షరా మామూలే
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ వసతి గృహాల్లో సంక్షేమం గాడితప్పింది. ఈ హాస్టళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇరుకైన గదులు, ఉరుస్తున్న భవనాలు, మరుగుదొడ్ల కొరత తదితర సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలతోపాటు హాస్టళ్ల తలుపులు తెరుచుకోనున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం కృషిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
కడప రూరల్ : జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతి యేటా వేసవి సెలవుల్లో మరమ్మత్తులను చేపట్టేవారు. ఇటీవలి కాలంలో మరమ్మత్తులు చేపట్టకపోవడంతో హాస్టళ్లలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హాస్టళ్లలోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సంక్షేమ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా హాస్టళ్లలోని సమస్యలు దాదాపుగా ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకునేవి. ప్రస్తుతం హాస్టళ్లపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో సంక్షేమం గాడి తప్పింది.
అన్ని హాస్టళ్లలో అసౌకర్యాలే
జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో మొత్తం 145 హాస్టళ్లు ఉండగా, అందులో 100 ప్రభుత్వ భవనాలు, 45 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 11 హాస్టళ్లు ఉండగా, 10 ప్రభుత్వ భవనాల్లో, 1 ప్రైవేటు భవనంలో నడుస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ పర్యవేక్షణలో 60 వసతి గృహాలు ఉండగా, 38 ప్రభుత్వ భవనాల్లో, 22 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. మొత్తం 216 హాస్టళ్లకుగాను 139 ప్రభుత్వ భవనాల్లో, 68 ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 14,500 మంది, గిరిజన హాస్టళ్లలో 1400 మంది, బీసీ హాస్టళ్లలో 8450 మంది ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో కూడా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. చినుకులు పడితే ఉరుస్తున్న భవనాలు, నీటి కొరత, ఇరుకు గదులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 10 మందికి ఒక మరుగుదొడ్డి, స్నానపు గది ఉండాల్సి ఉంది. అనేక చోట్ల ఇలా ఉండకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు.
మరమ్మతులకు నిధుల కొరత
ప్రతియేటా వేసవి సెలవుల్లో హాస్టళ్లలో మరమ్మత్తులను చేపడుతుంటారు. ఇటీవలి కాలంలో నిధులను కేటాయించకపోవడంతో మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ హాస్టళ్లలో రూ. 1.58 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించగా నిధుల కొరత కారణంగా కేవలం రూ. 75 లక్షల వ్యయంతో పనులను చేపట్టారు. మరికొన్ని హాస్టళ్లలో హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్లు (హెచ్‌డబ్ల్యుఓలు) అప్పు చేసి మౌలిక వసతులు కల్పించారు.
ఆ డబ్బు ఇంతవరకు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు సమస్యలతో పోరాడుతూనే చదువులో కూడా రాణిస్తున్నారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాణించి తమసత్తా చాటారు. గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలతోపాటు జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ల తలుపులు తెరుచుకోనున్నాయి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలనే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.