ఆదిలాబాద్ రూరల్: జిల్లాలో చలి తీవ్రత ఇలాగే ఉంటే ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్ని దుప్పట్లు పంపిణీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. జిల్లాలో చలి రికార్డు స్థాయిలో నమోదవుతున్న దృష్ట్యా ఆదివారం రాత్రి ఆయన ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ కొలాం ఆశ్రమోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాలను తనిఖీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి నుంచి ఎదురవుతున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కొన్ని రోజులుగా చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని, ప్రస్తుతం ఉన్న దుప్పట్లతో నిద్ర కూడా పట్టడం లేదని కొలాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చలి ఇదే విధంగా కొనసాగితే నాణ్యమైన ఉన్ని దుప్పట్లు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు. హాస్టళ్లకు జనవరి ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వసతిగృహాల్లో కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోతే వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో కొనసాగుతున్న అక్రమ డెప్యూటేషన్లపై వస్తున్న ఆరోపణలపై మంత్రిని సంప్రదించగా.. అక్రమ డెప్యూటేషన్లు ఉంటే విచారణ చేపట్టి రద్దు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి దురుదాస్‌కు రేచీకటి ఉండడంతో చికిత్స నిమిత్తం ఉన్నత ఆస్పత్రికి తరలించాలని సంబంధిత హెచ్‌ఎం, ఏటీడబ్ల్యూఓలను మంత్రి ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖాధికారి అంకం శంకర్, ఏటీడబ్ల్యూఓ సంధ్యారాణి, హెచ్‌ఎం భోజన్న, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
చలి ఇలాగే ఉంటే..విద్యార్థులకు ఉన్ని దుప్పట్లు
Published Mon, Dec 22 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement