అభిప్రాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. అసమానతలతో నిండివున్న విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్యను అందజేశారు. పేద ప్రజల గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని పొందిన జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని బహుజనులు ఎదురుచూస్తున్నారు.
తరతరాలుగా భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వలన అణచివేయబడిన వారికి రాజ్యాధికారం సాధించాలని 1935లో ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించి జీవితకాలం ఆ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పని చేశారు అంబేడ్కర్. తరువాత కాలంలో ఆ ఆశయ సాధన కోసం మాన్య కాన్షీరాం బహుజన కులాలను ఐక్యం చేయడానికి 1975లో బ్యాక్వార్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బాంసెఫ్) స్థాపించి లక్షలాది మందని సమీకరించారు. వారికి అంబేడ్కరిజాన్ని బోధించి, వారిని భారతదేశ రాజకీయ భవిష్యత్తును మార్చడానికి సమాయత్తం చేశారు. 1985లో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించి పదేళ్లలోనే దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు.
భారత దేశ రాజకీయాలలో కాన్షీరాం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో తమకు రావలసిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (జగనన్న) ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. ‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ’లంటూ బహుజన కులాలను సొంతం చేసుకొని వారిలో ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించి మనోబలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు.
కనీస గుర్తింపునకు నోచుకోని బీసీ కులాలను గుర్తించి, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున చైర్మన్, డైరెక్టర్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ఇవ్వాళ వైఎస్సార్సీపీ తరఫున 11 మంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో నలుగురు బీసీలు ఉండటం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, శాసన మండలి డిప్యుటీ చైర్మన్, మంత్రి పదవులను బీసీలకు కేటాయించి వారికి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. 70 శాతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మైనారిటీలకి కేటాయించడం అనేది బహుజన కులాల పట్ల జగన్ చిత్తశుద్ధి, అంకిత భావాలను సూచిస్తుంది.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను బహుజన పేదవర్గాల సాధికారత కోసం అమలు చేస్తూ ‘బహుజన సుఖాయ బహుజన హితాయ’ అనే మౌలిక సూత్రాన్ని పాటించడం జగన్ మానవతా, సమతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. అక్షరాలా రూ.2.70 లక్షల కోట్ల నిధులను అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బహుజన వర్గాల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో దళారులతో పని లేకుండా పారదర్శకంగా జమ చేయడం సంక్షేమ రంగంలో ఒక నూతన విప్లవాత్మక సంస్కరణగా చెప్పుకోవచ్చు. దీనికి అదనంగా పరోక్షంగా రూ.1.30 కోట్లను గృహనిర్మాణం వంటి ఇతర సంక్షేమ పథకాల కోసం వినియోగించడం కూడా గమనించగలం.
అసమానతలతో నిండి వున్న విద్యారంగంలో వినూత్నమైన సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన మేలైన ఆధునిక విద్యను అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.73,000 కోట్లు వెచ్చించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించేందుకు రూ.46,000 కోట్లను అమ్మఒడి పథకం ద్వారా అందించడం మరో గొప్ప అడుగు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, డిజిటల్ విద్యాబోధన, విద్యార్థులకు ట్యాబుల పంపిణీ వంటివి అమలు చేసి పేద విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేయడం జరిగింది. అర్హులైన పేద విద్యార్థుల విదేశీ విద్యకోసం ఒక్కొక్కరికి 1.25 కోట్ల రూపాయల వరకు వెచ్చించడం ఒక అద్భుతమైన అవకాశంగా గుర్తించాలి.
బహుజన పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేయడం, కావలసిన నూతన వైద్య పరికరాలను సమకూర్చడం, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించడం, సమర్థవంతమైన పర్యవేక్షణతో మెరుగైన సేవలు అందించడం వంటి అనేక చర్యలను వైసీపీ ప్రభుత్వం తీసుకొంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృత పరిచి, ఒక వ్యక్తికి వెచ్చించే గరిష్ఠ పరిమితి ఖర్చును 25 లక్షలకు పెంచారు. ఉచిత కంటి పరీక్షలు, విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు, సంచార హాస్పిటల్స్ వంటి అనేక నూతన పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ఆదర్శవంతమైంది.
సొంత ఇల్లు కావాలనే పేదల స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, 31 లక్షల మందికి ఇళ్ళను నిర్మించి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఈ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, కుల వివక్ష అనే సామాజిక మహమ్మారికి తావు లేకుండా సకల జనుల సహజీవనానికి నాంది పలికింది. నా అన్నవారు లేక ఆర్ధికంగా నిస్సహాయ స్థితిలో వుండే వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ రూపంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఇంటి వద్దనే ఇచ్చే పద్ధతిని అవలంబించడం అనేది నిజంగా ఒక గొప్ప పథకం. మానవతా దృక్పథంతో వృద్ధులకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచింది. 66 లక్షల మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపి వారి గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని శాశ్వతంగా పొందడం జగనన్నకే దక్కింది.
మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించి ప్రభుత్వ పరిపాలనను గ్రామ స్థాయికి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పాలి. గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారి అన్ని రకాల పౌర సేవలను అందిస్తూ ప్రజల వద్దకు పరిపాలన అన్న ఉన్నత ఆశయాన్ని సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైంది. గ్రామాలలో నివసించే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దింది. సమాజంలో అన్ని రకాల అణచివేతకు, అవమానాలకు గురి అయిన స్త్రీ జాతి సాధికారతకు, రక్షణకు, ఆత్మ గౌరవానికి అనేక సంక్షేమ పధకాలలో పాటు ‘దిశ’ పోలీస్ స్టేషన్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అనేక చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను సమర్థవంతంగా జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 2.5 లక్షల ఉద్యోగాలను, ఆ యా రంగాలలో మరొక 2.5 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించి మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం జరిగింది. నాలుగు నౌకాశ్రయాలు, 14 సముద్ర పోర్టులు, ఒక పెద్ద విమానాశ్రయం, 17 మెడికల్ కాలేజీల వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అందరికీ తెలిసిన విషయమే.
బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్న విషయం గ్రహించిన బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరలా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనీ, సమసమాజం నిర్మాణం జరగాలనీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
రావెల కిషోర్ బాబు
వ్యాసకర్త మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment