narrow rice
-
సన్నబియ్యమేవీ..?
► ఏప్రిల్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ► ఇప్పటి వరకూ సరఫరా చేయనివైనం ► ఎస్ఎంఎస్లకే పరిమితమవుతున్న గుడ్లు ► సిబ్బందికి వంటగ్యాస్ భారం ► గర్భిణులు, చిన్నారులకందని పౌష్టికాహారం మాతాశిశువులకు పౌష్టికాహారం అందించాలి్సన అంగన్వాడీ కేంద్రాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందడం లేదు. పొగలేని పొయ్యిలు ఇచ్చారు కానీ గ్యాస్ ధర మాత్రం మొక్కుబడిగా చెల్లిస్తున్నారు. గుడ్ల సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం సరఫరా చేసే పరిస్థితి కనిపించడంలేదు. అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు : 7 అంగన్వాడీ కేంద్రాలు : 1,605 మినీ అంగన్వాడీ∙కేంద్రాలు : 291 లబ్ధిపొందే చిన్నారుల సంఖ్య : 70,121 గర్భిణులు, బాలింతల సంఖ్య : 20,248 గుడ్లు (నెలకు) : 15,572,931 నేలకొండపల్లి: ఏప్రిల్ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో సన్నబియ్యం వండిపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయలేదు. జిల్లాలోని 7 ప్రాజెక్ట్‌ల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకా దొడ్డు బియ్యం ఉన్నాయి. సన్నబియ్యంపై అధికారులకు ఆదేశాలు కూడా అందలేదు. ఈ క్రమంలో సన్నబియ్యం వండిపెట్టడం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. దొడ్డు బియ్యం నిల్వలను వెనక్కి పంపిస్తారా..? అవే కొనసాగిస్తారా..? అనే అంశం ఎటూ తేలడంలేదు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు రానురాను దయనీయంగా మారుతున్నాయి. గతంలో ఇచ్చిన పౌష్టికాహారం కూడా అందించలేకపోతున్నాయి. గర్భిణులకు, బాలింతలకు, చి న్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలు పలు చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర, కల్లూరు, కారేపల్లి, ఖమ్మం అర్భన్, ఖమ్మం రూరల్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 70,121 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 20,248 మంది అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుంటున్నారు. ఇటీవల గుడ్ల కాం ట్రాక్టర్ మార్పు వల్ల పలు ప్రాజెక్ట్‌లలో ఫిబ్రవరి నెలలో చాలాచోట్ల గుడ్లుఅందలేదు. కొన్ని చోట్ల నెలలో ఒక్కసారి మాత్రమే గుడ్లను సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. అంగన్వాడీ కేం ద్రాల్లో మెనూఅమలుపై ఉన్నతాధికారులు పర్య వేక్షించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ భారం.. ఐసీడీఎస్ కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి గ్యాస్‌కు ధర చెల్లిస్తారు. దీంతో పిల్లలు తక్కువగా ఉన్న చోట గ్యాస్ భారం అధికంగా పడుతోంది. ఉదాహరణకు.. నేలకొండపల్లి మండలంలోని ఆచార్లగూడెం కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్‌కు మూడు నెలలకు ఒకసారి సుమారు రూ. 330 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. కానీ వంటకు మూడు నెలలకు ఒక సిలిండర్ అవసరమవుతోంది. దీంతో రూ.870 పెట్టి గ్యాస్ కొనుగోలు చేయాల్సివస్తోంది. వచ్చే అరకొర వేతనాలతో అదనపు భారాన్ని ఎలా భరించాలని ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ‘సన్న బియ్యం’ ఆదేశాలు రాలేదు అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ మాకు ఇంకా అధికారికంగా ఆదేశాలు రాలేదు. జిల్లాలో పలు చోట్ల గుడ్లు నెలలో ఒక్కసారే అందించారు. అందుకే కాంట్రాక్టర్‌కు 15 రోజులకే బిల్లులు ఇచ్చాం. గ్యాస్ భారం పడుతోందని ఆయాలు చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌కు తెలిపాం. ఒంటిపూట బడులు మా పరిధిలో లేదు. టీచర్ల విన్నపం మేరకు రాష్ట్ర డైరెక్టర్‌కు తెలిపాం. కేంద్రాలలో మెనూ కచ్చితంగా అమలు చేయాలి. లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి. –ఆర్.రాజ్యలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్ -
ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం
► విద్యార్థులకు కడుపునిండా తిండి ► ఆక్రమాలకు అడ్డుకట్ట ► సంచులపై టీఎస్ఎస్సీఎల్ ముద్ర ఆదిలాబాద్ టౌన్ : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి, దీంతో అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు సరిగా తినలేక పోయేవారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. సన్నబియ్యం రాక అక్రమార్కులకు వరంగా మారింది. ఇటు చౌక దుకాణాలు, అటు పాఠశాలలు, వసతి గృహలకు ఒకే రకమైన సంచుల్లో సన్న, దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇన్నాళ్లు అక్రమార్కులకు కాసులు కురిపించారుు. ఈ క్రమంలో అవి పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. అక్రమాలను నిరోదించడానికి పాలిథీన్ సంచుల్లో బడి బియ్యం సరఫరా చేస్తున్నారు. నియోజక వర్గంలో.. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ఆదిలాబాద్ మండలంలో101 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీఎస్, 21 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. జైనథ్ మండలంలో 39 పీఎస్‌లు, 9 యూపీఎస్‌లు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. బేల మండలంలో 34 పీఎస్‌లు, 11 యూపీఎస్, 5 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటితో పాటు నియోజక వర్గంలోని ఆశ్రమ, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని వడ్డిస్తున్నారు. మొత్తం నియోజక వర్గంలో 20 వేల వరకు విద్యార్థులు ఉన్నారు. పక్కదారి పట్టించకుండా... ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఇప్పటిదాకా పాఠశాలలు, వసతి గృహలు, రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం అన్ని సంచులు ఒకే విధంగా ఉండేవి. 50 కిలోల గోనే సంచుల్లో అందజేసేవారు. దీంతో ఏవి దొడ్డు రకం..ఏవి సన్న రకమో.. సంచి తెరచి పరిశీలిస్తే కానీ తెలిసేది కాదు. దీన్ని ఆసరాగా చేసుకోని అక్రమార్కులు పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నారుు. అలాగే సంచుల్లో బియ్యం తూకం తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి 50 కిలోల ప్రత్యేక సంచి (తెలుపురంగు)లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. సంచులపై టీఎస్ఎస్సీఎల్ (తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ)ముద్రతో పాటు వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం బియ్యం, ప్యాకింగ్ చేసిన తేదిని ముద్రించారు. ఆక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఇది వరకు గోనే సంచుల్లో చౌకదరల దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో ఇవి కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన పాలిధీన్ సంచుల్లో 50 కిలో సంచుల్లో సరఫరా చేస్తున్నాం. దీంతో దొడ్డు బియ్యం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు. -శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
ఎంత లావు ప్రేమో!
వసతి గృహాలకు పంపిణీ కాని సన్న బియ్యం నెరవేరని ప్రభుత్వ హామీ చిమిడిన అన్నమే గతి అజీర్తితో బాధపడుతున్న విద్యార్థులు వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడతామన్న ప్రభుత్వ హామీ వారికి పెడుతున్న అన్నంలా చిమిడిపోయింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి రావెల కిషోర్‌బాబు మాటిచ్చి ఏడాది దాటినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ లావు బియ్యాన్నే వాడడంతో చిమిడిన, సుద్దగా మారిన అన్నాన్ని తినలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 119 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో 8,548 మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాల వసతి గృహాలు 27 ఉండగా వాటిలో 1,690 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 62 వసతి గృహాల్లో 4,758 మంది విద్యార్థులు ఉన్నారు. 32 కళాశాలల వసతి గృహాల్లో 3,209 మంది ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే 12 వసతి గృహాల్లో 2,225 మంది విద్యార్థులున్నారు. కళాశాల వసతి గృహాలు మూడింటికి గాను 105 మంది విద్యార్థులున్నారు. వీటితో పాటు మూడు కస్తూర్బా బాలికల పాఠశాలల్లో 300 మంది ఉన్నారు. అన్ని శాఖల సంక్షేమ వసతి గృహాల్లో 20,835 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురుకుల పాఠశాలలు జిల్లాలో ఐదు, జూనియర్ కళాశాల ఒకటి ఉన్నాయి. వీటిలో 1600 మందికి పైగా పిల్లలు ఉన్నారు. వీరికి సన్నబియ్యం సరఫరా చేసి నాణ్యమైన భోజనం పెడతామని పాలకులు ఇచ్చిన హామీ అమలు కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2.51 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీరికీ లావు బియ్యమే సరఫరా చేస్తున్నారు. అర్ధాకలితో ఉంటున్నారు లావు బియ్యం వండి పెట్టడంతో ఆ భోజనం తిన్న విద్యార్థులకు అజీర్తి సమస్యలు తలెత్తుతున్నాయని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. భోజనం తిన్న అనంతరం కడుపునొప్పి వస్తే హాస్టళ్లలో ఉన్న ఏవో మందుబిళ్లలు ఇచ్చి సరిపెడుతున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తుంటే ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పలువురు వార్డెన్లు చెబుతున్నారు. పోషకాహారం కూడా అంతంతమాత్రంగానే అందుతోందని, లావు బియ్యంతో వండిన భోజనం కారణంగా విద్యార్థుల ఆకలి తీరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. -
అయినా.. తీరుమారలేదు!
సన్నబియ్యం ఇచ్చి..మెనూ మార్చినా ఫలితం శూన్యం సమస్యలకు నిలయంగానే సంక్షేమ హాస్టళ్లు మౌలిక సౌకర్యాలపై దృష్టిపెట్టని ఫలితం.. చలికి గజగజ...ఆరు బయట స్నానాలు అద్దెభవనాలు.. ఇరుకు గదులు బాలికలకు భద్రత అంతంతే ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసిన నిజాలు... సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసి, మెనూలో మార్పులకు శ్రీకారం చుట్టి....కాస్మొటిక్ చార్జీలు పెంచినప్పటికీ .. విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిక పోవటంతో....గరీబోల్ల వసతి గృహాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు లేకపోవడం, ఇరుకు గదులను విస్తరించకపోవడం, మంచినీరు, మరుగుదొడ్లు, హాస్టళ్లకు ప్రహరీల ఏర్పాటు వంటి విషయాలను పట్టించుకోకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల దుప్పట్లు లేక విద్యార్థులు చలికి వణికుతున్నారు. నీళ్లు లేక..భోజనం బాగా లేక పస్తులుంటున్నారు. ఒక్కో గదిలో పరిమితికి మించి విద్యార్థులను ఉంచుతున్నారు. పడుకోవడానికి బెడ్స్ లేవు. నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. ఒక హాస్టల్లో 300 మంది విద్యార్థులుంటే... కేవలం రెండు బాత్రూమ్లు, టాయ్‌లెట్ గది ఉంది. ఈ కారణాల వల్లే హైదరాబాద్ మహానగరంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చేరటానికి ఆసక్తి చూపడం లేదు. నగరంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 26 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 2,450 మంది విద్యార్థులు చేరటానికి అవకాశం ఉండగా... ఈ ఏడాది 1883 మంది మాత్రమే చేరారు. అదేవిధంగా 49 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉండగా, ఇందులో 5,060 మంది విద్యార్థులకు గానూ, 4,165 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ నగరంలోని కొన్ని హాస్టళ్లను విజిట్ చేయగా పలు సమస్యలు దృష్టికి వచ్చాయి. - సాక్షి, సిటీబ్యూరో మచ్చుకు కొన్ని హాస్టళ్ల పరిస్థితి... అమీర్‌పేటలోని లింగయ్యనగర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. మంచినీటి సరఫరా లేదు. భోలక్‌పూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో ప్రతి నెల కాస్మొటిక్ చార్జీలు ఇవ్వటం లేదు. డ్రెస్ కార్డ్స్, నోట్ బుక్స్ ఇవ్వడంలేదు. ఈ హాస్టల్లో ఉన్న చేతిపంపు పని చేయడంలేదు. నీళ్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు.ముషీరాబాద్‌లోని బాలికల వసతి గహం (సికింద్రాబాద్)లో పిల్లల పెట్టెలు భద్రపర్చుకోవడానికి సరైన సదుపాయం లేదు. భవనం శిథిలావస్థకు చేరింది. చిన్నపాటి వర్షం వస్తే చాలు నీరంతా లోపలికి వస్తుంది. వర్షాకాలమంతా విద్యార్థులకు నిద్ర ఉండడం లేదు. దిల్‌సుఖ్‌నగర్‌లోని మలక్‌పేట-1, 2, 3 బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మంచినీటి ట్యాంక్ సరిగా శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలక్‌పేట హాస్టల్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేయడం వల్ల రెండు కిలోమీటర్లు పాఠశాలకు నడిచి వెళ్లటానికి విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. హయత్‌నగర్ మండలం బాటసింగారంలోని ఎస్సీ హాస్టల్లో ఫ్యాన్లు లేకపోవడంతో దోమల బెడదతో విద్యార్థులు రాత్రివేళల్లో నిద్ర పోలేకపోతున్నారు. అంతేగాక బెడ్షీట్లు లేక చలికి వణుకుతున్నారు. హయత్‌నగర్‌లోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సరిపడా స్నానాల గదులు లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు సరిగా లేవు. హాస్టల్ నిర్వహణ సరిగా లేదు. భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. -
అంగన్వాడీలకూ సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీలకు కూడా సన్నబియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు ఆరేళ్లలోపు చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం లభించేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా కానున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీలకు అందుతున్న కేజీ రూ.4 విలువైన దొడ్డు బియ్యం స్థానంలో కిలో రూ.36.50 విలువైన సన్నబియ్యం(సూపర్ ఫైన్ రకం) అందిస్తారు. దీని ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్ల అదనపు వ్యయం కానుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంచనా. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 11లక్షల మందికి మేలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 35,334 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రాల్లో మొత్తం 11,10,226 మంది లబ్ధిదారులున్నారు. వీరందరికీ అనుబంధ పోషకాహారం నిమిత్తం ప్రతిరోజూ ఒకపూట పూర్తి భోజనాన్ని సర్కారు అందిస్తోంది. ఈ మేరకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె.. ఇతర ఆహార పదార్థాలను ఆయా కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే దొడ్డు బియ్యం వల్ల లబ్ధిదారులు ఆహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో విద్యార్థి వసతిగృహాలకు ఇస్తున్నట్టుగానే అంగన్వాడీలకూ సన్నబియ్యా న్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.115 కోట్ల అదనపు భారం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించడం ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్లు అదనంగా ఖర్చుకానుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం అంగన్వాడీలకు ఇస్తున్న కిలో రూ.4 విలువైన దొడ్డు బియ్యానికి నెలకు రూ.1.18 కోట్లు ఖర్చవుతుండగా, సన్నబియ్యం సరఫరా చేస్తే నెలకు రూ.10.79 కోట్లు ఖర్చుకానున్నాయి. ఇలా నెలకు రూ.9.61 కోట్ల చొప్పున ఏటా రూ.115.34 కోట్లు అదనపు భారం పడనుందని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. -
సన్న బియ్యం ధరలు పైపైకి..!
రబీ నిల్వలు దాస్తున్న వ్యాపారులు మిల్లుల్లో అక్రమ నిల్వలు ధాన్యాన్ని దాచేస్తున్నారు కృత్రిమ కొరతతో ధరలు అధికం కైకలూరు: జిల్లాలో సన్న బియ్యం దందా నడుస్తోంది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా ఖరీప్ సాగు మందగించింది. ధాన్యం కొరత ఏర్పడింది. ఇదే అదనుగా బియ్యం వ్యాపారులు ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. జిల్లాలో ప్రసుత్తం సుమారు 75వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అంచనా. ఖరీఫ్సాగు దిగుబడులపై ఇప్పటికే రైతులు ఆశలు వదులుకున్నారు. రబీలో నిల్వలను వ్యాపారులు దాచేస్తున్నారు. పాత నిల్వలు బహిరంగ మార్కెట్లోకి రాకపోవడంతో కొనుగోలుదారులపై భారం పడుతోంది. సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సన్నబియ్యం క్వింటా ధర రూ.2700 నుంచి రూ.3000కి చేరింది. వ్యాపారులు 25 కేజీల బస్తాను రూ.850 నుంచి రూ.1000కి విక్రయిస్తున్నారు. సన్నం బియ్యం కేజీ ధర రెండు వారాల ముందు రూ.32కు విక్రయించగా ప్రస్తుతం రూ.37 వరకు పెరిగింది. ఇటీవల క్వింటాకు రూ.200 అదనంగా బియ్యం ధర పెరిగింది. సన్నబియ్యంలో రకాలను బట్టి అదనంగా రేట్లు పెరుగుతున్నాయి. కర్నూలు సోనమసూరికి చెందిన లలిత బ్రాండ్ 25 కేజీల బియ్యం బస్తా రూ.1200కి విక్రయిస్తున్నారు. జిల్లాలో వ్యాపారులు, దళారులు ఖరీఫ్‌లో పంట దిగుబడులు రావని ముందుగానే ఓ అంచనాకు వచ్చి సన్న బియ్యం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మిల్లర్ల మాయాజాలం... మిల్లర్ల వద్ద సన్న రకం బియ్యం నిల్వలు భారీగా ఉన్నాయి. సాధారణంగా సన్నరకం బియ్యానికి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అధిక ధర పలుకుతోంది. ఇది ముందే ఊహించిన మిల్లర్లు, వ్యాపారులు జిల్లాలో బియ్యం కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. గతంలో ధాన్యం నిల్వలకు లిమిటేషన్ విధించారు. విధిగా లెసైన్సులు పొందాల్సి ఉండేది. నేడు ఆ పద్ధతిని తీసివేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించి విక్రయించుకునే అవకాశం కల్పించారు. పూర్వం మార్కెట్లో బియ్యం ధరలు పెరిగినప్పుడు అధికారులు దాడులు నిర్వహించేవారు. ప్రభుత్వపరంగా సన్న బియ్యం దుకాణాలను తెరిచేవారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులు దారికి వచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవేమీ జరగడం లేదు. మిల్లర్లు, వ్యాపారులు గొలుసుకట్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొనుగోలుదారులు రేట్లు ఎందుకు పెంచారని అడిగితే మిల్లర్లు ధరలు పెంచారు, మమ్ముల్ని ఏం చేయమంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా.. బియ్యం డిమాండ్‌ను అసరాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా వ్యాపారులు మార్పు చేస్తున్నారు. కంటికి ఆకర్షించే రంగురంగుల బ్యాగులతో కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో సన్న బియ్యంగా మార్పు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైలు ప్రయాణికుల బోగిలలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం తరలిపోతోంది. అధికారుల అక్రమ నిల్వలపై దాడులు చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. -
సన్న బియ్యం ధర మరీ లావు !
చింతలపూడి : మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి, డిమాండ్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాని ఎలాంటి లాజిక్కూ లేకుండా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఓవైపు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోపక్క బియ్యం ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. సోనా మసూరి బియ్యం ధర 25 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,250కు అమ్ముతున్నారు. పీఎల్ రకం అయితే కిలో రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. కొద్ది సంవత్సరాలుగా ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు వ రి దిగుబడిని దెబ్బతీయడం, కృష్ణా డెల్టాలో సన్న బియ్యం పండించే రైతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. అయితే బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో వీటి పెరుగుదలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. జిల్లాలో ఆకివీడు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో బియ్యం ఎగుమతి చేసే మిల్లులు 300కు పైగా ఉన్నాయి. అయితే జిల్లాలోని ట్రేడింగ్ మిల్లుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేదని, మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్లమని స్థానిక వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఐకేపీ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంతో మార్కెట్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. దీంతో మెట్ట ప్రాంతంలో మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండపేట నుంచి దిగుమతి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి సన్న బియ్యం రకరకాల బ్రాండ్ల లో జిల్లాలోని స్థానిక బియ్యం వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి హోల్ సేల్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుని బియ్యం ధరలు విపరీతంగా పెంచి మార్కెట్‌ను శాసిస్తున్నారు. మార్కెట్లో ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. కర్నూలు రకం సన్న బియ్యం, జీలకర్ర సోనా రకం అంటూ వినియోగదారులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి సోనా బియ్యంలో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే అంటున్నారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది గుంటూరు, కృష్ణా డెల్టాలో రైతులు అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదు. అదీ కాక మెట్ట ప్రాంతంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వా ణిజ్య పంటలను సాగు చేస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యం కోసం ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టి ధరలను అదుపులోకి తేవాలని మధ్యతరగతి, సామాన్య ప్రజలు కోరుతున్నారు. -
ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం
భువనగిరి: విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంలో నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఈ విధానాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ వెబ్సైట్ రూపొందించి విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన బియ్యం వివరాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సరఫరా చేస్తారు. -
సన్నబియ్యం మేలు చేస్తాయా ?
తెలంగాణలో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో జనవరి 1 నుంచి సన్నబియ్యంతో భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. నిరుపేద పిల్లలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల బాగో గులపై ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఏదోరకమైన శ్రద్ధ ఉండటం అభినందించదగినదే. అయితే, ఎముకలు కొరికే చలికి అల్లల్లాడే చిన్నారులకు దుప్పట్లు, సబ్బులు, తలనూనె వంటి కనీసావసరాలపై దృష్టి పెట్టకుండా సన్నబియ్యం వంటి వ్యర్థమైన, ఆరోగ్య వ్యతిరేకమైన సౌకర్యాన్ని హాస్టళ్లకు అనవసరంగా అంట కట్టడం విజ్ఞత అనిపించు కోదు. వడ్ల గింజగా ఉన్న బియ్యాన్ని ఒకసారి మరపట్టి, తిరిగి మరపట్టి సదరు గింజలో పిసరంత పిండి పదార్ధం (కార్బొహైడ్రేట్స్) మినహా మరేమీలేని స్థితిని తేవడాన్నే సన్న బియ్యమని మనం వ్యవహరిస్తుం టాం. బియ్యం గింజ పైపొరలో స్వాభావికంగా ఉండే జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషక పదార్థాలను తెల్ల రంగుపై వ్యామోహంతో వదులుకోవడం హాస్టళ్లలో చిన్నారులకు ఎలా ఆరోగ్యకరమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చూడటానికి ముత్యాల్లా, నాజూకుగా, నోరూరించేలా కనిపించే సన్న బియ్యం సారహీనమైనవని వైద్య పరిశోధనల్లో తేలిన సత్యం. ఈ బియ్యంతో వండిన అన్నం జంక్ ఫుడ్, గడ్డితో సమానం. అనారోగ్య హేతువు. గత రెండు మూడు దశాబ్దాలుగా పూర్వపు ఏపీలోనూ, తమిళనాడులోనూ డయాబిటీస్ (సుగర్ వ్యాధి), రక్తపోటు (బీపీ) రోగులు ఊహాతీతంగా అధికం కావడానికి సన్న, తెల్ల బియ్యం వాడకం పెరగడమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయి. మన హైదరాబాద్ నగరం దేశంలోనే సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న డయాబెటిక్ రాజధానిగా ఇప్పటికే పేరుమోసింది. హాస్టళ్లలో ఉండే పిల్లలకు నిస్సారమైన తెల్ల బియ్యం సరఫరా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఘనంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఈ పథకాన్ని అమలు చేయించడానికి కంకణం కట్టుకున్నారు. ఇదంతా ఎవరి ఆరోగ్యం కోసం? ప్రతిరోజూ తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటే అందులో పీచు లేకపోవడంతో కొద్ది సమయానికే ఆకలి వేస్తుం ది. దాని ఫలితంగా అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని ఆబగా తింటారు, శరీరంలో ఖర్చుకాని కేలరీలు అధికంగా జమపడి శరీరం బరువు పెరుగుతుంది. సన్నబియ్యం త్వరగా అరగడంతో జీర్ణక్రియకు రోజంతా పనిలేక ఆ వత్తిడి ఇతర శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపు తుంది. ఈ బియ్యానికి అలవాటు పడిన వారిని జీవన శైలి వ్యాధులు యవ్వనంలోనే పలకరిస్తాయి. దాని కంటే గింజ పైపొరని యథాతథం గా ఉంచే సోనా మసూరి లేదా హెచ్ఎంటి బియ్యం ఈ వయస్సులో చిన్నారులకు మేలు చేస్తాయి. వేల టన్నుల సన్న బియ్యాన్ని వండించి పిల్లల ఆరోగ్యాన్ని అపాయంలో పడవేయడం తగదు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచన చేయడం మంచిది. - వీణవంక మార్కండేయ చెన్నూరు -
అర్హులందరికీ ఆహార భద్రత
గజ్వేల్: అర్హులందరికీ ‘ఆహార భద్రత’ కార్డులను అందిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పలు కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో ‘ఆహార భద్రత’పథకం కింద లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ‘ఆహార భద్రత’ పథకంపై పచ్చ పార్టీ నాయకులు కార్డులను తొలగిస్తున్నరంటూ చేస్తున్న దుష్పప్రచారం నమ్మవద్దని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే వారు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని టీడీపీ నాయకులనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులపై 20కిలోల బియ్యం సీలింగ్‌ను ఎత్తేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తనలాగే నాణ్యమైన భోజనం తినాలనే సంకల్పంతో సీఎం సన్న బియ్యం అందిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించగలిగితే వారు చదువులో రాణించే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ తహశీల్దార్ బాల్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు బోస్, నరేందర్‌రావు, సంతోషిణి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, బెండ మధు తదితరులు పాల్గొన్నారు. -
‘సన్న బియ్యంతో అన్నం’ షురూ
నగరంలో పథకం ప్రారంభం పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు 161 హాస్టళ్లలోని విద్యార్థులకు లబ్ధి సిటీబ్యూరో: నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ బాలికల హాస్టల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు వేర్వేరుగా ప్రారంభించారు. మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంత్రి తలసాని పథకాన్ని ప్రారంభించారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్‌లోని సితాఫల్‌మండి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. 15,652 మంది విద్యార్థులకు లబ్ధి నగరంలో 161 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 15,652 మంది విద్యార్థులకు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో.. నగరంలోని 612 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి భోజనంతో విద్యార్థులు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని హాస్టల్ వార్డెన్లు, పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి: దత్తాత్రేయ ముషీరాబాద్: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం కార్యక్రమాన్ని భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ తో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, డ్రాఔట్స్ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్లు తెరిచి అభివృద్ధిని చూడండి:నాయిని భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తాము చేపట్టే అభివృద్ధికి సహకరించాలని కోరారు. పేద విద్యార్థుల పోరాట ఫలితమిది.. అఫ్జల్‌గంజ్: సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా పేద విద్యార్థుల పోరాట విజయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సన్న బియ్యం సరఫరా కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సన్న బియ్యం సరఫరా విషయంలో భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాధిక, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కె.నర్సింహ నాయక్, విద్యార్థి నేతలు పి.సతీష్‌కుమార్, రేపాక రాంబాబు, సీహెచ్ శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, రతన్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పథకాన్ని వేర్వేరుగా ప్రారంభించిన దత్తాత్రేయ, నాయిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకే హాస్టల్లో వేర్వేరుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి అధికారులు భోలక్‌పూర్‌లోని బాలికల ఎస్సీ వసతి గృహాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు అనుకున్న సమయానికి రాగా నాయిని నర్సింహారెడ్డి కోసం దాదాపు 45 నిమిషాలు వేచి చూశారు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత అరగంటకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాస్టల్‌కు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్‌కు సన్న బియ్యం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. -
‘సంక్షేమానికి’ సన్నబియ్యం
ఖమ్మం : దొడ్డు బియ్యంతో వండిన ముద్ద అన్నం తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు మంచిరోజులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మాధ్యాహ్న భోజనంతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పెట్టే భోజనానికి జనవరి ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం(ఫైన్ రైస్) అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యావేత్తలు, సంక్షేమ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుందోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 4 లక్షల మందికి ప్రయోజనం... సన్నబియ్యం పథకంతో జిల్లాలో 2400 ప్రాథమిక పాఠశాలల్లో చదివే 1,17,013 మం ది, 474 ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే 63,679 మంది, 411 ఉన్నత పాఠశాలల్లో చదివే 43,458 మంది విద్యార్థులకు, 63 బీసీ హాస్టళ్లకు చెందిన 5,977 మంది, 71 ఎస్సీ హాస్టళ్లలో ఉండే 5,620 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. 33 కేజీబీవీల్లో చదువుతున్న 5,470 బాలికలు, 121 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 వేల మందితోపాటు ఇతర ఇంటిగ్రేటెడ్, మెట్రిక్, పోస్టు మెట్రిక్ పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇక నాణ్యమైన భోజనం అందనుంది. తీరనున్న ‘దొడ్డు’ బాధలు హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం తయారీలో కూరగాయలు, వంట సామగ్రి కోసం గతంలో కంటే నిధులు పెంచినా.. దొడ్డు బియ్యం.. అవికూడా పురుగులు పట్టినవి, ముక్కిపోయినవి పంపడంతో గత్యంతరం లేక వాటినే వండిపెట్టేవారు. బియ్యం నాణ్యంగా లేకపోవడంతో భోజనం ముద్దగా అయ్యేది. ఇందులో ఏ కూర వడ్డించినా రుచించదు. దీనికి తోడు ఇదే అదునుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, హాస్టల్ మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లు ప్రతి రోజూ నీళ్ల చారుతోనే సరిపెట్టేవారు. దీంతో విద్యార్థులు ముద్ద అన్నం, నీళ్ల చారు తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక అర్ధాకలితో అలమటించేవారు. సన్న బియ్యం సరఫరా అయితే కూరలు ఎలా ఉన్న అన్నం మాత్రం తినడానికి అనువుగా ఉంటుందని, పస్తులుండే సరిస్థితి రాదని విద్యార్థులు అంటున్నారు. నెలకు 1208 మెట్రిక్ టన్నులు సరఫరా... జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ, ఇతర ఆశ్రమ, కస్తూర్బాగాందీ బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 1208 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎస్సీ హాస్టళ్లకు 73 మెట్రిక్ టన్నులు, ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలకు 333 మెట్రిక్ టన్నులు, బీసీ హాస్టళ్లకు 60, ఇతర వసతి గృహాలకు 100, పీఎస్‌లకు 142, యూపీఎస్‌లకు 118, 9,10 తరగతుల విద్యార్థులకు 112 , అంగన్వాడీ కేంద్రాలకు 270 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అమలుపై అనుమానాలు.. విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినా... ఈ పథకం అమలు తీరు ఏలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల నుంచి తహశీల్దార్లకు ఆర్వోలు వెళ్తాయి. వారు అంగీకరిస్తే ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా అవుతాయి. అక్కడి నుంచి డీలర్లు పేదలకు అందించే బియ్యంతోపాటు, పాఠశాలలకు అందించే బియ్యం కూడా తీసుకొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పాఠశాలలకు పంపడంలో చేతులు మారే అవకాశం ఉంది. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యంలో మేలిమి రకమైనవి పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు కుమ్మక్కై మేలిమి బియ్యాన్ని పక్కదారి పట్టించిన సందర్బాలున్నాయి. దీంతోపాటు పాఠశాలల్లో బియ్యం మాయం కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం సరఫరా అయినా ఇలాంటివి ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం లెవీ తగ్గించడంతో పాటు ఈ సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. సాగైన పంటలో సగానికి పైగా దొడ్డు రకం ధాన్యమే. ఇలాంటి పరిస్థితిలో సన్న బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
పైన్ రైస్
29 నాటికి అన్ని రేషన్ షాపులకు సరఫరా యుద్ధప్రాతిపదికన పనులు.. సెలవులు రద్దు ఎంఎల్ఎస్ పాయింట్లకు ప్రత్యేకాధికారుల నియామకం రేషన్‌కార్డు దారులు, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం హన్మకొండ అర్బన్: పేద ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వనుంది. రేషన్‌కార్డు దారులతోపాటు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇక నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆహార భద్రత కార్డులకు సంబంధించి జిల్లాలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించారు. వారికి సరిపడా కోటాను రేషన్ షాపులకు సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ నెల 29వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలని జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఆదేశించారు. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేం దుకు ప్రతి ఎంఎల్ఎస్ పాయిం ట్‌కు ఒక అధికారిని ఇన్చార్జ్గా నియమించారు. మొత్తం 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పంపిణీ ప్రక్రియ చేపట్టారు. 8 లక్షల కార్డులు జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 8 లక్షలకు పైగా రేషన్‌కార్డులు నమోదయ్యాయి. వీటిలో మొత్తం 26 లక్షల మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నట్లు అధికారు లు లెక్కించారు. పూర్తి స్థాయిలో లెక్కలు తేలితే ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆహార భద్రత కార్డులో ఎంత మంది ఉం టే అందరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం జనవరి నెల కోటాగా అందజేయనున్నారు. ఈ మొత్తం సుమారు 18వేల మొట్రిక్ టన్నులుగా గుర్తించారు. అరుుతే గత నెలలో పాత కార్డుల లెక్కల ప్రకారం జిల్లాలో 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని కార్డుదారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొత్త కార్డులు సంఖ్యా పరంగా కొంత తక్కువగా ఉన్నప్పటికీ... కోటా పెంచడంవల్ల మొత్తం సుమారు 6వేల మెట్రిక్ టన్నులు పెరిగింది. లెక్కలు పూర్తయితే కోటా మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు జనవరి నుంచి పూర్తి కోటా సన్నబి య్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ దిశగా కూడా పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్షేమ శాఖల అధికారులు అందజేసిన లెక్కల ప్రకారం 2,30,000 మంది విద్యార్థులకు అవసరమైన 2.77 వేల మొట్రిక్ టన్నుల బి య్యం సరఫరా చేయనున్నారు. సర్వేలో గుర్తించిన అంత్యోదయ కార్డుదారులకూ పూర్తిస్థారుులో బి య్యం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. 29 వరకు సెలవులు రద్దు పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బంది సెలవులను 29వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు డీఎస్ఓ ఉషారాణి తెలిపారు. స్థానిక అవసరాల మేరకు అదనంగా సిబ్బంది, వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా జిల్లాలోని 2,114 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులుగా ఆర్డీఓలు, డీఎం, డీఎస్ఓ ఇతర ఉన్నతాధికారులను నియమించారు. కొనసాగుతున్న నమోదు ప్రస్తుతం ఆహార భద్రత కార్డుల అర్హుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10.69 ల క్షల దరఖాస్తులు రాగా... క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేసి వివరాలు నమోదు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం కొత్తకార్డుల జారీకి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.