=వసతిగృహాల్లో నిఘా దగా
=సక్రమంగా ఆహారం అందించని వైనం
=అనారోగ్యం బారిన విద్యార్థులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచి బాలలు అనారోగ్యం పాలవుతున్నారు. పేదవర్గాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు వసతి గృహాల్లో చేరితే వారికి చాలీచాలని ఆహారం పెట్టి చేతులు దులుపుకొంటున్నారు.
గుడ్లవల్లేరు మండలం అంగలూరు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక బాలికల వసతి గృహంలో మూడు రోజులుగా పిల్లలకు సక్రమంగా ఆహారం పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 151 వసతి గృహాలున్నాయి. వీటిలో 84 బాలురు, 67 బాలికల హాస్టళ్లున్నాయి. 15,100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4797 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇవికాకుండా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలు నడుపుతున్నారు.
పర్యవేక్షణ లోపం..
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉడికీ ఉడకని అన్నమే తినాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రెండుసార్లైనా ఆయా డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న ఏఎస్‌డబ్ల్యూవోలు ప్రతి హాస్టల్‌ను సందర్శించి బాలలకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించాల్సి ఉంది. హాస్టల్‌లో వండి పెడుతున్న ఆహారంపై వార్డెన్ల పర్యవేక్షణ కొరవడింది. ప్రతి నెలా రెండుసార్లు కుక్, వార్డెన్లు, ఏఎస్‌డబ్ల్యూవోలకు సమావేశం నిర్వహించి మెనూ ప్రకారం బాలలకు ఆహారం వండిపెట్టాలని అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు.
వసతి గృహంలోని వంటశాలలో ఏం జరుగుతుందో తెలుసుకునే చొరవను వార్డెన్లు చూపకపోవడంతో కుక్‌లు ఇష్టారాజ్యంగా వంట పనులు చేస్తున్నారు. అంగలూరు సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో మూడు రోజులుగా ఆహారం సక్రమంగా పెట్టకున్నా అటు వార్డెన్ గాని, ఏఎస్‌డబ్ల్యూవోగాని పట్టించుకోనే లేదు. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో మచిలీపట్నం వలందపాలెంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించిన సమయంలో వార్డెన్ హాస్టల్‌లో లేనేలేరు.
ఉన్న ఇద్దరు కుక్‌లు పప్పు, చారు వండుతున్నారు. ఎంత మంది పిల్లలు ఉన్నారో వారికి ఎంత మేర ఆహారం వండాలో తెలియకుండానే ఇక్కడ వంట పూర్తి చేస్తుండటం గమనార్హం. మాచవరం మెట్టు సమీపంలో ఉన్న బాలుర కళాశాల వసతి గృహంలో ఎండిపోయిన బీరకాయలు, గోంగూర, దోసకాయలు దర్శనమిచ్చాయి. వీటినే వసతి గృహంలోని విద్యార్థులకు కూరలుగా వండి పెట్టడం గమనార్హం. వసతి గృహాల్లో తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వసతి గృహాల ప్రాంగణంలోకి వర్షపునీరు నిల్వ ఉన్నా వాటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయలేదు. వసతి గృహాల్లో విద్యార్థుల బాగోగులను పట్టించుకునేందుకు ఆత్మీయ అధికారులను ఏర్పాటు చేసినా వారు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి.
చర్యలు తప్పవు
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం బాలలకు ఆహారం అందించని వారిపై ఇక నుంచి నిఘా ఉంచుతామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు తెలిపారు. అంగలూరు సంఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏఎస్‌డబ్ల్యూవో పైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వసతి గృహాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.