Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! | Holi 2025: Follow These Pre Post Skin And Hair Care Tips | Sakshi
Sakshi News home page

Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

Published Thu, Mar 13 2025 4:27 PM | Last Updated on Thu, Mar 13 2025 5:12 PM

Holi 2025: Follow These Pre Post Skin And Hair Care Tips

హోలీ హోలీల రంగ హోలీ..చమ్మకేళీలహోలీ అంటూ ఎంతో సరదాగా, ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ.  పిల్లా పెద్దా అంతా హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపో​కూడదు. నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణంగా  ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, హోలీ ఆడేముందు, ఆడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. అందుకే ఈ సేఫ్టీ టిప్స్‌ మీకోసం.

హోలీ ఆడే సమయంలో ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్‌లో  విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలు ఉంటాయని  గమనించాలి.  అలాగే వాడి సైడ్‌ ఎఫెక్ట్‌లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.  రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకు దారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.

సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక  చర్మ సమస్యలు ఇరిటేషన్‌ ఇతర ప్రమాదాలనుంచి తప్పించు కోవచ్చు.  పర్యావరణానికి ఎలాంటి హానీ  జరగదు.

చదవండి: Holi 2025 : ఎపుడూ వైట్‌ డ్రెస్సేనా? కలర్‌ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!

 

పిల్లల్ని ఒక కంట:  కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు  అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.

స్కిన్‌ అండ్‌ హెయిర్‌ : హోలీ ఆడటానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్‌ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను  మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది.  హోలీ రంగులతో రియాక్షన్‌ ఇచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పైగా సులభంగా రంగులు క్లీన్‌ అవుతాయి.

దుస్తులు: హోలీ రంగులు  ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్‌లు, కుర్తాలు ధరించాలి.  నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది.  

కళ్లు,చర్మ రక్షణ: గులాల్‌, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్‌కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్‌లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.

నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్‌ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి  రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే  శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రంగులను ఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్‌, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

నోట్‌ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.  ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement