వసతిగృహ విద్యార్థుల్లో కొత్త మెనూ కర్రీల అమలు వర్రీగా మారింది. కొత్త మెనూ ప్రకటించినా..అందుకనుగుణంగా మెస్ చార్జీలు లేకపోవడంతో మెనూకు కొర్రీ పడింది. హాస్టళ్లలో విద్యార్థులకు ఇంటి తరహా భోజనం పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలని చెప్పింది. అయితే అది అమలుకు నోచుకోకపోవడంతో ప్రకటనకే పరిమితమైంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, టమాటా సాంబారు, రసాలతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
నెల్లూరు రూరల్: వసతిగృహాల్లో కొత్త మెనూ అమలు కాకుండానే మంగళం పాడేశారు. జూలై 1వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తో పాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనందనిలయాల్లో వారానికి రెండు రోజులు చికెన్, రోజూ పాలు, గుడ్లు సంతృప్తికరమైన అల్పాహారం పెట్టాలంటూ కొత్త మెనూ చార్ట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అందు కోసం విద్యార్థులకు మెనూ చార్జీలను కూడా స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోల్చితే మెస్ చార్జీలు నామమాత్రమే పెరిగాయని, దీనికి తోడు మారిన మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని బోలెడంత ఖర్చు అవుతుందని వార్డెన్లు చేతులెత్తేశారు. కోడికూరతో మంచి భోజనం చేయొచ్చని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. సొంత లాభం చూసుకుంటూ వార్డెన్లు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మెనూ అమలు చేయకుండా పేద విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారు. బిల్లులు మాత్రం కొత్త మెనూ ప్రకారం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెనూ అమలులో సందిగ్ధం
జిల్లాలో ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టళ్లు 189 ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉంది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండు సార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ పెట్టాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. గతంలో ఇచ్చే మెస్ చార్జీలను కళాశాల వసతి గృహాలకు రూ.350, 8, 9, 10 తరగతులకు రూ.400, 3 నుంచి 7వ తరగతి వరకు రూ.250 పెంచింది. స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేంచేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చితే ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్ల వాదన.
ధరలు ప్రకటించరేం?
మెనూ చార్జీ ప్రకారం ఎంతెంత ధరల్లో కొనుగోలు చేయాలోనన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఉన్న మెనూకు అదనంగా పాలు, పెసరపప్పు, పొంగల్, చికెన్, వేరుశనగ ఉండలు, చెట్నీ, పూరీ, బఠానీ, బంగాళదుంప కుర్మా వంటివి చేర్చారు. కానీ ఈ సరుకులను ఏ ధర పెట్టి కొనుగోలు చేయాలన్న విషయాన్ని తేల్చలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.70పైగా అవుతుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఎంత ఉంటాయోనన్న ఆందోళనలో వార్డెన్లు ఉన్నారు. గురుకులాల్లో అయితే మధ్నాహ్న భోజన పథకం ఉండదు కాబట్టి వీటికి ఇంకా అదనపు ఖర్చు అవుతుందని, కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలేమని చేతులెత్తేస్తున్నారు.
సమస్యలు తీర్చకుండానే..
ప్రస్తుతం జిల్లాలో ఉన్న వసతిగృహాల్లో చాలా చోట్ల ప్లేట్లు లేవు. ఒక్కో వసతిగృహంలో వందకుపైగా విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గ సిబ్బంది లేరు. మరో పక్క వాచ్‌మన్లు, సహాయకులు, వంట మనుషులు కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. చాలాచోట్ల చాలీచాలని గదుల్లో విద్యార్థులు మగ్గుతున్నారు. ఇన్ని సమస్యలున్నా పట్టించుకోని ప్రభుత్వం అరకొరగా మెస్ చార్జీలు భారీగా పెంచామని ప్రచారం చేసుకుంటుంది. వాటిని అమలు చేసేందుకు వార్డెన్లు అవస్థలు పడుతున్నారు.
పెంచడం సరే ధరలెలా?
మెనూ చార్జీలు ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. మాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. ఏ ఐటమ్ ఎంత రేటుకు, ఎన్ని గ్రాములు పెట్టాలనేది స్పష్టత లేదు. ఈ విషయమై రాష్ట్ర డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిని విన్నవించాం. ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఇప్పుడు ఒక్కో విద్యార్థికి రూ.25లకు పైగా అదనంగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం పెట్టే ధరలెలా ఉంటాయో దానిపై అమలు ఆధారపడి ఉంటుంది. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఈ.విజయకుమార్ , ఏపీ హాస్టల్ వెల్ఫేర్
అఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment