తెలంగాణలో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో జనవరి 1 నుంచి సన్నబియ్యంతో భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. నిరుపేద పిల్లలైన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ హాస్టళ్ల విద్యార్థుల బాగో గులపై ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఏదోరకమైన శ్రద్ధ ఉండటం అభినందించదగినదే. అయితే, ఎముకలు కొరికే చలికి అల్లల్లాడే చిన్నారులకు దుప్పట్లు, సబ్బులు, తలనూనె వంటి కనీసావసరాలపై దృష్టి పెట్టకుండా సన్నబియ్యం వంటి వ్యర్థమైన, ఆరోగ్య వ్యతిరేకమైన సౌకర్యాన్ని హాస్టళ్లకు అనవసరంగా అంట కట్టడం విజ్ఞత అనిపించు కోదు.
వడ్ల గింజగా ఉన్న బియ్యాన్ని ఒకసారి మరపట్టి, తిరిగి మరపట్టి సదరు గింజలో పిసరంత పిండి పదార్ధం (కార్బొహైడ్రేట్స్) మినహా మరేమీలేని స్థితిని తేవడాన్నే సన్న బియ్యమని మనం వ్యవహరిస్తుం టాం. బియ్యం గింజ పైపొరలో స్వాభావికంగా ఉండే జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషక పదార్థాలను తెల్ల రంగుపై వ్యామోహంతో వదులుకోవడం హాస్టళ్లలో చిన్నారులకు ఎలా ఆరోగ్యకరమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చూడటానికి ముత్యాల్లా, నాజూకుగా, నోరూరించేలా కనిపించే సన్న బియ్యం సారహీనమైనవని వైద్య పరిశోధనల్లో తేలిన సత్యం.
ఈ బియ్యంతో వండిన అన్నం జంక్ ఫుడ్, గడ్డితో సమానం. అనారోగ్య హేతువు. గత రెండు మూడు దశాబ్దాలుగా పూర్వపు ఏపీలోనూ, తమిళనాడులోనూ డయాబిటీస్ (సుగర్ వ్యాధి), రక్తపోటు (బీపీ) రోగులు ఊహాతీతంగా అధికం కావడానికి సన్న, తెల్ల బియ్యం వాడకం పెరగడమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయి. మన హైదరాబాద్ నగరం దేశంలోనే సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న డయాబెటిక్ రాజధానిగా ఇప్పటికే పేరుమోసింది.
హాస్టళ్లలో ఉండే పిల్లలకు నిస్సారమైన తెల్ల బియ్యం సరఫరా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఘనంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఈ పథకాన్ని అమలు చేయించడానికి కంకణం కట్టుకున్నారు. ఇదంతా ఎవరి ఆరోగ్యం కోసం? ప్రతిరోజూ తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటే అందులో పీచు లేకపోవడంతో కొద్ది సమయానికే ఆకలి వేస్తుం ది. దాని ఫలితంగా అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని ఆబగా తింటారు, శరీరంలో ఖర్చుకాని కేలరీలు అధికంగా జమపడి శరీరం బరువు పెరుగుతుంది.
సన్నబియ్యం త్వరగా అరగడంతో జీర్ణక్రియకు రోజంతా పనిలేక ఆ వత్తిడి ఇతర శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపు తుంది. ఈ బియ్యానికి అలవాటు పడిన వారిని జీవన శైలి వ్యాధులు యవ్వనంలోనే పలకరిస్తాయి. దాని కంటే గింజ పైపొరని యథాతథం గా ఉంచే సోనా మసూరి లేదా హెచ్‌ఎంటి బియ్యం ఈ వయస్సులో చిన్నారులకు మేలు చేస్తాయి. వేల టన్నుల సన్న బియ్యాన్ని వండించి పిల్లల ఆరోగ్యాన్ని అపాయంలో పడవేయడం తగదు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచన చేయడం మంచిది.
- వీణవంక మార్కండేయ చెన్నూరు
సన్నబియ్యం మేలు చేస్తాయా ?
Published Mon, Jan 5 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement