ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు ఆరోగ్య భద్రత కల్పించావు.. 108 వాహనాలతో అత్యవసర సేవలు అందుబాటులోకి తెచ్చావు.. రుణమాఫీతో రైతులను ఆదుకున్నావు.. ఉచిత విద్యుత్‌తో సాగుకు సాయం చేశావు.. జలయజ్ఞంతో సాగునీటి కొరత తీర్చావు.. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచావు.. మహానేతా నీవు మా నుంచిభౌతికంగా దూరమైనా నీ మేలు మరచిపోలేం.. మా మది నిండుగా నీ జ్ఞాపకాలే అంటూ జిల్లా వాసులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుంటున్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాకు ఆయన చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు.
సాక్షి, విజయనగరం: పేద వాడికి సుస్తీ చేస్తే బంగారం, ఇల్లు, భూమి తాకట్టు పెట్టి వైద్యం చేసుకునే పరిస్థితి ఉండేది. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చలించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ప్రతీ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించారు. కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు ఆరోగ్య కార్డుతో పైసా ఖర్చులేకుండా వైద్యం అందేది. పథకంతో ఎంతో మంది వైద్యసేవలు పొంది పునర్జన్మ పొందారు.
అపరసంజీవిని 108..
ఆరోగ్యశ్రీ లాగే వైఎస్సార్ అమలుచేసిన మరో గొప్పపథకం 108. రోడ్డు ప్రమాదాలు, పాముకాటుకు గురైన వారిని, అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారిని, గర్భిణులు, కడుపునొప్పి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చడంలో 108 వాహన సేవలు ఎనలేనివి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సేవలను మరింత విస్తృతం చేశారు. ఆధునిక వైద్య పరికరాలతో కూడిన కొత్తవాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ చేసిన 15, 20 నిమిషాల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 108 అంబులెన్సులు 36 ఉన్నాయి.
పల్లెముంగిటకే వైద్యం..
ఆస్పత్రులకు రాలేని వారికోసం పల్లె ముంగిటకు వైద్య సేవలు అందించడం కోసం 104 అనే మరో పథకాన్ని దివంగత ముఖ్యమంతి వైఎస్సార్ అమల్లోకి తెచ్చారు. రోజుకో గ్రామానికి ఉదయం 7 గంటలకే 104 వాహనం వెళ్తోంది. వాహన సిబ్బంది బీపీ, సుగర్, ఆస్తమా, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికొకటి చొప్పున 34 వాహనాలు ఉన్నాయి.
రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ..
2004కు ముందు తీవ్ర కరువు పరిస్థితులు. ఎటుచూసినా దుర్బిక్షమే. తినడానికి తిండిలేక రైతులు వలసబాట పట్టేవారు. వరుస కరువులతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. చాలా మంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితులను చూసిన వైఎస్సార్ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. అంతేకాదు.. రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇప్పించారు. దీంతో లక్షలాది మంది రైతులకు లబ్ధిచేకూరింది. రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకుని వైఎస్సార్ రైతు బాంధవుడిగా పేరుగాంచారు.
మహానేత మానసపుత్రిక పెద్దగెడ్డ
పాచిపెంట: పెద్దగెడ్డ జలాశయం నిర్మించక ముందు పశువులకు పచ్చగడ్డి కూడా కానరాని ప్రాంతమిది. వర్షాధారంతో మెట్టపైర్లు పండితే ఈ ప్రాంత రైతు కడుపునిండేది. లేదంటే అప్పులు చేసి లేదా అస్తులు అమ్ముకుని పిల్లాపాపలను పోషించుకోవాల్సిన దుస్థితి. వైఎస్సార్ దయతో కరువు ప్రాంతం కోనసీమగా మారింది. ఒడిశా కొండ ప్రాంతాల నుంచి జీవనదిగా ప్రవహించే వేగావతి నదిపై పాచిపెంట వద్ద ప్రతిపాదనలకే పరిమితమైన పెద్దగెడ్డ జలాశయ నిర్మాణానికి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు.
కొద్దిరోజుల్లోనే ప్రాజెక్టును పూర్తిచేయించారు. 2006 సెప్టెంబర్ 26న పెద్దగెడ్డ జలాశాయాన్ని రైతులకు అంకితం చేశారు. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో సుమారు 12వేల ఎకరాలకు సాగునీరు అందించారు. అప్పటివరకు బీడువారిని భూములు నేడు పచ్చని పంటలతో కనువిందు కలిగిస్తున్నాయి. రైతుల బతుకులను మార్చుతున్నాయి. జిల్లాలో మొదటి ప్రాజెక్టు కావడంతో పెద్దగెడ్డ వైఎస్సార్ మానస పుత్రికగా పేరుపొందింది.
మహనేత మరణంతో కలగా మారిన పర్యాటక శోభ
మహనేత రాజశేఖర్ రెడ్డి మరణంతో పర్యాటక శోభ ఎండమావిగా మారింది. అప్పట్లో పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో విశాఖపట్నం హార్బర్ సాంకేతిక నిపుణులతో ఇక్కడ బోటు షికారు సదుపాయాన్ని కల్పించారు. పెద్దగెడ్డ ప్రాజెక్టుకు అనుసరించి పార్కుకు కోసం సుమారు 10 ఎకరాలు కేటాయించారు. పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న దశలో ఆయన మరణంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడంతో మహానేత ఆశలు నెరవేరుతాయన్న ఆశ ఉంది. – సలాది అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, మాజీ సర్పంచ్ కోటికిపెంట
Comments
Please login to add a commentAdd a comment