
కడుపు నొప్పి వస్తోందంటూ నిద్రలేచిన తల్లి.. నిర్జీవంగా కనిపించిన పిల్లలు.. తాము విషంలాంటిదేమీ తీసుకోలేదని పోలీసులకు చెప్పిన తల్లి
రాత్రి షాపులో తెచ్చిన పెరుగుతో అన్నం తిన్నామని.. భర్త మాత్రం పప్పుతో తిన్నాడని వెల్లడి..
పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఏం జరిగిందో తెలుస్తుంది: ఎస్పీ
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల రక్త నమూనాలు
పటాన్‌చెరు టౌన్: రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున నోట్లో నురగలతో విగతజీవులై కన్పించారు. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆస్పత్రిలో చేరిన వారి తల్లి చికిత్స పొందుతోంది. సీఐ నరేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు 2008లో వివాహం జరిగింది.
2010లో భార్య అనారోగ్యంతో మరణించడంతో 2012లో నల్లగొండ జిల్లా మందాపూర్ గ్రామానికి చెందిన రజిత అలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న సాయికృష్ణ (12), నాలుగో తరగతి చదువుతున్న మధుప్రియ (10), మూడు చదువుతున్న గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అంతా కలిసే భోజనం చేశారు
గురువారం రాత్రి 9 గంటల సమయంలో అంతా కలిసి భోజనం చేశారు. పిల్లలు, రజిత పప్పుతో పాటు షాపు నుంచి తెచ్చుకున్న పెరుగుతో అన్నం తిన్నారు. చెన్నయ్య మాత్రం వట్టి పప్పుతో తిని, ట్యాంకర్ తీసుకుని చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగిరాగా, రజిత తలుపులు తీసింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రజిత తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పింది. చెన్నయ్య వెంటనే పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ముగ్గురు పిల్లలు నోటి నుండి నురగలు కక్కుతూ చలనం లేకుండా కనిపించారు.
దీంతో వెంటనే బయటకు వెళ్లిన ఆయన ‘కాపాడండి..’అంటూ అరిచాడు. స్ధానికులు రావడంతో పిల్లలు చనిపోయారని, భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు రజితను బీరంగూడలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పారితోష్ పంకజ్, సీఐ నరేష్, క్లూస్ టీం ఇంటి ముందు, వెనుక, భవనంపైన పరిశీలించారు. ఘటనపై స్థానికుల్ని ఆరా తీశారు.
పిల్లల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజితతో అమీన్‌పూర్ పోలీసులు మాట్లాడారు. తాము విషం లాంటిదేమీ తీసుకోలేదని, పప్పు, పెరుగన్నం తిన్నామని, భర్త పప్పుతో అన్నం తిన్నాడని వివరించింది. దీంతో వీరు తిన్న పెరుగులో ఏదైనా కలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్‌పూర్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరణించిన చిన్నారులు తీసుకున్న ఆహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వంగా విషం కలిపారా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనేది పరిశీలిస్తున్నారు. చిన్నారుల బ్లడ్ శాంపిళ్లతో పాటు, ఇతర శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎస్పీ పరితోష్ పంకజ్
‘క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాం. స్థానికంగా ఆరా తీశాం. కానీ ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్ధాయిలో తెలియరాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.
గతంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి: రజిత తల్లి
‘గత ఏడాది వరకు నా కూతురుకి, అల్లుడికి గొడవలు ఉన్నాయి. అప్పట్లో వచ్చి సర్ది చెప్పి వెళ్లాం. అప్పుడే నా కూతురు.. మళ్లీ గొడవ జరిగితే నేను, నా పిల్లలు మందు తాగి చనిపోతామని, మందు దొరకకపోతే ఎక్కడైనా నదిలో పడి చనిపోతామని చెప్పింది..’అని రజిత తల్లి పార్వతమ్మ మీడియాకు చెప్పింది.
కారు ఇచ్చి ఆస్పత్రికి పంపా..
‘చెన్నయ్య ఏడేళ్లుగా రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా డు. అర్ధరాత్రి రెండున్నర స మయంలో పిల్లలు చనిపోయారని, భార్య ప్రాణాపా య స్థితిలో ఉందంటూ చెన్నయ్య అరవడంతో బ యటకు వచ్చాం. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నేనే కారు ఇచ్చా. డయల్ 100కు, పోలీసులకు సమా చారం ఇచ్చా’అని కాలనీ వాసి ప్రభాకర్ చారి చెప్పారు.