రాస్తారోకో చేస్తుçన్న బాధితులు,సీపీఎం నాయకులు (ఇన్‌సెట్) మృతి చెందిన పురిటిబిడ్డ
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో పురిటిబిడ్డ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బాధితులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. మడకశిర సమీపంలోని చీపులేటి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భార్య నాగలక్ష్మి రెండవ కాన్పుకోసం ఆదివారం సాయంత్రం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షలు చేసి గర్భంలో బిడ్డ బాగుందని, రేపటి వరకు ఆగితే సాధారణ కాన్పు అవుతుందన్నారు. మొదటి బిడ్డకు సిజెరేషన్ చేయగా నాలుగేళ్లు తర్వాత జాగ్రత్తగా ఉంటూ రెండవకాన్పుకు ఆస్పత్రిలో చేరింది. తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఉదయం సిజేరియన్ చేసి కాన్పు చేశారు. అయితే బిడ్డ చనిపోయిందని డాక్టర్ తెలిపారు.
దీంతో నాగలక్ష్మి బంధువులు ఆగ్రహించారు. నిన్నటివరకు కడుపులో బిడ్డ బాగుందన్న వైద్యులు.. ఇప్పుడు ప్రాణం లేని బిడ్డను చేతికి ఇస్తారా అంటూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా సీపీఎం నాయకులు నిలిచి మృతశిశువుతో ఇందిరమ్మ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు తీసుకొచ్చారు. అనంతరం ఆందోళనకారులు ఆస్పత్రి గేటు వద్ద బైఠాయించారు. సీపీఎం నాయకులు వినోద్, రాము, రాజప్పలు మాట్లాడుతూ రూ.23 కోట్లతో మాతాశిశు ఆస్పత్రి కట్టారే గానీ సరిపడునంతమంది వైద్యులు లేరని, ఎమ్మెల్యే కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment