ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ ఇచ్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చారు.. నీడలేని పేదలకు గూడును అందించారు.. జలయజ్ఞంతో బీడులను సస్యశ్యామలం చేశారు.. డెల్టా ఆధునికీకరణ, గోదావరి ఏటిగట్టు పటిష్టతకు నడుం బిగించారు.. ఉద్యాన వర్సిటీ ద్వారా అన్నదాతలకు అండగా నిలవడంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలకు బాటలు వేశారు.. ఇలా అన్నింటా ‘పశ్చిమ’పై ఎనలేని ప్రేమను చూపించారు.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం పోటీపడి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.. అడుగడుగునా మహానేత గురుతులతో చెరగని సంతకమై నిలిచిపోయారు. మా గుండెల్లో గుడిసెల్లో.. కొలువుంటావు రాజన్నా.. సాయం సంధ్యా దీపంలో.. నిన్నే తలుచుకుంటాము రాజన్నా.. అంటూ జిల్లావాసులు స్మరించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మహానేత.. అందుకో మా జ్యోతఅంటూ పశ్చిమవాసులు నీరాజనాలు అర్పిస్తున్నారు.
సాక్షి, పశ్చిమగోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం తీర ప్రాంత అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తీర ప్రాంత ప్రజల సంక్షేమం విషయంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవను చూపించారు. ఆయన పరమపదించి 11 ఏళ్లు గడుస్తున్నా నిత్యం ఆయన స్మృతులను ఈ ప్రాంత ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. పట్టణంలో వైఎస్ పేరుపై పెద్దకాలనీ కూడా ఉంది. ఈ కాలనీ వాసులు చందాలు వేసుకుని వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో సునామీ ప్రళయంతో తీరంలో మృత్యుఘోష వినిపించింది. సునామీ బాధితులను ఆదుకోవడంలో ఆయన చొరవ చూపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సీతారామపురంలో లేసుపార్కును నిర్మించడంలో విశేషంగా కృషిచేశారు. లేసుపార్కునూ ఆయనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్కులో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
వశిష్ట వారధికి శ్రీకారం
ఉభయగోదావరి జిల్లావాసులకు కలగా ఉన్న వశిష్ట వంతెన నిర్మాణానికి వైఎస్సార్ జీఓ ఇచ్చి రూ.94 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం నిర్మాణ పనులు అటకెక్కగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వంతెన నిర్మాణానికి చొరవ చూపిస్తున్నారు. బియ్యపుతిప్ప మినీ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చిందంటే అదీ వైఎస్ చలువే. ఆయన మృతితో ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది. తండ్రి ఆశయ సాధనలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.450 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పేరుపాలెం బీచ్ అభివృద్ధికి తొలిసారిగా నిధులు మంజూరు చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌కు దక్కుతుంది.
ఆయన హయాంలో నియోజకవర్గంలో 4 వేల మందిపైగా పేదలు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించుకున్నారు. 2004 నాటికి నియోజకర్గంలో 200 మందికి అందే పింఛన్ల సంఖ్యను ఆయన 2 వేలకు పెంచారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.400 కోట్లకు పైగా నిధులు మంజూరుచేశారు. పలు రహదారులు, తాగునీటి ప్రాజెక్ట్‌లు, ఉప్పుటేరులపై వంతెనలు ఆయన హయాంలో నిర్మించినవే. నరసాపురంలో హౌసింగ్ బోర్డు కాలనీని ఆనుకుని ఇందిరమ్మ పథకంలో రూ.10 కోట్ల ఖర్చుతో 700 మందికి ఇళ్లు నిర్మించి అందించారు.
నగర బాటతో సంక్షేమ పరవళ్లు
నిడదవోలులో 2005లో రాజీవ్ నగరబాట కార్యక్రమంలో భాగంగా మహానేత వైఎస్సార్ పర్యటించారు. పట్టణానికి సుమారు రూ.కోటి నిధులను కేటాయించారు. వీటితో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలో సీపీఎఫ్ నిధులు సుమారు రూ.కోటితో నిర్మించిన సెంట్రల్ విద్యుత్ లైటింగ్‌ను, పట్టణంలో విద్యానగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. బాలాజీనగర్‌లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కేఎల్ సామర్థ్యం గల మంచినీటి రిజర్వాయర్‌కు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఎంవీ నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 28వ వార్డులో 832 మంది పేదలకు ఇళ్లను అందించారు.
మహానేత సేవలకు గుర్తుగా ఈ ప్రాంతవాసులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసి స్మరించుకుంటున్నారు. మాజీ కౌన్సిలర్ పొలదాసు శ్రీనివాస్ వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో సొంత నిధుతో రూ.2 లక్షలతో వైఎస్సార్ నగర్‌కు ముఖద్వారాన్ని నిర్మించారు. 2008లో వైఎస్సార్ హయాంలో రూ.70 లక్షలతో పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మున్సిపల్ కార్యాలయంగా కౌన్సిల్ నామకరణం చేసి ఏకగీవ్రంగా తీర్మానం చేసింది.
బాలికా విద్యకు ప్రాధాన్యం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెరవలి మండలంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా నడిపల్లిలో 53 మంది లబ్ధిదారులకు 1.78 ఎకరాలు, కడింపాడులో 48 మంది లబ్ధిదారులకు 1.50 ఎకరాలు, మల్లేశ్వరంలో 38 మంది లబ్ధిదారులకు 1.21 ఎకరాలు, అన్నవరప్పాడులో 123 మంది లబ్ధిదారులకు 3.71 ఎకరాలు, కాపవరంలో 88 మంది లబ్ధిదారులకు 2.95 ఎకరాలు, ఖండవల్లిలో 274 మంది లబ్ధిదారులకు 8.20 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు అందించారు. రాజీవ్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆయన కానూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అప్పటికప్పుడు రూ.46 లక్షలు నిధులు మంజూరు చేసి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.
కానూరు బీసీ బాలికల వసతి గృహం పరిశీలించి అప్పటికప్పుడు రూ.26 లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన ఘనత ఆయనదే. ముక్కామలలో ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారి నుంచి ముక్కామల వరకు రోడ్డు నిర్మాణానికి రూ.76 లక్షల నిధులు మంజూరు చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్న భయాన్ని పోగొట్టిన మహనీయులు ఆయన. రూ.136 కోట్లతో గోదావరి ఏటిగట్టును ఎత్తు పెంచడంతో పాటు పటిష్టం చేసి ఇక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మెట్టనింట ఆరోగ్య సిరులు
జిల్లాలోని మెట్ట ప్రాంతంపై మహానేత వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటుచేసి ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. చింతలపూడి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 2006 ఫిబ్రవరి 10న రూ.5 కోట్లతో పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. మెట్ట రైతుల కోరిక మేరకు 2008 అక్టోబర్‌లో రూ.1,701 కోట్లతో కామవరపుకోటలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం
2003 మే నెలలో పాదయాత్రలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్ మూడు రోజులు పర్యటించారు. 2006 ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రిగా చింతలపూడి విచ్చేసి ఇందిరమ్మ గ్రామ సభలో పాల్గొన్నారు. 2007 జూన్ 7న జంగారెడ్డిగూడెం వచ్చిన సందర్భంగా 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేసి అదే రోజు శంకుస్థాపన చేశారు. రూ.7.54 కోట్లతో ఆస్పత్రి భవనాలను నిర్మించారు. జంగారెడ్డిగూడెంలో పాలిటెక్నిక్ కాలేజీ, సబ్‌ట్రెజరీ కార్యాలయం ఆయన మంజూరు చేసినవే.
మదిలో మెదిలే నాయకుడు
మదిలో నిరంతరం మెదిలే నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆయన ఫొటో కన్పించినా, ఆయన చేసిన పనులు కన్పించినా ఆయన జ్ఞాపకాలు, ఆయనతో మాట్లాడిని మాటలు ఇట్టే గుర్తుకువస్తాయి అని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. మహానాయకుడి మాటా, బాటా, మర్యాద, మనస్ఫూర్తి నవ్వు మరవలేమని గుర్తుచేసుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉండి మండలంలోని 220 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో వైఎస్సార్‌ను కలిసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజారంజకమైన పాలనతో ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పీవీఎల్ అన్నారు.
మానస పుత్రిక ఉద్యాన వర్సిటీ
భవిష్య దార్శనికుడు, రైతుల పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతిపథం నుంచి సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఊపిరిపోసుకున్న జిల్లాలోని వెంకట్రామన్నగూడెంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ ఉద్యాన రైతుల పాలిట వరంగా మారింది. ఉద్యాన విద్య అభ్యసించే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పతరువుగా నిలుస్తోంది. రైతును రాజు చేసే క్రమంలో తక్కువ నీటితో వాణిజ్య విలువలు కలిగిన ఉద్యాన ఉత్పత్తులను పండించే స్థాయికి తీసుకెళ్లడానికి వైఎస్ సీఎంగా, ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అనంతర కాలంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. విద్య, పరిశోధన, విస్తరణ లక్ష్యాలుగా 216 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దేశంలో రెండవదిగా, దక్షిణ భారతదేశంలో మొదటి విశ్వవిద్యాలయంగా ఏర్పడింది.
వర్సిటీ 13 జిల్లాల్లో 20 పరిశోధనా స్థానాలు, నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ఏడు ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌లు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలతో ఉద్యాన రైతులకు సేవలను అందిస్తోంది. కొత్త వంగడాల సృష్టితో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు ద్వారా సారవంతమైన నారును రైతు లోకానికి అందిస్తోంది. విదేశీ సిరులు కురిపించే ఆర్కిడ్స్, రైతులకు లాభాలను పంచే క్యాప్సికం, కీరా దోస వంటి పంటలతో పాటు వాణిజ్య సిరులు అందించే పూల సాగులను ప్రోత్సహిస్తోంది. ఎండిన పూలకు వాణిజ్యపు హంగులు అద్దే ప్రాజెక్టు కార్యాచరణకు రాబోతుంది. ప్రధాని అవార్డు అందుకున్న వీఆర్ గూడెం కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు దేశంలో ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రాలుగా ఉద్యాన వర్సిటీ కేంద్రాలు అవార్డులు అందుకునే స్థాయికి ఎదగడం వెనుక వైఎస్సార్ ఆశయ స్ఫూర్తి దాగి ఉంది.
వెస్ట్ చాంపియన్ అని పిలిచేవారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ ప్రదాత అని మాజీ ఎమ్మెల్యే, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు అన్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ తనకు టికెట్ ఇచ్చారని, జిల్లాలో తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా గెలుపొందిన సమయంలో తనను ఎంతగానో మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. తాను ఎప్పుడు కలిసిన వెస్ట్‌గోదావరి చాంపియన్ అని పిలిచేవారన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను పీసీసీ అధ్యక్షుడి పదవిని చేపట్టానని, కాంగ్రెస్ అధిష్టానానికి ఆయనే స్వయంగా ప్రతిపాదించారన్నారు. వైఎస్సార్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్‌గా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశానన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు సంక్షేమ ఫలాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. మహానేత బాటలోనే సీఎం జగన్ పయనిస్తున్నారని జీఎస్ రావు అన్నారు.
ఆయన జ్ఞాపకాలు మరువలేం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన జ్ఞాపకాలు మరువలేమని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించేవారని, జిల్లాలో పాదయాత్ర జరిగినప్పుడు ఆయనతో కలిసి నడిచానని గుర్తు చేసుకున్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన హయాంలోనే గోపాలపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ఇందిరమ్మ కాలనీ పేరుతో వేలాది మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని అన్నారు. ద్వారకాతిరుమలలో బాలయోగి గురుకుల పాఠశాలను నిర్మించారన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు బుధవారం సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment