ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ
మూడు రోజుల క్రితం కన్నుమూసిన కన్న కూతురి మృత్యు ఘంటికలు గుండెల్లో ఇంకా విషాద గీతికలై మార్మోగుతూనే ఉన్నాయి. ఇంతలో అమ్మా గొంతు నొప్పంటూ.. అచ్చం కూతురిలాగే కొడుకు కూడా కూలబడ్డాడు. క్షణాల వ్యవధిలో ఆస్పత్రికి తరలించారు. కూతురిని పొట్టన పెట్టుకున్న డిప్తీరియానే కొడుకునూ మంచాన పడేసిందని వైద్యులు తేల్చారు. కన్నీరైన ఆ కన్నపేగుకు భూమిపై కాళ్ల నిలబడలేదు.. అయ్యా కొడుకును రక్షించండంటూ వైద్యుల కాళ్లావేళ్లా పడగా.. గుంటూరు జిల్లా తీసుకెళ్లాలని సెలవిచ్చారు. కూతురు లేదనే కడుపు కోత కన్నీటి ధారవుతుంటే... కళ్లు మూతలు పడుతున్న కొడుకును తీసుకుని గుంటూరు జ్వరాల ఆస్పత్రికి చేరారు. నాలుగు గంటలపాటు ఒక్కరు కూడా సమాధానం చెప్పిన వాళ్లు లేరు.. ఈ బిడ్డనైనా రక్షించండి సారూ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. చివరకు వారి వేదన విని స్థానికులు ఆందోళనకు ఉపక్రమించడంతో వైద్యులు కదిలివచ్చారు. బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
గుంటూరు రూరల్: ఆ తల్లిదండ్రుల వేదన తీర్చలేనిది. అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం భూదేడు గ్రామానికి చెందిన జన్నే మహేంద్ర, రాధిక దంపతులకు స్నేహలత(6), సాయితేజ సంతానం. మహేంద్ర గ్రామంలో బాడుగ ఆటోకు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. 15 రోజుల క్రితం స్నేహలతకు గొంతు నొప్పి వచ్చింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజులు చికిత్స చేసిన వైద్యులు స్నేహలతను కాపాడలేకపోయారు. మూడు రోజుల చిన్నారి ఈ లోకాన్ని వీడి వెళ్లింది. ఆ కుటుంబం తీరని శోకంలో మునిగింది.
కొడుకుకూ అదే వ్యాధి
ఈ నెల 19వ తేదీ రాత్రి ఏడు గంటలకు కుమారుడు సాయితేజ కూడా గొంతు నొప్పి అంటూ బాధపడటంతో తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తీసుకుళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లాలోని బాపట్ల వైద్యశాలకు వెళ్లాలని రిఫర్ చేశారు.
కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు, మేనమామ రాజుతో కలిసి బాపట్లకు బయలుదేరారు. శనివారం ఉదయం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు వ్యాధికి సంబంధించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వరకు బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పలేదని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. అనంతరం వైద్యులు నగర శివారుల్లోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు.
వైద్యుల నిర్లక్ష్యం
ఆదివారం మధ్యాహ్నం నగర శివారుల్లోని జ్వరాల ఆసుపత్రికి చేరుకోగా 12 గంటకు వెళ్లిన వారిని అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. తన కుమారుడి పరిస్థితి బాగోలేదని, జరిగిన ఉదంతాన్ని చెప్పి ఆసుపత్రిలో చేర్పించుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆ తల్లిదండ్రులు వేడుకున్నారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు.
చలించిన స్థానికులు
సాయంత్రం 4–30 గంటల సమయంలో ఆసుపత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రుల వద్దకు స్థానికులు వచ్చారు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్ద ఆందోళన చేసేందుకు ఉపక్రమించడంతో గమనించిన వైద్యులు సాయితేజను అడ్మిట్ చేసుకున్నారు. కుమార్తెను పోగొట్టుకుని గుండెలవిసిన తల్లిదండ్రులకు వైద్యులు నిర్లక్ష్యం మరింత కడుపు కోతను పెంచుతోంది. అయ్యా మా బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండంటూ ప్రతి ఒక్కరినీ ఆ కన్నపేగు వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment