Diphtheria
-
హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
చిన్నారుల్లో ఆ వ్యాధులు మళ్లీ విజృంభిస్తాయేమో?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా చిన్నారులకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ కార్యక్రమానికి ఆటంకం కలగడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పిల్లలకు క్రమం తప్పకుండా వేస్తున్న టీకా కార్యక్రమం రెండు నెలలుగా నిలిచిపోవడంతో పాత శత్రువులైన డిఫ్తీరియా, ధనుర్వాతం, తట్టు, పోలియో మళ్లీ తిరగబెట్టే ప్రమాదముందని అంటున్నారు. కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది ఏడాదిలోపు చిన్నారులు డిఫ్తీరియా, తట్టు, పోలియో వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఒక నివేదికలో తెలిపింది. భారత్‌లో ప్రతినెలా 20 నుంచి 22 లక్షల మంది చొప్పున ఏడాదికి 2.60 కోట్ల మంది చిన్నారులకు జాతీయ టీకా కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపింది. -
కొడుకునైనా కాపాడండయ్యా..!
మూడు రోజుల క్రితం కన్నుమూసిన కన్న కూతురి మృత్యు ఘంటికలు గుండెల్లో ఇంకా విషాద గీతికలై మార్మోగుతూనే ఉన్నాయి. ఇంతలో అమ్మా గొంతు నొప్పంటూ.. అచ్చం కూతురిలాగే కొడుకు కూడా కూలబడ్డాడు. క్షణాల వ్యవధిలో ఆస్పత్రికి తరలించారు. కూతురిని పొట్టన పెట్టుకున్న డిప్తీరియానే కొడుకునూ మంచాన పడేసిందని వైద్యులు తేల్చారు. కన్నీరైన ఆ కన్నపేగుకు భూమిపై కాళ్ల నిలబడలేదు.. అయ్యా కొడుకును రక్షించండంటూ వైద్యుల కాళ్లావేళ్లా పడగా.. గుంటూరు జిల్లా తీసుకెళ్లాలని సెలవిచ్చారు. కూతురు లేదనే కడుపు కోత కన్నీటి ధారవుతుంటే... కళ్లు మూతలు పడుతున్న కొడుకును తీసుకుని గుంటూరు జ్వరాల ఆస్పత్రికి చేరారు. నాలుగు గంటలపాటు ఒక్కరు కూడా సమాధానం చెప్పిన వాళ్లు లేరు.. ఈ బిడ్డనైనా రక్షించండి సారూ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. చివరకు వారి వేదన విని స్థానికులు ఆందోళనకు ఉపక్రమించడంతో వైద్యులు కదిలివచ్చారు. బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. గుంటూరు రూరల్: ఆ తల్లిదండ్రుల వేదన తీర్చలేనిది. అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం భూదేడు గ్రామానికి చెందిన జన్నే మహేంద్ర, రాధిక దంపతులకు స్నేహలత(6), సాయితేజ సంతానం. మహేంద్ర గ్రామంలో బాడుగ ఆటోకు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. 15 రోజుల క్రితం స్నేహలతకు గొంతు నొప్పి వచ్చింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజులు చికిత్స చేసిన వైద్యులు స్నేహలతను కాపాడలేకపోయారు. మూడు రోజుల చిన్నారి ఈ లోకాన్ని వీడి వెళ్లింది. ఆ కుటుంబం తీరని శోకంలో మునిగింది. కొడుకుకూ అదే వ్యాధి ఈ నెల 19వ తేదీ రాత్రి ఏడు గంటలకు కుమారుడు సాయితేజ కూడా గొంతు నొప్పి అంటూ బాధపడటంతో తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తీసుకుళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లాలోని బాపట్ల వైద్యశాలకు వెళ్లాలని రిఫర్ చేశారు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు, మేనమామ రాజుతో కలిసి బాపట్లకు బయలుదేరారు. శనివారం ఉదయం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు వ్యాధికి సంబంధించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వరకు బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పలేదని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. అనంతరం వైద్యులు నగర శివారుల్లోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఆదివారం మధ్యాహ్నం నగర శివారుల్లోని జ్వరాల ఆసుపత్రికి చేరుకోగా 12 గంటకు వెళ్లిన వారిని అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. తన కుమారుడి పరిస్థితి బాగోలేదని, జరిగిన ఉదంతాన్ని చెప్పి ఆసుపత్రిలో చేర్పించుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆ తల్లిదండ్రులు వేడుకున్నారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. చలించిన స్థానికులు సాయంత్రం 4–30 గంటల సమయంలో ఆసుపత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రుల వద్దకు స్థానికులు వచ్చారు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్ద ఆందోళన చేసేందుకు ఉపక్రమించడంతో గమనించిన వైద్యులు సాయితేజను అడ్మిట్ చేసుకున్నారు. కుమార్తెను పోగొట్టుకుని గుండెలవిసిన తల్లిదండ్రులకు వైద్యులు నిర్లక్ష్యం మరింత కడుపు కోతను పెంచుతోంది. అయ్యా మా బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండంటూ ప్రతి ఒక్కరినీ ఆ కన్నపేగు వేడుకుంటోంది. -
ఏపీలో తొలిసారి డిఫ్తిరీయా కేసు
-
డిఫ్తిరీయా కేసుతో బాలిక మృతి
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో తొలిసారి డిఫ్తీరియా కేసు నమోదవ్వడం కలకలం సృష్టించింది. డిఫ్తిరియా వ్యాధితో శ్రావణి అనే విద్యార్థి మరణించింది. అనంతరపురం జిల్లా కేంద్రంలోని శారదా మన్సిపల్ హైస్కూల్లో ఏడో తరగతి చదివే శ్రావణికి డిఫ్తీరియా సోకడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుట్టిన వెంటనే టీకా వేయకపోవడం, శారదా మున్సిపల్ హైస్కూల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యతోనే తమ శ్రావణి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అంటు వ్యాధి కావడం, డీటీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ అందజేయకుండా సరఫరా నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వ్యాధి ప్రబలకుండా సకాలంలో స్పందించడంలో మున్సిపల్, వైద్యశాఖలు విఫలమయ్యాయి. -
సిటీలో మళ్లీ డిఫ్తీరియా కలకలం
సాక్షి, సిటీబ్యూరో: కంఠసర్పి(డిఫ్తీరియా) మళ్లీ కాటేస్తుంది. గత కొద్ది కాలంగా ఇది చాపకింది నీరులా విస్తరిస్తుంది. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డిఫ్తీరియా బాధితులు వస్తున్నారు. వైద్యులు వీరిని క్లీనికల్ డిఫ్తీరియాగా నమోదు చేసి చికిత్స చేస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో జూన్‌లో 64, జులైలో 110 డిఫ్తీరియా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు తెలిసింది. వారిలో ఇద్దరు కర్నూలుకు చెందిన వా రు కాగా, మరో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారే. వీరి వివరాలు బయటికి పొక్కకుండా అధికారులు గోప్యతను పాటిస్తుండటం విశేషం. గురువారం ఫీవర్ ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతుండగా, ఉస్మానియాలో మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఈ బాధితులకు చికిత్స చేసేందుకు ఈఎన్టీ నిపుణుడు అందుబాటులో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. -
శాంతా బయో కొత్త ప్లాంటులో ఉత్పత్తి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సనోఫీ పాశ్చర్‌లో భాగమైన శాంతా బయోటెక్నిక్స్ తాజాగా తమ కొత్త ప్లాంటులో టీకాల ఉత్పత్తి ప్రారంభించింది. తెలంగాణలోని ముప్పిరెడ్డిపల్లి దగ్గర ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో సుమారు 19,000 చ.మీ. విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటైంది. సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడితో ఇది ఏర్పాటైందని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో శాంతా బయో చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రారంభ దశలో పిల్లల్లో డిఫ్తీరియా మొదలైన వాటి నివారణకు ఉపయోగపడే శాన్-5 తదితర టీకాలు ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఇందులో ఏటా పది మిలియన్ డోస్‌ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 30 మిలియన్ డోస్‌ల దాకా ఉండగలదని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఇప్పటికే ఒక ప్లాంటు ఉండగా, ముప్పిరెడ్డిపల్లిది రెండోదవుతుందన్నారు. మరోవైపు, ఇన్సులిన్ తయారీ ప్రాజెక్టు 2017 నాటికి సిద్ధం కాగలదని శాంతా బయోటెక్నిక్స్ ఈడీ మహేష్ భల్గాట్ వివరించారు. రూ. 450 కోట్లతో దీన్ని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఇదీ పూర్తయితే మొత్తం 1,000 మందికి ఉపాధి లభించగలదని చెప్పారు. -
డిప్తీరియాతో గురుకుల పాఠశాల విద్యార్థి మృతి
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు డిప్తీరియా (కోరింత దగ్గు) బారినపడి మృతిచెందిన సంఘటన స్థానికంగా కలకలంరేపింది. బామిని మండలం నేరడికి చెందిన బి. నరేష్ (15).. కొత్తూరులోని గురుకుల హాస్టల్ లో పదోతరగతి చదువుతున్నాడు. గడిచిన పదిరోజులుగా కోరింత దగ్గుతో బాధపడుతున్నప్పటికీ విద్యార్తిని సిబ్బంది పట్టించుకోలేదని తెలిసింది. శనివారం నాటికి పరిస్థితి విషమించడంతో నరేశ్ ను విశాఖపట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతిచెందాడు. విద్యార్థి మృతితో అతడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
డెత్తీరియా
డిఫ్తీరియాతో చిన్నారి మృతి 500లకు పైగా కేసులు నమోదు వ్యాక్సిన్ లోపం వల్లే విజృంభణ గ్రేటర్ వాసులను కంఠసర్పి(డిఫ్తీరియా) కాటేస్తోంది. ఆ వ్యాధి బారిన పడి ఫీవర్ ఆస్పత్రిలో శనివారం ఓ చిన్నారి మృతి చెందింది. ఇప్పటి వరకూ 500లకు పైగా కేసులు నమోదయ్యా యి. ఒక్క ఫీవర్ ఆస్పత్రిలో వందకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. డీపీటీ వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం ఆస్పత్రుల పాలుకావడం గమనార్హం. నగరంలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఓ చిన్నారి ఈ నెల 6న ఫీవర్ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వందలాది మంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారులకు వస్తుంది. ప్రస్తుతం పెద్దవారికి సైతం సోకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగేళ్లుగా ఈ వ్యాధి నగరంలో విజృంభిస్తోంది. 2011 సంవత్సరంలో 1036 కేసులు, 2012లో 925, 2013లో 1083 కేసులు న మోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈఎన్టీ డాక్టర్లు లేకపోవడం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వాక్సినేషన్ లోపం వల్లే.. జాతీయ ఇమ్యూనైజేషన్ పోగ్రామ్‌లో భాగంగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. పోలియో, డిఫ్తీరియా వ్యాధుల నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌ను నిల్వచేసే విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా టీకాలు వేసుకున్న వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. నగరంలోని పలు పీహెచ్‌సీల్లో డీపీటీ వ్యాక్సిన్‌ను బుధవారం వేస్తున్నారు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి వాక్సినేషన్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఒక్క పోలియో దినోత్సవం రోజు మినహా ఇతర సందర్భాల్లో కన్పించడం లేదు. పాత బస్తీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. 18 నెలలకు ఒక డోసు, ఐదేళ్లకు మరో డోసు చొప్పన డీపీటీ వాక్సిన్ ఇవ్వాలి. దీనిపై అవగాహన లేకపోవడంతో సకాలంలో వ్యాక్సిన్ వేయించలేక పోతున్నారు. ఇప్పటి వరకు న మోదైన కేసులన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. లక్షణాలు గుర్తించండిలా... గొంతువాపుతో పాటు ట్రాన్సిల్స్పై పింక్ కలర్ ప్యాచ్ ఏర్పడి రక్తస్రావం అవుతుంది బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ముక్కు నుంచి నీరు కారుతుంది. తలనొప్పి వస్తుంది. దగ్గు, జలుబు ఉంటుంది శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, హై టెంపరేచర్‌తో కూడిన జ్వరంతో బాధపడతారు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి నిర్లక్ష్యం చేస్తేనాడీ వ్యవస్థ, గుండె పని తీరు దెబ్బతిని మరణించే ప్రమాదం ఉంది - డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి -
డెంగీ పంజా
సాక్షి, సిటీబ్యూరో : నగరంపై డెంగీ మళ్లీ పంజా విసురుతోంది. సీజనల్ వ్యాధులతో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ, మలేరియా, డిఫ్తీరియా వంటి వ్యాధులు చాపకింది నీరులా విస్తరిస్తున్నా సంబంధిత అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 158 మలేరియా కేసులు, 55 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సుమారు 200 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు డిఫ్తీరియాతో మృత్యువాత పడగా, మరో ఐదుగురు డెంగీతో చనిపోయారు. సీజనల్ వ్యాధులతో సిటీజనులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల్లో బాధితులు గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కలుషిత నీటి వల్ల బస్తీలు పడకేశాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరంలోని ఏ ఇంట్లోకి తొంగి చూసినా జలుబు, తలనొప్పి, జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు పొద్దుపొడిచినా ముసుగు తీయడం లేదు. ఉప్పర్‌పల్లికి చెందిన మౌనిక(9) తీవ్రమైన డెంగీ జర్వంతో గాంధీ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. నాలుగు రోజుల కిందట ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు మౌనిక తల్లిదండ్రులు తెలిపారు. అదేవిధంగా మేడిపల్లిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కె.శంకర్ డెంగీ జర్వంతో బాధపడుతుండగా బంధువులు ఆయనను రామంతాపూర్‌లోని ఏడీఆర్ఎం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పలువురు బాధితులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఊసేలేని యాక్షన్‌ప్లాన్..? జీహెచ్ఎంసీ పరిధిలో అధికారికంగా 1470 పైగా మురికివాడలు ఉన్నాయి. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫిలింనగర్‌లతో సామాన్యులుండే లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, మూసారంబాగ్, గోల్నాక, భోలక్‌పూర్, చిలకలగూడ, వారసిగూడ, పార్శిగుట్ట, గాంధీనగర్, ఉప్పల్, తదితర బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అయినా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు గాని, అటు వైద్యాధికారులు గాని రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వ్యాధుల నివారణ కోసం జిల్లా వైద్యాధికారులు ముందస్తుగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. ఆయా బస్తీల్లో పర్యటించి, వ్యాధులపై ముం దే ఓ అంచనాకు రావాల్సి ఉంది. కానీ వైద్యాధికారులు ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఆరోగ్య కేంద్రాల్లో విలువైన మందులే కాదు దగ్గు, జలుబుతో బాధపడుతున్న చిన్నారులకు కనీసం సిరఫ్‌లు కూడా దొరకడం లేదు. వైద్యులు రాకపోవడంతో నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, ఆయాలే బాధితులకు పెద్దదిక్కు అవుతున్నారు. నిబంధనలు పట్టని ప్రైవేటు ఆస్పత్రులు నగరంలో ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల తో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనే డెంగీకి చికిత్స చేస్తున్నారు. డెంగీ, మలేరియాతో బాధపడుతున్న వారి నుంచి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపాలి. కానీ పలు ప్రైవే టు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. సాధారణ జర్వంతో బాధపడుతున్న వారికీ డెంగీని బూచీగా చూపుతున్నాయి. ప్లేట్లెట్స్ తగ్గాయని, వెంటనే వాటిని ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని రోగులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వైద్యం పేరుతో వారి నుంచి రూ.50 వేల నుంచి రూ. 70వేల వరకు గుంజుతూ దోపిడీకి పాల్పడుతున్నాయి. రక్తంలో ప్లేట్లెట్స్ ఎలా ఉండాలంటే.... శరీరంలో ఉండాల్సిన ప్లేట్లెట్స్ : 1.50 లక్షల నుంచి 2 లక్షలు కనీసం 40 వేలకు పైగా ఉండాలి. వీరికి వెంటనే రక్తం ఎక్కించాలి,. లే దంటే మృతి చెందే ప్రమాదం ఉంది 40 వేల కంటే తక్కువ ఉంటే కష్టమే ప్రభుత్వ ఉచిత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), నారాయణగూడ వెంటెరీనరీ బయలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వీబీఆర్ఐ), మెహిదీపట్నం లక్షణాలివీ.. తీవ్రమైన జ్వరం భరించలేని ఒంటి నొప్పులు శరీరంపై దద్దుర్లు కళ్లు ఎరుపెక్కడం రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం జాగ్రత్తలివీ... డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంట్లోని నీటి ట్యాంకులను, కుండలను, క్యాన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు పెట్టకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గదుల్లో గాలి వెలుతురు ఉండేలా చూడాలి. పిల్లలకు విధిగా పగటిపూట కూడా దోమతెరలు వాడాలి. ఇంట్లోకి దోమలు జొరబడకుండా కిటికీలకు సన్నటి జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు ఉంచాలి. మూడు రోజులకు మించి నిల్వ ఉన్న మంచినీటిని తాగరాదు. - డాక్టర్ రంగనాథ్, అడిషనల్ సూపరింటిండెంట్, ఉస్మానియా యాక్షన్ ప్లాన్ అందలేదు మలేరియా, డెంగీ వ్యాధుల నివారణ కోసం జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. అది మాకింకా అందలేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు హైరిస్క్ జోన్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. అయితే గత ఏడాదితో పోలిస్తే డెంగీ, మలేరియా కేసులు తక్కువే నమోదవుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ శ్రీహర్ష, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి, హైదరాబాద్ -
కాకినాడలో డిఫ్తీరియా.. ఆరేళ్ల బాలుడి మృతి
సాక్షి, కాకినాడ : డిఫ్తీరియా... ఐదేళ్ల లోపు చిన్నారులకు వచ్చే ప్రాణాంతక వ్యాధి.. దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరి వేగంగా సోకే అంటువ్యాధి. దీన్ని కంఠసర్పి లేదా గొంతువాపు వ్యాధి అని కూడా అంటారు. పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని భావి స్తున్న తరుణంలో ఈ వ్యాధి విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఒక చిన్నారి మృత్యువాతపడగా, ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారణైంది. మరో 15మంది చిన్నారు లకు ఈ వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) ఆందోళన కల్గించేలా విజృంభిస్తోంది. సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులకు వ చ్చే ఈ వ్యాధి ఐదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా లో వెలుగు చూసిన ఈ డిఫ్తీరియా జిల్లావాసులను భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యాధి సోకి ఏటిమొగకు చెందిన పెమ్మాడి కళ్యాణ్ (6) సోమవారం అర్ధరాత్రి మృత్యువాత పడ్డాడు. భర్తతో విడివడి కొడుకు, కూతురితో జీవనం సాగి స్తున్న ఆదిలక్ష్మి కొడుకు కల్యాణ్‌ను పొగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అదే ప్రాంతానికి చెందిన కట్టా మధు(5) సంజయ్‌నగర్‌కు చెందిన బాసి రమ్య(5), కొవ్వూరు రోడ్డుకు చెందిన కోరుకొండ మనోహర్(12) తో పాటు సంజయ్‌నగర్‌కు చెందిన మరో ఏడేళ్ల చిన్నారికి వైద్యపరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణైంది. వీరుకాకుండా నగరంలో మురికివాడలకు చెందిన సుమారు 15 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఏడేళ్ల లోపు చిన్నారుల వరకు ఈ వ్యాధి సోకకుండా డీపీటీ బూస్టర్ డోస్ ఇస్తే సరిపోతుంది. కానీ వ్యాధి సోకుతున్న వారు 10 ఏళ్లకు పైబడినవారు కావడం, ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో అధికారులున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు కాకినాడ నగరపాలక వైద్యఆరోగ్య శాఖాధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కుటుంబ సంక్షేమాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. వ్యాధికి గురైన వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేపట్టగా, మురికివాడల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం రావడం..కొండనాలుక వద్ద టాన్సిల్స్‌పై తెల్లని లేయర్ ఏర్పడం..నాలుకపై పుండ్లు ఏర్పడడం..గొంతు నొప్పి తీవ్రంగా ఉండడం ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. సకాలంలో గుర్తించకపోతే స్వరపేటిక(వాయిస్బాక్సు)కు సోకి ఆ తర్వాత ఊపిరితిత్తులకు చేరుకుని ప్రాణాంతకమవుతుంది. వ్యాధి తీవ్రమైతే ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే. దగ్గు..తుమ్ముల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిని ఎలా గుర్తించాలి...సోకితే ఏం చేయాలి గొంతుపరీక్ష ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తేనే మెరుగైన వైద్యం అందించవచ్చు. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సకాలంలో ఆస్పత్రిలో చే ర్చి ఎరిత్రోమైసిన్ లేదా యాంటిబయాటిక్ ఇస్తే సరిపోతుంది. అయితే వ్యాధి తగ్గే వరకు ఈఎన్టీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయిస్తే 15 రోజుల్లోనే కోలుకొనే అవకాశం ఉంది. ఏ సమయంలో వ్యాక్సిన్లు వేయాలి ? సాధారణంగా డిప్తీరియా (కంఠసర్పి), పెర్టుసిస్ (ఊపిరాడకుండా వచ్చే దగ్గు), టెటనస్ (ధనుర్వాతం) నివారణకు చిన్నారులకు 45 రోజులు,75 రోజులు, 105 రోజులకు హైపటైటిస్ బీ, పోలియో వ్యాక్సిన్లతో కలిపి డీపీటీ ఇస్తారు. ఆ తర్వాత 18నెలలకు, ఐదేళ్లకు, ఏడేళ్లకు డీపీటీ బూస్టర్డోస్లివ్వాలి. ఈ వ్యాధికి కారకమైన ‘కార్ని బాక్టీరియం డిప్తీరియా’అనే బ్యాక్టీరియా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉన్నంత వరకు ఈ బ్యాక్టీరియా ఏమీ చేయలేదు. ఆ శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి విజృంభిస్తుంది. వైద్యశాఖ కార్యాచరణ నగరంలో మరీ ముఖ్యంగా మత్స్యకారప్రాంతాల్లో ఈ వ్యాధి విజృంభిస్తున్నందున పదేళ్ల లోపు చిన్నారులందరికి మరోసారి డీపీటీ బూస్టర్ డోస్ ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు. ముందుగా గుర్తిస్తే ప్రాణాంతకం కాదు ఈ వ్యాధి గొంతునొప్పితో ప్రారంభమవుతుంద ని ప్రభుత్వాసుపత్రి ఈఎన్టీ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి అంతరించి పోయినదైనా వైరస్ నిద్రాణమై ఉండి మార్పును సంతరించుకుని రావడం వింతేమీ కాదన్నారు. ప్రారంభంలో గొంతు నొప్పికి ఎరిత్రోమైసిన్ వేస్తే నయమవుతుందని దానికి లొంగక పోతే గ్రామాల్లోని ఆర్ఎంపీలు, సాధారణ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు సిఫార్సు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి కాకుండా చూడాలన్నారు. -
డిఫ్తీరియా కేసులు మరో పది..
నల్లకుంట, న్యూస్‌లైన్: నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం మరో 10 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. మంగళవారం మొత్తం 33 మంది ఆస్పత్రిలో చేరగా, 14 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం మొత్తం 29 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాగా, డిఫ్తీరియా ప్రబలిన గోపన్‌పల్లిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముషీరాబాద్ బడీమసీద్- అబ్దుల్ కరీమ్ (11), వట్టిపల్లి ఫతేమైదాన్- మతిన్ (11), జెరీలిన్, అలీజా కోట్ల- సాలిహా సిద్ధిఖి (9), మలక్‌పేట- అమీనాబీ (12)లకు డిఫ్తీరియా సోకినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ నెలలో డిఫ్తీరియాకు సంబంధించి 150 కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. కొత్తగా ఆస్పత్రిలో చేరిన వారు వీరే... గోపన్‌పల్లి- వంశీకృష్ణ (9), సంతోష్‌నగర్- మరియాకాసిమ్ (9), జైన్ (19), సికింద్రాబాద్- రిజ్వాబేగం (45), చాదర్‌ఘాట్- ప్రియాంక (8), ఖార్వాన్- నఫీజ్ (20), కోకాపేట- అనురాధ (25), యాకుత్‌పుర- సమీర్ (11), ఎన్టీఆర్ నగర్- సాయినిధి (3). ఎమర్జెన్సీ నిధులతో వాక్సిన్ కొనుగోలు ఆస్పత్రి ఎమర్జెన్సీ బడ్జెట్లో 20 శాతం నిధులను డిఫ్తీరియా వ్యాక్సిన్ కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో రోగికి 10 వేల యూనిట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఇందు కోసం రూ.1500 ఖర్చవుతున్నాయి. ప్రభుత్వమే దీన్ని ఉచితంగా సరఫరా చేస్తే బాగుంటుంది. - డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి -
‘గొంతువాపు’తో ముగ్గురు చిన్నారుల మృతి
హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే దారుణం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేరిన మరో 33 మంది బాధితులు అపరిశుభ్ర పరిస్థితులు, టీకాలు వేయకపోవడమే కారణమంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ‘గొంతువాపు (డిఫ్తీరియా)’ మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజుల్లోనే ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది. పదుల సంఖ్యలో చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి రాజీవ్‌నగర్ కాలనీలో నివసించే మునెప్ప, వసంత దంపతుల కుమార్తె వైశాలి(6), గోపి, బేబి దంపతుల కుమారుడు ప్రభు (4)లకు కొద్ది రోజుల కింద తీవ్ర జ్వరం వచ్చింది. చిన్నారులిద్దరికీ పరీక్షలు చేసిన స్థానిక వైద్యులు గొంతువాపుగా గుర్తించారు. దాంతో వైశాలిని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి, ప్రభును నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. అయితే, నీలోఫర్ ఆస్పత్రిలో ప్రభుకు మొదట ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించిన సిబ్బంది.. అదే సమయంలో మరో అత్యవసర కేసు రావడంతో అవే అత్యవసర చికిత్స యంత్రాలను తీసి ఆ పేషెంట్‌కు పెట్టారని ప్రభు తల్లిదండ్రులు ఆరోపించారు. అత్యవసర పరికరాలు తీసివేసిన అనంతరం ప్రభు నోరు, ముక్కు నుంచి రక ్తస్రావం జరిగిందన్నారు. ఇక చాదర్‌ఘాట్ పరిధిలోని వినాయక నగర్‌కు చెందిన మహ్మద్ రఫీ కుమారుడు ఫారూక్ (6) కూడా గొంతువాపు బారిన పడి మంగళవారం మృతి చెందాడు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమ, మంగళవారాల్లో గొంతువాపుతో బాధపడుతున్న 33 మంది రోగులు చేరినట్లు వైద్యులు తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, సరైన సమయంలో టీకాలు వేసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఈ సీజన్లో గొంతువాపు విజృంభించడం సాధారణమేనని పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు చిన్నారులకు కూడా సరైన సమయంలో డీపీటీ టీకాలు వేయకపోవడంతోనే మృత్యువాతపడ్డారని చెప్పారు.