కరోనా: ఏపీ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం | AP Government Officers Taking Special Care On Corona | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం

Published Mon, Mar 23 2020 1:13 PM | Last Updated on Mon, Mar 23 2020 1:30 PM

AP Government Officers Taking Special Care On Corona - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అధికారులు, సిబ్బంది తలమునకలవుతున్నారు. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. పరిస్ధితిపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్ధాయి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. స్ధానికంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.


విజయవాడ
ప్యారిస్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడి కుంటుంబ సభ్యులకు వైరస్‌ సోకినట్లు అనుమానం రావటంతో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షించిన కుటుంబ సభ్యుల రెండు శాంపిల్స్‌ నెగెటివ్‌గా తేలాయి. కాగా మరో అనుమానిత వ్యక్తి శాంపిల్‌ కూడా నెగటివ్‌ అని అధికారులు తేల్చారు. మూడు రోజుల కిందట ప్యారిస్‌ నుంచి నగరానికి వచ్చిన యువకుడు ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జర్వం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు.  21న అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అతను ఉండే ప్రాంతంలో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు. అలాగే బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం.. రవాణా సదుపాయాలను గుర్తించే చర్యలు చేపట్టారు. బాధితుడు హైదరాబాద్‌ నుంచి క్యాబ్‌లో విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌ ఎవరు? విజయవాడకు వచ్చాక బాధితుడు ఈ మూడు రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరిని కలిశాడు? అని అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే అతని కుటుంబసభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 1,005 మంది వివరాలతో కూడిన జాబితా జిల్లాకు చేరింది. 

ఇంటింటా సర్వే.. 
జిల్లాలో గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 1,005 మంది వచ్చినట్లు అధికారికంగా తెలుస్తోంది. వీరందరిని పారామెడికల్‌ సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వని వారు సైతం వెంటనే తమ వివరాల్ని నమోదు చేయాలని కోరుతున్నారు.
  
ప్రజలంతా సహకరించాలి: కలెక్టర్‌ ఇంతియాజ్‌  
కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమవంతు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.
 
ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ : నగర సీపీ ద్వారకాతిరుమలరావు
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడలో కరోనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 7995244260కు ఫోన్‌ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చని ఆయన  తెలిపారు.

విశాఖపట్నంలో పరిస్ధితి..
విశాఖలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్‌ అమలుచేస్తున్నట్లు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ప్రజలంతా జిల్లా యంత్రాగానికి సహకరించాలని కోరారు. కరోనా అనుమానితుల కోసం మరిన్ని క్వారంటైన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విమ్స్‌ ఆసుపత్రిలో 400 పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్ర వైద్య కళాశాలలో 200 పడకలు సిద్దం చేయనున్నామని తెలిపారు.

వీటితో పాటు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, మెంటల్‌ కేర్‌ ఆసుపత్రి, గీతం కాలేజీలో మరిన్ని పడకలు సిద్దం చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మరో 62 ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. కేజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలకు వైద్యులు, సిబ్బంది సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు

నెల్లూరు
జిల్లాలోని సరిహద్దులను అధికారులు మూసివేశారు. జిల్లాకు వచ్చిన 880 మంది హోం క్వారంటైన్‌కు తరలించారు. తమిళనాడు నుంచి నెల్లూరు వచ్చే తడ చెక్‌పోస్ట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సమీక్షిస్తున్నారు. తడలోని టూరిజం హోటల్‌ను కరోనా క్వారంటైన్‌గా మార్పు చేశామని కలెక్టర్‌ తెలిపారు.

కరోనా పాజిటివ్‌ వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అనుమానితులను వెంటనే చెక్‌ చేసేందుకు ర్యాపిడ్‌ మెడికల్‌ టీంను అధికారలు  సిద్దం చేశారు.  ప్రేవేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్‌ స్కాన్‌ చేసిన తర్వాతే అనుమతిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రకాశం
కరోనా పాజిటివ్‌ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒంగోలు పాజిటివ్‌ కేసు యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాల క్వారంటైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ.. కింది స్ధాయి సిబ్బంది పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement