ఇచ్ఛాపురంతో విడదీయలేని అనుబంధం  | YS Rajasekhara Reddy Eleventh Death Anniversary In Srikakulam | Sakshi
Sakshi News home page

ఇచ్ఛాపురంతో విడదీయలేని అనుబంధం 

Published Wed, Sep 2 2020 12:02 PM | Last Updated on Wed, Sep 2 2020 12:02 PM

YS Rajasekhara Reddy Eleventh Death Anniversary In Srikakulam - Sakshi

ప్రజాప్రస్థాన విజయస్థూపం ఆవిష్కరణలో పాల్గొన్న వైఎస్సార్‌ (ఫైల్‌) 

చెరిగిపోని సంక్షేమ సంతకం.. చెదిరిపోని మధుర జ్ఞాపకం.. పాలించింది ఐదేళ్లే అయినా తరతరాలు తలచుకునేలా రామరాజ్యాన్ని అందించిన మహానుభావుడు. రాజకీయాలతో సంబంధం లేని.. జెండాలతో నిమిత్తం లేని అజెండా ఆయనది. అందరికీ మంచి జరగాలన్నదే ఆయన ఆశయం. మిత్రుడికే కాదు శత్రువుకు సైతం మేలు చేయాలన్నదే ఆయన నైజం. అందుకే అందరి మనసులను గెలిచాడు. చిరంజీవిగా నిలిచాడు.

సాక్షి, శ్రీకాకుళం: మానవత్వం, దయాగుణం ఉన్న మహా మనీషి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో వైఎస్సార్‌ను చూస్తే తెలుస్తుంది. ఆరోగ్యవంతంగా రాష్ట్రం ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తుందని నమ్మిన మహా వ్యక్తి ఆయన. రాజకీయంగా ఎక్కడ కనుమరుగైపోతామోనన్న భయంతో కొందరు ఆరోగ్యశ్రీపై రకరకాల విమర్శలు చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ నిధులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దోచిపెడుతున్నారని అరిచినా పట్టించుకోలేదు. నిరాటంకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి లక్షలాదిమంది ప్రాణాలు నిలిచారు. దేశంలోనే ఒక అద్భుత పథకంగా చూపించారు. మాట ఇచ్చామంటే నిలబడాలి. మాట మీద నిలబడ్డ వాడే నాయకుడు. ఇచ్చిన హామీలనే కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, ప్రజా అవసరాల దృష్ట్యా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసినవాడే ప్రజా నాయకుడవుతారు.

అలా కావాలంటే దయాగుణం, మానవత్వం, స్పందించేతత్వం ఉండాలి. అవన్నీ ఉంటూ ప్రజల బాధలకు పరిష్కారం చూపినవాడే మంచి పాలకుడిగా భావిస్తారు. అదంతా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిలో కన్పించింది. ఆయనున్నంతకాలం ప్రజల మేలుకోరి పనిచేశారు. ‘పాదయాత్రలో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. హామీ ఇవ్వకుండా కూడా అనేక పథకాలు ప్రవేశ పెట్టి ప్రజానేత అయ్యారు. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చెరపలేని సంతకంగా... చెరిగిపోని జ్ఞాపకంగా అందరిలోనూ చిరస్మరణీయుడయ్యాడు. ఇప్పుడా మహానేత బాటలోనే ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారు. నమ్మిన సిద్ధాంతంతో... వైఎస్సార్‌ ఆశయ సాధనతో... పేద ప్రజల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. 

జిల్లాలో రాజన్న జాడలివి..
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే చిక్కోలు ప్రజలకు ఓ పరిష్కారం చూశారు. శ్రీకాకుళానికి ఓ పెద్దాసుపత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119 కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఏటా జిల్లా నుంచి వందల మంది వైద్యులను తయారు చేసే సంస్థను జిల్లాలో పెట్టారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండూ ఆయన చేతుల మీదుగానే జరిగాయి. 13 ఆధునిక వసతులతో కూడిన భవనాలను మంజూరు చేశారు. కానీ వైఎస్సార్‌ మరణం తర్వాత దాని కోసం పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. మళ్లీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిమ్స్‌లో అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణంపోసుకున్నవారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు వైఎస్సార్‌ పటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటారు.

విశ్వవిద్యాలయం ఆయన పుణ్యమే
సిక్కోలు జిల్లాకు 1980 నుంచి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వాలు అనేక కమిటీలు కూడా వేశాయి. కానీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. ప్రతీ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ భావించారు. ఆ ఆలోచనకు ప్రతిరూపంగా ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ యూనివర్సిటీ ఏర్పాటైంది. 2008 జూలై 25న డాక్టర బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. 

రైతు పక్షపాతిగా..
నదులున్నా పొలాలు తడవని పరిస్థితి. భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి. సాగు చేద్దామని భావించినా అప్పు పుట్టని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. అంతటితో ఆగకుండా ప్రతీ చుక్కనీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తోటపల్లి ఫేజ్‌ 2, వంశధార రెండో దఫా ప్రాజెక్టును, టెక్కలి నియోజకవర్గంలోని ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2005 మే నెలలో వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌ 2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.970 కోట్లు విడుదల చేశారు.

హిరమండలం వద్ద సుమారు 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ కోసం చేపట్టిన వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరినట్టే. వంశధార కుడి, ఎడమ కాలువలతో పాటు వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్‌ అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు. 12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్‌ 1 పనులను రూ.57.87 కోట్లతో చేపట్టారు. సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 123.25 కోట్లతో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ.300 కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో  14 వేల ఎకరాల్లో 5 వేల మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. 

పేదలకు లక్షా 80 వేల సొంతిళ్లు 
పేదలకు సొంతింటి కల నెరవేర్చారు. పక్కా స్థలమిచ్చి గూడు కట్టారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2006–07 నుంచి వరుస మూడేళ్లు ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరిట పేదలందరికీ కుల, మత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా ఇళ్లను అందించారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సరిపడని లబ్ధిదారులు డ్వాక్రా సంఘాల్లో ఉంటే వారికి మరో రూ.20 వేలు అదనంగా బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి పక్కా ఇళ్లను నిర్మించకునేందుకు ప్రోత్సహించారు.  ఇందిరమ్మ పథకం కింద 2006–07లో 71,141 ఇళ్లను, 2007–08లో 70,435 ఇళ్లను మంజూరు చేసి వాటిలో 61,754 ఇళ్లను పూర్తి చేశారు. మూడో విడతగా 42,800 ఇళ్లను మంజూరు చేయగా 39,240 ఇళ్లను నిర్మించి మూడేళ్లలో  చరిత్రలో ఎక్కడా లేని విధంగా లక్షా 80 వేల 817 ఇళ్లు మంజూరు చేసి అందులో లక్షా 63 వేల 140 ఇళ్లను పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది.  

ఇచ్ఛాపురంతో విడదీయలేని అనుబంధం 
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఓ ప్రభంజనం. ప్రజల బాధలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన ప్రజాప్రస్థానం ఓ చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటించి వైఎస్సార్‌ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన యాత్ర ముగించారు. అందుకు గుర్తుగా అక్కడ విజయస్థూపం నిర్మించారు. 2003 ఏప్రిల్‌ 9న పాదయా త్ర ముగింపు రోజున స్థూపాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్‌ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కుమార్తె వైఎస్‌ షర్మిల పాదయాత్రల ముగింపునకు కూడా ఇదే వేదిక కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement