వసతి.. అధోగతి | problems of government hostels | Sakshi
Sakshi News home page

వసతి.. అధోగతి

Published Wed, Jul 12 2017 10:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వసతి.. అధోగతి - Sakshi

వసతి.. అధోగతి

61 - సాంఘిక సంక్షేమ హాస్టళ్లు
78 - బీసీ సంక్షేమ హాస్టళ్లు
18 - ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు
19,532 - వసతి పొందుతున్న విద్యార్థులు


- బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
- అవసరమైనన్ని దుప్పట్లు లేక అవస్థలు
- తలుపులు లేని కిటికీలే అధికం
- ముద్దకట్టిన అన్నం.. జారిపోయే పప్పు
- ఎక్కడా కనిపించని భోజనశాలలు


ప్రతిపాదనల్లోనే..
12,100 మంది బీసీ హాస్టళ్ల విద్యార్థులకు 42,601 చిన్న పుస్తకాలు, 94,027 పెద్ద పుస్తకాలు అవసరమని ప్రతిపాదించగా ఇప్పటి వరకు ఒక్కటీ హాస్టళ్లకు చేరని పరిస్థితి.

చప్పిడి మెతుకులు.. సాగని చదువులు
సౌకర్యాలు నాస్తి..సమస్యలు జాస్తి
మెనూ బరువు ...దుప్పట్లు కరువు
అందని పుస్తకాలు...అడ్రస్‌లేని యూనిఫాం
ఇదీ జిల్లాలోని వసతి గృహాల విద్యార్థుల దుస్థితి


నీళ్లచారు...మజ్జిగన్నం
మెనూ పాటిస్తున్న విధానమిది


తాగేందుకు నీళ్లుండవు...రాత్రయితే వెలుగుండదు
సౌకర్యాల తీరిది


పరిసరాలు రోత...దోమత మోత
పరిశుభ్రత పరిస్థితి ఇది


పుస్తకాలకు దిక్కులేదు...యూనిఫాంకు గతిలేదు
అటకెక్కిన చదువుకు తార్కాణమిది


పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పాలకుల నిర్లక్ష్యంతో సంక్షామ గృహాలుగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక...మోను అమలుకాక...సౌకర్యాలకు నోచుకోక విద్యార్థులంతా అల్లాడిపోతున్నారు.  దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో చిన్నారులంతా చలికి వణికి పోతున్నారు. దాదాపు ఏ వసతి గృహంలోనూ మెనూ అమలు చేయకపోవడంతో చప్పిడి మెతుకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటిదాకా విద్యార్థులకు యూనీఫాం...నోట్‌ పుస్తకాలు అందకపోవడంతో చదువులు కూడా సాగడం లేదు.
-అనంతపురం ఎడ్యుకేషన్‌

జిల్లా వ్యాప్తంగా 157 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. 61 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 5,632 మంది, 78 బీసీ హాస్టళ్లలో 12,100 మంది, 18 ఎస్టీ హాస్టళ్లలో 1,800 మంది  1– 10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. అయితే దాదాపు అన్ని వసతి గృహాల్లోనూ కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అందని బెడ్‌షీట్లు
బీసీ హాస్టళ్ల విద్యార్థులకు బెడ్లు షీట్లు ఇంకా రాలేదు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థులకు కప్పుకోవడానికి దుప్పట్లు వచ్చినా..కింద పరుచుకోవడానికి కార్పెట్లు రాలేదు. దీంతో ఒక దుప్పటిని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్నారు.
 
దోమల మోత
జిల్లాలోని దాదాపు అన్ని వసతి గృహాల్లో  దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రçస్తుతం మారిన సీజన్‌తో దోమల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దోమతెరలు కొనుగోలు చేసేందుకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు...కనీసం కిటికీలు, వాకిళ్లకు నెట్‌ (వల) కూడా ఏర్పాటు  చేయలేదు. దీంతో దోమల మోత అధికం కావడంతో విద్యార్థులకు కంటిమీద కనుకు కరువైంది.

కన్నెత్తి చూడని వైద్యులు
నిబంధనల మేరకు ప్రతినెలా ప్రభుత్వ వైద్యులు సమీప వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. కానీ చాలా హాస్టళ్లæ విద్యార్థులకు వైద్యులు వస్తారనే సమాచారం కూడా తెలియదు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎక్కువగా పిల్లలుæ వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుంది. జిల్లాకేంద్రంలో ఉన్న హాస్టళ్ల వాపే వైద్యులు కన్నెత్తి చూడడం లేదంటే... ఇక మారుమాల గ్రామాల్లో ఉన్న వసతి గృహాలకు ఏమాత్రం వెళ్తుంటారో అర్థం చేసుకోవచ్చు.  

పుస్తకం అందితే ఒట్టు
పాఠశాలలు వెళ్లేరోజునే వసతి గృహంలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉన్నా...జిల్లాలో ఏ వసతి గృహం విద్యార్థికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ అందలేదు. పుస్తకాలు లేక ఖాళీ బ్యాగులతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు నోట్‌పుస్తకాల్లో రాసుకోవాలంటే దిక్కులు చూస్తున్నారు.

అ‘డ్రస్‌’ లేదు
విద్యా సంవత్సరం ప్రారంభంలో వసతి గృహాల్లోని విద్యార్థులకు నాలుగు జతల యూనీఫాం పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క ఎస్సీ హాస్టళ్లలో తప్ప మిగతా ఏ వసతి గృహం విద్యార్థులకూ యూనిఫాం అందలేదు. దీంతో పిల్లలు రంగులు, చినిగిన దుస్తులతో బడులకు వెళ్తున్నారు.

నెలాఖరుకు యూనీఫాం ఇస్తాం
బీసీ హాస్టళ్లకు సంబంధించి క్లాత్‌ విడతల వారిగా జిల్లాకు చేరుతోంది. వచ్చినది వచ్చినట్లుగా కుట్టడానికి పంపాం. ఈ నెలాఖరు నాటికి యూనీఫాం అందజేస్తాం. నోట్‌ పుస్తకాలకు మరోవారం పట్టొచ్చు. ప్రైవేట్‌ బిల్డింగులకు మెష్‌ (వల) కొట్టించలేదు. అయితే ప్రతి గదిలోనూ దోమల కాయిన్స్, లిక్విడ్‌ ఉంచేలా చర్యలు తీసుకుంటాం.  
– రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు

దుప్పట్లు లేక ఇక్కట్లు
కనగానపల్లి (రాప్తాడు) : నియోజవర్గ కేంద్రం రాప్తాడులోని బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులున్నారు. కానీ మంగళవారం రాత్రి 80 మంది మాత్రమే కనిపించారు. మెనూ ప్రకారమే సాయంత్రం అన్నం, ఆకూర పప్పు, రసం, గుడ్డుతో భోజనం పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో రాత్రి వేళలో విద్యార్థుల దోమలు మోతతో...వర్షంతో చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వసతి గృహంలో ఇంకా  అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ ఏడాది దుప్పట్లు, యూనిఫాం అందలేదని హాస్టల్‌ వార్డెన్‌ మారుతీప్రసాద్‌ తెలిపారు.

తాగునీటికీ తప్పని తిప్పలు
నార్పల :
స్థానిక ఎస్‌సీ బాలుర వసతి గృహంలో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహంలో 120 మంది విద్యార్థులున్నట్లు రికార్డులు చెబుతుండగా... మంగళవారం రాత్రి 60 మంది కనిపించారు. రాత్రి అన్నం, పప్పు, చారు వడించారు. తమకు ఇవ్వాల్సిన రగ్గులను గతంలో పని చేసిన వార్డున్‌ తీసుకపోవడంతో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామని, అయితే ఇటీవలే ఇన్‌చార్జి వార్డెన్‌ రగ్గులు, బ్యాగు ఇచ్చినట్లు తెలిపారు. మరుగుదొడ్ల వద్ద లైట్లు లేకపోవడంతో రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామనీ, వసతి గృహంలోకి వచ్చే గేట్‌ వద్దే విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌ ఏర్పాటు చేయడంతో ఎప్పుఽడేం జరుగుతుందో తెలియక భయాందోళన చెందుతున్నామని విద్యార్థులు తెలిపారు.

నీళ్ల సాంబారు, పలుచని మజ్జిగ
ఉరవకొండ :
స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉండగా, 120 మంది మాత్రమే హాజరవుతున్నారు. మంగళవారం రాత్రి మోను ప్రకారం అన్నం,  పప్పు, రసం, మజ్జిగతో పాటు గ్రుడ్డు అందించారు. అయితే సాంబారులో నీళ్లే అధికంగా ఉన్నాయి. ఇక మజ్జిగ పేరుకు మాత్రమే ఉన్నట్లుగా ఉంది. అన్నం కూడా ముద్దగా ఉండటంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందిపడ్డారు. పిల్లలకు రగ్గులు ఇచ్చినా... కింద పరుచుకోవడానికి కార్పెట్లు లేక పోవడంతో వారు నేల పైనే పడుకోవాల్సి వచ్చింది.

భద్రత కరువు
హిందూపురం అర్బన్‌ :
పట్టణంలోని బీసీ హాస్టళ్ల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి పడుతుంఽఽడడంతో విద్యార్థులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి సమయంలో మీదపడుతుందేమోనని ఆరు బయటే నిద్రిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఒకే దుప్పటి పంపిణీ చేయడంతో చలికి వణుకుతూ అల్లాడిపోతున్నారు. దోమలు కూడా తీవ్రమవడంతో ఇటీవల పలువురు విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. ఇక యూనిఫాం కూడా ఇవ్వకపోవడంతో రంగుల దుస్తుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు.  

నిర్వహణ దారుణం
హిందూపురం నియోజకవర్గంలో పది హాస్టళ్లు ఉండగా... మెనూ ఏ మాత్రం అమలు కావడం లేదు. రోజూ ఉదయాన్నే రాగిమాల్ట్‌ ఇవ్వాల్సి ఉన్నా... అది గోడమీద రాతలకే పరిమితమైంది. అలాగే ప్రతి శనివారం ఇవ్వాల్సిన పాయసం కూడా అందటం లేదు. ఇక రాత్రి వేళ అన్నం, కూరగాయల కర్రీ, రసం, పెరుగు, అరటిపండు, లేకపోతే గుడ్డు ఇవ్వాల్సి ఉన్నా...వారానికి రెండుసార్లు మాత్రమే గుడ్డు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. ప్రతి ఆదివారం ఎగ్‌ బిరియాని వండాల్సి ఉన్నప్పటికీ అది కూడా అమలు కావడంలేదు. భోజనం కూడా నాణ్యంగా ఉండడం లేదనీ, కుళ్లిపోయిన కూరగాయలతో కర్రీ వండుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరెంటుపోతే...అంధకారమే!
కళ్యాణదుర్గం :
పట్టణంలోని ఎస్సీ బాలికల–2 వసతిగృహంలో సుమారు 100 మంది విద్యార్థులుంటున్నారు. కనీసం కొవ్వొత్తులు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో విద్యుత్‌ సరఫరాలో కోత పడినప్పుడు విద్యార్థులంతా అంధకారంలోనే గడుపుతున్నారు. మంగళవారం రాత్రి కూడా విద్యార్థులు భోజనం చేస్తుండగా...కరెంటు సరఫరాలో గంట సమయం అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యార్థులంతా చీకట్లలోనే భోజనం ముగించారు. వసతిగృహ అధికారిణి మాధవి కూడా అందుబాటులో లేరు. విద్యార్థులకు నీళ్ల రసం, నీళ్ల పప్పే వడ్డించారు. అంతేకాదు భోజనంలోకి మజ్జిగ కూడా ఇవ్వలేదు. మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం, కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా...అది అమలు కాలేదు. వసతిగృహంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ప్రభుత్వం పంపిణీ చేసిన దుప్పట్లు సైజు పరిపోక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.
 
సమస్యల లోగిళ్లు
మడకశిర :
నియోజకవర్గంలో 10 బీసీ హాస్టళ్లు...అమరాపురం, మడకశిరల్లో ఎస్సీ హాస్టళ్లున్నాయి. అమరాపురం బాలుర ఎస్సీ హాస్టల్‌లో 46 మంది విద్యార్థులుండగా....వీరిలో 20 మంది కొత్త విద్యార్థులున్నారు. వీరికి దుప్పట్లు లేవు. అంతేకాకుండా జంకాణాలు కూడా అందలేదు. మంగళవారం రాత్రి మెనూ ప్రకారం సాంబారు, అన్నం, కరి వడ్డించాల్సి ఉన్నా...పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. హాస్టల్‌ భవనం కొత్తదైనా ఐదు గదుల్లో విద్యుత్‌ బల్బులు లేకపోవడంతో విద్యార్థులు చీకటిలోనే ఉండాల్సి వచ్చింది. రెండు గదులకు కిటికీలు సక్రమంగా లేక విద్యార్థులు  దోమల మోతతో అల్లాడిపోయారు. ఇక మడకశిర బాలుర ఎస్సీ హాస్టల్‌లో 80 మంది విద్యార్థులుండగా... కొత్తగా చేరిన విద్యార్థులకు దుప్పట్లు అందలేదు. మెనూ ప్రకారం అన్నం, సాంబారు  వడ్డించినా కర్రీ ఇవ్వలేదు. కిటికీలకు నెట్‌లను ఏర్పాటు చేయకపోవడంతో దోమలు మోతతో విద్యార్థులకు నిద్ర కరువైంది. రొళ్ల మండలంలోని రత్నగిరి బీసీ హాస్టళ్‌లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఏ వసతిగృహం విద్యార్థికి కూడా పుస్తకాలు, యూనిఫాం అందలేదు.

అందని కాస్మొటిక్‌ చార్జీలు
గుంతకల్లు :
నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు రెండు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు అందలేదు. గుంతకల్లు పట్టణంలోని బాలుర ఎస్సీ హాస్టల్‌తోపాటు ఎస్సీ బాలికలు, 1, 2 బాలుర బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. అన్నం ముద్దముద్దగా ఉండడంతో పాటు నీళ్ల మజ్జిగ, కాయగూరలు లేని సాంబారే తమకు కడుపు నింపుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకో పర్యాయం మాంసాహారం ఇవ్వాల్సి ఉన్నా..ఏ వసతి గృహంలోనూ విద్యార్థులకు ఇవ్వడం లేదు. కొన్ని హాస్టళ్లలో మెనూ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. చాలా వసతి గృహాల్లో తాగునీరు సరఫరా కాక విద్యార్థులు బాటిళ్లలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. హాస్టళ్ల భవనాలు అపరిశుభ్రంగా ఉండడంతో  దోమలు బెడద ఎక్కువైంది. అధికారులు దుప్పట్లు మాత్రమే సరఫరా చేయడంతో బెడ్‌షీట్స్‌ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  

వసతులు కరువు
బుక్కపట్నం (పుట్టపర్తి) :
పుట్టపర్తి నియోజవర్గంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ వసతి గృహంలోనూ   సరైన సౌకర్యాలు లేవు. ఓబులదేవరచెరువు బీసీ హాస్టల్‌లో 153 మంది విద్యార్థులుండగా...విద్యార్థులుకు ఇప్పటి వరకూ దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులే ఇళ్ల నుంచి   తెచ్చుకున్నారు. ఇక యూనిఫాం, పుస్తకాలు కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు.  మిగిలిన సదూపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

సం‘క్షామ’ హాస్టళ్లు
ధర్మవరం :
నియోజకవర్గంలో ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్‌లో బాలికల హాస్టల్, ఎస్‌బీఐ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, తారకరామాపురంలో బీసీ హాస్టల్‌ ఉన్నాయి. తాడిమర్రి మండల కేంద్రంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. అదేవిధంగా బత్తలపల్లిలో ఒక బీసీ వసతి గృహం,  ముదిగుబ్బ మండల పరిధిలో ముదిగుబ్బ, మలకవేములలో బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పెరిగిన కూరగాయల ధరలతో నీళ్లచారు, చప్పిడి పప్పే విద్యార్థులకు అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు అందాల్సిన కాస్మొటిక్ చార్జీలు నేటికీ ఇవ్వలేదు. ఇక దుప్పట్లు కూడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతూ, దోమ కాటుకు గురవుతున్నారు. ఇళ్ల వద్దనుంచి తెచ్చుకున్న వారి దుప్పట్లనే అందరూ సర్దుకుని కప్పుకుంటున్నారు.  పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. నేటికీ వారికి పుస్తకాలను అందజేయలేదు. దీంతో విద్యార్థులు పూర్వ విద్యార్థులతో పుస్తకాలను తీసుకుని చదువుకునే దుస్థితి నెలకొంది.

దోమకాట్లతో కనుకు కరువు
రాయదుర్గం :
నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 6 బాలుర , రెండు బాలికల బీసీ హాస్టళ్లు, 2 ఎస్సీ బాలుర , 2 బాలికల హాస్టళ్లున్నాయి. ఇందులో జూనియర్‌ కళాశాల బాలుర, బాలికల బీసీ హాస్టళ్లు ఒక్కొటి చొప్పున ఉన్నాయి.  ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు మాత్రం ఇంతవరకు దుప్పట్లు, యూనిఫాం, నోటు పుస్తకాలు పంపిణీ చేయగా బీసీ హాస్టళ్లకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. మంగళవారం రాత్రి పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న బీసీ హాస్టల్‌ను సాక్షి విజిట్‌ చేయగా, విద్యార్థులు దుప్పట్లు లేక చలికి వణుకుతూ కనిపించారు. సాయంత్రం మెనూ ప్రకారం అన్నం, కూరగాయల పప్పు, రసం, పెరుగు, గుడ్డు ఇచ్చారు. అయితే ఇరుకైన డైనింగ్‌ హాలులో సుమారు 110 మంది విద్యార్థులు భోజనం చేశారు. అయితే దుప్పట్లు గానీ, యూనిఫాం, నోటుపుస్తకాలు గానీ ఇంతవరకూ పంపిణీ చేయలేదని విద్యార్థులు తెలిపారు. దోమతెరలు లేకపోవడంతో దోమల బాధ ఎక్కువైందని విద్యార్థులు వాపోయారు.

మరుగుదొడ్లు లేక సతమతం
తాడిపత్రి రూరల్‌ :
తాడిపత్రి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు 10 ఉన్నాయి. అలాగే జూనియర్‌ కళాశాల వసతి గృహాలు 4 ఉన్నాయి. తాడిపత్రిలో 7, చుక్కలూరులో 1, పెద్దపప్పూరులో 2, యాడికిలో 1, పెద్దవడగూరు మండలంలో 3, తాడిపత్రి పట్టణంలో జూనియర్‌ కళాశాలలకు చెందిన వసతి గృహాలు 4 ఉన్నాయి. ఏ ఒక్క వసతి గృహంలోనూ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. తాడిపత్రి పట్టణంలోని ఇంటరీగ్రేడ్‌ వసతి గృహంలో 110 మంది విద్యార్థులుండగా, డ్రైనేజీ కాలువలు లేక వసతి గృహం పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఇక తాడిపత్రి మండలంలోని చుక్కలూరు బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో తాళాలు వేశారు. దీంతో విద్యార్థులకు మరుగుకు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దవడగూరు వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement