చెదరని జ్ఞాపకం
సాక్షి ప్రతినిధి, కడప : శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా.. అనంతపురం నుంచి అదిలాబాద్ వరకూ ఆ పేరు ఉచ్ఛరిస్తే మనస్సు పులకరిస్తుంది. అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదలను ప్రేమించడం. వర్గాలకు అతీతంగా సంక్షేమ పాలన అందించడం.. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు.. నడకలో రాజసం.. నమ్ముకున్న వారిని ఆదరించేగుణం.... మాట తప్పని మడమ తిప్పని నైజం... ఈ లక్షణాలన్నీ ఎవరివో చెప్పనక్కర్లేదు. ఆయనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేరరెడ్డి. మూడు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించి సంక్షేమ పాలన అందించారు. 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయినా మరుపురాని జ్ఞాపకంగా ప్రజానీకం మదిలో నిలిచిపోయారు.
రాజకీయ ప్రస్థానం.....
వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతుల రెండవ సంతానం వైఎస్ రాజశేఖరరెడ్డి. విశ్వసనీయతే ప్రామాణికంగా రాజకీయాలు నెరిపిన ఆయన, మాట ఇస్తే ఎంత కష్టమైనా నెరవేర్చాలని తపించేవారని విమర్శకులు సైతం కొనియాడుతుంటారు. మెడిసిన్ పూర్తి కాగానే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా ఏడాది కాలం సేవలందించారు. ఆ తర్వాత పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరున 30 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించసాగారు. అనతి కాలంలోనే పేదల డాక్టర్‌గా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొందారు.
తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20వేల 496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి నుంచి 2009 వరకు ప్రతిసారి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా ఘనతకెక్కారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగాను, మరోరెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పదవులను అలంకరించారు.
ప్రజాప్రస్థానంతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం ..
వరుసగా రెండు పర్యాయాలు అధికారం కోల్పోయి కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. సీఎల్పీ నేతగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి వైఎస్‌ను వరించింది. 2004 మే 14న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఆ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛనుల పావలా వడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డులు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఙం, 108, 104 వైద్య సేవలు, కిలో రూ.2 బియ్యం, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, ఒకటేమిటి అన్ని వర్గాల వారికి అనువైన పథకాలను రూపొందించారు. 2009 ఎన్నికల్లో విశ్వసనీయత పేరుతో బరిలో దిగిన ఆయన 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను ఒంటిచేత్తో గెలిపించుకున్నారు. 2009 మే 20న మరోమారు ముఖ్యమంత్రిగా ప్రజలమధ్యనే ప్రమాణస్వీకారం చేపట్టారు. రచ్చబండ కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళుతూ పంచ భూతాల్లో ఐక్యం అయ్యారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది మృత్యువాతబడ్డారు.