పేదోళ్ల బిడ్డలు తలదాచుకునే లోగిళ్లు సమస్యల వలయాలుగా మారాయంటూ ‘సాక్షి’ సమరశంఖం పూరించింది.. కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ వసతి గృహాల్లో చలిగాలులకు వణుకుతున్న విద్యార్థుల దయనీయ స్థితిని కళ్లకు కట్టినట్టు ప్రతిబింబించింది.. చలిగాలులు శరీరాన్ని వణికిస్తుంటే అర్ధాకలి భోజనాలు ఆ విద్యార్థుల కడుపుల్లో ఆకలి మంటలు రేకెత్తిస్తున్నాయి. వీటిపై రెండు రోజుల పాటు సాక్షి బృందం జిల్లాలో ఏకకాలంలో వసతి గృహాలను సందర్శించి హాస్టళ్ల దయనీయ పరిస్థితిపై ‘గాలిలో సంక్షేమం.. చలితో సహవాసం’, ‘సుద్ద అన్నం.. నీళ్ల సాంబారు’, ‘అర్ధాకలి’ శీర్షికలతో సోమ, మంగళవారాల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో మనసున్న జిల్లా అధికారులు కదిలారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టరే రంగంలోకి దిగారు. దీంతో అధికార యంత్రాంగం హాస్టళ్లలో వసతి సౌకర్యాలపై ఆరా తీసేందుకు పరుగులు తీస్తోంది.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ :
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలకు కలెక్టర్ ఎం.రఘునందనరావు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై 12 అంశాలతో కూడిన నమూనా తయారు చేసి దీని ప్రకారం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇప్పటి వరకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన ఏఎస్‌డబ్ల్యూవోలు నివేదికలు తయారు చేసేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఫైళ్లు పక్కనపెట్టి ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలంటూ కలెక్టర్ అధికారులకు సూచించటం గమనార్హం. హైదరాబాదులో ఉన్న కలెక్టర్ వచ్చిన వెంటనే వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డీడీ ఆకస్మిక తనిఖీ...
కలెక్టర్ ఆదేశాలతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు మంగళవారం వివిధ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమశాఖ 10వ నంబరు వసతి గృహంలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తాను కూడా తిని పరిశీలించారు.
వారంలో ఎన్నిసార్లు కోడిగుడ్లు వడ్డిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం విద్యార్థులకు వంకాయ కూర, కోడిగుడ్డు, చారు, పెరుగు వడ్డించారు. ‘సాక్షి’లో వార్తలు వస్తుండటంతో భోజనం సక్రమంగా పెడుతున్నారా అంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. పెరుగు వడ్డిస్తున్నారా, మజ్జిగ పోస్తున్నారా అని అడుగగా పెరుగే ఇస్తున్నారని విద్యార్థులు చెప్పారు. అనంతరం ఆయన పెరుగు పరిశీలించగా పలచగా ఉండటం గుర్తించారు. ఇక నుంచి గిన్నెలలో పాలు తోడుపెట్టి పెరుగు అందజేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు వండిపెట్టే భోజనాన్ని సక్రమంగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
బావిపై మూతవేయాలని ఆదేశం...
వసతి గృహం ఆవరణలో ఉన్న బావిని వాడకుండా ఉంచారని, దీనివల్ల ప్రమాదాలు జరగకుండా మూతవేయించాలని హాస్టల్ వార్డెన్ సుభానీకి సూచించారు. హాస్టల్ గదుల్లోని కిటికీ అద్దాలు పగిలిపోవటంతో విద్యార్థులు చలిబారిన పడకుండా కనీసం అట్టలనైనా కిటికీలకు ఏర్పాటు చేయాలని వార్డెన్‌కు చెప్పారు. బుధవారంలోగా ఈ పని పూర్తిచేయాలన్నారు. హాస్టళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని డీడీ చెప్పారు. డీడీ వెంట మచిలీపట్నం ఇన్‌చార్జ్ ఏఎస్‌డబ్ల్యూవో జేవీ రమణ ఉన్నారు.
పెడనలో ఏజేసీ పరిశీలన...
పెడన బీసీ బాలుర వసతి గృహాన్ని ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు మంగళవారం రాత్రి పరిశీలించారు. బాత్‌రూమ్‌లలో లైట్లు లేకపోవటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. వార్డెన్ చెప్పిన సమాధానం పొంతన లేకపోవటంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం మచిలీపట్నంలోని వలందపాలెం బీసీ బాలికల వసతి గృహాన్ని ఏజేసీ తనిఖీ చేశారు.
‘సాక్షి’ కథనాలపై స్పందించిన కలెక్టర్
Published Wed, Dec 11 2013 1:47 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement