‘రాజన్నా.. నిను మరువలేమన్నా’ | YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Kadapa | Sakshi
Sakshi News home page

‘రాజన్నా.. నిను మరువలేమన్నా’

Published Mon, Sep 2 2019 8:11 AM | Last Updated on Mon, Sep 2 2019 9:14 AM

YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Kadapa - Sakshi

జిల్లా ముద్దు బిడ్డ.. కడప ఖ్యాతిని దేశ వ్యాప్తంగా వెలిగేలా చేశారు. వైఎస్‌ పేరు కాదు బ్రాండ్‌.. అనే స్థాయికి ఎదిగారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. నిరుపేదల కష్టాలను అతి దగ్గర నుంచి చూసిన ఆయన.. వారి కుటుంబాల్లో చిరునవ్వులు పూయించారు. చెప్పింది చేయడమే కాదు.. చెప్పనిది చేసి చూపించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించారు. దేశం యావత్తు ఆశ్చర్యపోయేలా ఉమ్మడి రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) లో ప్రగతి పరుగులు పెట్టించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. సొంత జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశారు. కడప రూపురేఖలే మారిపోయాయి. పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. జన హృదయాల్లో నిలిచిపోయారు. ‘రాజన్నా.. నిను మరువలేమన్నా’... మా గుండెల్లోనే కొలువైనావన్నా.. అంటూ కీర్తిస్తున్నారు. ‘ప్రగతి పనుల్లో నీ రూపం కనిపిస్తోంది. సంక్షేమ పథకాల్లో నీ చిరునామా స్పురిస్తోంది’ అంటూ కొనియాడుతున్నారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

సాక్షి, వైవీయూ : కరువు సీమ నుంచి క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తే.. కడప గడప నుంచి సైతం పతకాలు వస్తాయన్న ఆలోచన.. వైఎస్‌ఆర్‌ రాష్ట్ర స్థాయి క్రీడాపాఠశాలకు పునాదిరాయి పడేలా చేసింది.. విశ్వవిద్యాలయ, ఉన్నత విద్యను జిల్లా ప్రజలకు అందించాలన్న సంకల్పం తత్వవేత్త యోగివేమన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీజం వేసింది. ఒకటా.. రెండా.. చెప్పుకుంటూ పోతే జిల్లా అంతటా వైఎస్‌ఆర్‌ తనదైన మార్కుతో అభివృద్ధికి బాటలు వేయగా.. నాడు నాటిన అభివృద్ధి బీజాలు నేడు ఫలాలను ఇస్తున్నాయి. ఉన్నత విద్యావంతుడైన వైఎస్‌ఆర్‌ హయాంలో  కడపలో విద్యాలయాలు ఏర్పాటు కాగా.. వేల మంది విద్యార్థులు ఈ సంస్థల్లో విద్యాభ్యాసన చేస్తున్నారు. 2006 డిసెంబర్‌ 30న ప్రాంతీయ క్రీడా పాఠశాల ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి పాఠశాలగా ఉన్నతీకరణ చెందింది.

వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ మైదానం
కడప నగరంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మైదానం ఏర్పాటయ్యేందుకు వైఎస్‌ఆర్‌ చూపిన చొరవ అనిర్వచనీయం. స్వయానా రూ.50 లక్షల సొంత నిధులను వెచ్చించారు. దీంతోపాటు ఎకరా రూ.వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో కడపలో మైదానం ఏర్పాటు చేసేందుకు ఏసీఏ ముందుకు రావడంతోపాటు వైఎస్‌ఆర్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పేరు మీదుగా వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ మైదానం ఏర్పాటైంది.

కేంద్రీయ విద్యాలయం
సెంట్రల్‌ సిలబస్‌ కోరుకునే విద్యార్థుల కోసం వైఎస్‌ఆర్‌ కృషితో కడప నగరంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను కడప నగరానికి తీసుకువచ్చారు.

మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధి
కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధికి కోటిరెడ్డి, రామసుబ్బమ్మ తర్వాత అంత స్థాయిలో వైఎస్‌ఆర్‌ కృషి చేశారు.

వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం
కడపలోని డీఎస్‌ఏ ఆవరణలో రూ.5.1 కోట్లతో వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. 2009 జనవరి 24న వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మైదానం నేడు ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులకు నెలవుగా మారింది. 

‘వేమన’తో విశ్వ ఖ్యాతి
కరువుసీమలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న తలంపుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతని చాటిచెబుతోంది.  2006 మార్చి 9న పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 28 కోర్సులతో విలసిల్లుతోంది. 1500 మందికి పైగా విద్యార్థులు 113 మంది అధ్యాపక బృందం, 100 మంది పైగా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్‌ 20న తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగరానికి సమీపంలో పీజీ సెంటర్‌ ఏర్పాటు చేసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారింది.  అనంతరం 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్‌ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు.

కొత్త కలెక్టరేట్‌తో సహా మరెన్నో..
రాజధాని ప్రాంతంలోని సచివాలయానఇన తలపించేలా .. కడపలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌.. నగరానికే తలమానికంగా నిలుస్తోంది. కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి వైఎస్‌ఆర్‌ పూనుకోగా.. నేడు అందుబాటులోకి రావడంతో సరికొత్త అందం చేకూరింది. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం, వైఎస్‌ఆర్‌ ఆడిటోరియం, ఉప రవాణా కార్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్, శిల్పారామం ఏర్పాటు చేశారు.

పశువైద్య కళాశాల
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు యోగివేమన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ స్థాపించారు. దీంతో ఇంజనీరింగ్‌ కళాశాలకు కూడా వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆఫ్‌ యోగివేమన యూనివర్సిటీగా నామకరణం చేశారు. ప్రొద్దుటూరులోని ఏరియా ఆస్పత్రిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. కడపలోని జిల్లా ఆస్పత్రి స్థానంలో రిమ్స్‌ ఏర్పాటు చేయడంతో ఇక్కడ జిల్లా ఆస్పత్రిని నిర్మించారు.

రిమ్స్‌.. సూపర్‌
కడప అర్బన్‌ : కడప నగర శివారులో ‘రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ (రిమ్స్‌)కు 2005లో 230 ఎకరాల విస్తీర్ణంలో శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజలకు వైద్య ప్రదాయినిని అందించేందుకు శ్రీకారం చుట్టారు.  రూ. 150 కోట్ల నిధులు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతంగా  పూర్తి చేయించారు. 2007 సెప్టెంబర్‌ 5న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చేతుల మీదుగా ‘రిమ్స్‌’ భవనాలను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు శంకుస్థాపన చేయించారు. అదే క్రమంలోనే నర్సింగ్‌ కళాశాలను ప్రారంభింప చేశారు. ప్రభుత్వ దంతవైద్య కళాశాలను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మింప చేసి 2009 జనవరి 24న భవనాలను ప్రారంభించారు. ప్రస్తుతం రిమ్స్‌ ప్రజలకు సూపర్‌గా సేవలందిస్తోంది.

కడపకు సొబగులు 
కడప కార్పొరేషన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప గడపను  వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధికి చిరునామాగా మార్చారు.  మున్సిపాలిటీగా ఉన్న కడప పట్టణాన్ని నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేశారు.   ఇరుకుగా ఉన్న అన్ని రోడ్లను  విస్తరింపజేసి, డివైడర్లు, పచ్చని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని సుందరంగా మార్చారు. బుగ్గవంక సుందరీకరణ పేరుతో బుగ్గవంక చుట్టూ ప్రహరీ నిర్మించి హైలెవెల్‌ వంతెనలు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మించారు. కడప చుట్టూ రింగు రోడ్డు నిర్మించారు. కడప విమాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమించారు. 

ఆర్టీపీపీకి వెలుగులు

ఎర్రగుంట్ల: మండలంలోని ఆర్టీపీపీకి వెలుగుకు నింపిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి దక్కుతుంది. సుమారు రూ.140 కోట్లతో బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆర్టీపీపీకి 68 కిలో మీటర్ల పొడవున పైపులైన్‌ వేశారు. ఇప్పుడు ఆర్టీపీపీ కాంతులను వెదజల్లుతుంది. యూనిట్ల సామర్థ్యం కూడా పెంచారు. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తుండటంతోనే 600 మెగావాట్ల 6వ యూనిట్‌ ప్రస్తుతం దిగ్విజయంగా నడుస్తోంది.

పశుపరిశోధన కేంద్రం
పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, ఫుడ్‌ అండ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల నెలకొల్పారు. పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు. పీఎంఈవై, పశుక్రాంతి కింద విరివిగా పాడి పశువులను రాయితీతో ఇవ్వడంతో జిల్లాలోనే పులివెందులలో అత్యధికంగా పాల సేకరణ జరిగింది. అదే విధంగా పాడి పశువులకు వచ్చే జబ్బుల నివారణకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పారు. ఈ ఆసుపత్రిలో పాడి పశువులలో వచ్చే ప్రాణాంతక జబ్బులను నివారించేందుకు అందుబాటులోకి అధునాతన వైద్య చికిత్సలు తెచ్చారు. అదే విధంగా 654 ఎకరాలలో రూ.350 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నత స్థాయి పశుపరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

కరువు నేలలో ఉద్యాన కళాశాల
రైల్వేకోడూరు : మండలంలోని అనంతరాజుపేటలో దివంగత  ముఖ్యమంత్రి వైఎస్సార్‌ 15 కోట్ల రూపాయలతో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేశారు. 2007 జూన్‌ 26న ప్రారంభమైంది. రాయలసీమ ప్రాంతంలో ఏకైక ఉద్యాన కళాశాలగా పేరుగాంచింది. రైతన్నలకు సేవ చేయడానికి సరికొత్త వంగడాలు, వ్యవసాయంలో నూతన  వరవడులు తొక్కించడానికి ఎందరో యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి వస్తున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ కేవలం వ్యవసాయం పైనే ఆధారపడే ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేయడానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తలచి పరిశోధనా స్థానానికి అనుసంధానంగా ఆ ప్రాంగణంలోనే ఉద్యాన కళాశాల ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ ఎస్సీ హార్టికల్చర్‌ ప్రధాన కోర్సు, దానితోపాటు ఎమ్మెస్సీ, ఫ్రూట్‌సైన్స్, వెజిటేబుల్‌ సైన్స్, ఫ్టోరీ కల్చర్, స్పైసెస్, మెడీషియన్‌ ప్లాంటేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉద్యోగ అవకాశాలు
ఇక్కడ నాలుగేళ్ల  కోర్సును పూర్తి చేసుకున్న ఎందరో విద్యార్థులు ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రాష్ట్ర సర్వీసులు, పలు ప్రైవేటు విత్తన, ఎరువులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంకుల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ట్రిపుల్‌ ఐటీ
వేంపల్లె : విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కడం లేదన్న అభిప్రాయంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇడుపులపాయలో 2008లో ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పారు. ఇక్కడ జిల్లాతోపాటు రాయలసీమలోని విద్యార్థులు చదువుకుంటున్నారు.

అపర భగీరథుడు
చాపాడు:  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టి అపర భగీరథుడిగా నిలిచారు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు శాశ్వత సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్సార్‌–1, ఎస్సార్‌–2, బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులతో మైదుకూరుతోపాటు బద్వేలు నియోజకవర్గ ప్రాంతాలకు సాగునీటి లబ్ధి కలిగింది.

వెలిగల్లు ప్రాజెక్టు
రాయచోటి: కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. కడప–అనంతపురం జిల్లాలో సరిహద్దులో నత్తనడకన నిర్మితమవుతున్న వెలిగల్లు ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయించారు. రాష్ట్రంలోనే తొలి జలయజ్ఞం ప్రాజెక్టుగా పూర్తి చేసి 2009లో వైఎస్‌ఆర్‌ తన చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. చిత్తూరు–కడప జిల్లాల సరిహద్దులో ఝరికోన ప్రాజెక్టును నిర్మించి దశాబ్దాల రైతుల ఆశలను నెరవేర్చారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా చిన్నమండెం మండలంలోని దేవగుడిపల్లె సమీపంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో శ్రీనివాసపురం రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 

సర్వరాయసాగర్‌
వల్లూరు : గాలేరు –నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌ ప్రాజెక్ట్‌ను కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలో నిర్మించడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించారు. ఈ ప్రాజెక్ట్‌ పనులు వైఎస్‌ సీఎంగా ఉండగా పరుగులు తీశాయి. 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. మహానేత మరణంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. తరువాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం  వహించాయి.

పులివెందుల : గండికోట, పైడిపాలెం ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు.  పైడిపాలెం ప్రాజెక్ట్‌కు రూ.690 కోట్లు ఖర్చు చేయగా.. అనంతరం వచ్చిన పాలకులు కేవలం రూ.30 కోట్లు ఖర్చు చేసి ప్రారంభించారు. కృష్ణా జలాలు పులివెందుల ప్రాంతానికి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ ఆధునికీకరణ(కాలువలకు లైనింగ్‌) ఏర్పాటు, సూక్ష్మ నీటి కేంద్రం కింద సింహాద్రిపురం మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేయడం జరిగింది. పైడిపాలెం నుంచి చిత్రావతి, హిమకుంట్ల, తొండూరు చెరువులకు నీరు అందించడానికి పనులు ప్రారంభించారు. హిమకుంట్ల చెరువును పీబీసీ కాలువలోకి లిఫ్ట్‌ ద్వారా ఆయకట్టుకు నీరు అందించేలా పనులు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement