గడ్డి, మొక్కలు, నీటి మడుగులు
పలు దేశాల పరిధిలో పరుచుకున్న వైనం
అంతరిక్షం నుంచీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పచ్చదనం
వాతావరణ మార్పులే కారణం
కొన్నాళ్లుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...!
వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది.
భారీ వర్షాలు
సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్‌గా పిలుస్తారు. ఈ సీజన్‌లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.
21 వేల ఏళ్లకోసారి...
సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment