పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా పూర్వపు కడప జిల్లా దర్శనమిచ్చేది. ముఖ్యమంత్రులు రాజకీయ వివక్షతో అభివృద్ధిని విస్మరించారు. మరోమారు అలాంటి వివక్షత కన్పిస్తోంది. పెండింగ్ పథకాలు పూర్తి చేయాలనే సంకల్పం పాలకుల్లో కన్పించడం లేదు. 90 శాతం పూర్తయిన పనులు కూడా ఐదేళ్లుగా దిష్టిబొమ్మల్లా మిగిలాయి. చంద్రబాబు సర్కారు కూడా వీటి పూర్తికి ఆసక్తి చూపడంలేదు. వివక్ష విడనాడి అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా వాసుల వాంఛ.
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు తీసింది. విద్య, వైద్య, పారిశ్రామికంగా,మౌళిక సదుపాయాలు కల్పనలో ఆయన ప్రత్యేక చొరవ చూపారు. పథకాలు తుదిదశకు చేరుతున్నాయన్న తరుణంలో ఆయన అమరుడయ్యారు. ఆ వారసత్వంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఒక్కొక్కటిగా పథకాలు మరుగున పడ్డాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సైతం అదే వైఖరితో జిల్లా పట్ల వివక్ష చూపుతోంది.
బోర్డులకే పరిమితమైన పారిశ్రామిక వాడ...
పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన పారిశ్రామికవాడ బోర్డులకే పరిమితమైంది. కడప సమీపంలోని చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లో 6,464.5 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించారు. ఈ పారిశ్రామిక వాడకు సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా నీటి పథకం ప్రభుత్వం ప్రణాళిక రచించింది. బీడీఎల్(భారత్ డైనమిక్ లిమిటెడ్), డిఫెన్స్ రీసెర్చ్ డెవెలప్‌మెంట్ ల్యాబ్ (డిఆర్‌డిఓ)లాంటి ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు వచ్చినా పాలకపక్షం ఆదరణ లేక తరలివెళ్లాయి. మరికొన్ని ఫార్మాకంపెనీలు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందకొచ్చాయి. అయితే నీటి సౌకర్యం లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నాయి.
జిఓఎంకే పరిమితమైన ఉక్కు పరిశ్రమ...
రాష్ట్ర విభజన బిల్లులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎంతో అవసరం. నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉక్కు పరిశ్రమ స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జమ్మలమడుగు సమీపంలో ‘బ్రహ్మణీ స్టీల్స్’ను 20 వేల కోట్ల రూపాయల అంచానా వ్యయంతో చేపట్టారు.
దాదాపు రూ. 1250 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. అనంతర ఏర్పడ్డ రాజకీయ వివక్షత కారణంగా బ్రహ్మణీ స్టీల్స్‌ను ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనికి కేటాయించిన భూములతో పాటు నీటి కేటాయింపుల జీవోను కూడా రద్దు చేసింది. ఆస్థానంలో ఉక్కు పరిశ్రమ చేపట్టాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బ్రహ్మణీ స్థానంలో సెయిల్ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
నిధుల కోసం ఎదురుచూపుల...
జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా గండికోట ప్రాజెక్టును 28టీఎంసీలతో రూపలకల్పన చేశారు. వరద నీటిని అంచనా కట్టి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30 రోజుల్లో నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా వరద కాలువను పూర్తి చేశారు. అవుకు ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రూపొందించిన ఈకాలువ ద్వారా గండికోట ప్రాజెక్టు వద్ద 5 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం(టన్నెల్) సైతం పూర్తి చేశారు. తుదిదశకు చేరిన ఈ ప్రాజెక్టు నిధుల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసినా ముంపు పునరావాసం పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. దాంతో ఇప్పటికీ ముంపువాసులు గ్రామాలు ఖాళీ చేయలేదు. ఈకారణంగా శ్రీశైలం నుంచి వరదనీటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. గండికోట, మైలవరం, వామికొండ, సర్వాయసాగర్, పైడిపాళెం, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు నిల్వచేసుకునే అవకాశం ఉన్నా ఫలితంలేకపోయింది.
విమానాశ్రయం పెండింగ్....
కడప గడపలో 1953 నుంచి విమానాశ్రయం ఉన్నప్పటికీ విమానాల రాకపోకలు మాత్రం లేవు. దాంతో అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఇందుకోసం 33 కోట్ల రూపాయల నిధులను ఒకే విడతగా విడుదల చేశారు.
రెండు విడతల్లో ఏయిర్‌పోర్టు నిర్మాణ పనులను చేపట్టారు. 2009 డిసెంబర్ నాటికి మొదటి విడత పనులను పూర్తి చేశారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. 13 కోట్ల రూపాయలతో మిగిలిన పనులు దాదాపు రెండు ఏళ్ల క్రితమే పూర్తి అయ్యాయి. అయినప్పటికీ ప్రారంభోత్సవానికి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ బిల్డింగ్ సైతం ఎదుర్కోంటుంది. భవనాలు మూడేళ్ల క్రితమే పూర్తి అయినా అందుబాటులోకి తీసుకరాలేదు.
బాబూ.. వినవా! వివక్ష మానవా!!
Published Fri, Feb 27 2015 2:09 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement