైనే నిద్రిస్తున్నారు. దీంతో బండల చల్లదనం, పైన చలిగా లి విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తోంది. నగరం లోని ముస్తఫా నగర్ ప్రాంతంలో ఉన్న బీసీ సంక్షేమ ప్రీమెట్రిక్ వసతి గృహంలో పలు గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక వారి వద్ద ఉన్న దుప్పట్లను కిటికీలకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇక గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు దుప్పట్లు లేని పరిస్థితి. నూతనంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు ఇంటి నుంచే దుప్పట్లు తెచ్చుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కనిపించని వార్డెన్, వాచ్మెన్లు.. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల్లో సౌకర్యాలే లేవను కుంటే.. వసతి గృహాలకు సంరక్షకులుగా ఉన్న సిబ్బంది అక్కడ కనిపించడం లేదు. ముస్తఫా నగర్ బీసీ వసతి గృహంలో రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్‌మన్ ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. వారు ఇష్టారీతిగా తిరుగుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వార్డెన్, వాచ్‌మన్ వసతి గృహంలో ఉండకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక వసతి గృహంలో విద్యార్థి హత్య జరిగినా.. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం వారి నిర్లక్ష్యాన్ని వీడలేదు. నెహ్రూ నగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వాచ్మన్లు ఇద్దరూ వసతి గృహ గేట్లకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్తున్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే తిరుగుతున్నారు. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వాచ్మన్లు ఇంటికి వెళ్లడం, వసతి గృహాలపై పర్యవేక్షణగా ఉండాల్సిన సంక్షేమాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వసతి గృహాలపై పర్యవేక్షణ ఉంచాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
వసతి గృహాల ప్రారంభమెప్పుడో..?
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల కళాశాలస్థాయి వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోక వందలాది మంది విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి బాలురు, బాలికలకు రెండు కళాశాల స్థాయి వసతి గృహాలు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రెండు బాలురు, ఒకటి బాలికల కళాశాలస్థాయి వసతి గృహాలు 40 రోజుల క్రితం మంజూరు కాగా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు, వసతి లేకపోవడంతో చదువులను అర్ధంతరంగా ఆపివేయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి 16 మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు చదువు నిమిత్తం జిల్లా కేంద్రానికి రోజూ వచ్చి పోవడంతో బస్సు చార్జీలతో బెంబేలెత్తిపోతున్నా రు. సంక్షేమ వసతి గృహాలకు అద్దెకివ్వడానికి భవ న యజమానులు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. అద్దెకు దొరికిన భవనాల కిరాయిల అద్దె రేట్లు ప్రభుత్వానికి గుదిబండగా మారడంతో వసతి గృహాల ప్రారంభానికి గ్రహణం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అద్దె ధరలు తక్కువగా ఉండటం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అద్దె ధరలు పెంచే అధికారం సంక్షేమ అధికారులకు లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. పోటాపోటీ దరఖాస్తులు.. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాల్సిన వసతి గృహాల్లో ఇప్పటికే 150కి మించి విద్యార్థులు ఉండడంతో ఏం చేయాలో పాలుపోక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలకు విద్యార్థుల ప్రవేశాల తాకిడి అధికమవ్వడంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్న వసతి గృహాలకు తోడు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి రెండు (బాలురు, బాలికలు), బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, వీణవంక, చొప్పదండి మండల కేంద్రాల్లోని ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మారుస్తూ జిల్లా కేంద్రానికి తరలించారు. ఐదు కళాశాల స్థాయి వసతి గృహాల్లో ప్రవేశాల కోసం 540 మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఐదు హా స్టళ్లను నెలకొల్పుతూ తీసుకున్న నిర్ణయం 40 రోజు లు గడుస్తున్నా భవనాలు లభించకపోవడం, లభిం చిన చోట కిరాయి రేట్లు నిబంధనల ప్రకారం పొం తన లేకుండా ఉండడంతో వసతి గృహాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఒక చదరపు అడుగుకు రూ.5.50 చెల్లించే అవకాశం ఉంది. నగరంలో అద్దెలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ధర మాత్రం తక్కువగా ఉంది. దీనికితోడు ఖాళీ స్థలం, కారిడార్‌తోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు అద్దె కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఇంటి నిర్మాణం కొలతలు చూసి అద్దె నిర్ణయిస్తారు. అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాల యజమానుల కిరాయి రేట్లకు పొంతన లేకుండా పోవడంతో వసతి గృహాల ప్రా రంభం కొలిక్కి రావడం లేదు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకోని సంక్షేమ శాఖల కళాశాల స్థాయి వసతి గృహాల ప్రారంభానికి కసరత్తు ముమ్మరం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘వసతి గృహాల భవనాల ప్రారంభానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాం. అద్దె భవనాల రేట్లు అధికంగా ఉండటం, ప్రభుత్వ నిబంధనలు సరిపోక పరిస్థితిని పైఅధికారులకు విన్నవించాం. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. -
‘ఆదర్శం... అపహాస్యం!.
♦ నెరవేరని ఆదర్శ పాఠశాల లక్ష్యం ♦ అరకొరగా నిర్మితమైన హాస్టల్ భవనాలు ♦ ఉన్నవి ప్రారంభించకపోవడంతో మొలుస్తున్న పిచ్చిమొక్కలు ♦ నిరుపయోగంగా పడి ఉన్న వసతి సామగ్రి ♦ సుదూరం నుంచి ఆటోల్లో తప్పని రాకపోకలు నిరుపేదలకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలి... వారిని సమున్నతంగా తీర్చిదిద్దాలి... అందుకోసం సకల సౌకర్యాలతో భవనాలు... వసతి సమకూర్చాలి. ఆంగ్ల బోధనద్వారా ఉజ్వల భవితను అందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలంతా ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రూపొందించిన ఆదర్శ పాఠశాలల వ్యవస్థ అపహాస్యవమవుతోంది. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు... అక్కరకు రాని భవనాలు... అరకొర సౌకర్యాలు వారిని వెక్కిరిస్తున్నాయి. ఈ చిత్రం చూడండి. ఇదేదో స్క్రాప్ దుకాణం అనుకుంటున్నారు కదూ... లక్కవరపుకోటలో ఏర్పాటైన ఆదర్శ పాఠశాల విద్యార్థులకోసం తెప్పించిన సామగ్రి వాటిని వినియోగించకపోవడంతో అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరో కొద్ది రోజుల్లో అవి తుప్పుపట్టిపోవడం ఖాయం. రంగురంగుల్లో సుందరంగా కనిపిస్తున్న ఈ భవనం చూడండి. ఇది లక్కవరపుకోటలో నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్. ఇది ఇలా బయటకు కనిపిస్తున్నా... లోపల మాత్రం సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. అందువల్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. అవెప్పుడు పూర్తవుతాయో... దీనినెప్పుడు ప్రారంభిస్తారో తెలీదు గానీ... మరి కొద్దిరోజుల్లో ఇది శిథిలావస్థకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. లక్కవరపుకోట(ఎస్‌కోట): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం 2013 సంవత్సరంలో ప్రారంభించిన ఆదర్శపాఠశాలల్లో ‘ఆదర్శం’ నేతిబీరకాయ చందంగా మారింది. విద్యా బోధన పక్కన పెడితే ఇక్కడ అపహాస్యం! సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కడా నేటికీ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. దీనివల్ల విద్యార్థినులు సుదూర ప్రాంతాలనుంచి ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. వసతి సౌకర్యం కల్పిస్తారంటేనే ఇక్కడ చేర్చామని తీరా రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని వసతి గృహాలు జిల్లాలో 16 చోట్ల ఆదర్శపాఠశాలల ఏర్పాటు చేశారు. ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి వసతి గృహాలు నిర్మించారు. గత ఏడాది జూన్ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వసతి గృహాలు ప్రారంభిస్తామని అధికారులు హడావుడి చేశారు. ఒక్కో వసతి గృహంలో 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందుకు అవసరమైన వసతి, మంచాలు.. కుర్చీలు వంటి సామగ్రిని తెప్పించారు. అయితే అవన్నీ ఇప్పుడు ఓ మూల పడి ఉన్నాయి. ప్రస్తుతం హాస్టల్ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ముఖ్యంగా లక్కవరపుకోట, వేపాడ, గర్భాంలోని వసతి గృహాలకు కనీసం మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం, విజటర్స్ వేచివుండే గదులు నిర్మాణం కాలేదు. అధికారులు మాత్రం ఈ విద్యా సంవత్సరానికే ప్రారంభించేస్తామని చెబుతున్నా... అందుకు అనుగుణంగా అయితే పనులు జరగలేదు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారుల మాటలు వారిని నమ్మకం కలిగించడంలేదు. అవస్థలు పడుతున్న విద్యార్థులు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని అనడంతో సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేరారు. తీరా హాస్టళ్లు ప్రారంభించకపోవడంతో నిత్యం ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం చేతి చమురు వదులుతోందనీ, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వతసతి గృహాలు ప్రారంభించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కిరాణంలో ఖాతా!
హాస్టళ్ల విద్యార్థులకు అందని కాస్మొటిక్ చార్జీలు బీసీ, ఎస్సీ వసతి గృహాలకు ఏడు నెలలుగా విడుదల కాని నిధులు గిరిజన ఆశ్రమ పాఠశాలకు నాలుగు నెలలుగా మొండిచేయి నర్సంపేట : వారంతా నిరుపేద విద్యార్థులు. ఆర్థిక సమస్యల కారణంగా కన్నవారికి దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు నాలుగు నెలలుగా, బీసీ, ఎస్టీ హాస్టళ్లలోని విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదు. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి వీరికి డబ్బు అందలేదు. దీంతో సబ్బుకు బదులు బియ్యపు పిండితో స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఒకే సబ్బును సగం చేసుకుంటూ ముగ్గురు చొప్పున వాడుకోవాల్సిన దుస్థితి! ఇక విద్యార్థుల్లో మరికొందరు సబ్బు లేకుండా నల్లాల కింద స్నానం చేస్తుండగా.. ఇంకొందరు కటింగ్ ఖర్చులు లేక పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను చూస్తూ డబ్బు అడగలేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక పూట ఎలా గడవాలో తెలియక విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలకోసారి... బడులకు దూరమవుతున్న నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ వీరికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ప్రభుత్వాల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సౌకర్యాలు సమకూరక ఏటా విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. విద్యార్థులకు సబ్బులు, కొబ్బరినూనె, పౌడర్ వంటి కనీస అవసరాల కోసం ప్రతీ నెల రూ.50తో పాటు కటింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రూ.12 అందజేయాల్సి ఉంటుంది. ఇక ఆడ పిల్లలకు ఏడో తరగతి వరకు రూ.55, ఆ తర్వాత వారికి రూ. 75 అందించాలి. కానీ ప్రతీ నాలుగు నెలలకోసారి ఇచ్చే ఈ డబ్బు ఈసారి సక్రమంగా అందకపోవడం గమనార్హం. గ్రూప్‌గా ఉద్దెర.. తల్లిదండ్రులు పేదరికంలో ఉండి హాస్టల్‌కు పంపించగా ప్రభుత్వం ఇవ్వాల్సిన కాస్మోటిక్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు కొబ్బరినూనె, సబ్బు వంటి కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి సమీపంలోని కిరాణం షాపుల్లో ఖాతాలు పెట్టి సబ్బు, కొబ్బరినూనె తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చితే సంక్షేమ వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే నగదు ఏ మూలకు సరిపోదు. ప్రస్తుతం ఏ కంపెనీ సబ్బు ధర చూసినా రూ.20కి పైగానే ఉంది. పౌడర్, కొబ్బరినూనె కోసం రూ.50వరకు కావాలి. కానీ ఇచ్చే అరకొర నగదు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్సీ వసతి గృహాలు : 15 విద్యార్థులు : 689 బీసీ వసతి గృహాలు : 18 విద్యార్థులు : 1,876 ఎస్టీ వసతి గృహాలు : 08 విద్యార్థులు : 1,488 22 ఎన్ఎస్పీ 02 : కాస్మోటిక్ బిల్లులు రాలేదని చెబుతున్న హాస్టల్ విద్యార్థినులు -
ఎంత లావు ప్రేమో!
వసతి గృహాలకు పంపిణీ కాని సన్న బియ్యం నెరవేరని ప్రభుత్వ హామీ చిమిడిన అన్నమే గతి అజీర్తితో బాధపడుతున్న విద్యార్థులు వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడతామన్న ప్రభుత్వ హామీ వారికి పెడుతున్న అన్నంలా చిమిడిపోయింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి రావెల కిషోర్‌బాబు మాటిచ్చి ఏడాది దాటినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ లావు బియ్యాన్నే వాడడంతో చిమిడిన, సుద్దగా మారిన అన్నాన్ని తినలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో 8,548 మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాల వసతి గృహాలు 27 ఉండగా వాటిలో 1,690 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 62 వసతి గృహాల్లో 4,758 మంది విద్యార్థులు ఉన్నారు. 32 కళాశాలల వసతి గృహాల్లో 3,209 మంది ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 12 వసతి గృహాల్లో 2,225 మంది విద్యార్థులున్నారు. కళాశాల వసతి గృహాలు మూడింటికి గాను 105 మంది విద్యార్థులున్నారు. వీటితో పాటు మూడు కస్తూర్బా బాలికల పాఠశాలల్లో 300 మంది ఉన్నారు. అన్ని శాఖల సంక్షేమ వసతి గృహాల్లో 20,835 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురుకుల పాఠశాలలు జిల్లాలో ఐదు, జూనియర్ కళాశాల ఒకటి ఉన్నాయి. వీటిలో 1600 మందికి పైగా పిల్లలు ఉన్నారు. వీరికి సన్నబియ్యం సరఫరా చేసి నాణ్యమైన భోజనం పెడతామని పాలకులు ఇచ్చిన హామీ అమలు కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2.51 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీరికీ లావు బియ్యమే సరఫరా చేస్తున్నారు. అర్ధాకలితో ఉంటున్నారు లావు బియ్యం వండి పెట్టడంతో ఆ భోజనం తిన్న విద్యార్థులకు అజీర్తి సమస్యలు తలెత్తుతున్నాయని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి వస్తే హాస్టళ్లలో ఉన్న ఏవో మందుబిళ్లలు ఇచ్చి సరిపెడుతున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పలువురు వార్డెన్లు చెబుతున్నారు. పోషకాహారం కూడా అంతంతమాత్రంగానే అందుతోందని, లావు బియ్యంతో వండిన భోజనం కారణంగా విద్యార్థుల ఆకలి తీరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. -
నో మెనూ.. పెట్టిందితిను
విద్యార్థులకు అందని పోషకాహారం దోమలతో సహవాసం ఇతర వ్యాపకాల్లో వార్డెన్లు బిజీ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల మోత మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు ఉండగా వాటిలో 9,876 మంది, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 96 వసతి గృహాలు ఉండగా వాటిలో 6705 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1288 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా వసతి గృహాల్లోని విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన వార్డెన్లు నెలవారీ మామూళ్ల పేరుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే అంశంపైనే అధికంగా దృష్టిసారించి పిల్లలను అర్ధాకలితో ఉంచుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు వసతి గృహాల్లో గుడ్డు వడ్డించాలి. మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే పాఠశాలలో ఇస్తున్నారు కదా అని ఎదురుప్రశ్నిస్తున్నారు. తలకు రాసుకునే కొబ్బరినూనె ఖర్చులు కూడా రెండు నెలలుగా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూడాల్సిన వార్డెన్లు ఇతర పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో పిల్లలకు ఏం పెడుతున్నారో, వారేం తింటున్నారో, ఏం చదువుతున్నారో పట్టించుకునే వారే కరువయ్యారు. వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు చెప్పే ట్యూటర్లకు గత ఎనిమిది నెలలుగా గౌరవవేతనం ఇవ్వని పరిస్థితి. ఇలా ఎన్నో సమస్యలను సాక్షి బృందం గుర్తించింది. పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో పిల్లలే లేరు. పామర్రు బీసీ బాలికల వసతి గృహంలో 25 మంది పిల్లలున్నట్లు లెక్కల్లో ఉన్నా అక్కడ ఐదుగురే ఉన్నారు. పామర్రు ఎస్సీ బాలికల వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేరు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు వసతి గృహం వార్డెన్ ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. బాలికల వసతి గృహంలో వరండాలోనే బాలికలు నిద్రిస్తున్నారు. ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టుకున్నా దోమలబెడద వీరిని వెంటాడుతోంది. మైలవరం బీసీ బాలుర వసతి గృహంలో 150 మంది పిల్లలకుగాను ఐదు మరుగుదొడ్లే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో పోషకాహారంతో కూడిన భోజనం పెట్ట డం లేదు. జి.కొండూరు మండలం వెలగలేరులోని హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు వసతి గృహం ప్రైవేటు భవనంలో ఉంది. వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులపాలవుతున్నారు. గన్నవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. శ్లాబు పెచ్చలూడి పడతున్నాయి. ఈ రెండు వసతి గృహాల భవనాల్లో కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలతోనే విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఎస్సీ వసతి గృహంలో మూడు జతల యూనిఫాం మాత్రమే ఇచ్చారు. వత్సవాయి ఎస్సీ హాస్టల్లో భోజ నం సుద్దగా పెడుతుండడంతో పిల్లలు తినలేని పరిస్థితి. పెనుగంచిప్రోలు బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో పిల్లలు తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపుతున్నారు. చిల్లకల్లు ఎస్టీ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున దీన్ని రద్దుచేయాలని ప్రతిపాదనలు పంపారు. జగ్గయ్యపేటలోని బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది. నందిగామ నియోజకవర్గంలో రెండు వసతి గృహాలు ఉండగా వార్డెన్లు కుక్‌లకు బియ్యం, సరుకులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇక నైట్ వాచ్మెన్లు కూడా బయట పనుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో పిల్లలపై అజమాయిషీ కొరవడింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు బీసీ బాలుర వసతి గృహంలో వార్డెన్, నైట్ వాచ్‌మన్ లేరు. హాస్టల్ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండి ఉంది. మెనూ సక్రమంగా అమలుచేయడం లేదు. అవనిగడ్డ బీసీ బాలుర వసతి గృహం డ్రెయిన్ పక్కనే ఉండడంతో నిత్యం దుర్గంధం వెదజల్లుతోంది. వాచ్‌మన్ లేరు. మోపిదేవి ఎస్సీ బాలుర వసతి గృహంలో సరిపడినన్ని గదులు లేవు. పిల్లలు వరండాలోనే చదువుకుని అక్కడే నిద్రపోతున్నారు. ట్యూటర్లు కూడా లేరు. నాగాయలంక బీసీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో నడుస్తోంది. సరిపడినన్ని గదులు లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు. గుడ్లవల్లేరు కళాశాల వసతి గృహంలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. వసతులు సక్రమంగా లేకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలోని వసతి గృహాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. బోరు నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారు. నాలుగు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా రెండు జతలు మాత్రమే ఇచ్చారు. కాస్మొటిక్ చార్జీలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఆరు సంక్షేమ హాస్టళ్లలోనూ రక్షిత నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పునీటినే తాగునీటిగా వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉయ్యూరు బస్టాండ్ ప్రాంతంలో, మండలంలోని ఆకునూరులో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కంకిపాడు హాస్టల్లో మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. ధరలు మండిపోతుండటంతో దాదాపు అన్ని హాస్టళ్లలో మెనూ అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. పెనమలూరు ఎస్సీ బాలికల హాస్టల్లో లోఓల్టేజీ సమస్యతో రాత్రివేళ లైట్లు వెలగటం లేదు. బీసీ హాస్టల్ భవనం శ్లాబు లీకవటంతో శిథిలావస్థకు చేరింది. విజయవాడ దేవీనగర్ బీసీ బాలికల హాస్టల్లో 25 మంది విద్యార్థినులకు గాను విజిట్ సందర్భంగా ఏడుగురే కనిపించారు. 15 మంది స్థానికులేనని, భోజనాల అనంతరం ఇంటికి వెళ్లిపోతారని సిబ్బంది తెలిపారు. తాగునీటికి పబ్లిక్ కుళాయే వీరికి ఆధారం. బాలుర హాస్టల్లో దోమల బెడద ఎక్కువగా ఉందని, దుప్పట్లు ఇచ్చినా ఇబ్బంది పడుతున్నామని, దోమతెరలు ఇస్తే బాగుంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. మాంటిస్సోరి విద్యా సంస్థల ప్రాంగణంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో 110 మంది విద్యార్తులు ఉండగా, వారికి సరిపడినన్ని గదులు లేవు. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఇరుక్కుని పడుకోవాల్సి వస్తోంది. మరుగుదొడ్లు కూడా నాలుగే ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కస్తూరిబాయిపేట ఎస్సీ మోడల్ హాస్టల్లో 175 మంది విద్యార్థినులకు గాను ఒకే ట్యాంకర్ నీళ్లు ఉండటంతో విద్యార్థినులు ఒక్కోరోజు స్నానం చేయకుండానే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.