Machinery of government
-
కరోనా: ఏపీ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అధికారులు, సిబ్బంది తలమునకలవుతున్నారు. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. పరిస్ధితిపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్ధాయి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. స్ధానికంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్యారిస్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి శనివారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడి కుంటుంబ సభ్యులకు వైరస్ సోకినట్లు అనుమానం రావటంతో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షించిన కుటుంబ సభ్యుల రెండు శాంపిల్స్ నెగెటివ్‌గా తేలాయి. కాగా మరో అనుమానిత వ్యక్తి శాంపిల్ కూడా నెగటివ్ అని అధికారులు తేల్చారు. మూడు రోజుల కిందట ప్యారిస్ నుంచి నగరానికి వచ్చిన యువకుడు ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జర్వం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. 21న అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఉండే ప్రాంతంలో 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు. అలాగే బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం.. రవాణా సదుపాయాలను గుర్తించే చర్యలు చేపట్టారు. బాధితుడు హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? విజయవాడకు వచ్చాక బాధితుడు ఈ మూడు రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరిని కలిశాడు? అని అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే అతని కుటుంబసభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 1,005 మంది వివరాలతో కూడిన జాబితా జిల్లాకు చేరింది. ఇంటింటా సర్వే.. జిల్లాలో గ్రామ వలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 1,005 మంది వచ్చినట్లు అధికారికంగా తెలుస్తోంది. వీరందరిని పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వని వారు సైతం వెంటనే తమ వివరాల్ని నమోదు చేయాలని కోరుతున్నారు. ప్రజలంతా సహకరించాలి: కలెక్టర్ ఇంతియాజ్ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమవంతు సామాజిక బాధ్యతలను చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ : నగర సీపీ ద్వారకాతిరుమలరావు విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడలో కరోనా కంట్రోల్ రూమ్ నెంబర్ 7995244260కు ఫోన్ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో పరిస్ధితి.. విశాఖలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ప్రజలంతా జిల్లా యంత్రాగానికి సహకరించాలని కోరారు. కరోనా అనుమానితుల కోసం మరిన్ని క్వారంటైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విమ్స్ ఆసుపత్రిలో 400 పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్ర వైద్య కళాశాలలో 200 పడకలు సిద్దం చేయనున్నామని తెలిపారు. వీటితో పాటు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, మెంటల్ కేర్ ఆసుపత్రి, గీతం కాలేజీలో మరిన్ని పడకలు సిద్దం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరో 62 ఆసుపత్రుల్లో ఐసోలేషన్ పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. కేజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలకు వైద్యులు, సిబ్బంది సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు నెల్లూరు జిల్లాలోని సరిహద్దులను అధికారులు మూసివేశారు. జిల్లాకు వచ్చిన 880 మంది హోం క్వారంటైన్‌కు తరలించారు. తమిళనాడు నుంచి నెల్లూరు వచ్చే తడ చెక్‌పోస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సమీక్షిస్తున్నారు. తడలోని టూరిజం హోటల్‌ను కరోనా క్వారంటైన్‌గా మార్పు చేశామని కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అనుమానితులను వెంటనే చెక్ చేసేందుకు ర్యాపిడ్ మెడికల్ టీంను అధికారలు సిద్దం చేశారు. ప్రేవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్ స్కాన్ చేసిన తర్వాతే అనుమతిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం కరోనా పాజిటివ్ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒంగోలు పాజిటివ్ కేసు యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాల క్వారంటైన్లో ఈ పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ.. కింది స్ధాయి సిబ్బంది పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉన్నారు. -
‘సూపర్ బగ్’ విక్రయదారులపై కేసులు నమోదు చేయాలి
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆదేశాలు ‘సాక్షి’కథనంపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని యాంటిబయోటిక్స్ మందులు వరదలా ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపర్‌బగ్ డ్రగ్స్ తెలంగాణలో విచ్చలవిడిగా వెలుగు చూస్తున్నాయి. మూడో తరానికి చెందిన హెచ్1 డ్రగ్స్ కేటగిరీలోని 50 సూపర్‌డ్రగ్ మందులు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఎం.అమృతరావు వెల్లడించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘సూపర్‌బగ్ భయోత్పాతం’కథనంపై ఆయన స్పందించారు. కథనం ఎంతో చైతన్యవంతంగా ఉందని ఆయన కొనియాడారు. యాంటీబయోటిక్స్‌ను పుట్నాల్లా తింటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు చేసి సూపర్‌బగ్ డ్రగ్స్ ఉంటే వెంటనే సీజ్ చేయాలని... సంబంధిత దుకాణాదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. హెచ్1 సూపర్‌బగ్ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉపయోగించడంవల్ల... అవి బ్యాక్టీరియాపై పనిచేసే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. సాధారణంగా వీటిని అధిక ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఐసీయూల్లో ఉపయోగి స్తారన్నారు. హెచ్1 కేటగిరీల్లోని డ్రగ్స్‌ల్లో దగ్గు మందులు కూడా ఉన్నాయని, వీటి వాడకంతో అధికంగా మత్తు వస్తుందన్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు ఈ దగ్గు మందులను ఒక ముఠా సరఫరా చేస్తోందన్నారు. రెండు ప్రిస్క్రిప్షన్లు రాయాలి... హెచ్1 డ్రగ్‌లను వైద్యులు సూచించాల్సి వస్తే... రెండు ప్రిస్కిప్షన్లు రాయాలని అమృతరావు చెప్పారు. ఒకటి రోగి వద్ద, మరొకటి మందుల దుకాణాదారులు ఉంచుకోవాలన్నారు. వాటిని ఎందుకు విక్రయించారో తమకు తెలపాలని ఆయన ఆదేశించారు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. సూపర్‌బగ్‌లను మూడు నాలుగు కంపెనీలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా, ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించి... మత్తు కలిగించే 2,040 కోడిస్టార్ దగ్గు మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
రాళ్లెత్తే కూలీలకు రక్షణ కరువు
* నీరు లేదు.. భోజనం చేయనీయరు.. మండే ఎండల్లోనూ శ్రమదోపిడీ * చాలీచాలనీ జీతాలకు ప్రాణాలను పణంగా పెడుతున్న పొరుగు రాష్ట్రాల కార్మికులు * అమలు కాని కార్మిక చట్టాలు.. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం * సర్కారు వారి ఇలాకాలోనే వెట్టిచాకిరీ * తాత్కాలిక సచివాలయ నిర్మాణ కూలీల బతుకులు దుర్భరం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో రాళ్లెత్తుతున్న కూలీలకు రక్షణ కరువైంది. అద్భుత ప్రజా రాజధాని అంటూ చంకలు గుద్దుకుంటున్న సర్కారు వారి ఇలాకాలో అత్యంత ఘోరమైన వెట్టిచాకిరీ అమలవుతోంది. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకుండా ప్రభుత్వం దగాచేసింది. పొరుగు రాష్ట్రాల కార్మికుల శ్రమదోపిడీకి అవకాశం కల్పించింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువ కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో, వారి కుటుంబాల్లో భయందోళనలను సృష్టించింది. ఇక్కడ తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను ‘సాక్షి’ ప్రతినిధి వద్ద కార్మికులు ఏకరువు పెట్టారు. తమ పేర్లు, ఫొటోలు పేపర్లో వేస్తే ఉన్న ఉపాధి పోయి రోడ్డున పడతామంటూ వారు వేడుకున్న తీరు చూస్తే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అవగతమవుతోంది. ఒక్కో గదిలో 30 మంది మగ్గాల్సిందే గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు చేపట్టిన ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చాయి. బీహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ పనులు చేయిస్తున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1,800 మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి రోజువారీ వేతనంగా రూ.185 నుంచి రూ.250 ఇచ్చి శ్రమదోపిడీ చేస్తున్నారు. కొందరికి నెలవారీగా రూ.8 వేల నుంచి 15 వేలు ఇస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కార్మికులకు జీతాలు అందలేదు. ఇంతేకాదు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగేందుకు మంచినీరు లేదు. దాహమైతే దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. సమయానికి భోజనం చేయడానికి వీలుండదు. పని పూర్తి చేసి వెళ్లు అని నిర్మాణ సంస్థల ప్రతినిధులు హూంకరిస్తుంటారు. తలదాచుకునేందుకు పక్కా నివాసాలు లేవు. మండే ఎండల్లోనూ రేకుల షెడ్లలో ఉక్కబోతతో మాడిపోవాల్సిందే. షెడ్లలోని ఒక్కో గదిలో 20 నుంచి 30 మంది బతకాల్సిందే. కొన్ని షెడ్లలో కనీసం బాత్రూమ్, లెట్రిన్ సౌకర్యం కూడా లేదు. ఇంత జరుగుతున్నా మంత్రులు, అధికారులు అటువైపు దృష్టి సారించి కార్మికుల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అమలు కాని కార్మిక చట్టాలు.. సర్కారు వారి ఇలాకాలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఏ కార్మికుడైనా ఎనిమిది గంటలు పని చేయాలన్న కార్మిక చట్టం ఇక్కడ అమలు కాకపోవడంతో ఏకంగా 12 నుంచి 14 గంటలకుపైగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్‌లు అమలు చేయాల్సిన నిర్మాణ కంపెనీలు రెండు షిప్ట్‌లతో శ్రమదోపిడీ చేస్తున్నాయి. పని వేళలు పాటించకపోవడంతో రాత్రి, పగలు తమకు అప్పగించిన పనులు పూర్తి చేసేందుకు కార్మికులు శ్రమిస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగితే వెంటనే వైద్య సదుపాయం అందించే అవకాశం లేదు. వేసవి తీవ్రత కారణంగా ఇటీవల కార్మికులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనికి విరామం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు వర్తింపచేయకపోవడం చూస్తే చట్టం అమలులో పాలకుల చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోంది.