Aminpur
-
నోట్లో నురగలతో ముగ్గురు చిన్నారుల మృతి
పటాన్చెరు టౌన్: రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున నోట్లో నురగలతో విగతజీవులై కన్పించారు. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆస్పత్రిలో చేరిన వారి తల్లి చికిత్స పొందుతోంది. సీఐ నరేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు 2008లో వివాహం జరిగింది.2010లో భార్య అనారోగ్యంతో మరణించడంతో 2012లో నల్లగొండ జిల్లా మందాపూర్ గ్రామానికి చెందిన రజిత అలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న సాయికృష్ణ (12), నాలుగో తరగతి చదువుతున్న మధుప్రియ (10), మూడు చదువుతున్న గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా కలిసే భోజనం చేశారు గురువారం రాత్రి 9 గంటల సమయంలో అంతా కలిసి భోజనం చేశారు. పిల్లలు, రజిత పప్పుతో పాటు షాపు నుంచి తెచ్చుకున్న పెరుగుతో అన్నం తిన్నారు. చెన్నయ్య మాత్రం వట్టి పప్పుతో తిని, ట్యాంకర్ తీసుకుని చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగిరాగా, రజిత తలుపులు తీసింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రజిత తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పింది. చెన్నయ్య వెంటనే పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ముగ్గురు పిల్లలు నోటి నుండి నురగలు కక్కుతూ చలనం లేకుండా కనిపించారు.దీంతో వెంటనే బయటకు వెళ్లిన ఆయన ‘కాపాడండి..’అంటూ అరిచాడు. స్ధానికులు రావడంతో పిల్లలు చనిపోయారని, భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు రజితను బీరంగూడలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పారితోష్ పంకజ్, సీఐ నరేష్, క్లూస్ టీం ఇంటి ముందు, వెనుక, భవనంపైన పరిశీలించారు. ఘటనపై స్థానికుల్ని ఆరా తీశారు.పిల్లల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజితతో అమీన్పూర్ పోలీసులు మాట్లాడారు. తాము విషం లాంటిదేమీ తీసుకోలేదని, పప్పు, పెరుగన్నం తిన్నామని, భర్త పప్పుతో అన్నం తిన్నాడని వివరించింది. దీంతో వీరు తిన్న పెరుగులో ఏదైనా కలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్పూర్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరణించిన చిన్నారులు తీసుకున్న ఆహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వంగా విషం కలిపారా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనేది పరిశీలిస్తున్నారు. చిన్నారుల బ్లడ్ శాంపిళ్లతో పాటు, ఇతర శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎస్పీ పరితోష్ పంకజ్ ‘క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాం. స్థానికంగా ఆరా తీశాం. కానీ ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్ధాయిలో తెలియరాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.గతంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి: రజిత తల్లి ‘గత ఏడాది వరకు నా కూతురుకి, అల్లుడికి గొడవలు ఉన్నాయి. అప్పట్లో వచ్చి సర్ది చెప్పి వెళ్లాం. అప్పుడే నా కూతురు.. మళ్లీ గొడవ జరిగితే నేను, నా పిల్లలు మందు తాగి చనిపోతామని, మందు దొరకకపోతే ఎక్కడైనా నదిలో పడి చనిపోతామని చెప్పింది..’అని రజిత తల్లి పార్వతమ్మ మీడియాకు చెప్పింది.కారు ఇచ్చి ఆస్పత్రికి పంపా.. ‘చెన్నయ్య ఏడేళ్లుగా రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా డు. అర్ధరాత్రి రెండున్నర స మయంలో పిల్లలు చనిపోయారని, భార్య ప్రాణాపా య స్థితిలో ఉందంటూ చెన్నయ్య అరవడంతో బ యటకు వచ్చాం. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నేనే కారు ఇచ్చా. డయల్ 100కు, పోలీసులకు సమా చారం ఇచ్చా’అని కాలనీ వాసి ప్రభాకర్ చారి చెప్పారు. -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, సంగారెడ్డి జిల్లా: కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాలను విద్యార్థినులు గుర్తించారు. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో కెమెరాను గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.కాగా, లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారనే కారణంగా మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేసిన మహేశ్వరరావు.. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కూడా కెమెరా పెట్టాడు. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు
సాక్షి,సంగారెడ్డి: అమీన్పూర్లో హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద నుంచి వసూళ్లకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం ఉందని, ఆయనతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ వాట్స్అప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. మీ జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. బిల్డర్ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమణలపై ఆరా.. రికార్డుల పరిశీలన
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. అమీన్‌పూర్‌లోని శంభునికుంట, శంబిచెరువు, చక్రపురి కాలనీలోని వివాదాస్పద భూమిని పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఆరా తీశారు. చెరువు ఆక్రమణల తాజా పరిస్థితి, వాటిపై ఉన్న కేసులు, ఇతరత్రా అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమీన్పూర్ బీరంగూడలోని శంభునికుంటలో జరిగిన అక్రమాలపై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రామస్వామి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పలు వివరాలు అందజేశారు. తొలుత కమిషనర్ పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి శాంతినగర్ వెళ్లే దారిలోని నిర్మాణాలపై ఆరా తీయగా.. 18 ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని, కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నారని కమిషనర్‌కు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వివరించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా బీరంగూడ మార్కెట్ చౌరస్తాలో శంభుని కుంటను, చెరువు ఆక్రమణలను పరిశీలించారు. వెంకటరమణ, చక్రపురి కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఆయన.. సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెంకటరమణకాలనీ పరిధిలోని మూడెకరాల భూమి అన్యాక్రాంతమైందని కాలనీవాసులు ఆరోపించారు.స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో వెంచర్ వేసిన వ్యక్తులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కాలనీ పార్కు స్థలాన్ని అక్రమంగా ఇతరులకు అమ్మారని ఆరోపించారు. పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు రంగనాథ్ దృష్టికి తీసుకురాగా.. సర్వే పనులు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు.ఇరిగేషన్ అధికారుల హై‘డ్రామా’చెరువులు, కాలువల అక్రమాలపై ఆరా తీసేందుకు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను స్థానిక ఇరిగేషన్ అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీరంగూడ శంభునికుంటలో ఆక్రమణలపై కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తున్న సమయంలో పటాన్చెరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి తప్పుడు సమాచారం ఇచ్చారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శంభునికుంట పరిధిలో ఉన్న ఆక్రమణపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చామని రామస్వామి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్థానికుడొకరు నేరుగా కమిషనర్ దగ్గరికి వెళ్లి సార్ మిమ్మల్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటానని రంగనాథ్ బదులిస్తూ ముందుకు సాగారు. వాస్తవానికి అమీన్పూర్లో చెరువులు, కాలువల పరిధిలో నిర్మాణాలకు ఇరిగేషన్ అధికారులే ప్రధాన కారణమని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై డీఈఈ రామస్వామి వివరణ కోరగా.. తానేమీ అబద్ధాలు చెప్పలేదని, రికార్డుల పరంగా ఉన్న వివరాలను మాత్రమే కమిషనర్ దృష్టికి తెచ్చానన్నారు. -
మృత్యు దారం!
ఇదే పొజిషన్లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది.. ఈ పాపం ఎవరిది? అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే.. సాక్షి, హైదరాబాద్: బీహెచ్ఈఎల్ సమీపంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు.. ఏంటా ప్రమాదం.. అమీన్పూర్ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్స్, కింగ్ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్పూర్ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కొత్తగా మాస్కులు.. ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇదీ చరిత్ర ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్ అమీన్ ఖాన్ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. ‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ – సంజీవ్‌వర్మ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. -
‘క్వారంటైన్’కు వెళ్లాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉన్నారు.. నేడు కరోనా భూతం అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని పొరుగిళ్లవారు.. మా ఇల్లు మా ఇష్టం ఇక్కడే ఉంటాం అని ప్రవాసీలు.. ఇదీ ప్రస్తుతం చాలాచోట్ల నెలకొన్న పరిస్థితి. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్ వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరి కా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేసి కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో పంపించే శారు. అయితే, ఇది ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్ల జ నం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రా వాలని కోరేందుకు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి వారు అంతెత్తున లేచారు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి... వదంతులతో ఇబ్బందులు.. చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులకు ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిం ది చెన్నై నుంచైతే.. చైనా నుంచి వచ్చాడనే వదంతి పుట్టింది. అంతే, అధికారులంతా పరుగో పరుగు. ఆపై విషయం తెలిసి నో ళ్లువెళ్లబెట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లక్ష్మాపూర్ తండాలో జరిగింది. -
అమీన్పూర్లో బాలిక గ్యాంగ్‌రేప్?
పటాన్చెరు: బాలిక అత్యాచారం, ఆపై హత్యకు యత్నం వార్తలతో అమీన్పూర్లో కలకలం రేగింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు తనను అత్యాచారం చేసి హత్య చేసేం దుకు ప్రయత్నిస్తున్నారని ఓ బాలిక ఫోన్ లో తన తండ్రికి సమాచారం ఇచ్చింది. దాంతో ఆ బాలికను స్థానికులు కాపాడేందుకు వెళ్లగా దుండగులు పరారయ్యారు. అయితే తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన బాలిక కథనానికి భిన్నంగా పోలీసులు ఆమె పై అత్యాచారమే జరగలే దని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వాణినగర్ లోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి వద్ద సదరు బాలిక తండ్రిగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆ బాలిక స్వస్థలమైన ఏపీలోని శ్రీకాకుళంలోనే ఉంటోంది. సెలవు లుండటంతో పది రోజుల క్రితమే తండ్రి వద్దకు వచ్చింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే బైక్‌పై వచ్చిన వ్యక్తి తనను బెదిరించి నిర్మానుష్య ప్రాం తానికి తీసుకెళ్లగా.. ఆ తర్వా త మరో ముగ్గురు కారులో వచ్చి తనపై లైంగి కదాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఈలోగా తన ఫోన్ నుంచి తండ్రికి సమాచారమివ్వగా అందరితో వచ్చి కాపాడారని వెల్లడించింది. అత్యాచారం జరగలేదు: ఎస్పీ దీనిపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల తర్వా త బాలికపై అత్యాచారం జరగదలేని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. బైక్‌పై ఎం దుకు వెళ్లావని ప్రశ్నిస్తే.. అతను ముందే తెలుసని.. తన నగ్న చిత్రాలు ఫోన్లో ఉన్నాయని బెదిరించి వాహనంపై తీసుకెళ్లాడని ఆమె చెప్పిందన్నారు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తరలించిన నిందితులను పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. బాలిక కిడ్నాప్.. అత్యాచారం టేక్మాల్(మెదక్): బాలికను అపహరించుకుపోయి అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. అల్లాదుర్గం సీఐ రవి కథనం ప్రకారం.. టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన బాలిక (15) సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 18న నానమ్మతో కలసి మధ్యాహ్నం చేనుకి వెళ్లింది. ఇద్దరూ కలసి పని చేస్తుండగా నీళ్లు తాగుతానంటూ ఆ బాలిక చేను వద్ద ఉన్న గుడిసెలోకి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఈనెల 21 పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరపగా అదే గ్రామానికి చెందిన పిట్ల లక్ష్మణ్ (23) బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో ఉండే లక్ష్మణ్ బంధువు మల్లయ్య ఇంట్లో బాలికను ఉంచినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం పోలీసులు మిన్పూర్కు వెళ్లి వారిని పట్టుకున్నారు. లక్ష్మణ్, మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
‘బయోడైవర్సిటీ’గా అమీన్పూర్ చెరువు
గుర్తింపు కోసం గ్రామ సభ సైట్‌గా గుర్తించడం దేశంలోనే ప్రథమం: బోర్డు మెంబర్ సువర్ణ పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిందే: తేజ్‌దీప్‌కౌర్ పటాన్చెరు: మండలం పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుందని తెలంగాణా రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ డాక్టర్ సి.సువర్ణ తెలిపారు. సోమవారం పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించారు. ఇందులో స్థానిక సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్, అటవీ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సైట్ గుర్తింపు పట్ల అభిప్రాయాలను సేకరించారు. చెరువుపై ఆధారపడిన మొత్తం 28 వర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెంబర్ సెక్రటరీ డా.సి.సువర్ణ మాట్లాడుతూ దేశంలోనే ఓ చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించడం ప్రపథమమన్నారు. ఈ చెరువు ప్రత్యేకమైందని వివరించారు. మొత్తం 171 రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే పక్షులు ఉన్నాయన్నారు. మహానగర శివారులో ఉన్న పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించడం భవిష్యత్ తరాలకు మేలు చేసినట్లవుతుందన్నారు. టీఎస్పీఎస్ డీజీ తేజ్‌దీప్‌కౌర్ మాట్లాడుతూ పెద్ద చెరువును తాము కొన్ని నెలల క్రితమే దత్తత తీసుకున్నామని గుర్తు చేశారు. తాము చేసిన కృషి ఫలించడంతో చెరువు వద్ద ఉన్న జీవవైవిధ్యం సంరక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అమీన్పూర్ చెరువు పరిసరాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బంది, శిక్షణ కేంద్రంలోని సిబ్బంది చెరువులో ఉన్న చెత్తను ఎత్తి పోస్తున్నారని వివరించారు. స్థానికులు అనేక వ్యర్థాలను చెరువులో వేస్తున్నారని దీని వల్ల పక్షి జాతులకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించాలని హైదరాబాద్ బర్డ్ వాచర్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్లోరా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారని ఆమె తెలిపారు. బయోడైవర్సిటీకి స్థానికులు మరింతగా సహకరించాలని కోరారు. తాను రిటైర్డ్ తర్వాత అమీన్‌పూర్‌లోనే నివసిస్తానని చెప్పారు. చెరువు వద్ద కొందరు డ్రోన్లతో ఫొటోలు తీస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే స్థానిక రైతులు, మత్సకారులు ఈ సభలో తమ సందేహాలను వ్యక్తం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తమ భూములను కోల్పోతామనే ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం చెరువు కింద 350 ఎకరాల ఎప్టీఎల్ పట్టాలున్నాయని అవి ఎంతో విలువైనవని తెలిపారు. స్థానిక సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చెరువులో కాలుష్య వ్యర్థాలు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయన్నారు. వివిధ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య వర్థాలు పెద్ద చెరువులో చేరుతున్నాయన్నారు. దీనిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, పీసీబి అధికారి భిక్షపతి, మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.