కడప రూరల్/వైవీయూ న్యూస్‌లైన్: ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సరైన వసతిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రభుత్వ వసతి గృహాలు ఎటువంటి సౌకర్యాలు లేని ప్రైవేట్ అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతో పాటు టాయిలెట్‌ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. భవనాలకు కిటికీలు లేక, ఆరుబయటే స్నానాలు చేస్తూ చలికాలంలో అవస్థలు పడుతున్నారు. మెనూ సక్రమంగా అమలుకాక బక్కచిక్కి పోతున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 147 హాస్టళ్లు ఉండగా 113 ప్రభుత్వ భవనాల్లో, 34 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో 10వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 11 ప్రభుత్వ, ఒకటి అద్దెభవనంలో కొనసాగుతున్నాయి. వీటిలో 1805 మంది విద్యార్థులు ఉంటున్నారు.
బీసీ సంక్షేమశాఖ పరిధిలో 38 ప్రభుత్వ, 22 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక్కడ 5375 మంది విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 219 హాస్టళ్లకు గాను 122 ప్రభుత్వ, 57 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల్లో నడిచే 122 హాస్టళ్లలో దాదాపు 70 శాతానికి పైగా సమస్యలతోకొట్టుమిట్టాడుతున్నాయి. శిథిలమైన భవనాలు, గదులకు కిటికీలు, తలుపులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 90 శాతం పైగా వసతి గృహాల్లో మరుగుదొడ్ల సౌకర్యం సౌకర్యవంతంగా లేదు. అద్దెభవనాల్లో వసతిపరిస్థితి దారుణంగా ఉంది. ఇరుకైన గదులు, అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో వసతి గృహాలు చేపట్టడానికి ఏడాది క్రితం ప్రభుత్వం ప్రణాళికలు పంపమని కోరింది.
ఆయా శాఖల జిల్లా అధికారులు నివేదికలు పంపినప్పటికీ వాటికి మోక్షం లభించడం లేదు. దాదాపుగా 70 శాతం హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కానందున 50 శాతం పైగా విద్యార్థులు బక్కచిక్కిపోతున్నారు. కొన్ని శాఖల వసతి గృహాలకు సంబంధించి నేటికీ యూనిఫాం అందలేదు. అనేకచోట్ల వసతిగృహాధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. హాస్టల్ పరిసరాల్లోనే నివాసం ఉండాల్సి ఉండగా వారు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటూ హాస్టల్ పెత్తనాన్ని వంటమనుషులకు అప్పచెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇంకా.. ఆరుబయటేనా..!
‘ఇంకా ఆరుబయటేనా... మహిళల గౌరవానికి భంగం కలగాల్సిందేనా’ అంటూ ప్రభుత్వాలు బహిర్భూమి విషయమై పెద్ద పెద్ద ప్రకటనలు ఓ వైపు గుప్పిస్తుంటే... జిల్లాలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బడిమానేసిన విద్యార్థినుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో మొదటి విడతలో ఏర్పాటైన 18 కేజీబీల్లో వసతులు ఉన్నప్పటికీ మెనూ విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తుండటం గమనార్హం. సంబేపల్లి, రాయచోటిలో ఇటీవల జరిగిన సంఘటనలు కేజీబీవీల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. రెండవ విడత మంజూరైన 11 కేజీబీవీల్లో భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనగలూరు, పుల్లంపేట మండలాలతో పాటు ఓబులవారిపల్లెలోని కేజీబీవీ అద్దె గృహాల్లో నడుస్తున్నాయి. ఓబుళవారిపల్లెలో కేవలం ఒక్క గదిలోనే విద్యార్థులందరూ ఉండాల్సి రావడం గమనార్హం. టాయిలెట్‌లు సరిగాలేక ఆరుబయటకే విద్యార్థినులు వెళ్లాల్సి రావడంతో వారు విషపురుగుల బారినపడే అవకాశం లేకపోలేదు.
వసతి లేదు
Published Fri, Dec 20 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement