‘మొక్క’వోని దీక్ష
పదేళ్ల ‘మొక్క’వోని దీక్షకు ఫలితం కాలనీకి పచ్చనిపందిరం. 50వ డివిజన్ నగరంలో ఉన్నప్పటికీ గ్రామీణ వాతావరణం భావన కలుగుతుంది. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవడమే దీక్షగా చేపట్టిన వీరు మిగతా ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
► పదేళ్లుగా చెట్లు పెంచుతున్న కాలనీవాసులు
► ప్రత్యేక శ్రద్ధతో హరితహారం
► నగరానికి ఆదర్శంగా 50వ డివిజన్‌వాసులు
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్రమంతా హరితహారం అంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే నగరంలోని 50వ డివిజన్ వాసులు పదేళ్ల క్రితమే చెట్ల ప్రాముఖ్యతను గుర్తించారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నకాలంలో వారిప్రాంతాన్ని హరితహారంలా మార్చేందుకు నడుం బిగించారు. కాలనీలో ఎటూ వెళ్లిన పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
శివారుకు పచ్చనితోరణం
పదేళ్లుగా 50వ డివిజన్‌లోని వావిలాలపల్లి, బ్యాంకుకాలనీ, మెహర్‌నగర్, వాసవినగర్‌లకు చెందిన ప్రజలు ‘మొక్క’వోని దీక్ష చేపట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి చిన్నపిల్లల్లా ఆలనాపాలనా చూస్తున్నారు. మండు వేసవిలో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితిలోనూ మొక్కలు ఎండిపోకుండా డబ్బు వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు పోయించారు. డివిజన్‌లో ఏడాది క్రితం పెట్టిన మొక్కల నుంచి పదేళ్ల క్రితం నాటిన వృక్షాల వరకు బతికున్నాయంటే డివిజన్ వాసుల పట్టుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏటా హరితహారమే
ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడు వేల మొక్కలు నాటి కరీంనగర్‌లోని పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కాలనీల్లో వెయ్యి గృహాలుండగా, ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున మొక్కలు ఉన్నాయి. పెద్ద గల్లీలో పెద్దపెద్ద వృక్షాలు, చిన్న గల్లీల్లో పూల మొక్కలు, విద్యుత్ తీగల కింద పొట్టి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఎవరి ఇంటి ముందున్న మొక్కలను వారే కాపాడుకోవడం బాధ్యతగా తీసుకున్నారు.
ప్రతి మొక్కపై శ్రద్ధ
కాలనీలోని ప్రతి మొక్కను కాపాడాలనే ఉద్దేశంతో బాధ్యతలు సమష్టిగా తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పదేళ్లుగా కాలనీలో చెట్లు పెంచుతున్నాం. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటున్నాం.
– సంపత్
పర్యావరణ పరిరక్షణకే..
పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచుతున్నాం. నగరంలో ఉన్నప్పటికీ అందరం సమష్టిగా చెట్లు పెంచి గ్రామ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం.సొంత ఖర్చులతో మొక్కలు నాటుతున్నాం.
– ఒంటెల సుమ, కార్పొరేటర్