హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే దారుణం
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేరిన మరో 33 మంది బాధితులు
అపరిశుభ్ర పరిస్థితులు, టీకాలు వేయకపోవడమే కారణమంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ‘గొంతువాపు (డిఫ్తీరియా)’ మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజుల్లోనే ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది. పదుల సంఖ్యలో చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి రాజీవ్‌నగర్ కాలనీలో నివసించే మునెప్ప, వసంత దంపతుల కుమార్తె వైశాలి(6), గోపి, బేబి దంపతుల కుమారుడు ప్రభు (4)లకు కొద్ది రోజుల కింద తీవ్ర జ్వరం వచ్చింది. చిన్నారులిద్దరికీ పరీక్షలు చేసిన స్థానిక వైద్యులు గొంతువాపుగా గుర్తించారు. దాంతో వైశాలిని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి, ప్రభును నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. అయితే, నీలోఫర్ ఆస్పత్రిలో ప్రభుకు మొదట ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించిన సిబ్బంది.. అదే సమయంలో మరో అత్యవసర కేసు రావడంతో అవే అత్యవసర చికిత్స యంత్రాలను తీసి ఆ పేషెంట్‌కు పెట్టారని ప్రభు తల్లిదండ్రులు ఆరోపించారు.
అత్యవసర పరికరాలు తీసివేసిన అనంతరం ప్రభు నోరు, ముక్కు నుంచి రక ్తస్రావం జరిగిందన్నారు. ఇక చాదర్‌ఘాట్ పరిధిలోని వినాయక నగర్‌కు చెందిన మహ్మద్ రఫీ కుమారుడు ఫారూక్ (6) కూడా గొంతువాపు బారిన పడి మంగళవారం మృతి చెందాడు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమ, మంగళవారాల్లో గొంతువాపుతో బాధపడుతున్న 33 మంది రోగులు చేరినట్లు వైద్యులు తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, సరైన సమయంలో టీకాలు వేసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఈ సీజన్‌లో గొంతువాపు విజృంభించడం సాధారణమేనని పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు చిన్నారులకు కూడా సరైన సమయంలో డీపీటీ టీకాలు వేయకపోవడంతోనే మృత్యువాతపడ్డారని చెప్పారు.
‘గొంతువాపు’తో ముగ్గురు చిన్నారుల మృతి
Published Wed, Aug 28 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement