అమీన్‌పూర్‌లో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. అమీన్‌పూర్‌లోని శంభునికుంట, శంబిచెరువు, చక్రపురి కాలనీలోని వివాదాస్పద భూమిని పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఆరా తీశారు. చెరువు ఆక్రమణల తాజా పరిస్థితి, వాటిపై ఉన్న కేసులు, ఇతరత్రా అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అమీన్‌పూర్ బీరంగూడలోని శంభునికుంటలో జరిగిన అక్రమాలపై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రామస్వామి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పలు వివరాలు అందజేశారు. తొలుత కమిషనర్ పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి శాంతినగర్ వెళ్లే దారిలోని నిర్మాణాలపై ఆరా తీయగా.. 18 ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని, కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నారని కమిషనర్‌కు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ వివరించారు.
వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా బీరంగూడ మార్కెట్ చౌరస్తాలో శంభుని కుంటను, చెరువు ఆక్రమణలను పరిశీలించారు. వెంకటరమణ, చక్రపురి కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఆయన.. సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెంకటరమణకాలనీ పరిధిలోని మూడెకరాల భూమి అన్యాక్రాంతమైందని కాలనీవాసులు ఆరోపించారు.
స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో వెంచర్ వేసిన వ్యక్తులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కాలనీ పార్కు స్థలాన్ని అక్రమంగా ఇతరులకు అమ్మారని ఆరోపించారు. పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు రంగనాథ్ దృష్టికి తీసుకురాగా.. సర్వే పనులు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు.
ఇరిగేషన్ అధికారుల హై‘డ్రామా’
చెరువులు, కాలువల అక్రమాలపై ఆరా తీసేందుకు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను స్థానిక ఇరిగేషన్ అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీరంగూడ శంభునికుంటలో ఆక్రమణలపై కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తున్న సమయంలో పటాన్‌చెరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి తప్పుడు సమాచారం ఇచ్చారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శంభునికుంట పరిధిలో ఉన్న ఆక్రమణపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చామని రామస్వామి చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో స్థానికుడొకరు నేరుగా కమిషనర్ దగ్గరికి వెళ్లి సార్ మిమ్మల్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటానని రంగనాథ్ బదులిస్తూ ముందుకు సాగారు. వాస్తవానికి అమీన్‌పూర్‌లో చెరువులు, కాలువల పరిధిలో నిర్మాణాలకు ఇరిగేషన్ అధికారులే ప్రధాన కారణమని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై డీఈఈ రామస్వామి వివరణ కోరగా.. తానేమీ అబద్ధాలు చెప్పలేదని, రికార్డుల పరంగా ఉన్న వివరాలను మాత్రమే కమిషనర్ దృష్టికి తెచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment