వసుధైక కుటుంబం!
సాక్షి ప్రతినిధి, కడప: వృత్తిరీత్యా కొందరు, వ్యాపార రీత్యా మరికొందరు వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. క్రిస్‌మస్ పండుగ వారందర్నీ ఒకే వేదికకు చేర్చింది. పసిబిడ్డల నుంచి 90 ఏళ్లు పైబడ్డ వృద్ధుల వరకూ ఓకే మందిరంలోకి చేరారు. సంయుక్తంగా ప్రార్థనలు చేశారు. ఒకర్ని మరొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. అటు తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. వైఎస్ కుటుంబసభ్యులతో బుధవారం ఇడుపులపాయ కళకళలాడింది.క్రిస్‌మస్ పండుగ వచ్చిందంటే ఎక్కడెక్కడో స్థిరపడ్డ ‘వైఎస్’ కుటుంబసభ్యులు ఇడుపులపాయకు చేరుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో స్థిరపడిన వైఎస్ కుటుంబ సభ్యులంతా బుధవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు.
సంయుక్త ప్రార్థనలలో నాలుగు తరాలు.. : ఇడుపులపాయ ప్రత్యేక ప్రార్థన మందిరంలో వైఎస్ కుటుంబానికి చెందిన నాలుగు తరాల కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజారెడ్డి సోదర సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు, వైఎస్‌రాజశేఖరరెడ్డి సోదర సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, ఇప్పటి తరం చిన్నారులైన రాజారెడ్డి సహచరులు అంతా ప్రత్యేక ప్రార్థనలలో నిమగ్నమయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలను ఆరగించారు. మొదటి తరం కుటుంబ సభ్యులనుంచి భవిష్యత్ తరం సభ్యుల వరకు దివంగత ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతి పేరు పేరునా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
నాగభూషణం కుటుంబానికి పరామర్శ:
చక్రాయపేట మండల వైఎస్‌ఆర్‌సీపీ యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం దేవరగుట్టపల్లె గ్రామానికి వెళ్లి వెంకటసుబ్బయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌రెడ్డిని చూడగానే మృతుడు నాగభూషణం సతీమణి ఈశ్వరమ్మ, తల్లి రెడ్డమ్మ బోరున విలపించారు. అధైర్యపడొద్దని కుటుంబానికి అండగా ఉంటామని వారిని ఓదార్చారు.
ప్రజలతో మమేకం :
హైదరాబాద్ నుంచి ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎర్రగుంట్లలో దిగి ఇడుపులపాయకు చేరుకున్నారు. మహానేత వైఎస్‌ఆర్ సమాధి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ఇడుపులపాయలోని అతిథి గృహంలో ప్రజలతో మమేకమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన జనం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో అధికార పక్షంపై ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించారని కొనియాడుతూ అభినందించారు.
జగన్‌ను కలిసిన పలువురు నేతలు : ఇడుపులపాయలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం పలువురు నేతలు కలిశారు. ముందుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి, కర్నూలు జిల్లా బనగానపల్లె వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి చిన్నాన్న పి.ద్వారకనాథరెడ్డి తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. వీరేకాకుండా వివిధ జిల్లాలనుంచి మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు వచ్చి వైఎస్ జగన్ కలవడంతోపాటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇడుపులపాయలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిలమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్ సోదరులు వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి కుమారులు అనిల్‌కుమార్‌రెడ్డి, సునీల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి, సతీమణి పద్మావతమ్మ, వైఎస్ జోసఫ్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి, ైడాక్టర్ సత్యానందరెడ్డి, థామస్‌రెడ్డి, వెఎస్ సోదరి విమలమ్మ కుమారుడు యువరాజారెడ్డిలతోపాటు వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్ లక్షుమ్మ, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమత, డాక్టర్ ఇసీ గంగిరెడ్డి సతీమణి సుగుణమ్మ, తదితరులతోపాటు వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, వేడుకలలో పాల్గొన్నారు.