ఆదర్శ పాఠశాలలు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నాయి... విద్యార్థుల ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్నాయి...కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా సౌకర్యాలు ఉన్నాయి... సుందరమైన భవనాలు, విశాలమైన ఆటస్థలాలు సొంతం... ఆధునిక వసతి గృహాలు అదనపు సౌకర్యం.. అన్ని సదుపాయాలు ఉచితం...ఇదే విద్య, సౌకర్యాలను ప్రైవేటు విద్యా సంస్థల్లో పొందాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి.. ఇంకెందుకు ఆలస్యం మోడల్ స్కూళ్లలో చేరి.. డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు ఉత్తమ విద్యను అందుకోండి.
ప్రత్యేకతలు
• విశాలమైన తరగతి గదులు, ఆటస్థలంతోపాటు గ్రంథాలయ సౌకర్యం
• ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉంటుంది.
• అర్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో బోధన
• చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
• ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
• మల్టీమీడియం, హెల్త్‌కేర్, బ్యూటీ కేర్ బ్యాంకింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు పలు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
• ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
సాక్షి, కడప ఎడ్యుకేషన్ : గ్రామీణ పిల్లలకు సైతం ఆంగ్ల మాధ్యమం, కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజం వేశారు. 2012కు కార్యరూపం దాల్చింది. 2013 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బోధన అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదివే వారికి ఉచిత భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆరవ తరగతిలో చేరిన విద్యార్థి ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చు.
అత్యాధునిక వసతులు
మోడల్ స్కూల్స్ భవనాలను ఆధునిక వసతులతో, కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పారు. అత్యాధునిక ల్యాబ్స్, రీడింగ్ క్లాస్ కోసం కుర్చీలు, టేబుళ్లు, లైట్లు, ఫ్యాన్లు తదితరాలు ఏర్పాటు చేశారు. స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యాలు బాగున్నాయి.
ప్రవేశం ఇలా..
ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే సౌకర్యం ఉంది. ఇందులో ఏటా 6వ తరగతి, ఇంటర్మీ డియెట్‌కు ప్రవేశాలు కల్పిస్తారు. 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లను కూడా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. 6వ తరగతిలో చేరే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులకు 100కు 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 100కు 35 మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు. ఇందులో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రతి ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయి.
సీట్ల రిజర్వేషన్లు
6వ తరగతికి సంబంధించి మొత్తంగా 80 సీట్లు ఉంటాయి. ఇందులో 26 సీట్లు ఓసీ జనరల్, 13 సీట్లు బాలికలకు, 8 ఎస్సీ జనరల్, 4 సీట్లు ఎస్సీ బాలికలకు, 3 సీట్లు ఎస్టీ జనరల్, 2 సీట్లు ఎస్టీ బాలికలకు, బీసీఈ ఒకటి, మిగతా 23 సీట్లు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇంటర్‌కు సంబంధించి 80 సీట్ల చొప్పున ప్రతి పాఠశాలలో ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులకు 20 సీట్ల చొప్పున ఉంటాయి.
ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు
జిల్లా వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి పట్టే సమయాన్ని బట్టి.. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇందులో 6వ తరగతి, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ముమ్మరంగా నమోదు అవుతున్నాయి.
ఆంగ్ల మాధ్యమంలో..
ఎటువంటి ఫీజులు లేకుండా 6 నుంచి ఇంటర్ వరకు ఆంగ్లమాధ్యమంతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. 9 నుంచి ఇంటర్ వరకు బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ వారు మాత్రం పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
యూనిఫాం, పుస్తకాలు
6, 7, 8వ తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా ఇస్తారు. 6 నుంచి ఇంటర్ వరకు పుస్తకాలను ఉచి తంగా అందజేస్తారు. హాస్టల్‌లో లేని విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇస్తున్నారు.
ఆధునిక ల్యాబ్స్
సైన్స్ ప్రయోగశాల (ల్యాబ్)లతోపాటు ప్రయోగాత్మకంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో దోహద పడతాయి. ప్రతి పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పది మోడల్ స్కూల్స్‌కు గాను తొమ్మిదింటికి మంజూరు కాగా.. సంబేపల్లెలో మాత్రం సొంత భవనం లేకపోవడంతో మంజూరు కాలేదు. ఈ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్, టెలిస్కోప్, రోబోటింగ్ పరికరాలతోపాటు నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడే ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించి విద్యార్థులు నూతన ఆవిష్కరణలను రూపొందించే అవకాశం ఉంది.
కార్పొరేట్, ప్రైవేటులో..
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో భారీగా ఫీజులు, అంతంత మాత్రంగానే మౌలిక వసతులు ఉంటాయి. వేలకు వేలు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇక హాస్టల్ సౌకర్యం కావాలంటే భారీగా డబ్బులు వెచ్చించాల్సిందే. ఇరుకైన తరగతి గదులు, వీటితోపాటు ప్రతిభావంతులకు బోధన ఒకలా.. ప్రతిభ లేని వారికి మరోలా ఉంటుంది. సరైన ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ వసతులు ఉండవు. వీటన్నింటి కంటే ఆటపాటలు అసలుండవు. నిత్యం ఒత్తిడితో కూడిన బోధనలు. వీటన్నింటి మధ్య విద్యార్థులు నలిగిపోతూ నిత్యం మానసిక ఒత్తిడితో కూడిన చదువులు సాగించాల్సిన పరిస్థితి. విద్యార్థుల్లో మనోవికాసం తగ్గి ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్న విషయాలకు కూడా ఆందోళన చెంది.. మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సంబంధిత విషయాల్లో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.
జిల్లాలో..
జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఖాజీపేట, కాశినాయన, వల్లూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, చిన్నమండెం, పుల్లంపేట, పెనగలూరు, సంబేపల్లె మండలాల్లో ఉన్నాయి. వీటిలో సంబేపల్లె పాఠశాలకు మాత్రం సొంత భవనం లేదు. స్థల సేకరణ సమస్య తలెత్తడంతో జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నారు. మిగతా 9 పాఠశాలకు సొంత పాఠశాల
భవనాలతోపాటు వసతి గృహాలు ఉన్నాయి.
బోధన బాగుంది
మోడల్ స్కూల్‌లో బోధన చాలా బాగుంది. ప్రణాళిక ప్రకారం చదివించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారు. ఆటలు ఆడిపిస్తారు. దీంతో చదువుతోపాటు ఆటలపైన కూడా పట్టు దొరుకుతుంది. – తస్‌నీమ్ ఫర్‌దీస్, 9వ తరగతి, వల్లూరు
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు
ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారు. చదువుతోపాటు నిత్యం పరీక్షలు నిర్వహిస్తారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో చాలా ఉత్సాహంగా చదవాలనిస్తుంది.
– రయ్యన్ అహమ్మద్, 7వ తరగతి, వల్లూరు
పదిలో పదికి పది పాయింట్లు
గతేడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాను. విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్టడీ అవర్స్ నిర్వహించి బాగా చదివిస్తారు. నిత్యం పరీక్షలు నిర్వహించి.. మార్కులు తక్కువ వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
– లిఖిత, పదో తరగతి పూర్వపు విద్యార్థిని, వల్లూరు
పేదలకు వరం
మోడల్ స్కూల్స్ పేద విద్యార్థులకు వరం. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుంది. ఆటలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వంటి వాటిలో ప్రవేశం కల్పిస్తారు. దీంతో విద్యార్థులు
ఉల్లాసంగా చదువుకుంటారు.
– దిలీప్‌కుమార్, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, వల్లూరు
సీబీఎస్‌ఈ సిలబస్ పెట్టాలి
మోడల్ స్కూళ్లు అంగ్ల మాధ్యమంలో నడుస్తున్నాయి. దీంతోపాటు సీబీఎస్‌ఈ సిలబ స్ ప్రవేశపెడితే బాగుంటుంది. చాలా మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అన్ని మోడల్ స్కూళ్లలో మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి సీబీఎస్‌ఈ పెడితే బా గుంటుంది.
– సురేష్‌బాబు, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, ఖాజీపేట
నెలాఖరు వరకు అడ్మిషన్లు
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్ స్కూల్స్‌లో ప్రస్తుతం 6, ఇంటర్మీడియట్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. పక్కాగా మెరిట్ ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేస్తున్నాం. ఈ నెలాఖరుకు సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తి అవుతుంది.
– ఉష, అసిస్టెంట్ డైరెక్టర్, మోడల్ స్కూల్స్
అన్ని సౌకర్యాలు
మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. కార్పొరేట్‌కు దీటుగా బోధన ఉంటుంది. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవల ఒక్కొక్క పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. దీంతో విద్యార్థులు నూతన పరిశోధనలు చేసుకునేందుకు అవకాశం ఉంది.
– పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి, కడప
Comments
Please login to add a commentAdd a comment