doctors negligance
-
డబ్బులు చెల్లిస్తేనే పేషెంట్‌ను చూడనిస్తాం
రాంగోపాల్‌పేట్: కిడ్నీ వ్యాధితో ఆస్పత్రికి వస్తే కరోనా సోకిందంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు 10 రోజుల నుంచి పేషెంట్‌ను చూపించడం లేదు. రూ. 5 లక్షల బిల్లు పెండింగ్ ఉందని, అది చెల్లిస్తేనే మీ వాడిని చూపిస్తామని ఆ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బుధవారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చోటు చేసికుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోరుట్లకు చెందిన రాజశేఖర్ (25) కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు గత నెల 27న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. చికిత్స నిమిత్తం విడతల వారీగా రూ.3 లక్షలు చెల్లించారు. అప్పటి నుంచి రోగికి చికిత్స అందిస్తున్న చెబుతున్న ఆస్పత్రి వర్గాలు అతడిని తమకు చూపించడం లేదన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడికి కరోనా సోకిందంటూ తమను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళను దిగారు. ఆస్పత్రి యాజమాన్యం డబ్బుల కోసం లేని రోగాన్ని అంటగడుతుందని వారు వాపోయారు. నడుచుకుంటూ ఆస్పత్రి వచ్చిన అతడికి కరోనా లక్షణాలు లేకున్నా 10 రోజుల నుంచి తమకు చూపించడం లేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం అడిగిన రూ.5 లక్షలు చెల్లించనందునే తమ కుమారుడిని చూపించడం లేదని అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నీ చెడిపోతే తన కిడ్నీ ఇస్తానని చెప్పానని, అప్పు చేసి రూ.3లక్షలు చెల్లించామని, తాము నిరు పేదలమని అంత డబ్బు ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. డబ్బు చెల్లిస్తేనే చూపిస్తామని కొందరు డాక్టర్లు చెప్పారని తన కుమారుడికి ఏమైనా జరిగితే ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసింది. బుధవారం అతడి కుటుంబ సభ్యులను లోపలికితీసుకెళ్లి చికిత్స పొందుతున్న రాజశేఖర్‌ను చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగుల సహాయకులను ఆస్పత్రి లోపలికి పంపించడం లేదని ఆ విషయం తెలియక బంధువులు అలా ఆరోపిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. కరోనా రోగులు ఉండటంతోనే వార్డులోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. అతనికి డయాలసిస్ నడుస్తుందని, చికిత్సకు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని వారు వివరించారు. వారు రూ.5లక్షల బిల్లు చెల్లించాల్సి ఉన్నా మానవతా దృక్పథంతో వారి ఇష్టం మేరకు డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కరోనా అనుమానానికి గర్భిణి బలి!
హన్మకొండ చౌరస్తా: కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఓ గర్భిణి ప్రాణాలను బలిగొంది. మృత శిశువుతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు అత్యవసర వైద్యం అందించాల్సిన వైద్యులు.. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూశారు. దీంతో 12 గంటల వేదన అనంతరం ఆమె తుదిశ్వాస విడిచింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన హరిప్రియ ఎనిమిది నెలల గర్భవతి. రెండు రోజుల క్రితం నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్త నాగరాజు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. గర్భంలో శిశువు మృతి చెందిందని గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)కి వెళ్లాలని సూచించారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన జీఎంహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే హరిప్రియ తీవ్ర ఆయాసంతో బాధ పడుతుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో సిబ్బంది ముట్టుకోవడానికి కూడా సాహసించలేదని భర్త నాగరాజు రోదిస్తూ తెలిపాడు. వైరస్ నిర్ధారణ కోసం నమూనాలు తీసుకుని పంపించారని, రాత్రంతా చికిత్స చేయకపోవడంతో హరిప్రియ తీవ్ర ఆయాసంతో నరకయాతన అనుభవించిందని పేర్కొన్నాడు. తీరా.. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైద్య సిబ్బంది ‘చావు’కబురు చెప్పారని నాగరాజు రోదిస్తూ చెప్పాడు. వైద్యులు సకాలంలో చికిత్స చేసి ఉంటే తన భార్య బతికేదని పేర్కొన్నాడు. వైరస్ అనుమానం ఉంటే చికిత్స చేయరా? అని నిలదీశాడు. చికిత్స చేశాం: హరిప్రియను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమా సరళాదేవి అన్నారు. అప్పటికే హరిప్రియ బీపీ, ఆయాసంతో బాధపడుతోందని, చికిత్స అందిస్తున్న క్రమంలో పల్మనరీ ఎంబాలిజం సమస్య ఎదురైందన్నారు. గర్భంలో మృత శిశువు, బీపీ ఎక్కువగా ఉన్న వారికి ఈ సమస్య వస్తుందన్నారు. తద్వారా రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లోకి చేరడం కారణంగా ఆమె చనిపోయిందని తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి మృతి చెందింది’
మియాపూర్: ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. ఈ సంఘటన మదీనాగూడ అర్చనా ఆస్పత్రి ముందు మంగళవారం జరిగింది. వివరాలు.. పటాన్‌చెరులోని కర్దనూర్ గ్రామానికి చెందిన పాండు, కవతి దంపతుల కూతురు పూజిత(18) మదీనాగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు డిసెంబర్ 26న కడుపునొప్పి రావడంతో పటాన్‌చెరులోని సాయిగణేష్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు అర్చన ఆస్పత్రికి తీసుకెళ్ళాలని సూచించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రికి అపెండిక్స్ ఆపరేషన్‌ను డాక్టర్లు పూర్తి చేశారు. రెండు రోజుల తర్వాత డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళవచ్చని సూచించారు. అంతలోనే అపెండిక్స్ గడ్డ పగిలిందని ఇన్ఫెక్షన్ అధికంగా అయిందని సూచించారని కుటుంబసభ్యులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. సోమవారం రాత్రి మళ్ళీ ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం వరకు బాగానే ఉన్నా 11 గంటల ప్రాంతంలో మృతి చెందింది. బీపీ నియంత్రలో లేనప్పుడు ఆపరేషన్ చేయడంతోనే మా అమ్మాయి పూజిత మరణించిందని వారు ఆరోపించారు. అనంతరం వారు ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. మియాపూర్ పోలీసులు ఆందోళనను విరమింపచేశారు. అపెండిక్స్ గడ్డ పగలడంతో పేగులకు ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆమె చనిపోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గర్భిణి అని చెప్పినా వినకుండా..
సాక్షి, శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ వేదనతో చేరిన గర్భిణిని రెండు రోజుల వరకు ఉంచుకుని, ఆ తర్వాత వైద్యులు వెనక్కి పంపేయడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు గత్యంతరం లేక స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం చేయించారు. జలుమూరు మండలం కామునాయుడుపేటకు చెందిన కింజరాపు నీలవేణికి నెలలు నిండటంతో 108 వాహనంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట ఆసుపత్రికి ఆశావర్కరు తిరుపతమ్మ సహాయంతో తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్సకు వైద్యులు లేరంటూ సాధారణ తనిఖీలు చేసి ఉంచారు. శనివారం ఉదయం గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే ఎనస్థీషియా డాక్టర్ వచ్చి తనిఖీ చేసి నీలవేణికి గుండె జబ్బు ఉందని, ఇక్కడ ఆపరేషన్ చేయలేమని వెళ్లిపోయారని భర్త అప్పలనాయుడు, కుటుంబ సభ్యులు పీ భారతి, ఎం నిర్మల, సత్యవతి వాపోయారు. ఈ విషయం చివరి నిమషంలో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మొదటి కాన్పు ఇక్కడే చేశారని, రెండో కాన్పునకు ఈ విధంగా చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ వైద్యులు ఎటువంటి కారణాలు చూపలేదని ఆపరేషన్ చేస్తామని హామీ ఇచ్చారని భర్త అప్పలనాయుడు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎనస్థీషియా డాక్టర్ ప్రసాదరావును వివరణ కోరగా నీలవేణికి థైరాయిడ్ ఉందని, గుండెకు సంబంధించిన జబ్బు ఉందని, రిస్క్ చేయలేక శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలని సూచించామన్నారు. అంతే తప్ప బలవంతంగా పంపలేదన్నారు. -
మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : స్థానిక 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన పుట్టిన బిడ్డ (నవజాత శిశువు) వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ చేయడంలో జాప్యం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే మృతి చెందాడని, వెంటనే ఆపరేషన్ చేసుంటే మా బాబు బతికే వాడని కొత్తూరు మండలం గూనబద్రకు చెందిన రుగడ ఏసుబాబు, లక్ష్మి అన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం 9 నెలలు ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మగ బిడ్డ పుట్టాడని ఆనందించామని అయితే తమ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండలేదని ఏసుబాబు చెప్పారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని, బాబు బతికేవాడని ఏసుబాబు అన్నారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడాదిన్నర కిందట ఏసుబాబుతో పోలాకి మండలం ముప్పిడికి చెందిన లక్ష్మితో వివాహమైంది. భార్య లక్ష్మి గర్భం దాల్చిన తరువాత శ్రీకాకుళంలో ఓ వైద్యురాలి వద్ద నిత్యం తనిఖీలు చేయించామని నెలలు నిండి నొప్పులు రావడంతో 14వ తేదీ రాత్రి 8.30 సమయంలో 108లో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఏసుబాబు చెప్పారు. అయితే రాత్రంతా తన భార్య నొప్పులతో ఇబ్బంది పడిందని సాధారణ తనిఖీలు చేసిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన గంట కల్లా మృతి చెందాడని అదే ఆపరేషన్ రాత్రి చేసుంటే తమకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రస్తుతం తన భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు. అయితే ఈ సంఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వైద్యపరమైన కారణాలతోనే మృతి ఈ సంఘటనపై ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎన్.పద్మావతి మాట్లాడుతూ వైద్యపరమైన కారణాలతో బిడ్డ మృతి చెందినట్టు చెప్పారు. గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించామన్నారు. గర్భిణి ప్రసవానికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయలేమని సాధారణ ప్రసవానికి ప్రయత్నించి అనుకూలంగా లేకపోతే ఆపరేషన్ చేస్తామని, ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి ప్రయత్నించి చివరి క్షణంలో ఆపరేషన్ చేశామన్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్టు చెప్పారు. చిన్నపిల్లల వైద్యుడు నవీన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటికి ఊపిరి ఉందని, కొద్ది క్షణాల్లోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తమ ప్రయత్నం చేశామని శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నించే లోగా మృతి చెందినట్టు తెలిపారు. -
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
రాజేంద్రనగర్: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు మృతిచెందారని పీరంచెరువులోని షాదాన్ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం మీర్జాగూడ ప్రాంతానికి చెందిన సురేష్, సంగీత(25) భార్యాభర్తలు. గర్భిణి అయిన సంగీత మూడు నెలలుగా రాజేంద్రనగర్ పరిధిలోని షాదాన్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. నెలలు నిండడంతో పది రోజులుగా ఆమె నిత్యం ఆస్పత్రికి వచ్చి చెకప్ చేసుకొని వెళ్లింది. ఈ నెల 8న ఆమెను డాక్టర్లు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అయితే, శనివారం ఉదయం నుంచి బాగానే ఉంది. రాత్రి 9 గంటల సమయంలో సంగీతతో పాటు కడుపులో ఉన్న శిశువు మృతి చెందిందని డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సంగీత మృతిచెందిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బంధువులను సముదాయించారు. పంచనామా నిర్వహించి రాత్రి ఉస్మానియా మార్చురీకి సంగీత మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం మరచిన వేళ..
కర్నూలు, బొమ్మలసత్రం: తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఐసీయూలో చికిత్స చేయకుండా కింద పడుకోబెట్టిన ఘటన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బనగానపల్లె పాతబస్టాండ్ సమీపంలో శనివారం తలకు గాయాలై ఓ వ్యక్తి పడి ఉండడాన్ని చూసిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న విశయాన్ని గుర్తించిన 108 సిబ్బంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బాధితుడిని ఐసీయూలోకి తీసుకెళ్లి నేలపై పడుకోబెట్టారు. కనీసం సరైన చికిత్స కూడా అందించలేదు. వార్డులో మంచాలు ఖాళీగా ఉన్నా.. బాధితుడిని కింద పడుకోబెట్టడమే గాక, మెరుగైన చికిత్స అందించకుండా వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి వెంట ఎవరూ లేరు అని తెలిసి కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం పలు విమర్శలకు దారి తీస్తోంది. -
కొడుకునైనా కాపాడండయ్యా..!
మూడు రోజుల క్రితం కన్నుమూసిన కన్న కూతురి మృత్యు ఘంటికలు గుండెల్లో ఇంకా విషాద గీతికలై మార్మోగుతూనే ఉన్నాయి. ఇంతలో అమ్మా గొంతు నొప్పంటూ.. అచ్చం కూతురిలాగే కొడుకు కూడా కూలబడ్డాడు. క్షణాల వ్యవధిలో ఆస్పత్రికి తరలించారు. కూతురిని పొట్టన పెట్టుకున్న డిప్తీరియానే కొడుకునూ మంచాన పడేసిందని వైద్యులు తేల్చారు. కన్నీరైన ఆ కన్నపేగుకు భూమిపై కాళ్ల నిలబడలేదు.. అయ్యా కొడుకును రక్షించండంటూ వైద్యుల కాళ్లావేళ్లా పడగా.. గుంటూరు జిల్లా తీసుకెళ్లాలని సెలవిచ్చారు. కూతురు లేదనే కడుపు కోత కన్నీటి ధారవుతుంటే... కళ్లు మూతలు పడుతున్న కొడుకును తీసుకుని గుంటూరు జ్వరాల ఆస్పత్రికి చేరారు. నాలుగు గంటలపాటు ఒక్కరు కూడా సమాధానం చెప్పిన వాళ్లు లేరు.. ఈ బిడ్డనైనా రక్షించండి సారూ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. చివరకు వారి వేదన విని స్థానికులు ఆందోళనకు ఉపక్రమించడంతో వైద్యులు కదిలివచ్చారు. బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. గుంటూరు రూరల్: ఆ తల్లిదండ్రుల వేదన తీర్చలేనిది. అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం భూదేడు గ్రామానికి చెందిన జన్నే మహేంద్ర, రాధిక దంపతులకు స్నేహలత(6), సాయితేజ సంతానం. మహేంద్ర గ్రామంలో బాడుగ ఆటోకు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. 15 రోజుల క్రితం స్నేహలతకు గొంతు నొప్పి వచ్చింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజులు చికిత్స చేసిన వైద్యులు స్నేహలతను కాపాడలేకపోయారు. మూడు రోజుల చిన్నారి ఈ లోకాన్ని వీడి వెళ్లింది. ఆ కుటుంబం తీరని శోకంలో మునిగింది. కొడుకుకూ అదే వ్యాధి ఈ నెల 19వ తేదీ రాత్రి ఏడు గంటలకు కుమారుడు సాయితేజ కూడా గొంతు నొప్పి అంటూ బాధపడటంతో తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తీసుకుళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లాలోని బాపట్ల వైద్యశాలకు వెళ్లాలని రిఫర్ చేశారు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు, మేనమామ రాజుతో కలిసి బాపట్లకు బయలుదేరారు. శనివారం ఉదయం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు వ్యాధికి సంబంధించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వరకు బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పలేదని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. అనంతరం వైద్యులు నగర శివారుల్లోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఆదివారం మధ్యాహ్నం నగర శివారుల్లోని జ్వరాల ఆసుపత్రికి చేరుకోగా 12 గంటకు వెళ్లిన వారిని అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. తన కుమారుడి పరిస్థితి బాగోలేదని, జరిగిన ఉదంతాన్ని చెప్పి ఆసుపత్రిలో చేర్పించుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆ తల్లిదండ్రులు వేడుకున్నారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. చలించిన స్థానికులు సాయంత్రం 4–30 గంటల సమయంలో ఆసుపత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రుల వద్దకు స్థానికులు వచ్చారు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్ద ఆందోళన చేసేందుకు ఉపక్రమించడంతో గమనించిన వైద్యులు సాయితేజను అడ్మిట్ చేసుకున్నారు. కుమార్తెను పోగొట్టుకుని గుండెలవిసిన తల్లిదండ్రులకు వైద్యులు నిర్లక్ష్యం మరింత కడుపు కోతను పెంచుతోంది. అయ్యా మా బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండంటూ ప్రతి ఒక్కరినీ ఆ కన్నపేగు వేడుకుంటోంది. -
ప్రాణం తీసిన ఆలస్యం..
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. వారిని ఆసుపత్రి సెక్యూరిటీగార్డులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సుల్తాన్‌బజార్ ఎస్ఐ లింగారెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, పలుగు తాండాకు చెందిన మహేందర్ భార్య పద్మ(25) ఈ నెల 16న రెండో కాన్పుకోసం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. ఆదివారం తెల్లవారు జామున ఆమెకు నొప్పులు రావడంతోత నైట్ డ్యూటీ డాక్టర్ టాబ్లెట్ ఇవ్వడంతో నిద్రపోయింది. ఉదయం 5 గంటల సమయంలో పద్మకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ శిశువు బతికి ఉండేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ శిశువు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెలవులు వస్తే అంతే.. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వివాదాలకు నిలయంగా మారుతుంది. సెలవురోజుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పేద మహిళలు, నవజాత శిశువులకు ప్రాణసంకటంగా మారుతోంది. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆసుపత్రిలో మాత, శిశువుల ప్రాణా నష్టాలు అధికంగా ఉంటున్నాయి. తాజగా పద్మ గర్భిణికి ప్రతి నెల ఈ ఆసుపత్రిలోనే అన్ని వైద్య పరీక్షలు జరిగి, స్కానింగ్‌లో సైతం శిశువు ఆరోగ్యంగా ఉన్నా వైద్యుల ఆలస్యం కారణంగా కడుపులోనే శిశువు మృతి చెందడం గమనార్హం. ఈ విషయమై ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
ఆస్పత్రిలో పురిటిబిడ్డ మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో పురిటిబిడ్డ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బాధితులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. మడకశిర సమీపంలోని చీపులేటి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భార్య నాగలక్ష్మి రెండవ కాన్పుకోసం ఆదివారం సాయంత్రం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షలు చేసి గర్భంలో బిడ్డ బాగుందని, రేపటి వరకు ఆగితే సాధారణ కాన్పు అవుతుందన్నారు. మొదటి బిడ్డకు సిజెరేషన్ చేయగా నాలుగేళ్లు తర్వాత జాగ్రత్తగా ఉంటూ రెండవకాన్పుకు ఆస్పత్రిలో చేరింది. తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఉదయం సిజేరియన్ చేసి కాన్పు చేశారు. అయితే బిడ్డ చనిపోయిందని డాక్టర్ తెలిపారు. దీంతో నాగలక్ష్మి బంధువులు ఆగ్రహించారు. నిన్నటివరకు కడుపులో బిడ్డ బాగుందన్న వైద్యులు.. ఇప్పుడు ప్రాణం లేని బిడ్డను చేతికి ఇస్తారా అంటూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా సీపీఎం నాయకులు నిలిచి మృతశిశువుతో ఇందిరమ్మ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు తీసుకొచ్చారు. అనంతరం ఆందోళనకారులు ఆస్పత్రి గేటు వద్ద బైఠాయించారు. సీపీఎం నాయకులు వినోద్, రాము, రాజప్పలు మాట్లాడుతూ రూ.23 కోట్లతో మాతాశిశు ఆస్పత్రి కట్టారే గానీ సరిపడునంతమంది వైద్యులు లేరని, ఎమ్మెల్యే కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
నిర్లక్ష్యపు పొర కమ్మేసింది!
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి రాయలసీమలోనే అతి పెద్దది. పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య విద్యార్థులు, అంతే స్థాయిలో నర్సులు ఉన్నా బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. ఇక్కడికి వచ్చే వారికి తూతూ మంత్రంగా వైద్యం అందించి ఆపరేషన్లు వాయిదా వేయడంతో ప్రజలు నాటు వైద్యంవైపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా నాటు వైద్యాన్ని చేయించుకునేందుకు వెళ్లిన వారిలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. కర్నూలులో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి రాయలసీమ ప్రాంతానికే తలమానికం. నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 మంది వరకు పీజీ వైద్యులు, 30 మంది వరకు పారా మెడికల్ సిబ్బంది ఈ విభాగం సొంతం. అన్ని రకాల కంటి సమస్యలకు ఇక్కడ అధునాతన వైద్యం లభిస్తుందని ఆశించి దూర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో వైద్యులు చికిత్స చేస్తుండగా, ఆ మరుసటి రోజున అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రతి ఆపరేషన్ థియేటర్ రోజున ఒక్కో యూనిట్ పాల్పంచుకుంటుంది. దాదాపుగా అన్ని రకాల కంటి జబ్బులకూ ఇక్కడ వైద్యం చేసేందుకు పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి పంపించింది. ఇటీవల సైతం డీఎంఈ కార్యాలయం నుంచి వైద్యపరికరాలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయాల్సిన బాధ్యత ఇక్కడి వైద్యబృందంపై ఉంది. తూతూ మంత్రంగా ఆపరేషన్లు.. ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని సాధించిన ఈ ఆసుపత్రిలో అత్యధికంగా కంటి శుక్లాల ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇతర కంటి జబ్బులు, కంటి గాయాలకు అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉన్నా ఇక్కడి వైద్యులు పెద్దగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు 5 నుంచి 10లోపు ఆపరేషన్లు మాత్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఆసుపత్రిలోని మంచాలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విసిగి వేసారి నాటు వైద్యం వైపు ! ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని ఎంతో ఆశగా వస్తున్న రోగులకు ఇక్కడ నిరాశే ఎదురవుతోంది. రోగులను పరీక్షించిన వైద్యులు మందులు ఇచ్చి మళ్లీ రావాలంటూ తిప్పి పంపిస్తున్నారు. ఇలా నాలుగైదు సార్లు తిరిగి వేసారిన రోగులు చివరకు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, సి. బెళగల్, కర్నూలు రూరల్ గ్రామాల ప్రజలు ఇటీవల నాటు వైద్యం వైపు చూస్తున్నారు. మహానందిలో దేవాలయం వద్ద ఓ వ్యక్తి కంట్లో పసురు వేస్తే కంట్లో పొర పోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆటోలను మాట్లాడుకుని రోగులు మహానందికి వెళ్లి వస్తున్నారు. ఇలా వెళ్లి ఆదివారం ఉదయం సోమయాజులపల్లి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇందులో 9 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందితే తాము నాటు వైద్యం కోసం ఎందుకు వెళ్తామని క్షతగాత్రులు ప్రశ్నిస్తున్నారు. -
అయ్యో..పాపం!
చీరాల రూరల్: చీరాల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు చేసే పనిని నర్సులు చేస్తుండడంతో పుట్టిన పండంటి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి నర్సులు వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి పండంటి మగబిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగింది. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ప్రాంగణంలో బాధితులు ఆందోళనకు దిగారు. ఇదీ..జరిగింది స్థానిక జాన్‌పేటకు చెందిన జొన్నలగడ్డ స్పందన, అశోక్‌కుమార్ దంపతులు. స్పందన నిండు గర్భిణి. మూడో కాన్పు కోసం ఆమె భర్త, బంధువులు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. గతంలో ఆమె మొదటి కాన్పు కూడా ఇదే ఆస్పత్రిలో చేశారు. అప్పుడు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. రెండో కాన్పు కూడా గతంలో ఇదే ఆస్పత్రిలో జరిగింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమెను గుంటూరు తరలించారు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతవరకూ ఓకే.. మూడో కాన్పు కోసం ఆమెను భర్త, బంధువులు కలిసి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సులు కాన్పు చేసేందుకు ప్రయత్నించారు. 10 గంటల సమయంలో డ్యూటీకి వచ్చిన వైద్యులు ఆమెను గమనించి పరిస్థితి విషమంగా ఉందని, మిమ్మల్ని ఎవరు వైద్యం చేయమన్నారని సిబ్బందిని మందలించారు. వైద్యులు వైద్యం చేసేందుకు ప్రయత్నించిన కొద్ది సేపటికే మగబిడ్డ చనిపోయింది. బయటకు వెళ్లాలని ఆదేశం బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను తీసుకుని త్వరగా బయటకు వెళ్లాలని కేకలేశారు. తన కుమారుడు ఎందుకు చనిపోయాడంటూ తండ్రి అశోక్‌కుమార్‌తో పాటు అతని బంధువులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు వద్ద వాపోయారు. ఉదయం 6:30 గంటలకు ఆస్పత్రికి వస్తే వైద్యులు రాలేదని, నర్సులు వైద్యం చేసేందుకు ప్రయత్నించారని, దాని కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. రెండో కాన్పు కోసం తన భార్యకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని, ఇదే విషయాన్ని నర్సులకు కూడా చెప్పామని, వారు సాధారణ కాన్పు చేసి బిడ్డను తీస్తామని చెప్పి అన్యాయంగా చంపేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితులు తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను విచారించారు. సంఘటన జరిగిన సమయంలో తాను లేనని, విచారించి తగు చర్యలు తీసుకుంటానని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!
వినుకొండటౌన్: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన వినుకొండలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి భర్త ఆంజనేయులు చెప్పిన వివరాల మేరకు.. నూజెండ్ల మండలం వీ అప్పాపురం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మి (24)కి కాన్పులు రావడంలో ఈ నెల 12వ తేదీన వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజులపాటు గర్భిణి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు.. గురువారం కాన్పు దగ్గర పడగానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా మధ్యాహ్న సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఫిట్స్ రావడంతో ప్రైవేటు వైద్యులు గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరు వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మి మృతి చెందింది. ప్రభుత్వ వైద్యులు సక్రమంగా వైద్యం చేయకపోవడంతోనే తన భార్య చనిపోయిందని ఆంజనేయులు విలపించాడు. -
‘గాంధీ’లోఅంతే!
అసలే వేసవి. మండుతున్న ఎండలు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్. ఈ పరిస్థితిలో ఫ్యాన్లు, ఏసీలు లేకుంటే మామూలు వ్యక్తులే ఉక్కపోతతో అల్లాడే పరిస్థితి. అలాంటిది ఇక జబ్బులతో బాధపడుతున్న రోగులకు కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం దారుణం. ఈ దుస్థితి ప్రస్తుతం ప్రఖ్యాత గాంధీ ఆస్పత్రిలో నెలకొంది. మండు వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయక ఇక్కడ రోగులు నానా యాతనపడుతున్నారు. వీరి బాధల్ని పట్టించుకునే వారే లేరు. గాంధీఆస్పత్రి: ఒక పక్క సూర్యుడి ప్రతాపం.. మరో పక్క అధికారుల నిర్లక్ష్యం.. వెరసీ రోగులు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్రాను. గాంధీ ఆస్పత్రిలో ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో తల్లడిల్లుతున్నారు. గాంధీ ఆస్పత్రిలోని పలు విభాగాల్లో 328 ఏసీలు ఏర్పాటు చేయగా వాటిలో సింహభాగం పనిచేయడంలేదు. ఓపీ, అత్యవసర, ఇన్ పేషెంట్ వార్డుల్లో ఉన్న 1,247 ఫ్యాన్లలో సగానికి పైగా మరమ్మతులకు గురయ్యాయి. ఎండాకాలంతో పాటు నిరుపేద రోగులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలోనే ఏసీలు, ఫ్యాన్లు మరమ్మతులు చేయించేందుకు ఆస్పత్రి పాలన యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ నెల వచ్చినప్పటికీ ఇంతవరకు మరమ్మతులకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పా లన యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోం దని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువులు..హాహాకారాలు చేస్తున్న బర్న్స్‌వార్డు రోగులు ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలోని స్టెప్‌డౌన్ వార్డు ఎన్ఐసీయూ, పీఐసీయూల్లో ఏసీలు పని చేయకపోవడంతో శిశువులు, చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. వార్మర్ల వేడితోపాటు ఇతర పరికరాల నుంచి వెలువడే ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఈ వార్డులో ఏసీలు తప్పనిసరి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏసీలు కొన్నేళ్లుగా పనిచేయడంలేదని, దీంతో శిశువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిబ్బందితోపాటు చిన్నారుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గైనకాలజీ లేబర్‌వార్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బర్న్స్ వార్డులోని రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ వార్డుల్లో కూడా ఏసీలు పనిచేయకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో కాలిన గాయాలతో బాధకు తాళలేక హాహాకారాలు చేసున్న రోగులకు వారి సహాయకులే పేపర్లు, అట్టలతో గాలి విసురుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. అత్యవసర విభాగాలతోపాటు ఆపరేషన్ థియేటర్లు, రౌండ్ ది క్లాక్ సేవలు అందించే డ్యూటీ డాక్టర్ల గదుల్లోని ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. ఆస్పత్రి పాలన యంత్రాంగానికి పలుమార్లు సమాచారం అందించినా ఫలితం లేకపోయిందని వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ ఒకే ఒక్కడు.. మినీ గ్రామాన్ని తలపించే గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడం గమనార్హం, గ్రేడ్ వన్ కేటగిరీలో ఒక ఎలక్ట్రీషియన్, గ్రేడ్ టూలో మరో ఇద్దరు ఎలక్ట్రీషియన్ పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టులో పనిచేసేవారు పదవీ విరమణ పొందడం, నూతన నియామకాలు చేపట్టకపోవడంతో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్ ఒక్కరే అందుబాటులో ఉంటున్నాడు. రెండు రోజుల్లో మరమ్మతులు చేస్తాం.. మరమ్మతులకు గురైన ఏసీలు, ఫ్యాన్లను రెండు రోజుల్లో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తాం. మరమ్మతులల కోసం మూడు నెలల క్రితమే టెండర్లు పిలిచాం, టెండరు దక్కించుకున్న ఎల్–1 టెండరుదారు ఇంతవరకు పత్తా లేకుండా పోయాడు, ఎల్–2 టెండరుదారుకు ఖరారు చేసి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తెసాం. – శ్రవణ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... హిందూపురం సంజీవరాయనిపల్లికు చెందిన నాగరత్నమ్మ (33) పురిటి నొప్పులతో 12న హిందూపురం ఆస్పత్రిలో చేరింది. గర్భిణి పరిస్థితిని గమనించిన వైద్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆమెను అర్థరాత్రి 12 గంటల సమయంలో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు కాస్త జాప్యం చేయడం పెద్ద సమస్యగా మారింది. ఓ గైనిక్ వైద్యురాలు, అనస్టీషియా వైద్యురాలు 13న రాత్రి సిజేరియన్ చేశారు. ఆపరేషన్ జరిగే సమయంలోనే బాలింతకు ఫిట్స్ వచ్చాయి. అప్పటికే గుండె ఫంక్షనింగ్ తక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. సిజేరియన్ చేయగా బాబు జన్మించాడు. అప్పటికే నాగరత్నమ్మ గుండె ఫెయిలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అనస్తీషియా వైద్యులు బాలింతను ఏఎంసీ (అక్యూట్ మెడికల్ కేర్)కు తరలించి వెంటిలేటర్ ద్వారా శ్వాసనందించారు. ఉదయం 8.30 గంటల సమయంలో బాలింత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త సురేష్‌తో పాటు వారి బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు ప్రయత్నించారనీ.. కాకపోవడంతోనే సిజేరియన్ చేశారని గైనిక్ హెచ్ఓడీ షంషాద్‌బేగం చెప్పారు. నాగరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. -
పెద్దాస్పత్రి కాదు.. నిర్లక్ష్యాస్పత్రి
- నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల ఉదాసీనత - చిన్నారి మృతితో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు - సర్వజనాస్పత్రిలో డాక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు అనంతపురం న్యూసిటీ: ‘నాన్న.. మదన్ లేయ్ రా బంగారు. పొద్దున్నే అమ్మా నాకు కాయ కావాలా అన్నావ్ కదనాన్నా... అన్నీ ఉన్నాయప్ప లేయ్. పొద్దున్నంతా మాట్లాడావ్... ఇక్కడికొచ్చే వారకూ బాగుంటివి కదప్పా... భగవంతుడా.. అప్పుడే నా బిడ్డకు నూరేళ్లు నిండాయా. ఏం పాపం చేశామయ్యా మేము.. మాకు ఇంత అన్యాయం చేశావు’ అంటూ 19 నెలల బిడ్డను పోగొట్టుకున్న మలకవారిపల్లి(అమడగూరు మండలం, కదిరి)కి చెందిన రమణమ్మ బోరున విలపించింది. కళ్లముందే నవమాసాలు మోసి కన్న బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్న పిల్లల వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని ఆ తల్లితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల బాధ్యతారాహిత్యం... చిన్నారి మృతి చెందిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాల మేరకు... అమడుగూరు మండలం మలకవారిపల్లికు చెందిన సురేష్‌బాబు, రమణమ్మలు దంపతులు. వీరికి మదన్‌కుమార్ అనే 19 నెలల చిన్నారి ఉన్నాడు. మదన్‌కు ఈ నెల 13న వాంతులు అయ్యాయి. దీంతో కదిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మందులు రాసి ఇంటికి పంపారు. కడుపు ఉబ్బడంతో పాటు మూత్రం రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు కదిరి వైద్యుల సూచన మేరకు గురువారం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డుకు వెళ్లగా అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఆర్ (సీనియర్ రెసిడెంట్) బయటకెళ్లండి ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణమ్మ, సురేష్ దంపతులు మేడమ్ కడుపు ఉబ్బరంగా ఉందని చూడాలని వేడుకున్నారు. ఓపీ టికెట్ తీసుకొనిరావాలని ఎస్ఆర్ వారిని ఆదేశించారు. దీంతో సురేష్‌బాబు పరుగన ఓపీ టికెట్ కోసం వెళ్లి అక్కడ అడ్మిషన్ రాయించుకుని వచ్చేందుకు వెళ్లాడు. భర్త వచ్చేలోపు పిల్లాడు కళ్లుమూతలు మూయడంతో రమణమ్మ కేకలు వేసింది. అప్పటికి తేరుకున్న ఎస్ఆర్ బాబుకు స్టెత్‌తో పరీక్షించగా హార్ట్ ఫంక్షనింగ్ తక్కువగా వచ్చింది. దీంతో ఊపిరి తీసుకోకపోవడంతో అంబూ ద్వారా కృత్రిమశ్వాస ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి మదన్‌కుమార్ మృతి చెందాడని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కుటుంబీకులు బోరున ఏడ్చుకుంటూ ఉండిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నా బిడ్డ మృతి చెందాడని రమణమ్మ ఆరోపించారు. వార్డుకు వెళ్లిన వెంటనే చూసింటే బిడ్డకు ఈ గతి పట్టేది కాదయ్యనని కన్నీరు మున్నీరైంది. చివరికి ఏమీచేయలేక సురేష్‌బాబు, రమణమ్మ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టూటౌన్ సీఐ యల్లంరాజు, ఔట్‌పోస్టు పోలీసులు త్రిలోక్, రాము వారిని తమ సొంతూరుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. మా ప్రయత్నం చేశాం - మల్లీశ్వరి ,హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం బాబు ముందుగానే మృతి చెందాడు. ఎస్ఆర్ సకాలంలో స్పందించి అంబూ ద్వారా కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా ప్రయత్నం మేం చేశాం. వైద్యుల తప్పేమీ లేదు. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
ధర్మవరం టౌన్: ధర్మవరం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృత్యువుపాలైంది. పట్టణంలోని లోనికోటకు చెందిన హసీఫా శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. శిశువు ఉమ్మనీరు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. అయితే ఆ సమయంలో చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకుని తిరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడినా శనివారం ఉదయం మళ్లీ క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది ఎదురవడంతో చిన్నారి తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్ వెంకటేశ్వర్లు కోసం చిన్నపిల్లల వార్డుకు వెళితే యథావిధిగా అందుబాటులో లేడు. దీంతో వారు ఆ చిన్నారిని తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యుడు చెప్పడంతో రోదిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివాదం ముదరడంతో పట్టణ ఎస్సై జయానాయక్ అక్కడికి చేరుకుని బాధితులను శాంతపరిచారు. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. సూపరింటెండెంట్ రామలక్ష్మి చిన్నపిల్లల డాక్టర్ సెలవులో ఉండటంతోనే బయట చికిత్స చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. చిన్న పిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం తాను డ్యూటీలో ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. -
‘సదరం’గం
అసలే దివ్యాంగులు. జిల్లా నలుమూలల నుంచి అష్టకష్టాలు పడి సర్వజనాసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సదరం శిబిరం అస్తవ్యస్తంగా మారడంతో వీరికి చుక్కలు కనిపించాయి. వైకల్య ధ్రువీకరణ దరఖాస్తులు తీసుకునేందుకు.. పరీక్షలు చేయించుకునేందుకు ఎదుర్కొన్న అవస్థలు వర్ణనాతీతం. ఇలా మధ్యాహ్నం దాటిపోవడంతో వైద్యులు ఇంటిముఖం పట్టారు. దిక్కుతోచని దివ్యాంగులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో శాంతించారు. ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా శిబరం నిర్వహిస్తామనడంతో వెనుదిరిగారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పోయిన చిన్నారి ప్రాణం
- హృదయ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - రంగంలోకి దిగిన పోలీసులు అనంతపురం మెడికల్ : అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది. తమ బిడ్డ మరణానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన భాగ్యలక్ష్మీ, ఉదయ్‌కుమార్ దంపతులకు మూడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం జ్వరం రావడంతో అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్ శ్రీనివాసులు.. నాలుగు రకాల మందులు ఇచ్చారు. ఇంటికెళ్లి మందులు వేయగానే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే ఆటోలో అనంతపురానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అంతలోనే టూటౌన్ పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఆస్పత్రి వద్ద గొడవ చేయడం తగదని, ఏదైనా ఉంటే స్టేషన్లో కేసు పెట్టాలని సూచించారు. అయినా వారు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. బిడ్డ మృతదేహంతో తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడున్న వారి హృదయాలు చలించిపోయాయి. ఘటనపై డాక్టర్ శ్రీనివాసులును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘పాల పొర పోవడం వల్లే బిడ్డ చనిపోయినట్టున్నాడు. పోస్టుమార్టం చేస్తే వాస్తవాలు తెలుస్తాయి’ అని అన్నారు. -
ఇదేం సర్కారు వైద్యం !
–‘అత్యవసర’ చికిత్స కోసం సర్వజనాస్పత్రికి బాలుణ్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు – సర్జికల్ వార్డులో అడ్మిషన్.. పత్తాలేని డాక్టర్ – ప్రైవేట్‌కు రెఫర్ చేసిన హౌస్సర్జన్లు – కమీషన్ కోసం సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకుల కక్కుర్తి ప్రాణాపాయ స్థితిలో బిడ్డ.. అడ్మిషన్ పుస్తకం కోసం వెళితే కౌంటర్లో పత్తాలేని సిబ్బంది.. ఏం చేయాలో తెలీక రోదిస్తూ నిలబడిపోయిన తల్లి.. కొడుకు పరిస్థితి చూసి ‘ఓరి దేవుడా’ అంటూ కుప్పకూలిన తండ్రి.. వార్డులో జాడలేని వైద్యుడు.. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ అంబులెన్స్ నిర్వాహకుల హడావుడి.. కమీషన్ సంగతేంటని సిబ్బంది గోల.. ఇదీ జిల్లాకే తలమానికంగా ఉన్న సర్వజనాస్పత్రిలో దుస్థితి. అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రాణాలు కాపాడండయ్యా అని బాధితులొస్తే.. ప్రైవేట్‌కు వెళ్లండయ్యా అంటూ పంపించేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఓ ఘటన బాధిత కుటుంబ సభ్యులనే కాకుండా అక్కడున్న వారినీబాధించింది. ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన హసేన్, పర్వీన్ దంపతుల కుమారుడు ఇబ్రహీం (8) గురువారం సాయంత్రం ఇంటి వద్ద పిల్లలతో కలిసి ఎద్దుల బండిపై ఆడుకుంటూ కింద పడ్డాడు. ఛాతీ వద్ద చొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయింట్మెంట్ ఇచ్చి పంపాడు. అయితే.. శుక్రవారం ఉదయం పిల్లవాడికి నొప్పి అధికమైంది. దీంతో తల్లిదండ్రులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టారు. అడ్మిషన్ అవసరమని డ్యూటీ డాక్టర్ చెప్పడంతో పుస్తకం కోసం తల్లి కౌంటర్ వద్దకు వెళ్లగా..అక్కడ సిబ్బంది లేరు. పది నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఓ ఉద్యోగి పుస్తకం ఇవ్వగానే.. ఆమె అత్యవసర విభాగానికి వెళ్లింది. అక్కడి నుంచి సర్జికల్ వార్డుకు పంపారు. వార్డులో డ్యూటీ డాక్టర్ పత్తాలేరు. నలుగురు హౌస్సర్జన్లు ఉన్నా ఫలితం శూన్యం. ‘నా బిడ్డను బతికించండయ్యా’ అంటూ తల్లి ప్రాధేయపడింది. దీంతో హౌస్సర్జన్లు డ్యూటీ డాక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. అక్కడి ఉంచి ఏం సమాధానం వచ్చిందో తెలీదు కానీ.. ‘ఇక్కడ వైద్యం చేయడానికి డాక్టర్లు లేరు.. మా మాట విని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి చిరునామాను కూడా పేపర్ మీద రాసిచ్చారు. ఇక్కడి పరిస్థితిని చూసి తండ్రి హసేన్ వార్డు బయటే కుప్పకూలిపోయి తల కొట్టుకున్నాడు. కమీషన్ కోసం వాగ్వాదం బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఒకవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా..మరోవైపు వైద్య సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. అత్యవసర విభాగం వద్దకు ఈ కేసు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇద్దరు అంబులెన్స్ నిర్వాహకులు నీడలా వెంటాడారు. సర్జికల్ వార్డులో హౌస్సర్జన్లు ప్రైవేట్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో వైద్యసిబ్బంది బేరం మొదలుపెట్టారు. ఓ ఎఫ్ఎన్ఓ అయితే ఏకంగా అంబులెన్స్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ‘వార్డు నుంచి ఎవరు ఫోన్ చేశారు.. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నా. అట్ల మీరే వచ్చి తీసుకెళ్తే ఎలా? మా కమీషన్ సంగతేంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు అంతా కలిసి ఆ బాలుణ్ని ప్రైవేటు ఆస్పత్రికి పంపించివేశారు. డాక్టర్ ఎవరో తెలియదట! సర్జికల్ వార్డులో డాక్టర్ ఎవరూ లేకపోవడంతో ఇబ్రహీం పరిస్థితిని హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయనకు ఫోన్ చేయగా ‘సార్ సర్జరీలో ఉన్నారు’ అంటూ అవతల వ్యక్తి సమాధానం ఇచ్చారు. వార్డులో ఉన్న హౌస్‌సర్జన్లను డ్యూటీ డాక్టర్ ఎవరని అడగ్గా ‘తెలియదు’ అని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. -
అయ్యో...ఫిజియో లేదయ్యో..!
– రెండ్రోజులుగా అందుబాటులో లేని ఉద్యోగులు – అవస్థలు పడుతున్న బాధితులు – సర్వజనాస్పత్రిలో దయనీయ పరిస్థితి అనంతపురం మెడికల్ : ఇక్కడ హాయిగా కుర్చీలో కూర్చొని కునుకుతీస్తున్న వ్యక్తి పేరు రంగారెడ్డి (72). అనంతపురంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నాడు. కుడి భుజం, మోకాలు నొప్పిగా ఉండడంతో ఈనెల 13, 14 తేదీల్లో సర్వజనాస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. 16వ తేదీ మరోసారి రావాలని చెప్పడంతో సోమవారం వచ్చాడు. సిబ్బంది లేరు. తిరిగి మంగళవారం వచ్చాడు. మధ్యాహ్నం అయినా ఎవరూ రాలేదు. ఫిజియోథెరపీ చేసే గదిలోనే ఉంటే ఎవరొచ్చినా లేపి వైద్యం చేస్తారనుకుని ఇలా నిద్రలోకి జారుకున్నాడు. చివరకు ‘డ్యూటీ సమయం’ ముగిసినా ఎవరూ రాకపోవడంతో నిరాశతో నిట్టూర్పుగా ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. పక్షవాతమొచ్చినా..కాళ్లూచేతులు పడిపోయినా.. కదలికలు తెప్పించగల శక్తి ఫిజియోథెరపీ వైద్యానికి ఉంది.నడుమునొప్పి.. మెడ నొప్పి.. వెన్నునొప్పి.. ఇలా ఏ నొప్పి నుంచైనా ఉపశమనం కల్పించగల శక్తి ‘ఫిజియోథెరపీ’కి ఉంది. డిస్క్ ఆపరేషన్లయినా..ఇతర ఏ సర్జరీ తర్వాత అయినా మునుపటిలా కోలుకోవడానికి తోడ్పడే ఇలాంటి వైద్యంపై సర్వజనాస్పత్రి సిబ్బందిలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. రెండ్రోజుల నుంచి ఈ విభాగం సిబ్బంది ఎవరూ సంబంధిత గదిలో అందుబాటులో లేరంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వారు విధులకు వస్తున్నారో.. లేదో కూడా తెలియని పరిస్థితి. ఫిజియోథెరపీ చేయించుకునేందుకు వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. ఈనెల 13, 14వ తేదీల్లో ఫిజియోథెరపీ చేయించుకున్న వారు సోమవారం (16వ తేదీ) మరోసారి థెరపీ కోసం ఆస్పత్రికి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం లేదు. ‘ఆ విభాగం తలుపులు తెరిచి ఉన్నాయే’ అన్న మాటేగానీ విధులకు సిబ్బంది ఎవరూ రాలేదు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి. సుమారు 15 మంది వరకు బాధితులు వివిధ నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వేచి చూశారు. అయినా సిబ్బంది రాలేదు. విసుగు చెంది సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేరు. దీంతో ఆర్‌ఎంవీ వైవీ రావు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘అందరూ ఫిజియోథెరపీ గది వద్దే ఉండండి.. సిబ్బంది వస్తారు’ అని ఆయన చెప్పినా ఫలితం లేదు. మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూసిన బాధితులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావును అడగ్గా సమస్యను సంబంధింత హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అత్యవసరంగా సెలవు పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఒకర్నయినా ఉంచల్ల కదా కొన్నాళ్లుగా నడుము నొప్పి ఎక్కువగా ఉంది. ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గుతుందని చెబితే ఉదయాన్నే వచ్చినా.. కానీ ఇక్కడెవరూ లేరు. అధికారులకు వెళ్లి చెబితే ఎవర్నో పంపుతామన్నారు. ఎవర్నో ఒకర్ని ఉంచల్ల కదా?. ఏం పెద్దాస్పత్రో ఏమో..! - సన్నెప్ప, గలగల, గుమ్మఘట్ట మండలం నడవలేకున్నా కొన్ని రోజులుగా కాళ్ల వాపులు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కావడంలేదు. నరాలన్నీ బిగుతయ్యాయి. ఇక్కడ వైద్యం చేయించుకుంటే బాగుంటుందని వస్తే ఎవరూ లేరు. పొద్దున్నుంచీ ఉన్నా. ఇలా ఎవరూ రాకపోతే ఎలా? - కావేరమ్మ, కోవూరునగర్, అనంతపురం పని వదిలిపెట్టి వచ్చా నేను ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తుంది. ఈనెల 13, 14 తేదీల్లో ఫిజియోథెరపీ చేయించుకున్నా. 15వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం రమ్మన్నారు. రోజూ వస్తున్నా..ఈ రోజు (మంగళవారం) కూడా ఇదే పరిస్థితి. ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? - పీరా, స్టాలిన్నగర్, అనంతపురం -
నామ'మాత్ర'మే..!
– పేదల వైద్యానికి అనారోగ్యం – జిల్లా వ్యాప్తంగా ప్రబలుతున్న రోగాలు – పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో మందుల కొరత – సర్వజనాస్పత్రిలోనూ అదే పరిస్థితి – ప్రైవేట్ బాట పడుతున్న రోగులు అనంతపురం మెడికల్ : పేదల వైద్యానికి అనారోగ్యం చేసింది. రోగాల బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న వారికి నామ'మాత్ర'పు సేవలు అందుతున్నాయి. వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మందుల కొరత పట్టిపీడిస్తుండగా.. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. కొన్ని రోజులుగా ఏ పల్లెలో చూసినా రోగాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలతో గ్రామీణులే కాకుండా పట్టణవాసులు కూడా తల్లడిల్లుతున్నారు. ప్రైవేటుకు పరుగులు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఘోరంగా ఉంటోంది. సర్వరోగ నివారిణి తరహాలో ఏ జబ్బు వచ్చినా వ్యాధి లక్షణంతో పనిలేకుండా అందుబాటులో ఉన్న మందులనే ఇచ్చి పంపించేస్తున్నారు. దీంతో బాధితులకు రోగం నయం కాక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. మరికొందరు వ్యయ ప్రయాసలకొచ్చి అనంతపురం సర్వజనాస్పత్రికి వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ఔట్‌పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటి తీసుకుని ఫార్మాసిస్ట్ వద్దకు వెళితే అందులో సగం మందులే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. వాస్తవానికి 20 రకాల యాంటి బయాటిక్స్, 220 రకాల మందులు, సిరప్స్, సూదులు, సెలైన్ బాటిల్స్, సర్జికల్ మందుల కోసం ప్రతి ఆస్పత్రికి పడకల సామర్థ్యాన్ని బట్టి మందులను కేటాయిస్తున్నారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు, సీహెచ్‌సీకి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఏరియా ఆస్పత్రులకు రూ. 8 లక్షల వరకు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రూ.11 లక్షలు, అనంతపురం సర్వజన ఆస్పత్రికి రూ. 1.30 కోట్ల వరకు ప్రతి త్రై మాసికానికి ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. వేధిస్తున్న మందుల కొరత : జేఎన్టీయూ సమీపంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు మందులు వస్తే ముందుగా వాటిని అనాలసిస్ కోసం హైదరాబాద్‌కు పంపుతారు. అక్కడ ఒకే అయితేనే పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్ బాట పట్టాల్సి వస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల కోసం ఆస్ప్రిన్, దగ్గుకు ఆంబ్రాక్సిల్, గాయాలకు పూసే బెంజాయిక్ ఆసిడ్..సాలిసిలిక్ ఆసిడ్, ఆయాసం నుంచి ఉపశమనం కోసం వాడే బుడెసునైడ్ నెబులైజింగ్ సొల్యూషన్.. సాల్బుటమాల్, కన్ను, చెవిలో వేసే సిఫ్రోప్లాక్సిసిన్ డ్రాప్స్, రక్తస్రావం కాకుండా ఉండేందుకు ఉపయోగించే ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడే పర్మిత్రిన్ సరిపడినంతగా లేవు. వీటితో పాటు యాంటీబయాటిక్స్ మందులకు కరువు వచ్చింది. అత్యవసర కేసులొస్తే అంతే.. పాయిజన్ కేసులు వస్తే వైద్యులు చేతులెత్తేసే పరిస్థితి వస్తోంది. బాధితులకు వాడే పీఏఎం (పామ్), అక్ట్రోపిన్ సల్ఫేట్ సరఫరా కావడం లేదు. ఇక శస్త్ర చికిత్సల సమయంలో అనస్తీషియా కీలకం. నొప్పి తెలియకుండా ఉండేందుకు పలు రకాల ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి కొరత కూడా ఉంది. డోబుటమైన్, కెటామిన్, లిగ్నోకైన్ అండ్ అడ్రినలిన్, మజిల్ రిలాక్సేషన్ కోసం వాడే సక్సినిల్ కోలిన్ సరఫరా లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. బయట కొనుక్కోమన్నారు నాది లేపాక్షి మండలం తిమ్మగానపల్లి. శుక్రవారం రాత్రి నా భార్య డెలివరీ అయింది. పాపకు చికిత్స చేస్తున్నారు. ఏవో మందులు రాసిచ్చారు. మందులిచ్చే చోటుకు పోతే ఆ మందులు లేవన్నారు. డాక్టర్‌కు చెబితే బయట కొనుక్కునిరావాలని చీటి ఇచ్చారు. – లక్ష్మీపతి -
సర్వజనాస్పత్రిలో బాలింతపై నిర్లక్ష్యం
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. ప్రసవం తర్వాత ఇంకా అనారోగ్యంగానే ఉన్న ఓ బాలింతను డిశ్చార్జ్ చేశారు. చివరకు తప్పు తెలుసుకుని మళ్లీ అడ్మిషన్ చేయించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన మహేశ్వరి ఈ నెల 1వ తేదీన గుంతకల్లు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పల్స్రేట్, బీపీ తగ్గిపోవడంతో అదే రోజు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. మూడ్రోజులు వైద్యం అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం కుదుటపడకముందే శనివారం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మహేశ్వరి అనారోగ్యంతో కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ సంధ్య అక్కడికి చేరుకుని తిరిగి అడ్మిషన్ చేసుకున్నారు. -
దొంగ ముద్ర
► అధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్న వైద్య సిబ్బంది ► ఒక చోట హాజరు..మరో చోట విధులు ► పట్టించుకోని ఉన్నతాధికారులు ► ఇబ్బందులు పడుతున్న రోగులు బయోమెట్రిక్‌తో డ్యూటీలకు డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్ పెట్టొచ్చని భావించింది సర్కార్. అయితే అదే బయోమెట్రిక్‌ను ఉపయోగించుకొంటూ తమ పనులను తాపీగా చేసుకుంటున్నారు కొందరు వైద్యులు. అదెలా అంటే ఉదాహరణకు... రాము అనే వైద్యుడు యల్లనూరు పీహెచ్సీలో విధులు నిర్వహిస్తుంటాడు. కానీ ఆయన ఉండేది మాత్రం తాడిపత్రిలో.. ఉదయమే తాడిపత్రి పరిధిలోని ఆస్పత్రికెళ్లి సమయానికి బయోమెట్రిక్‌లో అటెండెన్స్ వేసేస్తాడు. తన పనులన్నీ చూసుకొని ఏ మధ్యాహ్నమో తాను పనిచేసే యల్లనూరు పీహెచ్సీకెళ్లి కాసేపుండి మళ్లీ తాడిపత్రికి వచ్చేస్తాడు. తిరిగి సాయంత్రం తాడిపత్రిలోనే బయోమెట్రిక్‌లోనే అటెండెన్స్ వేస్తున్నాడు. ఇలా దర్జాగా ప్రభుత్వ విధులకు తమదైన శైలిలో డుమ్మా కొట్టేస్తున్నారు ఎంతో మంది వైద్యులు. అనంతపురం సిటీ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో సుమారు 2000 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారిలో ఉన్నత క్యాడర్ నుంచి స్వీపర్ దాకా పలు విభాగాల్లో పని చేస్తున్నారు. సుమారు 550 మందికి పైగా సిబ్బంది తప్పుడు హాజరు వేస్తూ విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. తాడిపత్రి, ఉరవకొండ, పెనుకొండ, ధర్మవరం, గుంతకల్లు, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులే ఎక్కువగా ఇలా చేస్తున్నట్లు సమాచారం. రెక్టరేట్ నుంచి హెచ్చరికలు బయోమెట్రిక్‌లో ఈ తరహా తప్పులు చేసేందుకు అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులను హెచ్చరించారు. కాగా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో వైద్యులు ఆడింటే ఆట పాడిందే పాటగా మారింది. సర్వజన ఆస్పత్రిలోనూ అంతే..! ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉదయం 10 గంటలకు హాజరు వేసిన వైద్యులు వచ్చిన దారినే క్లినిక్‌ల బాట పడుతున్నారు. సీసీ కెమెరాల నిఘాను కూడా వారు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆస్పత్రి అవుట్ గేటు వద్ద లోపలి నుంచి బయటక వెళ్లే వ్యక్తుల ముఖాలు కనిపించకుండా కెమెరాలను ఏర్పాటు చేయించుకున్నారు. ఫలితంగా ఎవరు బయటకు వెళ్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది. తిరిగి వారు విధులకు వచ్చే ద§ృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ఏ అధికారుల్లో చలనం లేదు. అలాంటి వారిని ఉపేక్షించం బయోమెట్రిక్ విధానాన్ని ఉల్లంఘించినా, బా«ధ్యతా రాహిత్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తాం. అక్కడక్కడా తప్పులు జరుగుతున్న విషయం వాస్తవమే... మా §ృlష్టికీ వచ్చింది. త్వరలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కేటాయిస్తాం. – వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి