వసతి గృహాలకు పంపిణీ కాని సన్న బియ్యం
నెరవేరని ప్రభుత్వ హామీ చిమిడిన అన్నమే గతి
అజీర్తితో బాధపడుతున్న విద్యార్థులు
వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడతామన్న ప్రభుత్వ హామీ వారికి పెడుతున్న అన్నంలా చిమిడిపోయింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి రావెల కిషోర్‌బాబు మాటిచ్చి ఏడాది దాటినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ లావు బియ్యాన్నే వాడడంతో చిమిడిన, సుద్దగా మారిన అన్నాన్ని తినలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు.
మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో 8,548 మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాల వసతి గృహాలు 27 ఉండగా వాటిలో 1,690 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 62 వసతి గృహాల్లో 4,758 మంది విద్యార్థులు ఉన్నారు. 32 కళాశాలల వసతి గృహాల్లో 3,209 మంది ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 12 వసతి గృహాల్లో 2,225 మంది విద్యార్థులున్నారు. కళాశాల వసతి గృహాలు మూడింటికి గాను 105 మంది విద్యార్థులున్నారు. వీటితో పాటు మూడు కస్తూర్బా బాలికల పాఠశాలల్లో 300 మంది ఉన్నారు. అన్ని శాఖల సంక్షేమ వసతి గృహాల్లో 20,835 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురుకుల పాఠశాలలు జిల్లాలో ఐదు, జూనియర్ కళాశాల ఒకటి ఉన్నాయి. వీటిలో 1600 మందికి పైగా పిల్లలు ఉన్నారు. వీరికి సన్నబియ్యం సరఫరా చేసి నాణ్యమైన భోజనం పెడతామని పాలకులు ఇచ్చిన హామీ అమలు కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2.51 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీరికీ లావు బియ్యమే సరఫరా చేస్తున్నారు.
అర్ధాకలితో ఉంటున్నారు
లావు బియ్యం వండి పెట్టడంతో ఆ భోజనం తిన్న విద్యార్థులకు అజీర్తి సమస్యలు తలెత్తుతున్నాయని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి వస్తే హాస్టళ్లలో ఉన్న ఏవో మందుబిళ్లలు ఇచ్చి సరిపెడుతున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పలువురు వార్డెన్లు చెబుతున్నారు. పోషకాహారం కూడా అంతంతమాత్రంగానే అందుతోందని, లావు బియ్యంతో వండిన భోజనం కారణంగా విద్యార్థుల ఆకలి తీరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
ఎంత లావు ప్రేమో!
Published Sat, Feb 20 2016 12:27 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
Advertisement
Advertisement