government hostels
-
నాణ్యత లేకుంటే జైలే!: సీఎం రేవంత్
ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటుహక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారు. – మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి ‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట ‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్‌ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది ‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం. కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు ‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి ఎస్సీఈఆర్టీలో గురువారం జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు. -
హాస్టల్... హడల్! సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు
వసతి గృహంకాదు.. ‘శిథిల’ గృహంనల్లగొండ జిల్లా మునుగోడులోని ఎస్సీ బాలుర హాస్టల్ దుస్థితి ఇది. భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ స్లాబ్‌పై పెచ్చులు ఊడిపడుతున్నాయి. భారీ వర్షం వస్తే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. హాస్టల్ పరిస్థితి బాగోలేక విద్యార్థులసంఖ్య తగ్గిందని.. గతంలో 60 మందికిపైగా ఉంటే.. ఇప్పుడు 40 మందే ఉన్నారని పేర్కొంటున్నారు.సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పాఠ శాలలు పునఃప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులు తిరిగిసంక్షేమ హాస్టళ్లకు చేరుతున్నారు. కానీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమి, అపరిశుభ్రత, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచి్చమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నర పాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నాయి. తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మరోవైపు హాస్టళ్లలో వంట కోసం టెండర్లు పూర్తిగాకపోవడం, డైట్ చార్జీలు సరిపోకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 2,020 వసతిగృహాలు ఉన్నాయి. అందులో 497 పోస్టుమెట్రిక్, 1,523 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. వీటిలో సుమారు 3.30 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పదోతరగతి పూర్తయిన విద్యార్థులు వెళ్లిపోవడం, కింది తరగతుల్లో కొత్త చేరికలు నమోదవడం జరుగుతోంది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో కూడా చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులైన పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అడ్మిషన్లు కొనసాగనున్నాయి. ఇలా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వసతుల లేమి మాత్రం సమస్యగా మారింది. పారిశుధ్యానికి బడ్జెట్ ఏదీ? శాశ్వత భవనాలున్న సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో పారిశుధ్య పనులు, మరమ్మతుల కోసం కొంతమేర నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఆ నిధులు రాకపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. కనీసం హాస్టళ్ల పరిసరాలను సైతం శుభ్రం చేయలేదు. చాలా వసతిగృహాల పరిసరాలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వాటిలో పాములు, తేళ్లు, విష పురుగులు చేరుతున్నాయి. వానలు కురుస్తుండటంతో ఆవరణలోకి, గదుల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విరిగిన కిటికీలు, తలుపులతో వాన నీళ్లు గదుల్లోకి పడుతున్నాయి. డైట్ చార్జీలు సరిపోక.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పదేళ్ల కిందటి డైట్ చార్జీలే కొనసాగుతున్నాయి. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950.. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,100, ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున ప్రభుత్వం డైట్ చార్జీల కింద చెల్లిస్తోంది. అడ్డగోలుగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ చార్జీలు ఏ మూలకూ సరిపోవడం లేదని వసతిగృహాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైట్ చార్జీలను కనీసం 25శాతం పెంచాల్సిన అవసరం ఉందని గత ఏడాది మంత్రుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని.. కానీ ఇప్పటివరకు చార్జీలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. విద్యార్థులకు తగిన పోషకాహారం అందే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. అద్దె భవనాలతో మరింత గోస రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేక, కొత్తవి నిర్మించక ఏళ్లకేళ్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటికి చెల్లించాల్సిన అద్దె బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్లు అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. కొన్ని హాస్టల్ భవనాలకు ఏడాదికిపైగా బిల్లులు రావడం లేదని అధికారులు అంటున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. మరికొన్ని కేస్ స్టడీలుపాములు, తేళ్ల సమస్యతో.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి మొల్లం శ్యాంకుమార్ గత వారం అనుమానాస్పదంగా మరణించాడు.టాయిలెట్ కోసం రాత్రిపూట బయటికి వెళ్లి, వచి్చన శ్యాంకుమార్.. వాంతులు చేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాసేపటికే కన్నుమూశాడు. టాయిలెట్ సమీపంలోని పొదల్లో తరచూ పాములు, తేళ్లు కనిపించేవని.. అవి కుట్టడం వల్లే శ్యాం మరణించి ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. ఈ చిత్రంలో అపరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో 30మంది విద్యార్థులు ఉంటున్నారు. బాత్రూంలు, భవనాన్ని క్లీన్ చేయడానికి మనుషుల్లేక అంతా అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక్కడ వంటకు సంబంధించిన టెండర్లు ఇంకా పూర్తికాలేదని, వంట చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి 10 నెలలుగా జీతం రాక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోందని.. దాంతో తామే రోజూ రూ.300 ఖర్చుపెట్టి కూరగాయలు తెప్పిస్తూ, వంట కూడా చేస్తూ.. విద్యార్థులకు తిండి పెడుతున్నామని హాస్టల్ వార్డెన్ డప్పు రవికుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తే విద్యార్థులకు సరైన భోజనం దొరుకుతుందని అంటున్నారు. -
ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం.. హైకోర్టులో పిటిషన్
-
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్‌లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్‌లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
ప్రభుత్వ హాస్టళ్లకు ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్ బాధ్యతలను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. ►మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలి. ►దీనికోసం ఎస్ఓపీలు రూపొందించాలి. ►పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్‌కూడా రూపొందించాలి. ►మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లపై ఈ అధికారులతో పర్యవేక్షణ చేయాలి. ►పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. ►ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలి. ►మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలి. ►గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు. ►టాయిలెట్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు. ►సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్ కల్పనలో భాగంగా డెస్క్‌లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్. ►కిచెన్ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్. ► 55 ఇంచీల స్మార్ట్ టీవీతో పాటు క్రీడాసామగ్రి, మరియు లైబ్రరీ బుక్స్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు. ►గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు – నేడు పనులు చేయాలని సీఎం ఆదేశం. ►2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు –నేడు. ►పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►డ్రైనేజీని లింక్ చేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు. ►ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ►ఈమేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు. ►ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు. ►హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ►హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ►క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి. ►ఈ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►విలేజ్‌క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. ►హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీచేయాలి. ►పై నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధంచేసి తనకు నివేదించాలని ఆధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
రెండో దశ చకచకా
స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యా కానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవుతుందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లకుపైగా అదనపు ఖర్చు అవుతోందని అధికారులు చెబుతున్నారు. విద్యా కానుక కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే. వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 వేల స్కూళ్లలో రూ.11,267 కోట్ల అంచనా వ్యయంతో మన బడి నాడు–నేడు రెండో దశ కింద పనులు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రెండో దశ నాడు–నేడు పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయంగా మార్పులు కనిపించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు–నేడు కింద పనులు చేపట్టాలని సూచించారు. నాడు–నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. విద్యా రంగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతిని ఇంగ్లిష్ మాధ్యమంలోకి తీసుకురావాలని, నాడు–నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. దీనిపై కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. జూలై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్ చేసిన స్కూళ్లు ప్రారంభిస్తామని వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తగినన్ని తరగతి గదులుండాలి ► తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కావాల్సిన తరగతి గదులను శరవేగంగా పూర్తి చేయాలి. అవి పూర్తవుతున్న కొద్దీ దశల వారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ కొనసాగాలి. ► 2022 .ఊలై, 2023 జూలై, 2024 జూలై.. ఇలా దశల వారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలి. ఇందుకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలి. ► జూలై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తి కావాలి. ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ సీబీఎస్ఈ అఫిలియేషన్‌తో ఉండాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. (ఇప్పటి వరకు 1,310 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తయింది.) ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణపై యాప్ ► ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణపై టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో యాప్‌ను ఉంచాలి. తల్లిదండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచేలా చూడాలి. ► జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా? లేదా? అన్న దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. ► ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతపై అవగాహన విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించారు. ఇందులో భాగంగా మహిళా పోలీసులు స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై అవగాహన కల్పిస్తారు. మహిళా ఉపాధ్యాయులు, బాలికలకు అన్ని రకాల వేధింపుల నుంచి రక్షణ కోసం దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాల నివారణ, మత్తు మందులకు దూరంగా ఉంచడం, పోక్సో యాక్ట్, ఫిర్యాదుల బాక్స్ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. -
నేతల మేత.. నాణ్యతలో కోత
సాక్షి, బొమ్మలసత్రం(నంద్యాల ): టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో నిధులను అడ్డంగా కొల్లగొడుతున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. చివరకు పేదల వైద్యానికి ఉద్దేశించిన వాటినీ వదలడం లేదు. ‘పనులు ఎలాగైనా చేసుకోండి.. మా కమీషన్లు మాకు ఇవ్వాల్సిందే’ అంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఫలితంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ప్రతిరోజూ 1,200 మంది దాకా ఔట్ పేషెంట్లు (ఓపీ) ఉంటారు. ప్రస్తుతం ఓపీ విభాగానికి ప్రత్యేక భవనం లేదు. ఆసుపత్రిలోనే ఓ మూలన కౌంటర్లు ఏర్పాటు చేసి..చీటీలు ఇస్తున్నారు. ప్రజలు ఎండలోను, చెట్ల కింద వేచివుండి ఓపీ చీటీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీ విభాగం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ద్వారా రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు గతేడాది జులైలో శంకుస్థాపన చేశారు. 20 శాతం కమీషన్లు! పేద రోగుల శ్రేయస్సు దృష్ట్యా భవన నిర్మాణాన్ని అత్యంత నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. అయితే..అధికార పార్టీ నేతల కక్కుర్తితో పనులు నాణ్యతగా జరగడం లేదు. ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 20 శాతం మేర కమీషన్లు దండుకున్నట్లు సమాచారం. ఆసుపత్రికి చెందిన ఓ ఇంజినీర్ మధ్యవర్తిగా వ్యవహరించి కాంట్రాక్టర్ నుంచి ముడుపులు ఇప్పించినట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లలో 20 శాతం అంటే రూ.కోటి ముడుపులు ముట్టజెప్పిన సదరు కాంట్రాక్టర్ పనులను ఎలా పూర్తి చేయాలో దిక్కుతోచని స్థితిలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే పాడవుతోంది! నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 2016లో మాతాశిశు వైద్యశాల భవనాలను రూ.15 కోట్లతో నిర్మించారు. అప్పుడు కూడా నేతల కమీషన్లు, అధికారుల స్వార్థం కారణంగా పనుల నాణ్యతకు పాతరేశారు. స్వయాన సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ భవనం మూడేళ్లు కూడా గడవకముందే దెబ్బతింటుండడం గమనార్హం. భవనం చుట్టూ భూమి కుంగిపోయి.. టైల్స్ విరిగిపోతున్నాయి. దాదాపు అడుగు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. బిల్డింగ్ గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకోవడం శోచనీయం. మాతాశిశు వైద్యశాల భవనం నిర్మించి మూడేళ్లు పూర్తి కాక ముందే బీటలు వారింది. ఇది చాలదని ఓపీ బిల్డింగ్ పనుల్లోనూ చేయి పెట్టారు. ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న పనుల నాణ్యతపై ఉన్నతస్థాయి అధికారులు విచారణ చేపట్టాలి. – ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, నంద్యాల నాసిరకంగా నిర్మిస్తున్నారు మాతాశిశు వైద్యశాల నిర్మించి మూడేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే భవనం చుట్టూ మట్టి దిగబడి పోయి టైల్స్ ఊడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. నూతనంగా నిర్మిస్తున్న ఓపీ బిల్డింగ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాసిరకం సిమెంటు , ఇసుక, కంకర వేసి పిల్లర్లు నిర్మిస్తున్నా.. కాంట్రాక్టర్‌ను అధికారులు ప్రశ్నించటంలేదు. – సద్దాం హుస్సేన్, సీపీఎం మండల కార్యదర్శి, నంద్యాల -
వసతి..వ్యథే..!
సంక్షేమ హాస్టలే తమ ఇల్లని సంబరపడ్డారు. అధికారులే తమ సంరక్షకులని భావించారు. హాస్టల్ అధికారులే పెద్ద దిక్కని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. తిండి సరిగా లేదు. ఫ్యాన్ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. ఆరుబయట స్నానాలు, అరకొర అద్దె భవనాలు, మెనూ పాటించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు సంక్షామానికి గురయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. హాస్టళ్ల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం. నెల్లూరు రూరల్: పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్న వాటికి కన్నాలు పడ్డాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇందులో 22 బీసంక్షేమ హాస్టళ్లు చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారు. వసతుల కల్పనలో విఫలం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు అధికారులు విఫలమయ్యారు. చాలీచాలని గదుల్లో విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. కొన్ని కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు గదుల్లోకి చేరుతున్నాయి. కొన్ని గదుల్లో ఫ్యాన్లు ఉన్నా తిరగకపోవడంతో దోమల దాటికి విద్యార్థులకు సరిగా నిద్రపట్టడం లేదు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో జాగారం చేస్తున్నారు. ఇనుపపెట్టెలను 2008వ సంవత్సరంలో అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. ఉన్నవి విరిగిపోయి వంగిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. వాటిలో దుస్తులు కానీ, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారు పాత పెట్టెలలోనే వస్తువులు భద్రపరచుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు. వసతి గృహాల్లో ఎలుకలు వాటిని చిందర వందర చేస్తున్నాయి. ఎలుకల వల్ల కొన్ని వసతి గృహాల్లో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. భద్రత కరువు బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. వాచ్మన్లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంతో పలు హాస్టళ్లలో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలికల హాస్టళ్లలో పురుషులను సిబ్బంది, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదంటూ పలు హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై అగాయిత్యాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే మోనూ ఎలా.. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది. ఇందులో భాగంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తోపాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనంద నిలయాలకు వర్తింపచేశారు. పెంచిన మెస్ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ వడ్డించాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేం చేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు ఇప్పుడు మెస్ చార్జీల పెంపునకు చాలా తేడా ఉంది. ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. ఈ మెనూ అమలు సాధ్యం కాదని అధికారులు, వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. తప్పని ఎక్కిళ్లు.. హాస్టళ్లకు దాతలు ఇచ్చిన ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసుల పంపిణీ లేదు. భోజనం చేసే సమయంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్లేట్లు పగుళ్లిచ్చాయి. ఆరుబయటకే.. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళితే విషపురుగుల బారిన పడుతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పందులు తిరుగుతున్నాయి. దీంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ అంటూ బహిరంగ మలవిసర్జన వద్దని, పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటనలు చేయడం తప్ప సంక్షేమ హాస్టళ్లలో సరిపడిన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల లేమి కారణంగా హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 80 హాస్టళ్లు మూతపడ్డాయి. మౌలిక వసతుల కల్పనకు చర్యలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్టెలు, దుప్పట్లు అందజేశాం. మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. ప్రతి హాస్టల్‌కు వాచ్‌మన్ నియమించడంతోపాటు, బాలికల వసతిగృహాలకు భద్రత పెంచాం. పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన మెనూలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ పూర్తిస్థాయిలో మెనూ అమలు చేయాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. – డి.మధుసూదనరావు, ఉప సంచాలకులు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ -
చికెన్ లేదు.. గుడ్డూ లేదు
వసతిగృహ విద్యార్థుల్లో కొత్త మెనూ కర్రీల అమలు వర్రీగా మారింది. కొత్త మెనూ ప్రకటించినా..అందుకనుగుణంగా మెస్ చార్జీలు లేకపోవడంతో మెనూకు కొర్రీ పడింది. హాస్టళ్లలో విద్యార్థులకు ఇంటి తరహా భోజనం పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలని చెప్పింది. అయితే అది అమలుకు నోచుకోకపోవడంతో ప్రకటనకే పరిమితమైంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, టమాటా సాంబారు, రసాలతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నెల్లూరు రూరల్: వసతిగృహాల్లో కొత్త మెనూ అమలు కాకుండానే మంగళం పాడేశారు. జూలై 1వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తో పాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనందనిలయాల్లో వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలంటూ కొత్త మెనూ చార్ట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అందు కోసం విద్యార్థులకు మెనూ చార్జీలను కూడా స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోల్చితే మెస్ చార్జీలు నామమాత్రమే పెరిగాయని, దీనికి తోడు మారిన మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని బోలెడంత ఖర్చు అవుతుందని వార్డెన్లు చేతులెత్తేశారు. కోడికూరతో మంచి భోజనం చేయొచ్చని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. సొంత లాభం చూసుకుంటూ వార్డెన్లు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మెనూ అమలు చేయకుండా పేద విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారు. బిల్లులు మాత్రం కొత్త మెనూ ప్రకారం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెనూ అమలులో సందిగ్ధం జిల్లాలో ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టళ్లు 189 ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ పెట్టాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గతంలో ఇచ్చే మెస్ చార్జీలను కళాశాల వసతి గృహాలకు రూ.350, 8, 9, 10 తరగతులకు రూ.400, 3 నుంచి 7వ తరగతి వరకు రూ.250 పెంచింది. స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేంచేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చితే ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్ల వాదన. ధరలు ప్రకటించరేం? మెనూ చార్జీ ప్రకారం ఎంతెంత ధరల్లో కొనుగోలు చేయాలోనన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఉన్న మెనూకు అదనంగా పాలు, పెసరపప్పు, పొంగల్, చికెన్, వేరుశనగ ఉండలు, చెట్నీ, పూరీ, బఠానీ, బంగాళదుంప కుర్మా వంటివి చేర్చారు. కానీ ఈ సరుకులను ఏ ధర పెట్టి కొనుగోలు చేయాలన్న విషయాన్ని తేల్చలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.70పైగా అవుతుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఎంత ఉంటాయోనన్న ఆందోళనలో వార్డెన్లు ఉన్నారు. గురుకులాల్లో అయితే మధ్నాహ్న భోజన పథకం ఉండదు కాబట్టి వీటికి ఇంకా అదనపు ఖర్చు అవుతుందని, కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలేమని చేతులెత్తేస్తున్నారు. సమస్యలు తీర్చకుండానే.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న వసతిగృహాల్లో చాలా చోట్ల ప్లేట్లు లేవు. ఒక్కో వసతిగృహంలో వందకుపైగా విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గ సిబ్బంది లేరు. మరో పక్క వాచ్మన్లు, సహాయకులు, వంట మనుషులు కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. చాలాచోట్ల చాలీచాలని గదుల్లో విద్యార్థులు మగ్గుతున్నారు. ఇన్ని సమస్యలున్నా పట్టించుకోని ప్రభుత్వం అరకొరగా మెస్ చార్జీలు భారీగా పెంచామని ప్రచారం చేసుకుంటుంది. వాటిని అమలు చేసేందుకు వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. పెంచడం సరే ధరలెలా? మెనూ చార్జీలు ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. మాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. ఏ ఐటమ్ ఎంత రేటుకు, ఎన్ని గ్రాములు పెట్టాలనేది స్పష్టత లేదు. ఈ విషయమై రాష్ట్ర డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిని విన్నవించాం. ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఇప్పుడు ఒక్కో విద్యార్థికి రూ.25లకు పైగా అదనంగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం పెట్టే ధరలెలా ఉంటాయో దానిపై అమలు ఆధారపడి ఉంటుంది. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – ఈ.విజయకుమార్ , ఏపీ హాస్టల్ వెల్ఫేర్ అఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
వసతి.. అధోగతి
61 - సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 78 - బీసీ సంక్షేమ హాస్టళ్లు 18 - ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు 19,532 - వసతి పొందుతున్న విద్యార్థులు - బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం - అవసరమైనన్ని దుప్పట్లు లేక అవస్థలు - తలుపులు లేని కిటికీలే అధికం - ముద్దకట్టిన అన్నం.. జారిపోయే పప్పు - ఎక్కడా కనిపించని భోజనశాలలు ప్రతిపాదనల్లోనే.. 12,100 మంది బీసీ హాస్టళ్ల విద్యార్థులకు 42,601 చిన్న పుస్తకాలు, 94,027 పెద్ద పుస్తకాలు అవసరమని ప్రతిపాదించగా ఇప్పటి వరకు ఒక్కటీ హాస్టళ్లకు చేరని పరిస్థితి. చప్పిడి మెతుకులు.. సాగని చదువులు సౌకర్యాలు నాస్తి..సమస్యలు జాస్తి మెనూ బరువు ...దుప్పట్లు కరువు అందని పుస్తకాలు...అడ్రస్‌లేని యూనిఫాం ఇదీ జిల్లాలోని వసతి గృహాల విద్యార్థుల దుస్థితి నీళ్లచారు...మజ్జిగన్నం మెనూ పాటిస్తున్న విధానమిది తాగేందుకు నీళ్లుండవు...రాత్రయితే వెలుగుండదు సౌకర్యాల తీరిది పరిసరాలు రోత...దోమత మోత పరిశుభ్రత పరిస్థితి ఇది పుస్తకాలకు దిక్కులేదు...యూనిఫాంకు గతిలేదు అటకెక్కిన చదువుకు తార్కాణమిది పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాలకుల నిర్లక్ష్యంతో సంక్షామ గృహాలుగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక...మోను అమలుకాక...సౌకర్యాలకు నోచుకోక విద్యార్థులంతా అల్లాడిపోతున్నారు. దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో చిన్నారులంతా చలికి వణికి పోతున్నారు. దాదాపు ఏ వసతి గృహంలోనూ మెనూ అమలు చేయకపోవడంతో చప్పిడి మెతుకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటిదాకా విద్యార్థులకు యూనీఫాం...నోట్ పుస్తకాలు అందకపోవడంతో చదువులు కూడా సాగడం లేదు. -అనంతపురం ఎడ్యుకేషన్ జిల్లా వ్యాప్తంగా 157 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 5,632 మంది, 78 బీసీ హాస్టళ్లలో 12,100 మంది, 18 ఎస్టీ హాస్టళ్లలో 1,800 మంది 1– 10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. అయితే దాదాపు అన్ని వసతి గృహాల్లోనూ కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందని బెడ్షీట్లు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు బెడ్లు షీట్లు ఇంకా రాలేదు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థులకు కప్పుకోవడానికి దుప్పట్లు వచ్చినా..కింద పరుచుకోవడానికి కార్పెట్లు రాలేదు. దీంతో ఒక దుప్పటిని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్నారు. దోమల మోత జిల్లాలోని దాదాపు అన్ని వసతి గృహాల్లో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రçస్తుతం మారిన సీజన్‌తో దోమల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దోమతెరలు కొనుగోలు చేసేందుకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు...కనీసం కిటికీలు, వాకిళ్లకు నెట్ (వల) కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో దోమల మోత అధికం కావడంతో విద్యార్థులకు కంటిమీద కనుకు కరువైంది. కన్నెత్తి చూడని వైద్యులు నిబంధనల మేరకు ప్రతినెలా ప్రభుత్వ వైద్యులు సమీప వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. కానీ చాలా హాస్టళ్లæ విద్యార్థులకు వైద్యులు వస్తారనే సమాచారం కూడా తెలియదు. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా పిల్లలుæ వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుంది. జిల్లాకేంద్రంలో ఉన్న హాస్టళ్ల వాపే వైద్యులు కన్నెత్తి చూడడం లేదంటే... ఇక మారుమాల గ్రామాల్లో ఉన్న వసతి గృహాలకు ఏమాత్రం వెళ్తుంటారో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం అందితే ఒట్టు పాఠశాలలు వెళ్లేరోజునే వసతి గృహంలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉన్నా...జిల్లాలో ఏ వసతి గృహం విద్యార్థికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ అందలేదు. పుస్తకాలు లేక ఖాళీ బ్యాగులతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు నోట్‌పుస్తకాల్లో రాసుకోవాలంటే దిక్కులు చూస్తున్నారు. అ‘డ్రస్’ లేదు విద్యా సంవత్సరం ప్రారంభంలో వసతి గృహాల్లోని విద్యార్థులకు నాలుగు జతల యూనీఫాం పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క ఎస్సీ హాస్టళ్లలో తప్ప మిగతా ఏ వసతి గృహం విద్యార్థులకూ యూనిఫాం అందలేదు. దీంతో పిల్లలు రంగులు, చినిగిన దుస్తులతో బడులకు వెళ్తున్నారు. నెలాఖరుకు యూనీఫాం ఇస్తాం బీసీ హాస్టళ్లకు సంబంధించి క్లాత్ విడతల వారిగా జిల్లాకు చేరుతోంది. వచ్చినది వచ్చినట్లుగా కుట్టడానికి పంపాం. ఈ నెలాఖరు నాటికి యూనీఫాం అందజేస్తాం. నోట్ పుస్తకాలకు మరోవారం పట్టొచ్చు. ప్రైవేట్ బిల్డింగులకు మెష్ (వల) కొట్టించలేదు. అయితే ప్రతి గదిలోనూ దోమల కాయిన్స్, లిక్విడ్ ఉంచేలా చర్యలు తీసుకుంటాం. – రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు దుప్పట్లు లేక ఇక్కట్లు కనగానపల్లి (రాప్తాడు) : నియోజవర్గ కేంద్రం రాప్తాడులోని బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులున్నారు. కానీ మంగళవారం రాత్రి 80 మంది మాత్రమే కనిపించారు. మెనూ ప్రకారమే సాయంత్రం అన్నం, ఆకూర పప్పు, రసం, గుడ్డుతో భోజనం పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో రాత్రి వేళలో విద్యార్థుల దోమలు మోతతో...వర్షంతో చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వసతి గృహంలో ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ ఏడాది దుప్పట్లు, యూనిఫాం అందలేదని హాస్టల్ వార్డెన్ మారుతీప్రసాద్ తెలిపారు. తాగునీటికీ తప్పని తిప్పలు నార్పల : స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలో 120 మంది విద్యార్థులున్నట్లు రికార్డులు చెబుతుండగా... మంగళవారం రాత్రి 60 మంది కనిపించారు. రాత్రి అన్నం, పప్పు, చారు వడించారు. తమకు ఇవ్వాల్సిన రగ్గులను గతంలో పని చేసిన వార్డున్ తీసుకపోవడంతో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామని, అయితే ఇటీవలే ఇన్చార్జి వార్డెన్ రగ్గులు, బ్యాగు ఇచ్చినట్లు తెలిపారు. మరుగుదొడ్ల వద్ద లైట్లు లేకపోవడంతో రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామనీ, వసతి గృహంలోకి వచ్చే గేట్ వద్దే విద్యుత్ ట్రాన్స్పార్మర్ ఏర్పాటు చేయడంతో ఎప్పుఽడేం జరుగుతుందో తెలియక భయాందోళన చెందుతున్నామని విద్యార్థులు తెలిపారు. నీళ్ల సాంబారు, పలుచని మజ్జిగ ఉరవకొండ : స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉండగా, 120 మంది మాత్రమే హాజరవుతున్నారు. మంగళవారం రాత్రి మోను ప్రకారం అన్నం, పప్పు, రసం, మజ్జిగతో పాటు గ్రుడ్డు అందించారు. అయితే సాంబారులో నీళ్లే అధికంగా ఉన్నాయి. ఇక మజ్జిగ పేరుకు మాత్రమే ఉన్నట్లుగా ఉంది. అన్నం కూడా ముద్దగా ఉండటంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందిపడ్డారు. పిల్లలకు రగ్గులు ఇచ్చినా... కింద పరుచుకోవడానికి కార్పెట్లు లేక పోవడంతో వారు నేల పైనే పడుకోవాల్సి వచ్చింది. భద్రత కరువు హిందూపురం అర్బన్ : పట్టణంలోని బీసీ హాస్టళ్ల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి పడుతుంఽఽడడంతో విద్యార్థులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి సమయంలో మీదపడుతుందేమోనని ఆరు బయటే నిద్రిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఒకే దుప్పటి పంపిణీ చేయడంతో చలికి వణుకుతూ అల్లాడిపోతున్నారు. దోమలు కూడా తీవ్రమవడంతో ఇటీవల పలువురు విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. ఇక యూనిఫాం కూడా ఇవ్వకపోవడంతో రంగుల దుస్తుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు. నిర్వహణ దారుణం హిందూపురం నియోజకవర్గంలో పది హాస్టళ్లు ఉండగా... మెనూ ఏ మాత్రం అమలు కావడం లేదు. రోజూ ఉదయాన్నే రాగిమాల్ట్ ఇవ్వాల్సి ఉన్నా... అది గోడమీద రాతలకే పరిమితమైంది. అలాగే ప్రతి శనివారం ఇవ్వాల్సిన పాయసం కూడా అందటం లేదు. ఇక రాత్రి వేళ అన్నం, కూరగాయల కర్రీ, రసం, పెరుగు, అరటిపండు, లేకపోతే గుడ్డు ఇవ్వాల్సి ఉన్నా...వారానికి రెండుసార్లు మాత్రమే గుడ్డు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. ప్రతి ఆదివారం ఎగ్ బిరియాని వండాల్సి ఉన్నప్పటికీ అది కూడా అమలు కావడంలేదు. భోజనం కూడా నాణ్యంగా ఉండడం లేదనీ, కుళ్లిపోయిన కూరగాయలతో కర్రీ వండుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటుపోతే...అంధకారమే! కళ్యాణదుర్గం : పట్టణంలోని ఎస్సీ బాలికల–2 వసతిగృహంలో సుమారు 100 మంది విద్యార్థులుంటున్నారు. కనీసం కొవ్వొత్తులు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో విద్యుత్ సరఫరాలో కోత పడినప్పుడు విద్యార్థులంతా అంధకారంలోనే గడుపుతున్నారు. మంగళవారం రాత్రి కూడా విద్యార్థులు భోజనం చేస్తుండగా...కరెంటు సరఫరాలో గంట సమయం అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యార్థులంతా చీకట్లలోనే భోజనం ముగించారు. వసతిగృహ అధికారిణి మాధవి కూడా అందుబాటులో లేరు. విద్యార్థులకు నీళ్ల రసం, నీళ్ల పప్పే వడ్డించారు. అంతేకాదు భోజనంలోకి మజ్జిగ కూడా ఇవ్వలేదు. మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం, కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా...అది అమలు కాలేదు. వసతిగృహంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ప్రభుత్వం పంపిణీ చేసిన దుప్పట్లు సైజు పరిపోక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. సమస్యల లోగిళ్లు మడకశిర : నియోజకవర్గంలో 10 బీసీ హాస్టళ్లు...అమరాపురం, మడకశిరల్లో ఎస్సీ హాస్టళ్లున్నాయి. అమరాపురం బాలుర ఎస్సీ హాస్టల్లో 46 మంది విద్యార్థులుండగా....వీరిలో 20 మంది కొత్త విద్యార్థులున్నారు. వీరికి దుప్పట్లు లేవు. అంతేకాకుండా జంకాణాలు కూడా అందలేదు. మంగళవారం రాత్రి మెనూ ప్రకారం సాంబారు, అన్నం, కరి వడ్డించాల్సి ఉన్నా...పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. హాస్టల్ భవనం కొత్తదైనా ఐదు గదుల్లో విద్యుత్ బల్బులు లేకపోవడంతో విద్యార్థులు చీకటిలోనే ఉండాల్సి వచ్చింది. రెండు గదులకు కిటికీలు సక్రమంగా లేక విద్యార్థులు దోమల మోతతో అల్లాడిపోయారు. ఇక మడకశిర బాలుర ఎస్సీ హాస్టల్లో 80 మంది విద్యార్థులుండగా... కొత్తగా చేరిన విద్యార్థులకు దుప్పట్లు అందలేదు. మెనూ ప్రకారం అన్నం, సాంబారు వడ్డించినా కర్రీ ఇవ్వలేదు. కిటికీలకు నెట్లను ఏర్పాటు చేయకపోవడంతో దోమలు మోతతో విద్యార్థులకు నిద్ర కరువైంది. రొళ్ల మండలంలోని రత్నగిరి బీసీ హాస్టళ్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ వసతిగృహం విద్యార్థికి కూడా పుస్తకాలు, యూనిఫాం అందలేదు. అందని కాస్మొటిక్ చార్జీలు గుంతకల్లు : నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు రెండు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు అందలేదు. గుంతకల్లు పట్టణంలోని బాలుర ఎస్సీ హాస్టల్‌తోపాటు ఎస్సీ బాలికలు, 1, 2 బాలుర బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. అన్నం ముద్దముద్దగా ఉండడంతో పాటు నీళ్ల మజ్జిగ, కాయగూరలు లేని సాంబారే తమకు కడుపు నింపుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకో పర్యాయం మాంసాహారం ఇవ్వాల్సి ఉన్నా..ఏ వసతి గృహంలోనూ విద్యార్థులకు ఇవ్వడం లేదు. కొన్ని హాస్టళ్లలో మెనూ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. చాలా వసతి గృహాల్లో తాగునీరు సరఫరా కాక విద్యార్థులు బాటిళ్లలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. హాస్టళ్ల భవనాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు బెడద ఎక్కువైంది. అధికారులు దుప్పట్లు మాత్రమే సరఫరా చేయడంతో బెడ్‌షీట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వసతులు కరువు బుక్కపట్నం (పుట్టపర్తి) : పుట్టపర్తి నియోజవర్గంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ వసతి గృహంలోనూ సరైన సౌకర్యాలు లేవు. ఓబులదేవరచెరువు బీసీ హాస్టల్లో 153 మంది విద్యార్థులుండగా...విద్యార్థులుకు ఇప్పటి వరకూ దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులే ఇళ్ల నుంచి తెచ్చుకున్నారు. ఇక యూనిఫాం, పుస్తకాలు కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు. మిగిలిన సదూపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సం‘క్షామ’ హాస్టళ్లు ధర్మవరం : నియోజకవర్గంలో ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్‌లో బాలికల హాస్టల్, ఎస్బీఐ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, తారకరామాపురంలో బీసీ హాస్టల్ ఉన్నాయి. తాడిమర్రి మండల కేంద్రంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. అదేవిధంగా బత్తలపల్లిలో ఒక బీసీ వసతి గృహం, ముదిగుబ్బ మండల పరిధిలో ముదిగుబ్బ, మలకవేములలో బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పెరిగిన కూరగాయల ధరలతో నీళ్లచారు, చప్పిడి పప్పే విద్యార్థులకు అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు అందాల్సిన కాస్మొటిక్ చార్జీలు నేటికీ ఇవ్వలేదు. ఇక దుప్పట్లు కూడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతూ, దోమ కాటుకు గురవుతున్నారు. ఇళ్ల వద్దనుంచి తెచ్చుకున్న వారి దుప్పట్లనే అందరూ సర్దుకుని కప్పుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. నేటికీ వారికి పుస్తకాలను అందజేయలేదు. దీంతో విద్యార్థులు పూర్వ విద్యార్థులతో పుస్తకాలను తీసుకుని చదువుకునే దుస్థితి నెలకొంది. దోమకాట్లతో కనుకు కరువు రాయదుర్గం : నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 6 బాలుర , రెండు బాలికల బీసీ హాస్టళ్లు, 2 ఎస్సీ బాలుర , 2 బాలికల హాస్టళ్లున్నాయి. ఇందులో జూనియర్ కళాశాల బాలుర, బాలికల బీసీ హాస్టళ్లు ఒక్కొటి చొప్పున ఉన్నాయి. ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం ఇంతవరకు దుప్పట్లు, యూనిఫాం, నోటు పుస్తకాలు పంపిణీ చేయగా బీసీ హాస్టళ్లకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. మంగళవారం రాత్రి పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న బీసీ హాస్టల్‌ను సాక్షి విజిట్ చేయగా, విద్యార్థులు దుప్పట్లు లేక చలికి వణుకుతూ కనిపించారు. సాయంత్రం మెనూ ప్రకారం అన్నం, కూరగాయల పప్పు, రసం, పెరుగు, గుడ్డు ఇచ్చారు. అయితే ఇరుకైన డైనింగ్ హాలులో సుమారు 110 మంది విద్యార్థులు భోజనం చేశారు. అయితే దుప్పట్లు గానీ, యూనిఫాం, నోటుపుస్తకాలు గానీ ఇంతవరకూ పంపిణీ చేయలేదని విద్యార్థులు తెలిపారు. దోమతెరలు లేకపోవడంతో దోమల బాధ ఎక్కువైందని విద్యార్థులు వాపోయారు. మరుగుదొడ్లు లేక సతమతం తాడిపత్రి రూరల్ : తాడిపత్రి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు 10 ఉన్నాయి. అలాగే జూనియర్ కళాశాల వసతి గృహాలు 4 ఉన్నాయి. తాడిపత్రిలో 7, చుక్కలూరులో 1, పెద్దపప్పూరులో 2, యాడికిలో 1, పెద్దవడగూరు మండలంలో 3, తాడిపత్రి పట్టణంలో జూనియర్ కళాశాలలకు చెందిన వసతి గృహాలు 4 ఉన్నాయి. ఏ ఒక్క వసతి గృహంలోనూ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. తాడిపత్రి పట్టణంలోని ఇంటరీగ్రేడ్ వసతి గృహంలో 110 మంది విద్యార్థులుండగా, డ్రైనేజీ కాలువలు లేక వసతి గృహం పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఇక తాడిపత్రి మండలంలోని చుక్కలూరు బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో తాళాలు వేశారు. దీంతో విద్యార్థులకు మరుగుకు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దవడగూరు వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో లేరు. -
ప్రభుత్వ హాస్టళ్లకు మంగళం
- మూసివేత దిశగ మరో 18 వసతిగృహాలు – ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు అనంతపురం : జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో 26 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో మరో 25 వసతి గృహాలు అదే బాటపట్టాయి. నగరంలోని ఎస్సీ నంబర్–3 వసతి గృహం, ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు ఎస్సీ వసతి గృహం, తదితర మరో 18 హాస్టళ్లకు 2017–18 విద్యా సంవత్సరంలో మంగళం పాడనున్నారు. దీంతో బడుగులు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఒకప్పుడు జిల్లాలో 125 హాస్టళ్లతో కళకళలాడిన సాంఘిక సంక్షేమశాఖ ప్రస్తుతం 56 హాస్టళ్లకు పడిపోయి వెలవెలబోతోంది. వసతి గృహాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఓవైపు పదేపదే ప్రకటనలు చేస్తున్నా...మరోవైపు ఏడాదికేడాది అవి మూతపడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను మూసివేశారు. జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో 26 ఎస్సీ హాస్టళ్లు, తర్వాత 75 మంది లోపు విద్యార్థులున్నారని 2016–17 సంవత్సరంలో మరో 25 హాస్టళ్లు ఈ జాబితాలో చేరాయి. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సమీప హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను సమీప హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 3,4,9,10 తరగతుల విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేస్తారు. 5,6,7,8 తరగతుల విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేస్తారు. ఈ నిర్ణయం ఎంతమాత్రం అమలు అవుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న హాస్టళ్లకు 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా డ్రాపౌట్స్ మారే ప్రమాదమూ లేకపోలేదు. అద్దె భవనాలు, 70 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల వివరాల నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారని సమాచారం. -
అయితే వంకాయ్..లేదా బంగాళదుంప
క్యారెట్ అంటే హాస్టల్ విద్యార్థులకు తెలియదు కుళ్లిన గుడ్లే పౌష్టికాహారమా! మెనూ అమలులో లోపాలపై కమిటీ ఆగ్రహం విశాఖపట్నం (మహారాణిపేట) : అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యే కార్యక్రమాలు ప్రజలకు తెలియడం లేదని మహిళా శిశు సంక్షేమ శాసన సభా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో సమస్యలపై చర్చించారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గుర్తించామన్నారు. ఏడాదంతా వంకాయ లేకపోతే బంగాళదుంపతోనే సరిపెడుతున్నారని వారికి క్యారెట్, ఆకుకూరలు అంటే తెలియదని కమిటీ సభ్యురాలు పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లే పౌష్టికాహారంగా ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఇటీవల అంగన్వాడీల్లో భర్తీ చేసిన లింక్ వర్కర్లు, ఆయా పోస్టుల్లో అవకతవకలు జరిగాయని, ఈ పోస్టుల భర్తీలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యం ఇచ్చారని చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర్రావు మాట్లాడుతూ అంగన్వాడీలకు గ్యాస్ సక్రమంగా సరఫరా చేయడం లేదని, కేంద్రాలను పర్యవేక్షించడానికి సరిపడినంత మంది సూపర్వైజర్లు లేరని సగానికి సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏడు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అమృత హస్తం నిధులు ఇవ్వలేదని కేంద్రాలకు అద్దె డబ్బులు సరిగా చెల్లించడం లేదని, చాలా కేంద్రాలకు సొంతభవనాలే లేవని కేంద్రాల్లో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు, రోడ్డు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఆనుకొని ఉన్న అంగన్వాడీలకు ప్రహరీలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. సభ్యులు అడిగిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్పర్సన్ మీసాల గీత అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి చిన్నపిల్లలతో వచ్చే వారందరిని ఓ దగ్గర ఉంచేందుకు ప్లే స్కూల్ మాదిరిగా ఓ గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. వికలాంగులను తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. జీవీఎంసీలో 2లక్షల 22వేల మంది డ్వాక్రా మహిళలుండగా కేవలం 700మందికి మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని యూసీడీ పీడీ శ్రీనివాసన్ చెప్పడంపై గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతులు సక్రమంగా ఇవ్వని సంక్షేమశాఖ సహాయ సంచాలకులపై మండిపడ్డారు. సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జేసీ-2 వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, జి.లక్ష్మీదేవితో పాటు దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కమిటీ వికలాంగులకు వీల్ చైర్లు అందజేసింది. -
సన్నబియ్యం మేలు చేస్తాయా ?
తెలంగాణలో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో జనవరి 1 నుంచి సన్నబియ్యంతో భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. నిరుపేద పిల్లలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల బాగో గులపై ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఏదోరకమైన శ్రద్ధ ఉండటం అభినందించదగినదే. అయితే, ఎముకలు కొరికే చలికి అల్లల్లాడే చిన్నారులకు దుప్పట్లు, సబ్బులు, తలనూనె వంటి కనీసావసరాలపై దృష్టి పెట్టకుండా సన్నబియ్యం వంటి వ్యర్థమైన, ఆరోగ్య వ్యతిరేకమైన సౌకర్యాన్ని హాస్టళ్లకు అనవసరంగా అంట కట్టడం విజ్ఞత అనిపించు కోదు. వడ్ల గింజగా ఉన్న బియ్యాన్ని ఒకసారి మరపట్టి, తిరిగి మరపట్టి సదరు గింజలో పిసరంత పిండి పదార్ధం (కార్బొహైడ్రేట్స్) మినహా మరేమీలేని స్థితిని తేవడాన్నే సన్న బియ్యమని మనం వ్యవహరిస్తుం టాం. బియ్యం గింజ పైపొరలో స్వాభావికంగా ఉండే జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషక పదార్థాలను తెల్ల రంగుపై వ్యామోహంతో వదులుకోవడం హాస్టళ్లలో చిన్నారులకు ఎలా ఆరోగ్యకరమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చూడటానికి ముత్యాల్లా, నాజూకుగా, నోరూరించేలా కనిపించే సన్న బియ్యం సారహీనమైనవని వైద్య పరిశోధనల్లో తేలిన సత్యం. ఈ బియ్యంతో వండిన అన్నం జంక్ ఫుడ్, గడ్డితో సమానం. అనారోగ్య హేతువు. గత రెండు మూడు దశాబ్దాలుగా పూర్వపు ఏపీలోనూ, తమిళనాడులోనూ డయాబిటీస్ (సుగర్ వ్యాధి), రక్తపోటు (బీపీ) రోగులు ఊహాతీతంగా అధికం కావడానికి సన్న, తెల్ల బియ్యం వాడకం పెరగడమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయి. మన హైదరాబాద్ నగరం దేశంలోనే సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న డయాబెటిక్ రాజధానిగా ఇప్పటికే పేరుమోసింది. హాస్టళ్లలో ఉండే పిల్లలకు నిస్సారమైన తెల్ల బియ్యం సరఫరా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఘనంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఈ పథకాన్ని అమలు చేయించడానికి కంకణం కట్టుకున్నారు. ఇదంతా ఎవరి ఆరోగ్యం కోసం? ప్రతిరోజూ తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటే అందులో పీచు లేకపోవడంతో కొద్ది సమయానికే ఆకలి వేస్తుం ది. దాని ఫలితంగా అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని ఆబగా తింటారు, శరీరంలో ఖర్చుకాని కేలరీలు అధికంగా జమపడి శరీరం బరువు పెరుగుతుంది. సన్నబియ్యం త్వరగా అరగడంతో జీర్ణక్రియకు రోజంతా పనిలేక ఆ వత్తిడి ఇతర శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపు తుంది. ఈ బియ్యానికి అలవాటు పడిన వారిని జీవన శైలి వ్యాధులు యవ్వనంలోనే పలకరిస్తాయి. దాని కంటే గింజ పైపొరని యథాతథం గా ఉంచే సోనా మసూరి లేదా హెచ్ఎంటి బియ్యం ఈ వయస్సులో చిన్నారులకు మేలు చేస్తాయి. వేల టన్నుల సన్న బియ్యాన్ని వండించి పిల్లల ఆరోగ్యాన్ని అపాయంలో పడవేయడం తగదు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచన చేయడం మంచిది. - వీణవంక మార్కండేయ చెన్నూరు -
చలి ఇలాగే ఉంటే..విద్యార్థులకు ఉన్ని దుప్పట్లు
ఆదిలాబాద్ రూరల్: జిల్లాలో చలి తీవ్రత ఇలాగే ఉంటే ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్ని దుప్పట్లు పంపిణీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. జిల్లాలో చలి రికార్డు స్థాయిలో నమోదవుతున్న దృష్ట్యా ఆదివారం రాత్రి ఆయన ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ కొలాం ఆశ్రమోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాలను తనిఖీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి నుంచి ఎదురవుతున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని, ప్రస్తుతం ఉన్న దుప్పట్లతో నిద్ర కూడా పట్టడం లేదని కొలాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చలి ఇదే విధంగా కొనసాగితే నాణ్యమైన ఉన్ని దుప్పట్లు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు. హాస్టళ్లకు జనవరి ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వసతిగృహాల్లో కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోతే వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో కొనసాగుతున్న అక్రమ డెప్యూటేషన్లపై వస్తున్న ఆరోపణలపై మంత్రిని సంప్రదించగా.. అక్రమ డెప్యూటేషన్లు ఉంటే విచారణ చేపట్టి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి దురుదాస్‌కు రేచీకటి ఉండడంతో చికిత్స నిమిత్తం ఉన్నత ఆస్పత్రికి తరలించాలని సంబంధిత హెచ్ఎం, ఏటీడబ్ల్యూఓలను మంత్రి ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ ఎం.జగన్మోహన్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖాధికారి అంకం శంకర్, ఏటీడబ్ల్యూఓ సంధ్యారాణి, హెచ్ఎం భోజన్న, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు. -
సమస్యలన్నీ పరిష్కరిస్తా..
పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు. కానీ హాస్టళ్లలో సదుపాయాలు, వసతులు, సౌకర్యాలు కరువై విద్యార్థులు సతమతం అవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం, నిధుల కొరత కారణంగా సమస్యలు తిష్టవేస్తున్నాయి. ప్రభుత్వ వసతిగృహాల్లో అన్ని వసతులు కల్పిస్తారని ఆశపడి వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం మెస్‌చార్జీలు పెంచి, సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో సౌకర్యాలు ‘కల్పన’గానే మారాయి. ఇప్పటికీ చాలా వసతిగృహాల్లో మెనూ అమలు కావడం లేదు, కిటికీలకు తలుపులు లేక చలికి వణికిపోతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఆయన వీఐపీ రిపోర్టర్‌గా మారి కాగజ్‌నగర్ పట్టణంలోని బీసీ వసతిగృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, సాధకబాధకాలు తెలుసుకున్నారు. హాస్టల్ పనితీరు, మెనూ, సిలబస్, ఆరోగ్యం, క్రీడలు, భోజన వసతి, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కోనప్పకు వివరించారు. - కాగజ్‌నగర్ టౌన్ బీసీ వసతి గృహానికి చేరుకోగానే హాస్టల్ ముందు పడి ఉన్న చెత్తాచెదారంపై వార్డెన్ మనోజ్‌తో ఇదేంటి అని ప్రశ్నించారు.. వార్డెన్ మనోజ్ : రేపటిలోగా చెత్తను తొలగిస్తాం సార్.. హాస్టల్లోకి వస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను చూసిన విద్యార్థులు.. నమస్తే సార్ ఎమ్మెల్యే : బాబు నమస్తే ఎలా ఉన్నారు విద్యార్థులు : బాగున్నాం సార్ ఎమ్మెల్యే : మీ లీడర్ ఎవరు విద్యార్థులు : రాజు, సుధాకర్, పాండు మా లీడర్లు సార్ ఎమ్మెల్యే : పాండు ఎక్కడ ఉన్నావు.. పాండు : సార్ నేనే పాండు అంటూ విద్యార్థి ముందుకు వచ్చాడు. ఎమ్మెల్యే : పాండు నీది ఏ ఊరు పాండు : సార్ నాది కన్నర్‌గాం, ఆసిఫాబాద్ మండలం ఎమ్మెల్యే : బాబు మీ హాస్టల్లో ఏ సమస్యలు ఉన్నాయి పాండు : సార్ పెట్టెలు రాలేదు. బోరింగ్ చెడిపోయింది. ఎమ్మెల్యే : అక్కడే ఉన్న వార్డెన్ మనోజ్‌ను పెట్టెల గురించి ఆరా తీశారు. వార్డెన్ : సార్ ఉన్నతాధికారికి రాసి పంపాం. వచ్చిన వెంటనే పెట్టెలు ఇస్తాం. ఎమ్మెల్యే : ఈ రోజు మెనూ ఏం ఇచ్చారు విద్యార్థి : సార్ ఇప్పుడు తయారవుతోంది. ఎమ్మెల్యే : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు విద్యార్థి : వారానికి ఆరు రోజులు ఇస్తుండ్రు సార్ ఎమ్మెల్యే : ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? విద్యార్థి రాజు : సార్ మంచినీటి సౌకర్యం లేదు. ఎమ్మెల్యే : నా స్వంత డబ్బులతో నేటి నుంచి మంచినీటి సరఫరా చేయిస్తా. ఎమ్మెల్యే : పాఠశాలకు సమయానికి వెళ్తున్నారా? అక్కడ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? విద్యార్థి : ఉదయం, సాయంత్రం వసతిగృహంలో తింటం, మధ్యాహ్నం స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం బాగుండడం లేదు సార్. ఎమ్మెల్యే : స్కూల్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి నాణ్యమైన భోజనం అందిస్తా. ఎమ్మెల్యే : మరుగుదొడ్ల పరిస్థితి ఎలా ఉంది.. విద్యార్థులు : సార్ మరుగుదొడ్ల పరిస్థితి బాగాలేదు. మరుగుదొడ్లు, స్నానపుగదుల తలపులు ఊడిపడ్డాయి. ఎమ్మెల్యే : వారంరోజుల్లో తలుపులకు మరమ్మతులు చేయిస్తా ఎమ్మెల్యే : ఇతరత్రా సమస్యలు ఏమి ఉన్నాయి విద్యార్థులు : డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లోరింగ్ లేదు. ఎమ్మెల్యే : హాస్టళ్ల డీడీ అంకం శంకర్‌తో ఫోన్లో మాట్లాడి, డైనింగ్ హాల్, ఫ్లోరింగ్‌కు ప్రతిపాదనలు పంపించండి అని ఆదేశించారు. ఎమ్మెల్యే : ఆరోగ్య పరీక్షల కోసం వైద్యులు వస్తున్నారా? విద్యార్థులు : ఏఎన్ఎంలు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే : హ్యాండ్‌బోర్ ఎప్పటి నుండి పని చేయడం లేదు విద్యార్థులు : సార్ 2 సంవత్సరాల నుండి పని చేయడం లేదు. ఎమ్మెల్యే : వార్డెన్ గారు ఎందుకు రిపేర్ చేయలేదు? వార్డెన్ మనోజ్ : ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను సార్. ఎమ్మెల్యే : హాస్టల్ వాచ్మెన్ ఎవరు, రాత్రి ఉంటున్నాడా? విద్యార్థులు : వాచ్మెన్ ఉంటున్నాడు. రాత్రి పూట పడుకుంటున్నాడు. ఎమ్మెల్యే : మంచినీటి కోసం కుండాలు, రంజన్లు ఉన్నాయా? వార్డెన్ : ప్లాస్టిక్ డ్రమ్ములను పెట్టాం సార్. ఎమ్మెల్యే : టిఫిన్ సరిగ్గా అందుతోందా? విద్యార్థులు : అందుతోంది సార్. ఎమ్మెల్యే : ఏం ఏం పెడుతున్నారు? విద్యార్థులు : ఉప్మా, కిచిడీ, అటుకులు పెడుతున్నారు సార్. ఎమ్మెల్యే : ఎలా చదువుతున్నారు విద్యార్థులు : మంచిగానే చదువుతున్నాము సార్ ఎమ్మెల్యే : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించండి. ప్రోత్సహిస్తాం ఎమ్మెల్యే : క్రీడల్లో పాల్గొంటున్నారా? విద్యార్థులు : అవును సార్ ఎమ్మెల్యే : ఇవాలా ఏం టిఫిన్ చేశారు? వార్డెన్ : సార్ కిచిడీ తయారు చేశాం. ఎమ్మెల్యే : సరే విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తా. విద్యార్థులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిసి నేలపై కూర్చుని టిఫిన్ చేశారు. ఎమ్మెల్యే : నేను వచ్చానని మెరుగైన అన్నం పెట్టారా? విద్యార్థులు : కాదు సార్ రోజు ఇలానే ఇస్తారు ఎమ్మెల్యే : ఏ సమస్యలు ఉన్న నా ఫోన్‌కు కాల్ చేసి సమస్యలు తెలపాలి. విద్యార్థులు : సరే సార్ అంటూ నెంబర్ అడిగారు. ఎమ్మెల్యే : నా నెంబర్ 9441255522 ఎమ్మెల్యే : వంటలు సరిగ్గా చేస్తున్నారా? వంట మనుషులు : సరిగ్గా చేస్తున్నాము సార్ ఎమ్మెల్యే : విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి వార్డెన్ : సార్ సమస్యలు ఎదురుకాకుండా చూస్తా. ఎమ్మెల్యే : వెళ్లోస్తాను మరీ, అనుమతి ఇస్తారా? విద్యార్థులు : నమస్తే సార్ మళ్లీ, మళ్లీ మా హాస్టల్‌కు రండి సార్. ఆనందంగా ఉంది సార్. ఎమ్మెల్యే : ఓకే ఓకే నవ్వుకుంటూ వెళ్లారు. వెళ్తుండగా.. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి బీసీ వసతి గృహం ముందు ఉన్న చెత్తను తొలగింపజేయాలని ఆదేశించారు. -
ప్రజావాణిగా గ్రీవెన్స్ సెల్
ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ కుప్పం: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌ను ఇక నుంచి ప్రజావాణిగా పేరు మారుస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి కుప్పం తహశీల్దార్ కార్యాలయుంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రవూన్ని నిర్వహించి గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన అధికారులు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టి అక్కడి వసతులు, ఆహారం, విద్యా విధానాలపై నివేదిక రూపొందిస్తారన్నారు. ప్రధానంగా గ్రామస్థాయి సమస్యలు అక్కడే పరిష్కారవుయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనకు సంబంధించి నూతన టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ స్కూల్లో తరగతి గదులు కొరత, పింఛన్ల పంపిణీ, ఇసుక రవాణా విధానంలో సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదనపల్లి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పాల్గొన్నారు. -
షరా మామూలే
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ వసతి గృహాల్లో సంక్షేమం గాడితప్పింది. ఈ హాస్టళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇరుకైన గదులు, ఉరుస్తున్న భవనాలు, మరుగుదొడ్ల కొరత తదితర సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలతోపాటు హాస్టళ్ల తలుపులు తెరుచుకోనున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం కృషిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కడప రూరల్ : జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతి యేటా వేసవి సెలవుల్లో మరమ్మత్తులను చేపట్టేవారు. ఇటీవలి కాలంలో మరమ్మత్తులు చేపట్టకపోవడంతో హాస్టళ్లలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హాస్టళ్లలోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సంక్షేమ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా హాస్టళ్లలోని సమస్యలు దాదాపుగా ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకునేవి. ప్రస్తుతం హాస్టళ్లపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో సంక్షేమం గాడి తప్పింది. అన్ని హాస్టళ్లలో అసౌకర్యాలే జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో మొత్తం 145 హాస్టళ్లు ఉండగా, అందులో 100 ప్రభుత్వ భవనాలు, 45 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 11 హాస్టళ్లు ఉండగా, 10 ప్రభుత్వ భవనాల్లో, 1 ప్రైవేటు భవనంలో నడుస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ పర్యవేక్షణలో 60 వసతి గృహాలు ఉండగా, 38 ప్రభుత్వ భవనాల్లో, 22 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మొత్తం 216 హాస్టళ్లకుగాను 139 ప్రభుత్వ భవనాల్లో, 68 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 14,500 మంది, గిరిజన హాస్టళ్లలో 1400 మంది, బీసీ హాస్టళ్లలో 8450 మంది ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో కూడా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. చినుకులు పడితే ఉరుస్తున్న భవనాలు, నీటి కొరత, ఇరుకు గదులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 10 మందికి ఒక మరుగుదొడ్డి, స్నానపు గది ఉండాల్సి ఉంది. అనేక చోట్ల ఇలా ఉండకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. మరమ్మతులకు నిధుల కొరత ప్రతియేటా వేసవి సెలవుల్లో హాస్టళ్లలో మరమ్మత్తులను చేపడుతుంటారు. ఇటీవలి కాలంలో నిధులను కేటాయించకపోవడంతో మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ హాస్టళ్లలో రూ. 1.58 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించగా నిధుల కొరత కారణంగా కేవలం రూ. 75 లక్షల వ్యయంతో పనులను చేపట్టారు. మరికొన్ని హాస్టళ్లలో హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్లు (హెచ్‌డబ్ల్యుఓలు) అప్పు చేసి మౌలిక వసతులు కల్పించారు. ఆ డబ్బు ఇంతవరకు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు సమస్యలతో పోరాడుతూనే చదువులో కూడా రాణిస్తున్నారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాణించి తమసత్తా చాటారు. గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలతోపాటు జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ల తలుపులు తెరుచుకోనున్నాయి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలనే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. -
పేరుకే మెనూ పెట్టిందే తిను
పెనుమూరు, న్యూస్‌లైన్: హాస్టళ్లలోని విద్యార్థులకు రోజూ గుడ్డు, వారంలో ఓ రోజు మాంసం, ప్రతి రోజూ సాయంత్రం రాగి గంజి, అరటి పండు లాంటి పౌష్టికాహారం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. వెంగళరాజుకుప్పం బీసీ బాలుర హాస్టల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ హాస్టల్లో 110 మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే 16 మంది మాత్రమే హాస్టల్‌కు రోజూ వస్తున్నారు. అయితే 16 మంది మాత్రమే హాస్టల్‌కు రోజూ వస్తున్నారు. మిగిలిన వారు హాస్టల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల వద్దే ఉంటున్నారు. హాస్టల్ వార్డెన్ రాత్రి 8 గంటలకు వచ్చి తెల్లవారుజామున 5.30 గంటలకు వెళ్లిపోతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు రారంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయంభయంగా ఉంటున్నారు. పెట్టింది తినాల్సిందే.. హాస్టల్లో కుక్ పెట్టిన అన్నం తినాల్సిందే. మెనూ గురించి బోర్డులో చదవడం తప్ప ఎప్పుడూ తిని ఎరగమని విద్యార్థులు చెబుతున్నారు. అన్నంలో పురుగులు ఉంటున్నాయని, అదీ కడుపు నిండా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల సాంబారు, రసమే తమకు దిక్కని, ఈ విషయం అడిగితే కుక్ సైతం కొడుతున్నారని విద్యార్థులు అంటున్నారు. భయపడుతూనే బతుకు.. హాస్టల్ గ్రామానికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడకు వెళ్లాలంటే ముళ్లపొదల మధ్యలో పోవాల్సిందే. చుట్టూ చీకటి. దీనికితోడు హాస్టల్ గదులు శిథిలావస్థలో ఉన్నాయి. పై భాగంలో పెచ్చులు ఊడుతూ వర్షాలకు ఉరుస్తున్నాయి. విద్యార్థులపై పెళ్లలు విరిగిపడిన సందర్భాలూ ఉన్నాయి. కిటికీలు సరిగా లేకపోవడంతో చలికి విద్యార్థులు వణికి పోతున్నారు. రాత్రి పూట కిటికీల గుండా పాములు, అడవి పిల్లులు హాస్టల్ గదుల్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే హాస్టల్‌కు గేటు లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి పూట సంచరిస్తున్నారు. మందుబాబులు మద్యం బాటిళ్లను హాస్టల్ ఆవరణలో పడేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి... సమస్యలు చెప్పుకుందామంటే అధికారులు సైతం హాస్టల్‌కు రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. స్విచ్ బోర్డులను తాకితే షాక్ కొడుతున్నాయని అంటున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మండల అధికారులకు పలుమార్లు చెప్పినా స్పందన కరువైందని చెబుతున్నారు. తాగునీటికి ఎన్ని కష్టాలే హాస్టల్లోని బోరు పాడైంది. దీంతో హాస్టల్‌కు దూరంగా ఉన్న చేతిబోరే విద్యార్థులకు దిక్కవుతోంది. నిత్యం అక్కడి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నీటిలోనూ కొంత కాలంగా సిలుం వస్తోంది. ఈ నీటిని ఉపయోగించిన కారణంగా అన్నం రంగు మారుతోంది. ఇలాంటి అన్నం తింటుంటే భయమేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాయాజాలం! హాస్టల్లో 110 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే 16 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారని, మిగిలిన వారు ఇళ్ల వద్దే ఉన్నారని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్‌కు రాని వారి సరుకులను అధికారులు అమ్మేసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు సైతం సరైన భోజనం పెట్టకుండా సరుకులు అమ్ముతుంటే కడుపు కాలుతోందని చెబుతున్నారు. విద్యాహక్కు చట్టానికీ తూట్లు హాస్టళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం తప్పక కల్పించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. అయితే వెంగళరాజుకుప్పం బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా ఉన్నాయి. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. తలుపులు సరిగా లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వెంగళరాజుకుప్పం వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు సమస్యలు తెలియజేశారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 24జీడీఎన్01: వెంగళరాజుకుప్పం హాస్టల్ 24జీడీఎన్02: శిథిలావస్థలో ఉన్న గదులు 24జీడీఎన్03:మరమ్మతులకు నోచుకోని బోరు 24జీడీఎన్04:నిరుపయోగంగా మరగుదొడ్లు 24జీడీఎన్05:విరిగిన కిటికీలు 24జీడీఎన్06:పిచ్చిమొక్కలతో హాస్టల్ పరిసరాలు 24జీడీఎన్07: గేటు లేని హాస్టల్ ముఖద్వారం -
విద్యార్థుల కన్నీరు...
నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు కనీస వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. జిల్లాలో 678 ప్రాంతాల్లో నీటి సవుస్యను పరిష్కరించేందుకు రూ.5.68 కోట్ల వ్యయుంతో వసతులు కల్పించాలని సర్కారు గత ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ప్రొసిడింగ్ నంబర్ జే-2/డీడబ్లూఎస్సీ/133 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సవుస్యలు తీర్చేందుకు ఎంపిక చేసిన ఒక్కో పాఠశాలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వుంజూరు చేసింది. ఆయూ ప్రాంతాల్లో చేతిపంపులు, నల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు బోరు బావులు తవ్వించి వినియోగంలోకి తేవాలి. ఇందులో భాగంగా నీటి సౌకర్యం లేని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోరుబావులు తవ్వారు. కానీ... వాటిని వినియోగంలోకి తేవడంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇప్పటివరకు 50 శాతం మేర వినియోగంలోకి రాలేదు. నర్సంపేట డివిజన్లోని నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం వుండలాల్లో 150 బోర్లు వేరుుంచి ట్యాంకులు నిర్మించడంతోపాటు పంపుసెట్లు, నల్లాలు ఏర్పాటు చేయూల్సి ఉంది. ఈ బాధ్యతను గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించారు. గత వేసవి సెలవుల నుంచి ఆయూ పాఠశాలల్లో 64 బోర్లు వూత్రమే వేరుుంచారు. ఇందులో సగం మేర ఇంకా వినియోగంలోకి రాలేదు. ఉన్న వాటినీ ఎందుకు వినియోగించుకోవడంలేదని అధికారులను ఆరా తీస్తే... ‘ప్రస్తుతం ఉన్న ప్రత్యావ్నూయు ఏర్పాట్లు దూరమైతే... వాటిని వినియోగంలోకి తెస్తాం.’ అని సవూధానం చెప్పడం గమనార్హం. -
వసతి లేదు
కడప రూరల్/వైవీయూ న్యూస్‌లైన్: ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సరైన వసతిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రభుత్వ వసతి గృహాలు ఎటువంటి సౌకర్యాలు లేని ప్రైవేట్ అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతో పాటు టాయిలెట్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. భవనాలకు కిటికీలు లేక, ఆరుబయటే స్నానాలు చేస్తూ చలికాలంలో అవస్థలు పడుతున్నారు. మెనూ సక్రమంగా అమలుకాక బక్కచిక్కి పోతున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 147 హాస్టళ్లు ఉండగా 113 ప్రభుత్వ భవనాల్లో, 34 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో 10వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 11 ప్రభుత్వ, ఒకటి అద్దెభవనంలో కొనసాగుతున్నాయి. వీటిలో 1805 మంది విద్యార్థులు ఉంటున్నారు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో 38 ప్రభుత్వ, 22 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక్కడ 5375 మంది విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 219 హాస్టళ్లకు గాను 122 ప్రభుత్వ, 57 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల్లో నడిచే 122 హాస్టళ్లలో దాదాపు 70 శాతానికి పైగా సమస్యలతోకొట్టుమిట్టాడుతున్నాయి. శిథిలమైన భవనాలు, గదులకు కిటికీలు, తలుపులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 90 శాతం పైగా వసతి గృహాల్లో మరుగుదొడ్ల సౌకర్యం సౌకర్యవంతంగా లేదు. అద్దెభవనాల్లో వసతిపరిస్థితి దారుణంగా ఉంది. ఇరుకైన గదులు, అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో వసతి గృహాలు చేపట్టడానికి ఏడాది క్రితం ప్రభుత్వం ప్రణాళికలు పంపమని కోరింది. ఆయా శాఖల జిల్లా అధికారులు నివేదికలు పంపినప్పటికీ వాటికి మోక్షం లభించడం లేదు. దాదాపుగా 70 శాతం హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కానందున 50 శాతం పైగా విద్యార్థులు బక్కచిక్కిపోతున్నారు. కొన్ని శాఖల వసతి గృహాలకు సంబంధించి నేటికీ యూనిఫాం అందలేదు. అనేకచోట్ల వసతిగృహాధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. హాస్టల్ పరిసరాల్లోనే నివాసం ఉండాల్సి ఉండగా వారు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటూ హాస్టల్ పెత్తనాన్ని వంటమనుషులకు అప్పచెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా.. ఆరుబయటేనా..! ‘ఇంకా ఆరుబయటేనా... మహిళల గౌరవానికి భంగం కలగాల్సిందేనా’ అంటూ ప్రభుత్వాలు బహిర్భూమి విషయమై పెద్ద పెద్ద ప్రకటనలు ఓ వైపు గుప్పిస్తుంటే... జిల్లాలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బడిమానేసిన విద్యార్థినుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో మొదటి విడతలో ఏర్పాటైన 18 కేజీబీల్లో వసతులు ఉన్నప్పటికీ మెనూ విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తుండటం గమనార్హం. సంబేపల్లి, రాయచోటిలో ఇటీవల జరిగిన సంఘటనలు కేజీబీవీల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. రెండవ విడత మంజూరైన 11 కేజీబీవీల్లో భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనగలూరు, పుల్లంపేట మండలాలతో పాటు ఓబులవారిపల్లెలోని కేజీబీవీ అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. ఓబుళవారిపల్లెలో కేవలం ఒక్క గదిలోనే విద్యార్థులందరూ ఉండాల్సి రావడం గమనార్హం. టాయిలెట్లు సరిగాలేక ఆరుబయటకే విద్యార్థినులు వెళ్లాల్సి రావడంతో వారు విషపురుగుల బారినపడే అవకాశం లేకపోలేదు. -
కష్టాల హాస్టళ్లు
సంక్షేమ హాస్టళ్లు పిల్లలకు నరకాన్ని చూపిస్తున్నాయి. దుప్పట్లు లేక అనేకమంది చలికి గజగజ వణుకుతున్నారు. ప్రభుత్వం కొంతమందికి దుప్పట్లు అందించింది. అవి నాసిరకంగా ఉండడంతో చలిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇక టాయిలెట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రజా సమస్యలపై ‘సాక్షి’ సమరంలో భాగంగా హాస్టళ్లలోని సమస్యలను వెలుగులోకి తెచ్చే దిశగా ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు: జిల్లాలో 126 ఎస్సీ, 16 ఎస్టీ, 66 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. అన్ని హాస్టళ్లలోనూ సమస్యలు కొలువుదీరాయి. చాలా హాస్టళ్లలో విద్యార్థులు చలికి, వర్షానికి సురక్షితంగా ఉండే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కిటికీలు విరిగిపోయాయి. మరికొన్ని హాస్టళ్లు రేకులషెడ్లలో నడుస్తున్నాయి. ఇవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సత్యవేడు వంటి చోట్ల హాస్టళ్లకు తలుపులు లేవు. ఆవులు వచ్చి పుస్తకాలు తినేసి వెళుతున్నాయి. రాత్రిపూట పాములు వచ్చేస్తుండడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంక్షేమానికి కేటాయిస్తున్న కోట్ల నిధులు ఏమైపోతున్నాయో తెలియని పరిస్థితి. ఇవీ సమస్యలు చిత్తూరు ఎస్సీ హాస్టల్-1లో 45 మంది విద్యార్థులు ఉన్నారు. దుప్పట్లు ఇటీవలే ఇచ్చారు. బాత్రూమ్లు సరిగాలేవు. మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆరుబయటే మలవిసర్జనకు వెళుతున్నారు. పక్కనే ముళ్లపొదలు ఉండడంతో అప్పుడప్పుడూ పాములు హాస్టల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్ర లేకుండా జాగారం చేస్తున్నారు. సత్యవేడులో ఎస్సీ హాస్టళ్లు-3, బీసీ హాస్టళ్లు-2 ఉన్నాయి. బీసీ బాలుర హాస్టల్ అధ్వానంగా ఉంది. హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. వర్షానికి ఉరుస్తోంది. కిటికీలు, తలుపులు లేవు. విద్యార్థులు చలికి అల్లాడుతున్నారు. ఆరుబయటే మంచులో భోజనం చేస్తున్నారు. తలుపులు లేకపోవడంతో ఆవులు లోపలికి వచ్చి పుస్తకాలు తినేస్తున్నాయి. పాములు వస్తున్నాయి. మొత్తం 150 మందికి ఒకటే మరుగుదొడ్డి. తిరుపతిలోని ఎస్సీ హాస్టల్లో కొందరు విద్యార్థులకే దుప్పట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చినవారికి ఈ సారి దుప్పట్లు ఇవ్వలేదు. కింద వేసుకున్న కార్పెట్లను దుప్పట్లుగా కప్పుకుంటున్నారు. చెన్నారెడ్డికాలనీలోని బీసీ హాస్టల్లోనూ ఇదే పరిస్థితి. మరుగుదొడ్లు సరిగ్గా లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం మండలాల్లో సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. అన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. బి.కొత్తకోటలో రేకులషెడ్డులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కాటన్ దుప్పట్లు ఇచ్చారు. ఇవి చలి నుంచి విద్యార్థులకు రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. తంబళ్లపల్లె బీసీ హాస్టల్లో కిటికీలు దెబ్బతిన్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నగరి నియోజకవర్గంలో 16 హాస్టళ్లు ఉన్నాయి. అన్ని చోట్లా దుప్పట్లు ఇచ్చారు. చాలా చోట్ల భవనాలకు కిటికీలు లేవు. దోమతెరలు ఇవ్వలేదు. దిండ్లు లేవు. కొన్ని హాస్టళ్లకు మాత్రం దోమల నివారణ కాయల్స్ ఇస్తున్నారు. మదనపల్లె ఎస్సీ హాస్టల్ (బాలురు)లో 69 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. నాసిరకం దుప్పట్లు ఇచ్చారు. విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. 220 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరికి దుప్పట్లు ఇచ్చారు. మిగిలిన వారి దగ్గర ఉన్న దుప్పట్లు చిరిగిపోయాయి. విద్యార్థులు చలికి వణుకుతూ నిద్రపోతున్నారు. మంచినీటి సమస్య ఉంది. దూరంగా ఉన్న బోర్లు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. }M>-âహస్తి నియోజకవర్గంలో 18 హాస్టళ్లు ఉన్నాయి. ఇక్కడ కనీస సదుపాయాలు కరువయ్యాయి. విద్యార్థులు అందరికీ దుప్పట్లు లేవు. కొన్ని హాస్టళ్లకు కిటికీలు సరిగ్గా లేవు. చంద్రగిరి నియోజకవర్గంలోని కస్తూర్బా గురుకుల హాస్టల్లో రెండేళ్ల క్రితం బెడ్షీట్లు ఇచ్చారు. రామచంద్రపురంలో బీసీ హాస్టల్ ఉంది. ఇక్కడ అరకొర సదుపాయాల మధ్య విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. -
‘సాక్షి’ కథనాలపై స్పందించిన కలెక్టర్
పేదోళ్ల బిడ్డలు తలదాచుకునే లోగిళ్లు సమస్యల వలయాలుగా మారాయంటూ ‘సాక్షి’ సమరశంఖం పూరించింది.. కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ వసతి గృహాల్లో చలిగాలులకు వణుకుతున్న విద్యార్థుల దయనీయ స్థితిని కళ్లకు కట్టినట్టు ప్రతిబింబించింది.. చలిగాలులు శరీరాన్ని వణికిస్తుంటే అర్ధాకలి భోజనాలు ఆ విద్యార్థుల కడుపుల్లో ఆకలి మంటలు రేకెత్తిస్తున్నాయి. వీటిపై రెండు రోజుల పాటు సాక్షి బృందం జిల్లాలో ఏకకాలంలో వసతి గృహాలను సందర్శించి హాస్టళ్ల దయనీయ పరిస్థితిపై ‘గాలిలో సంక్షేమం.. చలితో సహవాసం’, ‘సుద్ద అన్నం.. నీళ్ల సాంబారు’, ‘అర్ధాకలి’ శీర్షికలతో సోమ, మంగళవారాల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో మనసున్న జిల్లా అధికారులు కదిలారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టరే రంగంలోకి దిగారు. దీంతో అధికార యంత్రాంగం హాస్టళ్లలో వసతి సౌకర్యాలపై ఆరా తీసేందుకు పరుగులు తీస్తోంది. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలకు కలెక్టర్ ఎం.రఘునందనరావు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై 12 అంశాలతో కూడిన నమూనా తయారు చేసి దీని ప్రకారం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇప్పటి వరకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన ఏఎస్‌డబ్ల్యూవోలు నివేదికలు తయారు చేసేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఫైళ్లు పక్కనపెట్టి ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలంటూ కలెక్టర్ అధికారులకు సూచించటం గమనార్హం. హైదరాబాదులో ఉన్న కలెక్టర్ వచ్చిన వెంటనే వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీడీ ఆకస్మిక తనిఖీ... కలెక్టర్ ఆదేశాలతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు మంగళవారం వివిధ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమశాఖ 10వ నంబరు వసతి గృహంలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తాను కూడా తిని పరిశీలించారు. వారంలో ఎన్నిసార్లు కోడిగుడ్లు వడ్డిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం విద్యార్థులకు వంకాయ కూర, కోడిగుడ్డు, చారు, పెరుగు వడ్డించారు. ‘సాక్షి’లో వార్తలు వస్తుండటంతో భోజనం సక్రమంగా పెడుతున్నారా అంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. పెరుగు వడ్డిస్తున్నారా, మజ్జిగ పోస్తున్నారా అని అడుగగా పెరుగే ఇస్తున్నారని విద్యార్థులు చెప్పారు. అనంతరం ఆయన పెరుగు పరిశీలించగా పలచగా ఉండటం గుర్తించారు. ఇక నుంచి గిన్నెలలో పాలు తోడుపెట్టి పెరుగు అందజేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు వండిపెట్టే భోజనాన్ని సక్రమంగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. బావిపై మూతవేయాలని ఆదేశం... వసతి గృహం ఆవరణలో ఉన్న బావిని వాడకుండా ఉంచారని, దీనివల్ల ప్రమాదాలు జరగకుండా మూతవేయించాలని హాస్టల్ వార్డెన్ సుభానీకి సూచించారు. హాస్టల్ గదుల్లోని కిటికీ అద్దాలు పగిలిపోవటంతో విద్యార్థులు చలిబారిన పడకుండా కనీసం అట్టలనైనా కిటికీలకు ఏర్పాటు చేయాలని వార్డెన్‌కు చెప్పారు. బుధవారంలోగా ఈ పని పూర్తిచేయాలన్నారు. హాస్టళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని డీడీ చెప్పారు. డీడీ వెంట మచిలీపట్నం ఇన్చార్జ్ ఏఎస్‌డబ్ల్యూవో జేవీ రమణ ఉన్నారు. పెడనలో ఏజేసీ పరిశీలన... పెడన బీసీ బాలుర వసతి గృహాన్ని ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు మంగళవారం రాత్రి పరిశీలించారు. బాత్రూమ్లలో లైట్లు లేకపోవటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. వార్డెన్ చెప్పిన సమాధానం పొంతన లేకపోవటంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం మచిలీపట్నంలోని వలందపాలెం బీసీ బాలికల వసతి గృహాన్ని ఏజేసీ తనిఖీ చేశారు. -
నో మెను...పెట్టిందే తిను!
=వసతిగృహాల్లో నిఘా దగా =సక్రమంగా ఆహారం అందించని వైనం =అనారోగ్యం బారిన విద్యార్థులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచి బాలలు అనారోగ్యం పాలవుతున్నారు. పేదవర్గాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు వసతి గృహాల్లో చేరితే వారికి చాలీచాలని ఆహారం పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక బాలికల వసతి గృహంలో మూడు రోజులుగా పిల్లలకు సక్రమంగా ఆహారం పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 151 వసతి గృహాలున్నాయి. వీటిలో 84 బాలురు, 67 బాలికల హాస్టళ్లున్నాయి. 15,100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4797 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇవికాకుండా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలు నడుపుతున్నారు. పర్యవేక్షణ లోపం.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉడికీ ఉడకని అన్నమే తినాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రెండుసార్లైనా ఆయా డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎస్‌డబ్ల్యూవోలు ప్రతి హాస్టల్‌ను సందర్శించి బాలలకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించాల్సి ఉంది. హాస్టల్లో వండి పెడుతున్న ఆహారంపై వార్డెన్ల పర్యవేక్షణ కొరవడింది. ప్రతి నెలా రెండుసార్లు కుక్, వార్డెన్లు, ఏఎస్డబ్ల్యూవోలకు సమావేశం నిర్వహించి మెనూ ప్రకారం బాలలకు ఆహారం వండిపెట్టాలని అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వసతి గృహంలోని వంటశాలలో ఏం జరుగుతుందో తెలుసుకునే చొరవను వార్డెన్లు చూపకపోవడంతో కుక్‌లు ఇష్టారాజ్యంగా వంట పనులు చేస్తున్నారు. అంగలూరు సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో మూడు రోజులుగా ఆహారం సక్రమంగా పెట్టకున్నా అటు వార్డెన్ గాని, ఏఎస్డబ్ల్యూవోగాని పట్టించుకోనే లేదు. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో మచిలీపట్నం వలందపాలెంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించిన సమయంలో వార్డెన్ హాస్టల్లో లేనేలేరు. ఉన్న ఇద్దరు కుక్‌లు పప్పు, చారు వండుతున్నారు. ఎంత మంది పిల్లలు ఉన్నారో వారికి ఎంత మేర ఆహారం వండాలో తెలియకుండానే ఇక్కడ వంట పూర్తి చేస్తుండటం గమనార్హం. మాచవరం మెట్టు సమీపంలో ఉన్న బాలుర కళాశాల వసతి గృహంలో ఎండిపోయిన బీరకాయలు, గోంగూర, దోసకాయలు దర్శనమిచ్చాయి. వీటినే వసతి గృహంలోని విద్యార్థులకు కూరలుగా వండి పెట్టడం గమనార్హం. వసతి గృహాల్లో తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వసతి గృహాల ప్రాంగణంలోకి వర్షపునీరు నిల్వ ఉన్నా వాటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయలేదు. వసతి గృహాల్లో విద్యార్థుల బాగోగులను పట్టించుకునేందుకు ఆత్మీయ అధికారులను ఏర్పాటు చేసినా వారు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. చర్యలు తప్పవు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం బాలలకు ఆహారం అందించని వారిపై ఇక నుంచి నిఘా ఉంచుతామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు తెలిపారు. అంగలూరు సంఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏఎస్‌డబ్ల్యూవో పైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వసతి గృహాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.