అయినా.. తీరుమారలేదు!
సన్నబియ్యం ఇచ్చి..మెనూ మార్చినా ఫలితం శూన్యం సమస్యలకు నిలయంగానే సంక్షేమ హాస్టళ్లు మౌలిక సౌకర్యాలపై దృష్టిపెట్టని ఫలితం.. చలికి గజగజ...ఆరు బయట స్నానాలు అద్దెభవనాలు.. ఇరుకు గదులు బాలికలకు భద్రత అంతంతే ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసిన నిజాలు...
సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసి, మెనూలో మార్పులకు శ్రీకారం చుట్టి....కాస్మొటిక్ చార్జీలు పెంచినప్పటికీ .. విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిక పోవటంతో....గరీబోల్ల వసతి గృహాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు లేకపోవడం, ఇరుకు గదులను విస్తరించకపోవడం, మంచినీరు, మరుగుదొడ్లు, హాస్టళ్లకు ప్రహరీల ఏర్పాటు వంటి విషయాలను పట్టించుకోకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల దుప్పట్లు లేక విద్యార్థులు చలికి వణికుతున్నారు. నీళ్లు లేక..భోజనం బాగా లేక పస్తులుంటున్నారు. ఒక్కో గదిలో పరిమితికి మించి విద్యార్థులను ఉంచుతున్నారు. పడుకోవడానికి బెడ్స్ లేవు. నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. ఒక హాస్టల్‌లో 300 మంది విద్యార్థులుంటే... కేవలం రెండు బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్ గది ఉంది. ఈ కారణాల వల్లే హైదరాబాద్ మహానగరంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చేరటానికి ఆసక్తి చూపడం లేదు. నగరంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 26 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 2,450 మంది విద్యార్థులు చేరటానికి అవకాశం ఉండగా... ఈ ఏడాది 1883 మంది మాత్రమే చేరారు. అదేవిధంగా 49 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉండగా, ఇందులో 5,060 మంది విద్యార్థులకు గానూ, 4,165 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ నగరంలోని కొన్ని హాస్టళ్లను విజిట్ చేయగా పలు సమస్యలు దృష్టికి వచ్చాయి. - సాక్షి, సిటీబ్యూరో
మచ్చుకు కొన్ని హాస్టళ్ల పరిస్థితి...
అమీర్‌పేటలోని లింగయ్యనగర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. మంచినీటి సరఫరా లేదు. భోలక్‌పూర్ ఎస్సీ బాలికల హాస్టల్‌లో ప్రతి నెల కాస్మొటిక్ చార్జీలు ఇవ్వటం లేదు. డ్రెస్ కార్డ్స్, నోట్ బుక్స్ ఇవ్వడంలేదు. ఈ హాస్టల్‌లో ఉన్న చేతిపంపు పని చేయడంలేదు. నీళ్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు.ముషీరాబాద్‌లోని బాలికల వసతి గహం (సికింద్రాబాద్)లో పిల్లల పెట్టెలు భద్రపర్చుకోవడానికి సరైన సదుపాయం లేదు. భవనం శిథిలావస్థకు చేరింది. చిన్నపాటి వర్షం వస్తే చాలు నీరంతా లోపలికి వస్తుంది. వర్షాకాలమంతా విద్యార్థులకు నిద్ర ఉండడం లేదు.
దిల్‌సుఖ్‌నగర్‌లోని మలక్‌పేట-1, 2, 3 బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మంచినీటి ట్యాంక్ సరిగా శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలక్‌పేట హాస్టల్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేయడం వల్ల రెండు కిలోమీటర్లు పాఠశాలకు నడిచి వెళ్లటానికి విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. హయత్‌నగర్ మండలం బాటసింగారంలోని ఎస్సీ హాస్టల్‌లో ఫ్యాన్‌లు లేకపోవడంతో దోమల బెడదతో విద్యార్థులు రాత్రివేళల్లో నిద్ర పోలేకపోతున్నారు. అంతేగాక బెడ్‌షీట్లు లేక చలికి వణుకుతున్నారు. హయత్‌నగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు సరిపడా స్నానాల గదులు లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు సరిగా లేవు. హాస్టల్ నిర్వహణ సరిగా లేదు. భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది.