Special Care
-
బ్రెయిలీ భాషలో స్టార్ హెల్త్ పాలసీ
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీని ‘బ్రెయిలీ’ భాషలో విడుదల చేసింది. కంటి చూపు సరిపడా లేని వారు సైతం ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా తెలుసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుందని సంస్థ తెలిపింది. దేశంలో 3.4 కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని.. వారికి తగిన నైపుణ్యాలు, శిక్షణ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అవకాశం ఇవ్వడం ద్వారా మద్దతుగా నిలవనున్నట్టు ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా ఆరోగ్య బీమా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని.. బ్రెయిలీలో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ విడుదల ఈ దిశగా మైలురాయి అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ పేర్కొన్నారు. అంధులైన వారి సమగ్రమైన, సమ్మిళిత ఆరోగ్య బీమా రక్షణ అవసరాలను ఈ పాలసీ తీరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంధుడైన పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీకాంత్ బొల్లా పాల్గొన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ సహకారంతో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ బ్రెయిలీ వెర్షన్‌ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూపొందించింది. -
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్‌కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్‌ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్‌ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు ఫోన్‌చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
కరోనా: ఏపీ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అధికారులు, సిబ్బంది తలమునకలవుతున్నారు. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. పరిస్ధితిపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్ధాయి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. స్ధానికంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్యారిస్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడి కుంటుంబ సభ్యులకు వైరస్ సోకినట్లు అనుమానం రావటంతో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షించిన కుటుంబ సభ్యుల రెండు శాంపిల్స్ నెగెటివ్‌గా తేలాయి. కాగా మరో అనుమానిత వ్యక్తి శాంపిల్ కూడా నెగటివ్ అని అధికారులు తేల్చారు. మూడు రోజుల కిందట ప్యారిస్ నుంచి నగరానికి వచ్చిన యువకుడు ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జర్వం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. 21న అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఉండే ప్రాంతంలో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు. అలాగే బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం.. రవాణా సదుపాయాలను గుర్తించే చర్యలు చేపట్టారు. బాధితుడు హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? విజయవాడకు వచ్చాక బాధితుడు ఈ మూడు రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరిని కలిశాడు? అని అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే అతని కుటుంబసభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 1,005 మంది వివరాలతో కూడిన జాబితా జిల్లాకు చేరింది. ఇంటింటా సర్వే.. జిల్లాలో గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 1,005 మంది వచ్చినట్లు అధికారికంగా తెలుస్తోంది. వీరందరిని పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వని వారు సైతం వెంటనే తమ వివరాల్ని నమోదు చేయాలని కోరుతున్నారు. ప్రజలంతా సహకరించాలి: కలెక్టర్ ఇంతియాజ్ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమవంతు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ : నగర సీపీ ద్వారకాతిరుమలరావు విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడలో కరోనా కంట్రోల్ రూమ్ నెంబర్ 7995244260కు ఫోన్ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో పరిస్ధితి.. విశాఖలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ప్రజలంతా జిల్లా యంత్రాగానికి సహకరించాలని కోరారు. కరోనా అనుమానితుల కోసం మరిన్ని క్వారంటైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విమ్స్ ఆసుపత్రిలో 400 పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్ర వైద్య కళాశాలలో 200 పడకలు సిద్దం చేయనున్నామని తెలిపారు. వీటితో పాటు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, మెంటల్ కేర్ ఆసుపత్రి, గీతం కాలేజీలో మరిన్ని పడకలు సిద్దం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరో 62 ఆసుపత్రుల్లో ఐసోలేషన్ పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. కేజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలకు వైద్యులు, సిబ్బంది సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు నెల్లూరు జిల్లాలోని సరిహద్దులను అధికారులు మూసివేశారు. జిల్లాకు వచ్చిన 880 మంది హోం క్వారంటైన్‌కు తరలించారు. తమిళనాడు నుంచి నెల్లూరు వచ్చే తడ చెక్‌పోస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సమీక్షిస్తున్నారు. తడలోని టూరిజం హోటల్‌ను కరోనా క్వారంటైన్‌గా మార్పు చేశామని కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అనుమానితులను వెంటనే చెక్ చేసేందుకు ర్యాపిడ్ మెడికల్ టీంను అధికారలు సిద్దం చేశారు. ప్రేవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్ స్కాన్ చేసిన తర్వాతే అనుమతిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం కరోనా పాజిటివ్ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒంగోలు పాజిటివ్ కేసు యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాల క్వారంటైన్లో ఈ పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ.. కింది స్ధాయి సిబ్బంది పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉన్నారు. -
పడకేసిన భవిత
విజయనగరం అర్బన్: ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రత్యేక బోధనా విధానం నిర్లక్ష్యానికి గురవుతుంది. దీంతో ప్రత్యేకావసరాల చిన్నారులు దానిపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బోధన కోసం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పరికరాలు, నిర్మించిన భవనాలు అలంకార ప్రాయంగా మారాయి. వారి కోసం నియమించిన ఉపాధ్యాయుల (ఐఈఆర్టీ)ను సైతం వేరే అవసరాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు చికిత్స చేయాల్సిన ఫిజీషియన్ పోస్టులు భర్తీ చేయకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ కేంద్రాల భవిత అగమ్యగోచరంగా ఉంది. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో.. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారా మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులు దైనందిక కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేలా తర్ఫీదు ఇచ్చేందుకు 12 భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలు నియమించారు. జిల్లాల్లో 34 మండలాలను కలుపుతూ 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 5 రకాల ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు 546 మంది ఈ కేంద్రాల్లో అభ్యన పొందుతున్నారు. గతేడాది చివర్లో ‘సహిత’ పేరుతో నిర్వహించిన సర్వేలో 6,923 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కానీ సర్వే చేయడంలో చూపిన శ్రద్ధ వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడంలో చూపలేదు. తాజా నమోదులో కేవలం 546 మంది మాత్రమే ఉండడంపై వాటి సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతుంది. ఐఈఆర్టీలు చిన్నారులతో ఆక్షరాలు దిద్దించడం, ఆటలు నేర్పించడం వంటివి చేయాలి. ఇందుకు అవసరమైన ఆట వస్తువులు కూడా సర్వశిక్షా అభియాన్ ద్వారా సరఫరా చేశారు. ఫిజీషియన్స్ లేకుండానే థెరిపీ చికిత్సలు.. జిల్లాలోని 34 మండలాల పరిధిలోని 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఫిజియోథెరిపీ చికిత్సలు ఇతరల సేవలు అందించడానికి 9 మంది ఫిజీషియన్ వైద్యుల అవసరం ఉంది. ప్రస్తుతం 5 మంది మాత్రమే భవిత కేంద్రాల పరిధిలోని చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఫిజియోథెరిపీ సేవలు అందిస్తున్నట్లు నివేదికలు చూపి నిధులు డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిరుపయోగంగా పరికరాలు.. ప్రత్యేక అవసరాల చిన్నారులకు వ్యాయామం, విద్య అందించేందుకు జిల్లాలోని 12 భవిత కేంద్రాల్లో పదేసి లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు, చిన్నారుల హాజరుశాతం పడిపోవడంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు విద్యను బోధించటానికి మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలను నియమించాలి. జిల్లాలో ఇంకా ఐదు ఐఈఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరువైన ఆదరణ.. కేంద్రాలు ప్రారంభించిన తొలినాళ్లలో మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులకు కేంద్రాల్లో చక్కటి సేవలు అందాయి. వైద్య పరీక్షలు, వ్యాయామం, బోధన జరిగింది. తొలుత గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లల హాజరు శాతం తగ్గడంతో మండల కేంద్రాలకు తరలించారు. దీంతో ప్రత్యేకావసరాల పిల్లల తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు. అధికారుల లెక్కల ప్రకారం 6,600 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నా, కేవలం 546 మందికి మాత్రమే సేవలందిస్తున్నారంటే ఆ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఈఆర్టీలను ఇతర పనులకు వినియోగించడం కూడా ప్రస్తుత ఈ పరిస్థితి కారణం. ఐఈఆర్టీల విధులు.. ♦ గ్రామాల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఆవాస ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలి. ♦ కేంద్రాలకు సమీపంలోని పిల్లలను భవిత కేంద్రాలకు తరలించి, విద్యా బుద్ధులు నేర్పించాలి. ♦ వీరికి సహాయకులుగా కేర్ గివింగ్ వలంటీర్ పనిచేస్తారు. పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చే తల్లిదండ్రులకు ప్రయాణ భత్యంగా నెలకు రూ.250 చెల్లిస్తారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిన విద్యార్థులతో పాటు వీరికి కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. యూనిఫాం ఇవ్వాలి. ♦ కదల్లేని, మెదల్లేని పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్‌గా రూ.250 చెల్లిస్తారు. -
‘మొక్క’వోని దీక్ష
పదేళ్ల ‘మొక్క’వోని దీక్షకు ఫలితం కాలనీకి పచ్చనిపందిరం. 50వ డివిజన్ నగరంలో ఉన్నప్పటికీ గ్రామీణ వాతావరణం భావన కలుగుతుంది. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవడమే దీక్షగా చేపట్టిన వీరు మిగతా ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ► పదేళ్లుగా చెట్లు పెంచుతున్న కాలనీవాసులు ► ప్రత్యేక శ్రద్ధతో హరితహారం ► నగరానికి ఆదర్శంగా 50వ డివిజన్‌వాసులు కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్రమంతా హరితహారం అంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే నగరంలోని 50వ డివిజన్ వాసులు పదేళ్ల క్రితమే చెట్ల ప్రాముఖ్యతను గుర్తించారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నకాలంలో వారిప్రాంతాన్ని హరితహారంలా మార్చేందుకు నడుం బిగించారు. కాలనీలో ఎటూ వెళ్లిన పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శివారుకు పచ్చనితోరణం పదేళ్లుగా 50వ డివిజన్లోని వావిలాలపల్లి, బ్యాంకుకాలనీ, మెహర్‌నగర్, వాసవినగర్లకు చెందిన ప్రజలు ‘మొక్క’వోని దీక్ష చేపట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి చిన్నపిల్లల్లా ఆలనాపాలనా చూస్తున్నారు. మండు వేసవిలో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితిలోనూ మొక్కలు ఎండిపోకుండా డబ్బు వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు పోయించారు. డివిజన్లో ఏడాది క్రితం పెట్టిన మొక్కల నుంచి పదేళ్ల క్రితం నాటిన వృక్షాల వరకు బతికున్నాయంటే డివిజన్ వాసుల పట్టుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా హరితహారమే ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడు వేల మొక్కలు నాటి కరీంనగర్‌లోని పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కాలనీల్లో వెయ్యి గృహాలుండగా, ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున మొక్కలు ఉన్నాయి. పెద్ద గల్లీలో పెద్దపెద్ద వృక్షాలు, చిన్న గల్లీల్లో పూల మొక్కలు, విద్యుత్ తీగల కింద పొట్టి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఎవరి ఇంటి ముందున్న మొక్కలను వారే కాపాడుకోవడం బాధ్యతగా తీసుకున్నారు. ప్రతి మొక్కపై శ్రద్ధ కాలనీలోని ప్రతి మొక్కను కాపాడాలనే ఉద్దేశంతో బాధ్యతలు సమష్టిగా తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పదేళ్లుగా కాలనీలో చెట్లు పెంచుతున్నాం. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటున్నాం. – సంపత్ పర్యావరణ పరిరక్షణకే.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచుతున్నాం. నగరంలో ఉన్నప్పటికీ అందరం సమష్టిగా చెట్లు పెంచి గ్రామ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం.సొంత ఖర్చులతో మొక్కలు నాటుతున్నాం. – ఒంటెల సుమ, కార్పొరేటర్ -
ప్రసవాలపై ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక శ్రద్ధ
-
ప్రజావాణిగా గ్రీవెన్స్ సెల్
ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ కుప్పం: సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌ను ఇక నుంచి ప్రజావాణిగా పేరు మారుస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి కుప్పం తహశీల్దార్ కార్యాలయుంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రవూన్ని నిర్వహించి గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన అధికారులు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టి అక్కడి వసతులు, ఆహారం, విద్యా విధానాలపై నివేదిక రూపొందిస్తారన్నారు. ప్రధానంగా గ్రామస్థాయి సమస్యలు అక్కడే పరిష్కారవుయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనకు సంబంధించి నూతన టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ స్కూల్లో తరగతి గదులు కొరత, పింఛన్ల పంపిణీ, ఇసుక రవాణా విధానంలో సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదనపల్లి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పాల్గొన్నారు. -
అందమే ఆనందం
అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం అన్నారో మహాకవి. అందం పరమార్థాన్ని ఎంత అందంగా చెప్పారాయన. అలాంటి అందం కోసం పరితపిస్తోంది నేటి యువత. అందుకోసం పలు రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. నిజానికి అసలు అందం అంటే ఏమిటి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెబుతుంటారు. ఇక సినీ తారలయితే జీవితంలో సగ భాగం అందాలను మెరుగు పరచుకోవడనికే ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా కథానాయికలు వీరికి అందమే అర్ధబలం అనవచ్చు. అలాంటి సౌందర్య రాశి అయిన యామి గౌతమ్ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తన ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీ అందం గురించి ఏమి చెబుతారో చూద్దాం. మీ సౌందర్య రహస్యం? నిజం చెప్పాలంటే నా అందానికి ఎలాంటి రహస్యాలు లేవు. అందం అనేది మనసుకు సంబంధించింది. అసలు అందం అందరిలోనూ ఉం టుంది. మాలాంటివాళ్లు సినిమాలో, మోడలింగ్ రంగంలో పని చేస్తుంటాం కాబట్టి అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాం. నేను మంచి నీరు అధికంగా తాగుతాను. ఆకుకూరలు ఎక్కువగా తిం టాను. అందం కోసం రసాయనిక సాధనాలను ఉపయోగించను. సెంట్, బాడీస్ప్రే, సోప్ వంటివి ప్రకృతి సిద్ధమయినవే కోరుకుంటాను. మన అందాన్ని మనమే కాపాడుకోవాలి. నా అందాన్ని మెరుగులు దిద్దే విషయంలో అధిక బాధ్యతను మా అమ్మే తీసుకుంటుంది. ఇందుకు మన ప్రవర్తన కూడా దోహదపడుతుంది. ప్రశాంత స్వభావం సాధ్యమయినంత వరకు చిరునవ్వును దూరం చేసుకోకుండా ఉండడం పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉంటే ముఖం కళకళలాడుతుంది. ఇప్పుడొస్తున్న మేకప్ వస్తువులన్నీ రసాయనికాలతో కూడుకున్నవేగా? అందుకే చెబుతున్నా సాధ్యమయినంత వరకు జుట్టుకు, ముఖానికి ప్రకృతిలోని మూలికలతో తయారయిన సామగ్రినే ఉపయోగించుకోవాలి. మగువలకు అందంపై మోహానికి కారణం? అందం అనేది ఒక శక్తి అనవచ్చు. ఆ శక్తి మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరినీ ఆకర్షించే శక్తి అందానికుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆకర్షణ శక్తి చుట్టూ తిరుగుతోంది. అలా ప్రపంచాన్నే స్తంభింప చేసే శక్తి ఆకర్షణ కుంది. అతివలకు అందాల పోటీ అవసరమా? కచ్చితంగా అవసరమే. రకరకాల అందమయిన పువ్వులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మగువల అందాల పోటీలు కూడా. అందమయిన అతివలు సమాజంలోని చాలా విషయాలను సాధించవచ్చు. అలాంటి ఆత్మవిశ్వాసాన్నిచ్చేది అందమే. అందం అనేది మేను చాయలను బట్టి ఉంటుందా? నిజం చెప్పాలంటే అందానికి రంగుతో పని లేదు. అయితే అందం గురించి ఒక్కొక్కరి మనసులో ఒక్కో భావం ఉంటుంది. కొందరు మహిళలు రంగు మారాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా సహజ సిద్ధమయిన అందాన్ని సురక్షితంగా కాపాడుకుంటే చాలు. అలాంటి అందమే శాశ్వతం. అదే నిత్యసత్యం. మీరు ఒక ప్రముఖ ప్రకటనల సంస్థకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. నటిగా మరింత పాపులర్ అయితే ఆ ప్రకటనల సంస్థకు టాటా చెబుతారా? ఆ సంస్థ ఇదే ప్రశ్న వేసింది. అయితే నన్ను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన ఆ సంస్థ ద్వారానే తానీస్థాయికి ఎదిగాను. అందువల్ల ఎప్పటికీ ఆ సంస్థకు దూరం కాను. అందానికి మీరిచ్చే నిర్వచనం? ఇతరులు మనకు వశీకరణ అవుతున్నారంటే మనలో అందం ఉన్నట్లు అర్థం. అయితే అలాంటి వశీకరణ శక్తి మనలో నిరంతరం ఉండాలంటే మనలో సచ్చీలత, సంప్రదాయం, సేవా గుణం, ప్రేమ, అభిమానం వంటి లక్షణాలుం డాలి. సమాజంలో అసలయిన అందానికి నిర్వచనం ఇవే. ఆ విధంగా మానవతామూర్తి మదర్ థెరీస్సానే నిజమైన అందానికి ప్రతిరూపం. -
శ్రుతికి ప్రత్యేక రక్షణ
సెలబ్రిటీలకు స్వేచ్ఛ కరువవుతోందా? వారి జీవితం దిన దిన గండంగా భయభ్రాంతులమయంగా మారుతోందా? నటి శ్రుతి హాసన్ ఇక్కట్లు చూస్తే ఇలాంటి సందేహాలే కలుగుతాయి. ఎందుకంటే ఆమెకిప్పుడు స్వేచ్ఛే కరువవుతోంది. బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తే రక్షణ వలయంతో గడపాల్సిన పరిస్థితి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ నటిగా గుర్తింపు పొందిన శ్రుతి హాసన్ ముంబాయిలో నివశిస్తున్నారు. శ్రుతి గ్లామర్ విషయాల్లో పరిధులు దాటి నటిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ మధ్య హిందీలో డి-డే అనే చిత్రంలో వేశ్యగా నటించి పలు విమర్శలను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో ఒక అగంతకుడు శ్రుతి అద్దెకుంటున్న ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడికి చేసే ప్రయత్నం చేశాడు. శ్రుతి ఫిర్యాదుతో ముంబాయి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే ఎవడు అనే తెలుగు చిత్రంలో శ్రుతిమించి అందాలార బోసిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఇది అంతా నిర్మాత దుశ్చర్యే నంటూ శ్రుతి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇటీవల డెహ్రాడూన్‌లోని హోటల్లో బస చేసిన శ్రుతిహాసన్ గది తలుపు తట్టి ఒక తాగుబోతు అల్లరి చేసే ప్రయత్నం చేశాడు. అతనిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అల్లరోళ్ల చిల్లర ప్రవర్తనతో శ్రుతి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రత అవసరం అయ్యింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంతోపాటు హిందీలో యారా అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ ప్రాంతాల్లో శ్రుతికి ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె షూటింగ్ ముగించుకుని హోటల్ రూమ్‌కు వెళ్లే వరకు భద్రతా వలయంలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.