మృత్యు దారం! | Birds Deceased Due To Human Negligence | Sakshi
Sakshi News home page

మృత్యు దారం!

Published Wed, Dec 2 2020 1:51 AM | Last Updated on Wed, Dec 2 2020 6:59 AM

Birds Deceased Due To Human Negligence - Sakshi

ఇదే పొజిషన్‌లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది..  ఈ పాపం ఎవరిది?  అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే..  

సాక్షి, హైదరాబాద్‌: బీహెచ్‌ఈఎల్‌ సమీపంలోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోని అమీన్‌పూర్‌ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు..

ఏంటా ప్రమాదం.. 
అమీన్‌పూర్‌ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్స్, కింగ్‌ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్‌పూర్‌ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సభ్యులు అమీన్‌పూర్‌ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
అమీన్‌పూర్‌ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సభ్యులు  

కొత్తగా మాస్కులు.. 
ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

ఇదీ చరిత్ర
ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్‌ అమీన్‌ ఖాన్‌ పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. 

అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. 
‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ 
– సంజీవ్‌వర్మ, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ 

గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. 
అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్‌ వాచర్స్‌ చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement