సాక్షి, హిందూపురం: ప్రభుత్వాసుపత్రి బాత్‌రూంలో మృత శిశువు లభ్యం కావడం కలకలం రేపింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ చుట్టూ అల్లుకున్న ఈ కథ రోజంతా గందరగోళానికి తావిచ్చింది. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని పరిస్థితి. పోలీసుల రాకతో చిక్కుముడి వీడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ.. తీరా గర్భం దాల్చే సరికి భర్తకు భయపడి ఇలా వదిలించుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సీఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాలివీ.. పట్టణానికి సమీపంలోని సేవా మందిరానికి చెందిన ఆటో చంద్ర భార్య కమలమ్మ(32) శనివారం తెల్లవారుజామున కడుపునొప్పితో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది.
డాక్టర్ రాక మునుపే బత్‌రూంకు వెళ్లిన ఆమె.. అరగంట తర్వాత రక్తపు మరకలున్న దుస్తులతో బయటకు వచ్చింది. అక్కడున్న సిబ్బంది ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేసి అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత బాత్‌రూంలోకి వెళ్లిన సిబ్బంది ఓ కవర్‌లో చుట్టిపెట్టిన మృత శిశువును చూసి ఆందోళనకు లోనయ్యారు. వెంటనే విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమలమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. మొదట బుకాయించినా.. ఆ తర్వాత అసలు విషయాన్ని వివరించింది.
భర్తకు భయపడి..
చంద్ర, కమలమ్మ దంపతులకు ఐదేళ్ల కుమారుడు సంతానం. అయితే ఏడాది క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు భర్తకు చెప్పింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఎక్కడ భర్త కోప్పడతాడోనని దాచిపెట్టింది. ఎట్టకేలకు విషయం తెలియడంతో తొలగించుకోవాలని భర్త తేల్చిచెప్పాడు. ఆ మేరకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. నాటు వైద్యం కూడా తీసుకుంది. ఈ కోవలోనే స్కానింగ్ చేయించుకోగా బిడ్డకు అంగవైకల్యం ఉన్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో నెలలు నిండి కడుపునొప్పి రావడంతో శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరింది. అప్పటికే అబార్షన్‌కు ఇష్టారీతిన మందులు తీసుకోవడంతో బాత్‌రూంకు వెళ్లిన సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. జరిగిన పరిణామానికి భయపడిపోయిన కమలమ్మ బిడ్డను అక్కడే వదిలించుకుని వెళ్లిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మృత శిశువును కమలమ్మ దంపతులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment