
అందమే ఆనందం
అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం అన్నారో మహాకవి. అందం పరమార్థాన్ని ఎంత అందంగా చెప్పారాయన. అలాంటి అందం కోసం పరితపిస్తోంది నేటి యువత. అందుకోసం పలు రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. నిజానికి అసలు అందం అంటే ఏమిటి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెబుతుంటారు. ఇక సినీ తారలయితే జీవితంలో సగ భాగం అందాలను మెరుగు పరచుకోవడనికే ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా కథానాయికలు వీరికి అందమే అర్ధబలం అనవచ్చు. అలాంటి సౌందర్య రాశి అయిన యామి గౌతమ్ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తన ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీ అందం గురించి ఏమి చెబుతారో చూద్దాం.
మీ సౌందర్య రహస్యం?
నిజం చెప్పాలంటే నా అందానికి ఎలాంటి రహస్యాలు లేవు. అందం అనేది మనసుకు సంబంధించింది. అసలు అందం అందరిలోనూ ఉం టుంది. మాలాంటివాళ్లు సినిమాలో, మోడలింగ్ రంగంలో పని చేస్తుంటాం కాబట్టి అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాం. నేను మంచి నీరు అధికంగా తాగుతాను. ఆకుకూరలు ఎక్కువగా తిం టాను. అందం కోసం రసాయనిక సాధనాలను ఉపయోగించను. సెంట్, బాడీస్ప్రే, సోప్ వంటివి ప్రకృతి సిద్ధమయినవే కోరుకుంటాను. మన అందాన్ని మనమే కాపాడుకోవాలి. నా అందాన్ని మెరుగులు దిద్దే విషయంలో అధిక బాధ్యతను మా అమ్మే తీసుకుంటుంది. ఇందుకు మన ప్రవర్తన కూడా దోహదపడుతుంది. ప్రశాంత స్వభావం సాధ్యమయినంత వరకు చిరునవ్వును దూరం చేసుకోకుండా ఉండడం పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉంటే ముఖం కళకళలాడుతుంది.
ఇప్పుడొస్తున్న మేకప్ వస్తువులన్నీ రసాయనికాలతో కూడుకున్నవేగా?
అందుకే చెబుతున్నా సాధ్యమయినంత వరకు జుట్టుకు, ముఖానికి ప్రకృతిలోని మూలికలతో తయారయిన సామగ్రినే ఉపయోగించుకోవాలి.
మగువలకు అందంపై మోహానికి కారణం?
అందం అనేది ఒక శక్తి అనవచ్చు. ఆ శక్తి మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరినీ ఆకర్షించే శక్తి అందానికుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆకర్షణ శక్తి చుట్టూ తిరుగుతోంది. అలా ప్రపంచాన్నే స్తంభింప చేసే శక్తి ఆకర్షణ కుంది.
అతివలకు అందాల పోటీ అవసరమా?
కచ్చితంగా అవసరమే. రకరకాల అందమయిన పువ్వులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మగువల అందాల పోటీలు కూడా. అందమయిన అతివలు సమాజంలోని చాలా విషయాలను సాధించవచ్చు. అలాంటి ఆత్మవిశ్వాసాన్నిచ్చేది అందమే.
అందం అనేది మేను చాయలను బట్టి ఉంటుందా?
నిజం చెప్పాలంటే అందానికి రంగుతో పని లేదు. అయితే అందం గురించి ఒక్కొక్కరి మనసులో ఒక్కో భావం ఉంటుంది. కొందరు మహిళలు రంగు మారాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా సహజ సిద్ధమయిన అందాన్ని సురక్షితంగా కాపాడుకుంటే చాలు. అలాంటి అందమే శాశ్వతం. అదే నిత్యసత్యం.
మీరు ఒక ప్రముఖ ప్రకటనల సంస్థకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. నటిగా మరింత పాపులర్ అయితే ఆ ప్రకటనల సంస్థకు టాటా చెబుతారా?
ఆ సంస్థ ఇదే ప్రశ్న వేసింది. అయితే నన్ను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన ఆ సంస్థ ద్వారానే తానీస్థాయికి ఎదిగాను. అందువల్ల ఎప్పటికీ ఆ సంస్థకు దూరం కాను.
అందానికి మీరిచ్చే నిర్వచనం?
ఇతరులు మనకు వశీకరణ అవుతున్నారంటే మనలో అందం ఉన్నట్లు అర్థం. అయితే అలాంటి వశీకరణ శక్తి మనలో నిరంతరం ఉండాలంటే మనలో సచ్చీలత, సంప్రదాయం, సేవా గుణం, ప్రేమ, అభిమానం వంటి లక్షణాలుం డాలి. సమాజంలో అసలయిన అందానికి నిర్వచనం ఇవే. ఆ విధంగా మానవతామూర్తి మదర్ థెరీస్సానే నిజమైన అందానికి ప్రతిరూపం.