ప్రజావాణిగా గ్రీవెన్స్ సెల్
- ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ
- మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట
- కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్
కుప్పం: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌ను ఇక నుంచి ప్రజావాణిగా పేరు మారుస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి కుప్పం తహశీల్దార్ కార్యాలయుంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రవూన్ని నిర్వహించి గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన అధికారులు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టి అక్కడి వసతులు, ఆహారం, విద్యా విధానాలపై నివేదిక రూపొందిస్తారన్నారు. ప్రధానంగా గ్రామస్థాయి సమస్యలు అక్కడే పరిష్కారవుయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనకు సంబంధించి నూతన టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ స్కూల్‌లో తరగతి గదులు కొరత, పింఛన్ల పంపిణీ, ఇసుక రవాణా విధానంలో సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదనపల్లి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పాల్గొన్నారు.