- మూసివేత దిశగ మరో 18 వసతిగృహాలు
– ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
అనంతపురం : జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో 26 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో మరో 25 వసతి గృహాలు అదే బాటపట్టాయి. నగరంలోని ఎస్సీ నంబర్–3 వసతి గృహం, ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు ఎస్సీ వసతి గృహం, తదితర మరో 18 హాస్టళ్లకు 2017–18 విద్యా సంవత్సరంలో మంగళం పాడనున్నారు. దీంతో బడుగులు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఒకప్పుడు జిల్లాలో 125 హాస్టళ్లతో కళకళలాడిన సాంఘిక సంక్షేమశాఖ ప్రస్తుతం 56 హాస్టళ్లకు పడిపోయి వెలవెలబోతోంది. వసతి గృహాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఓవైపు పదేపదే ప్రకటనలు చేస్తున్నా...మరోవైపు ఏడాదికేడాది అవి మూతపడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకు
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను మూసివేశారు. జిల్లాలో 2015–16 విద్యా సంవత్సరంలో 26 ఎస్సీ హాస్టళ్లు, తర్వాత 75 మంది లోపు విద్యార్థులున్నారని 2016–17 సంవత్సరంలో మరో 25 హాస్టళ్లు ఈ జాబితాలో చేరాయి. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
సమీప హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం
మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను సమీప హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 3,4,9,10 తరగతుల విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేస్తారు. 5,6,7,8 తరగతుల విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేస్తారు. ఈ నిర్ణయం ఎంతమాత్రం అమలు అవుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న హాస్టళ్లకు 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా డ్రాపౌట్స్ మారే ప్రమాదమూ లేకపోలేదు. అద్దె భవనాలు, 70 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల వివరాల నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారని సమాచారం.
ప్రభుత్వ హాస్టళ్లకు మంగళం
Published Sun, Apr 30 2017 11:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement