సర్వజన ‘వ్యథ’
– మంత్రి కామినేని రాకతో సర్వజనాస్పత్రిలో ఆంక్షలు
– అపస్మారక స్థితిలో ఉన్న భార్యను తీసుకొచ్చిన భర్త
– ఆటోను అనుమతించకపోవడంతో చేతులపై ఎత్తుకొచ్చిన వైనం
– భార్యకు అన్నం పెట్టలేక విలవిల్లాడిన మరో భర్త
– రోగుల బంధువుల బాధలు వర్ణనాతీతం
అనంతపురం మెడికల్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో! రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పర్యటన సందర్భంగా అనంతపురం సర్వజనాస్పత్రిలో ఆంక్షలు విధించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర వైద్యం కోసం వాహనాల్లో వచ్చిన వారిని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు, సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో ‘నడక’యాతన పడ్డారు. మధ్యాహ్నం వార్డుల్లో ఉన్న వారికి పాలు, భోజనం తీసుకెళ్లేందుకు సైతం బంధువులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు ఆకలితో అలమటించారు. శుక్రవారం సర్వజనాస్పత్రిలో సీటీ స్కాన్, నూతన భవనాల ప్రారంభోత్సవానికి మంత్రులు కామినేని, పరిటాల సునీత, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చారు. దీంతో ఉదయం తొమ్మిది నుంచే ఆస్పత్రిలో ఇక్కట్లు మొదలయ్యాయి. ప్రధానంగా గైనిక్, ఆర్థో, పీడియాట్రిక్, సర్జికల్ వార్డుల్లో ఉంటున్న వారికి అవసరమైన ఆహారం, ఇతరత్రా సామగ్రి తీసుకెళ్లేందుకు బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరినీ లోపలికి అనుమతించకపోవడంతో ఆస్పత్రి అధికారుల తీరుపై మండిపడ్డారు. కొన్ని వార్డుల వద్ద రోగుల బంధువులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే మంత్రికి రెడ్, గ్రీన్ కార్పెట్లు పరచి స్వాగతం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
భార్యను చేతులపై తీసుకొచ్చిన భర్త
అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన టి.రాధ, ప్రసాద్ భార్యాభర్తలు. గురువారం రాత్రి ఓ వివాహానికి హాజరై భోంచేశారు. వివాహ వేడుకల్లో ఉండగానే రాధ వాంతులు చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాతూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో భర్త ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చారు. వారొచ్చే సమయానికి రోగుల విశ్రాంతి భవనం ప్రారంభోత్సవం జరుగుతోంది. గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను లోపలికి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న రాధను భర్త చేతులపై ఎత్తుకుని రావడం చూసి అక్కడున్న వారు ‘అయ్యో పాపం’ అంటూ ఆవేదన చెందారు. అసలేం జరిగిందో అంటూ అతడి వెంట కొందరు పరుగు పరుగున వచ్చారు. అత్యవసర విభాగం వద్దకు తీసుకెళ్లి అడ్మిషన్ చేశారు.ఒకవేళ రాధ పరిస్థితి విషమంగా ఉండి ఉంటే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.
భార్యకు అన్నం పెట్టలేక..
హిందూపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన లింగప్ప, రత్నమ్మ భార్యాభర్తలు. రత్నమ్మకు కడుపునొప్పి ఉండటంతో 20 రోజుల క్రితం సర్వజనాస్పత్రిలోని గైనిక్ వార్డులో చేర్చారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో లింగప్ప ప్రతి రోజూ ఆస్పత్రిలో అన్నదానం చేస్తున్న చోట భోజనం చేసి.. కొంత అన్నాన్ని భార్యకు తీసుకెళ్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం కూడా ప్లేట్‌లో అన్నం పెట్టుకుని వెళ్తే సెక్యూరిటీ గార్డులు బయటకు వెళ్లిపోమన్నారు. దీంతో తాను ఆస్పత్రి వెనుకభాగంలో ఉంటానని, భార్యను పంపాలని చెప్పి వెళ్లాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. సుమారు రెండు గంటల పాటు ప్లేట్‌లో అన్నాన్ని అలాగే ఉంచుకుని గడిపాడు. దానిపై ఏమీ పడకుండా టవాల్‌ను కప్పి ఉంచాడు. చివరకు మంత్రి వెళ్లిపోయాక వార్డులోకి వెళ్లాడు.